ప్రధాన మంత్రి కార్యాలయం

గ్రాండ్ చాలెంజెస్ వార్షిక సమావేశం 2020 ప్రారంభ కార్యక్రమం లో కీలకోపన్యాసాన్ని ఇవ్వనున్న ప్రధాన మంత్రి

Posted On: 17 OCT 2020 11:09AM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ నెల 19 న రాత్రి 7:30 గంటలకు గ్రాండ్ చాలెంజెస్ వార్షిక సమావేశం 2020 ప్రారంభ కార్యక్రమాన్ని ఉద్దేశించి  వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా కీలకోపన్యాసాన్ని ఇవ్వనున్నారు.

గ్రాండ్ చాలెంజెస్ వార్షిక సమావేశం గత 15 సంవత్సరాలుగా, అభివృద్ధికి, ఆరోగ్యానికి సంబంధించిన అతి పెద్ద సవాళ్లను పరిష్కరించడానికి అంతర్జాతీయ నూతన ఆవిష్కరణల తాలూకు సహకార పూర్వక కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ వచ్చింది. గ్రాండ్ చాలెంజెస్ వార్షిక సమావేశం 2020 ఈ నెల 19వ, 20వ, 21వ తేదీలలో వర్చువల్ పద్ధతిలో జరుగనుంది. ఈ సమావేశం విధాన రూపకర్తలను, వైజ్ఞానిక రంగ నాయకులను  ఒక చోటుకు చేర్చుతుంది. ప్రపంచంలో ఆరోగ్య సంబంధిత సమస్యలను, మరీ ముఖ్యంగా కోవిడ్-19 పై ప్రత్యేక శ్రద్ధను తీసుకొంటూ, పరిష్కరించడానికి ‘‘ప్రపంచం కోసం భారత్’’ దృక్పథాన్ని ఈ సమావేశం అనుసరించనుంది.  మహమ్మారి అనంతర కాలంలో ప్రపంచంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన దిశలో వేగవంతంగా ముందుకు పోయేందుకు ఏయే అంశాలను కీలకంగా చేపట్టాలో చర్చించడానికి ప్రపంచ నేతలు, ప్రసిద్ధ శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఈ వార్షిక సమావేశంలో పాలుపంచుకోనున్నారు.  కోవిడ్-19 ని అదుపుచేయడానికి ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించడం గురించి వారు తమ తమ ఆలోచనలను వివరిస్తారు.  కోవిడ్ తో పోరాడటానికి తీసుకోవలసిన శాస్త్రీయ చర్యలు, మహమ్మారిని అదుపులోకి తీసుకురావడం, అభివృద్ధి ప్రక్రియను శీఘ్రతరం చేయడం, ఈ వ్యాధితో పోరాడటం కోసం ప్రపంచస్థాయిలో అమలుపరచవలసిన పరిష్కారమార్గాలు, మరొక ప్రపంచ వ్యాప్త వ్యాధి తల ఎత్తకుండా నివారించే మార్గాలు వంటి పలు అంశాలపై నేతల సంభాషణలు, నిపుణ బృందాల చర్చలు,  వర్చువల్ గా సాగే ఇష్టాగోష్ఠులు ఈ మూడు రోజుల కార్యక్రమం లో భాగంగా ఉంటాయి.  ఈ వార్షిక సమావేశంలో 40 దేశాలకు చెందిన దాదాపు 1600 మంది పాల్గొంటారు.

గ్రాండ్ చాలెంజెస్ వార్షిక సమావేశం 2020 కి బిల్ & మిలిండా గేట్స్ ఫౌండేషన్, బయోటెక్నాలజీ విభాగం, భారత ప్రభుత్వ విజ్ఞాన శాస్త్ర  & సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసర్చ్, నీతి ఆయోగ్ లతో పాటు గ్రాండ్ చాలెంజెస్ కెనడా, ద యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫార్ ఇంటర్ నేషనల్ డెవలప్ మెంట్, వెల్ కమ్ లు కూడా సహ ఆతిథేయిలు గా వ్యవహరించనున్నాయి.
 
ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్యం & కుటుంబ సంక్షేమం, విజ్ఞాన శాస్త్ర  & సాంకేతిక విజ్ఞాన, భూ వైజ్ఞానిక శాస్త్ర శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ తొలి పలుకులు అందిస్తారు.  బిల్ & మిలిండా గేట్స్ ఫౌండేషన్ కో-చైర్ శ్రీ బిల్ గేట్స్ ప్లీనరీ ఫ్రేమింగ్ కన్వర్జేషన్ ను సమర్పిస్తారు.

గ్రాండ్ చాలెంజెస్ ఇండియా ను భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగం, బిల్ & మిలిండా గేట్స్ ఫౌండేషన్ ల భాగస్వామ్యంతో 2012వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. తరువాత దీనిలో వెల్ కమ్ కూడా ఒక భాగస్వామ్య సంస్థ గా చేరింది.  గ్రాండ్ చాలెంజెస్ ఇండియా వ్యవసాయం, పోషణ విజ్ఞానం, పారిశుధ్యం, తల్లీబిడ్డల స్వస్థత మొదలుకొని అంటురోగాల వరకు కూడా అనేక ఆరోగ్య, అభివృద్ధి సంబంధ ప్రాధాన్యాలపై దృష్టి పెట్టి కృషి చేస్తున్నది.
 


 

***



(Release ID: 1665426) Visitor Counter : 152