వ్యవసాయ మంత్రిత్వ శాఖ
రూ. 10వేల కోట్లతో ఎన్.సి.డి.సి. ఆయుష్మాన్ సహకార్ నిధి పథకానికి కేంద్ర మంత్రి పురుషోత్తమ్ రుపాల శ్రీకారం
సహకార సంఘాల ద్వారా ఆరోగ్య రక్షణ మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యం
గ్రామీణ ప్రాంతాల్లో సమగ్ర ఆరోగ్య రక్షణ విప్లవాన్ని తేనున్న సహకార సంఘాలు
Posted On:
19 OCT 2020 3:43PM by PIB Hyderabad
దేశంలో ఆరోగ్య రక్షణ మౌలిక సదుపాయాల కల్పనలో సహకార సంఘాలు ప్రముఖ పాత్ర పోషించేలా చూసేందుకు ఆయుష్మాన్ సహకార్ నిధి పేరిట ఒక వినూత్న పథకాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి పురుషోత్తమ్ రుపాల 2020, అక్టోబరు 19న ప్రారంభించారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్.సి.డి.సి.) ఆధ్వర్యంలోని స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కేంద్రస్థాయి ఆర్థికాభివృద్ధి సంస్థ ఈ పథకాన్ని రూపొందించింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రుపాల మాట్లాడుతూ, ప్రయోజనకరంగా పనిచేసే సహకార సంఘాలకు ఎన్.సి.డి.సి. రూ. 10వేల కోట్ల వరకూ కాలవ్యవధి రుణాలు ఇస్తుందని ప్రకటించారు. దేశంలో మరిన్ని ఆరోగ్ రక్షణ సదుపాయాల ఆవశ్యకతను వైరస్ మహమ్మారి వ్యాప్తి గుర్తుచేసిందన్నారు. రైతుల సంక్షేమ కార్యకలాపాలను బలోపేతం చేయడంలో కేంద్ర ప్రభుత్వం వేసిన ముందడుగే ఎన్.సి.డి.సి. పథకమని ఆయన చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో అమలుకానున్న ఆరోగ్య రక్షణ సదుపాయాల్లో ఆయుష్మాన్ సహకార్ పథకం ఒక విప్లవం కాబోతోందని అన్నారు ఆరోగ్య రక్షణ సేవలను రైతుల ద్వారా ఒక క్రియాశీలక కార్యక్రమంగా చేపట్టాలని సహకార సంఘాలకు కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు.
ఎన్.సి.డి.సి. మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ నాయక్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా సహకార సంఘాల ఆధ్వర్యంలో 53 ఆసుపత్రులు నడుస్తున్నాయని, వాటిల్లో 5వేలకు పైగా పడకలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. సహకార సంఘాలు అందించే ఆరోగ్య రక్షణ సేవలను ఎన్.సి.డి.సి. మరింత బలోపేతం చేస్తుందన్నారు.
ఆరోగ్య వ్యవస్థలను అన్ని కోణాల్లో రూపొందించే 2017వ సంవత్సరపు జాతీయ ఆరోగ్య విధానంపై దృష్టిని కేంద్రీకరిస్తూ, అందుకు అనుగుణంగా ఎన్.సి.డి.సి. పథకం పనిచేస్తుందని ఆయన అన్నారు. ఆరోగ్య రంగంలో పెట్టుబడులు, ఆరోగ్య సేవల నిర్వహణ, సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం, మానవ వనరుల అభివృద్ధి, పలు రకాల వైద్య విధానాలను ప్రోత్సహించడం, రైతులకు అందుబాటు ధరల్లో ఆరోగ్య రక్షణ సదుపాయం వంటి అంశాలపై ఈ పథకం దృష్టిని కేంద్రీకరిస్తుందన్నారు. ఆసుపత్రులు, ఆరోగ్య రక్షణ నర్సింగ్ విద్య, పారా మెడికల్ విద్య, ఆరోగ్య బీమా, ఆయుష్ వంటి సంపూర్ణస్థాయి ఆరోగ్య వ్యవస్థ వంటి అంశాలకు సంబంధించి, ఈ పథకం సమగ్రమైన పంధాను అమలు చేస్తుందన్నారు. సహకార సంఘాల ఆధ్వర్యంలోని ఆసుపత్రులు వైద్య విద్య, ఆయుష్ విద్య అమలు చేసేందుకు కూడా ఆయుష్మాన్ సహకార్ పథకం దోహదపడుతుందని అన్నారు.
గౌరవ ప్రధానమంత్రి 2020, ఆగస్టు 15న ప్రారంభించిన జాతీయ డిజిటల్ ఆరోగ్య పథకం సూత్రాలకు అనుగుణంగా, గ్రామీణ ప్రాంతాల్లో వైద్యరక్షణ పరంగా పూర్తి స్థాయి పరివర్తన సాధించేందుకు ఎన్.సి.డి.సి. ఆయుష్మాన్ సహకార్ పథకం దోహదపడుతుంది. ఈ పథకాన్ని వినియోగించే సహకార సంఘాలు గ్రామీణ ప్రాంతాల సమగ్ర ఆరోగ్య రక్షణ సేవల్లో ఏకంగా ఒక విప్లవాన్ని తీసుకురాగలవు.
ఆరోగ్య రక్షణకు సంబంధించిన సహకార నిబంధనలను పాటించే ఏ సహకార సంఘమైనా ఎన్.సి.డి.సి. నిధితో అనుసంధానం కాగలదు. రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా, లేదా కేంద్ర పాలిత ప్రాంతాల పాలనా యంత్రాంగాల ద్వారా గానీ, లేదా నేరుగా గానీ సహకార సంఘాలకు ఎన్.సి.డి.సి. సహాయం అందుబాటులో ఉంటుంది. ఇతర వననరుల నుంచి సబ్సిడీని, గ్రాంటును కూడా సహకార సంఘాలు వినియోగించుకునే అవకాశం ఉంటుంది.
ప్రత్యేకించి, ఆసుపత్రులు, ఆరోగ్య రక్షణ సదుపాయాల ఏర్పాటు, ఆధునికీకరణ, విస్తరణ, మరమ్మతులు, పునరుద్ధరణ కార్యకలాపాలకు ఆయుష్మాన్ సహకార పథకం వర్తిస్తుంది. అలాగే వైద్యవిద్యకు సంబంధించిన ఈ కింది అంశాలకు కూడా ఈ పథకం వర్తిస్తుంది.:
- ఆసుపత్రులు/వైద్యం/ఆయుష్/దంతవైద్యం/నర్సింగ్/ఔషధ రంగం/పారామెడికల్/అండర్ గ్రాడ్యుయెట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు బోధించే ఫిజియో థెరపీ కళాశాలలు,
- యోగా, వెల్ నెస్ సెంటర్,
- ఆయుర్వేద, అలోపతి, యునానీ, సిద్ధ, హోమియోపతి, ఇతర సంప్రదాయ వైద్య పద్ధతులు, ఆరోగ్య రక్షణ కేంద్రాలు,
- వయోజనులకు ఆరోగ్యరక్షణ సేవలు,
- ఉపశమన ఆరోగ్య రక్షణ సేవలు,
- అంగవైకల్యం ఉన్న వారికి ఆరోగ్య రక్షణ సేవలు,
- మానసిక వైద్య ఆరోగ్య సేవలు,
- అత్యవసర ఆరోగ్య రక్షణ సేవలు/ట్రామా కేంద్రాలు,
- ఫిజియోథెరపీ కేంద్రం,
- సంచార ఆసుపత్రి సేవలు,
- హెల్త్ క్లబ్, వ్యాయామ సదుపాయం,
- ఆయుష్ ఔషధాల తయారీ,
- ఔషధాల పరీక్షలకు ప్రయోగశాల,
- దంతవైద్య రక్షణ కేంద్రం,
- నేత్రవైద్య రక్షణ కేంద్రం,
- లాబొరేటరీ సేవలు,
- వ్యాధి నిర్ధారణ సేవలు,
- రక్తనిధి/రక్తం ఎక్కించే సేవలు,
- పంచకర్మ/తొక్కణం/క్షార సూత్ర థెరపీ కేంద్రం,
- యునానీ రెజిమెంటల్ థెరపీ (ఇలాజ్ బిల్ తడ్బీర్) కేంద్రం,
- ప్రసూతి ఆరోగ్య, శిశుసంరక్షణ సేవలు,
- సంతానోత్పత్తి, శిశు ఆరోగ్య సేవలు,
- ఎన్.సి.డి.సి. సహాయంతో చేయదగిన సేవల కేంద్రం, లేదా సేవలు,
- టెలీ మెడిసిన్, రిమోట్ అసిస్టెడ్ మెడికల్ ప్రొసీజర్,
- ఆరోగ్య వ్యూహ రచన, ఆరోగ్య రక్షణ, వైద్యవిద్య,
- డిజిటల్ ఆరోగ్యానికి సంబంధించిన ఇన్ ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ అంశాలు,
- బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐ.ఆర్.డి.ఎ.) గుర్తింపు పొందిన ఆరోగ్య బీమా సదుపాయం.
ఆరోగ్య రక్షణ మౌలిక సదుపాయాలకు సంబంధించిన నిర్వహణాపరమైన అవసరాలను తీర్చడానికి అవసరమైన మూలధనం పెట్టుబడిని, మార్జిన్ మనీ సదుపాయాన్ని ఈ పథకం అందిస్తుంది. మహిళా ప్రతినిధుల ప్రాబల్యం కలిగిన సహకార సంఘాలకు వడ్డీ రాయితీ సదుపాయాన్ని కూడా ఈ పథకం కల్పిస్తుంది.
సహకార సంఘాలకు ప్రోత్సాహం, సహకార సంఘాల అభివృద్ధి లక్ష్యంగా జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్.సి.డి.సి.)ను 1963లో పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. 1963నుంచి రూ. 1.60లక్షల కోట్ల రుణాలను,. ఎన్.సి.డి.సి. సహకార సంఘాలకు అందించింది.
వివరాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి
*******
(Release ID: 1665950)
Visitor Counter : 309