ప్రధాన మంత్రి కార్యాలయం

కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి, టీకా నిర్వహణ, పంపిణీ మరియు పరిపాలనపై నిర్వహించిన సమావేశానికి అధ్యక్షత వహించిన - ప్రధానమంత్రి


టీకా ఒకసారి సిద్ధం కాగానే అది త్వరగా పౌరులకు అందుబాటులో ఉండేవిధంగా చూడాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు

ఎన్నికల నిర్వహణ మాదిరిగా, అన్ని స్థాయిల్లో ప్రభుత్వాలను, పౌర సమూహాలను కలుపుకుని, టీకా పంపిణీ వ్యవస్థను అభివృద్ధి చేయాలని ప్రధానమంత్రి సూచించారు

భారతీయ శాస్త్రవేత్తలు, పరిశోధనా బృందాలు పొరుగు దేశాలతో సంయుక్తంగా, పరిశోధనా సామర్థ్యాలను బలోపేతం చేస్తున్నాయి

గత 3 వారాలలో రోజువారీ కేసులు, వృద్ధి రేటు, మరణాల సంఖ్యలో స్పష్టమైన క్షీణత నమోదౌతోంది

రాబోయే పండుగ రోజుల్లో సామాజిక దూరం, కోవిడ్ తగిన ప్రవర్తన, స్వీయ నిగ్రహం పాటించాలని ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు

మొత్తం మానవాళి కోసం ఐటి పరిశ్రమ, భారతదేశ విద్యారంగం తో సహా శాస్త్ర, సాంకేతిక సామాజం పనిచేయాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు

Posted On: 17 OCT 2020 4:32PM by PIB Hyderabad

దేశంలో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి, టీకా నిర్వహణ, పంపిణీ మరియు పరిపాలన యొక్క సంసిద్ధతను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈరోజు సమీక్షించారు. ఈ సమావేశంలో - కేంద్ర ఆరోగ్య మంత్రి శ్రీ హర్ష వర్ధన్; ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి; నీతీ ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం);  ప్రధాన శాస్త్రీయ సలహాదారు;  సీనియర్ శాస్త్రవేత్తలు, ప్రధానమంత్రి కార్యాలయంతో పాటు భారత ప్రభుత్వానికి చెందిన ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య మరియు వృద్ధి రేటులో నమోదౌతున్న స్థిరమైన క్షీణతను ప్రధానమంత్రి  గుర్తించారు.

భారతదేశంలో మూడు వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ముందంజలో ఉన్నాయి, వాటిలో 2 వాక్సిన్లు రెండవ దశలో ఉండగా ఒకటి మూడవ దశలో ఉంది.  భారతీయ శాస్త్రవేత్తలు మరియు పరిశోధనా బృందాలు, ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, మారిషస్, నేపాల్, శ్రీలంక వంటి పొరుగు దేశాలలో పరిశోధనా సామర్థ్యాలకు సహకరించి బలోపేతం చేస్తున్నాయి.  తమ దేశాలలో క్లినికల్ ప్రయోగాలు నిర్వహించవలసిందిగా కోరుతూ బంగ్లాదేశ్, మయన్మార్, ఖతార్, భూటాన్ దేశాల నుండి మరిన్ని అభ్యర్థనలు వచ్చాయి.  ప్రపంచ సమాజానికి సహాయపడే ప్రయత్నంలో భాగంగా, మన ప్రయత్నాలను మన సమీప పొరుగు ప్రాంతాలకు పరిమితం చేయవద్దని ప్రధానమంత్రి ఆదేశించారు.  టీకా నిర్వహణ విధానం కోసం, టీకాలు, మందులు మరియు ఐ.టి. వేదికలను అందించడంలో మొత్తం ప్రపంచానికి మన దేశం అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు. 

టీకా నిర్వహణ కోసం ఏర్పాటైన జాతీయ నిపుణుల బృందం (ఎన్.ఈ.జి.వి.ఏ.సి), రాష్ట్ర ప్రభుత్వాలు మరియు సంబంధిత భాగస్వాములతో సంప్రదించి, టీకాల నిర్వహణ, పంపిణీ మరియు పరిపాలన గురించి, సవివరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, సమర్పించింది. ఈ నిపుణుల బృందం, వ్యాక్సిన్ ప్రాధాన్యత మరియు టీకా పంపిణీపై రాష్ట్రాలతో సంప్రదిస్తూ,  చురుకుగా పనిచేస్తోంది.

దేశ భౌగోళిక పరిధిని, వైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, వ్యాక్సిన్ త్వరగా అందుబాటులోకి వచ్చేలా చూడాలని కూడా ప్రధానమంత్రి ఆదేశించారు.  రవాణా, సరఫరా, నిర్వహణలో అడుగడుగునా ఖచ్చితంగా వ్యవహరించాలని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు.  శీతలీకరణ గిడ్డంగులు, పంపిణీ వ్యవస్థ, పర్యవేక్షణ విధానం, ముందస్తు అంచనాలలో అధునాతన ప్రణాళికతో పాటు వైల్స్, సిరంజిలు వంటి అవసరమైన సహాయక పరికరాల తయారీ వంటివి ఇందులో తప్పకుండా ఉండాలి.

దేశంలో ఎన్నికలు మరియు విపత్తు నిర్వహణ విజయవంతంగా నిర్వహించిన అనుభవాలను మనం ఉపయోగించుకోవాలని ఆయన ఆదేశించారు.  అదే తరహాలో వ్యాక్సిన్ పంపిణీ, నిర్వహణ విధానాలను కూడా అమల్లోకి తీసుకురావాలని ప్రధానమంత్రి సూచించారు.  ఈ ప్రక్రియలో రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలు / జిల్లా స్థాయి కార్యకర్తలు, పౌర సమాజ సంస్థలు, స్వచ్చంద కార్యకర్తలు, పౌరులతో పాటు అవసరమైన అన్ని రంగాల నిపుణులు పాలు పంచుకోవాలి. మొత్తం ప్రక్రియకు బలమైన ఐ.టి. ఆధారిత మద్దతు ఉండాలి.  మన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు శాశ్వత విలువను తెచ్చిపెట్టే విధంగా ఈ వ్యవస్థను రూపొందించాలి. 

భారతదేశంలో సార్సు కోవ్-2 కు చెందిన విశ్వజన్యురాశి (కోవిడ్ -19 వైరస్) పై, ఐ.సి.ఎం.ఆర్. మరియు బయో-టెక్నాలజీ శాఖ (డి.బి.టి) ఆధ్వర్యంలో పాన్ ఇండియా నిర్వహించిన రెండు అధ్యయనాలు వైరస్ జన్యుపరంగా స్థిరంగా ఉన్నదనీ, వైరస్ లో పెద్దగా మార్పు లేదనీ సూచించాయి. 

వైరస్ వ్యాప్తి తగ్గుతున్నందుకు ఆత్మసంతృప్తి చెందకుండా, ఈ మహమ్మారిని అరికట్టే ప్రయత్నాలను ముమ్మరంగా కొనసాగించాలని హెచ్చరిస్తూ ప్రధానమంత్రి తమ ప్రసంగాన్ని ముగించారు.  ముఖ్యంగా రాబోయే పండుగ రోజుల్లో, నిరంతరంగా సామాజిక దూరం పాటించడం, ముసుగు ధరించడం, క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం, పారిశుధ్యం వంటి కోవిడ్ కు తగిన ప్రవర్తనలను తప్పకుండా పాటించాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పట్టుబట్టారు.

 

*****

 



(Release ID: 1665565) Visitor Counter : 246