ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
‘ప్రపంచ ఆహార దినోత్సవం’ సందర్భంగా ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ. నిర్వహించిన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన - డాక్టర్ హర్ష వర్ధన్
"నూతన భారతదేశం గురించి ప్రధానమంత్రి ఆలోచనకు అనుగుణంగా, 2022 నాటికి ట్రాన్స్-ఫ్యాట్ రహితంగా ఉండే ప్రయత్నంలో భారతదేశం ఉంది"
‘ఈట్ రైట్ ఇండియా’ మరియు ‘ఫిట్ ఇండియా ఉద్యమం’ దిశగా మార్పు చెందే సామర్థ్యాన్ని పునరుద్ఘాటించిన - డాక్టర్ హర్ష వర్ధన్
Posted On:
16 OCT 2020 3:50PM by PIB Hyderabad
"ప్రపంచ ఆహార దినోత్సవం" సందర్భంగా ఈ రోజు ఏర్పాటైన ఒక కార్యక్రమానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ. నిర్వహించింది. పెరుగు, పోషించు, నిలబెట్టు. కలిసి కట్టుగా: అనేది ఈ సంవత్సరం ఇతివృత్తం. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే వీడియో కాన్ఫరెన్సు ద్వారా పాల్గొన్నారు.
మహమ్మారి కారణంగా ప్రపంచం ఎదుర్కొంటున్నఅసాధారణమైన సవాళ్ల కారణంగా, ఆహారం, పోషణ, ఆరోగ్యం, రోగనిరోధక శక్తి మరియు సుస్థిరతపై నూతన దృష్టి కేంద్రీకరించబడిందని డాక్టర్ హర్ష వర్ధన్ పేర్కొన్నారు. "పర్యావరణపరంగా స్థిరమైన మార్గంలో ప్రతి ఒక్కరికీ సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులో ఉండాలనే విషయాన్ని ప్రోత్సహించడానికి, ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ. చేపట్టిన ఈట్ రైట్ ఇండియా ఉద్యమం లక్ష్యంగా ఉంది. పౌరులందరికీ సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం అనేది దాని ఆశయం ఒక భాగం. ఇది ఆహార భద్రతతో కూడిన పర్యావరణ వ్యవస్థలను మెరుగుపరుస్తుంది మరియు మన పౌరుల పరిశుభ్రత మరియు ఆరోగ్యాన్ని పెంచుతుంది. ” అని ఆయన వివరించారు.
ఆహార సరఫరా గొలుసు నుండి ట్రాన్స్ ఫ్యాట్స్ ను తొలగించడం అనేది, ఈ సంవత్సరం ఒక ప్రధాన లక్ష్యంగా ఉంది. పాక్షికంగా హైడ్రోజనేటెడ్ వెజిటబుల్ ఆయిల్స్ (పి.హెచ్.వి.ఓ. లు) (ఉదా. వనస్పతి, షార్టెనింగ్, మార్గరైన్ మొదలైనవి), కాల్చిన మరియు వేయించిన ఆహారాలు కలిగిన ఆహార పదార్ధాలు, ట్రాన్స్ ఫ్యాట్, భారతదేశంలో సంక్రమించని వ్యాధుల పెరుగుదలకు ప్రధాన కారణం. డాక్టర్ హర్ష వర్ధన్ మాట్లాడుతూ, “ట్రాన్స్ ఫ్యాట్ అనేది హృదయ సంబంధ వ్యాధులకు (సి.వి.డి) సవరించదగిన ప్రమాద కారకం. సి.వి.డి. ప్రమాద కారకాన్ని తొలగించడం, ముఖ్యంగా, కోవిడ్సి-19 పరిస్థితుల్లో చాలా సందర్భోచితంగా ఉంటుంది, ఎందుకంటే సి.వి.డి. ఉన్నవారు మరణాలపై ప్రభావం చూపే తీవ్రమైన పరిస్థితులను కలిగి ఉంటారు. ” అని పేర్కొన్నారు. దేశ స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా నూతన భారతదేశం గురించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారి ఆశయాలకు అనుగుణంగా, 2022 నాటికి, అంటే, ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యం కంటే ఒక సంవత్సరం ముందే, భారతదేశాన్ని ట్రాన్స్ ఫ్యాట్ రహితంగా చేయడానికి ప్రభుత్వం చేస్తున్న కృషిని, ఆయన ప్రతి ఒక్కరికీ గుర్తు చేశారు.
"ఈట్ రైట్ ఇండియా" మరియు "ఫిట్ ఇండియా ఉద్యమం" దిశగా మార్పు చెందే సామర్థ్యాన్ని, డాక్టర్ హర్ష వర్ధన్ పునరుద్ఘాటిస్తూ, "ఈ రెండు ఉద్యమాలతో పాటు స్వచ్ఛ భారత్ అభియాన్, జల్ జీవన్ మిషన్ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ యొక్క ఇతర ప్రయత్నాలు భారతీయుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి మరియు పర్యావరణాన్ని నయం చేస్తాయి." అని పేర్కొన్నారు.
ఆసక్తిగల పౌరులు అందుబాటులో ఉన్న మొత్తం సమాచారంలో విషయాలను చూడగలిగే ఇంటర్నెట్ యొక్క అద్భుతాలపై తన ఆశ్చర్యాన్ని ఆయన వ్యక్తం చేస్తూ, అవగాహన మరియు వినియోగదారుల విద్యను ప్రోత్సహించే సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించాలని, ఎఫ్.ఎస్.ఎస్.ఎ.ఐ. అధికారులను కోరారు. తద్వారా సమాచారం ఉన్న పౌరులు బాధ్యతాయుతమైన ఎంపికలు చేసుకునే అవకాశం ఉంటుందని, ఆయన అభిప్రాయపడ్డారు.
పాఠశాలల కోసం ఈట్ రైట్ క్రియేటివిటీ ఛాలెంజ్ ను ఆయన ప్రారంభించారు. ఇది ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడం కోసం నిర్వహిస్తున్న పోస్టర్ మరియు ఫోటోగ్రఫీ పోటీ. స్మార్ట్ సిటీ మిషన్ మరియు యు.కే. లోని ది ఫుడ్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ. నిర్వహించే ‘ఈట్ స్మార్ట్ సిటీ’ (ఛాలెంజ్) ను కూడా ఆయన ప్రారంభించారు. ఇది భారతదేశంలోని స్మార్ట్ సిటీలలో సరైన ఆహార పద్ధతులు మరియు అలవాట్ల వాతావరణాన్ని సృష్టిస్తుంది. మరియు ఇతర నగరాలు అనుసరించడానికి ఇది ఒక ఉదాహరణగా కూడా నిలుస్తుంది.
ఈ సందర్భంగా డాక్టర్ హర్ష వర్ధన్ అనేక పుస్తకాలు / మార్గదర్శకాలను విడుదల చేశారు:
* పాఠశాల క్యాంటీన్ / భోజనశాలలను సురక్షితంగా తిరిగి తెరవడానికి ఆహార భద్రత మరియు పరిశుభ్రత మార్గదర్శకాలు - ‘క్రొత్త సాధారణ కోవిడ్-19’పరిస్థితుల్లో, సంబంధిత భాగస్వాములందరూ అనుసరించాల్సిన ఉత్తమ పద్ధతులను ప్రత్యేకంగా పేర్కొనే పత్రం. వ్యక్తిగత మరియు పర్యావరణ పరిశుభ్రతతో పాటు, సాధారణ అపోహలపై వారి స్పష్టతలతో కూడిన చిట్కాలు కూడా ఇందులో ఉన్నాయి.
* ఆహారం మరియు పోషణపై సాంకేతిక అంశాలను తెలియజేయడానికీ, సరిగ్గా భుజించడం గురించి సాధారణ ప్రజలకు సులువైన సంప్రదాయ శైలిలో తెలియజేయడానికీ ‘మీరు సరిగ్గా భుజిస్తున్నారా?’ అనే పుస్తకం ఉపయోగపడుతుంది.
* ఆరోగ్యకరమైన మరియు పర్యావరణపరంగా స్థిరమైన ఆహారాన్ని అందించడం మరియు దేశవ్యాప్తంగా కార్యాలయాలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, సంస్థలు, ఆసుపత్రులలో పనిచేసే వ్యక్తులలో అవగాహన పెంచుకోవడంతో పాటు, క్యాంపస్ క్యాంటీన్లలో తప్పనిసరి ఆహార భద్రత మరియు పరిశుభ్రత అవసరాలను అమలు చేయడానికి అవసరమైన మార్గదర్శక సమాచారంతో ‘ఆరెంజ్ బుక్’, అనే పుస్తకాన్ని ఈట్ రైట్ క్యాంపస్ కోసం రూపొందించారు.
* రోజువారీ సిఫార్సులు మరియు తప్పనిసరి ఆహార నియమాలు - ఇది రాష్ట్రాల కోసం ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ. రూపొందించిన ఒక హ్యాండ్‌బుక్. ఆహార నియమాలపై, రాష్ట్ర ప్రభుత్వ అధికారులలో నెలకొన్న ప్రధాన ఆందోళనలకు, ఇది, సమాధానాలను అందిస్తుంది. రోజువారీ భోజనంలో బలవర్థకమైన ప్రధాన ఆహారంతో పోల్చినప్పుడు, విటమిన్-ఎ, విటమిన్-డి, ఐరన్, ఫోలిక్ యాసిడ్ మరియు విటమిన్-బి 12 వంటి సూక్ష్మ పోషకాల సగటు వినియోగంలో ఉన్న వ్యత్యాసాన్ని ఇది మరింత వివరిస్తుంది.
ఈ కార్యక్రమానికి, కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్; ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ. సి.ఈ.ఓ. ఆరోన్ సింఘాల్ తో పాటు, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మరియు ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ. లకు చెందిన ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్లు; ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ. కి చెందిన ప్రాంతీయ డైరెక్టర్లు మరియు అధికారులు; నూనెలు మరియు కొవ్వుల శాస్త్రీయ ప్యానెల్ యొక్క నిపుణులు; అంతర్జాతీయ ప్రజారోగ్య సంస్థలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ బ్యాంకు, కీలక వ్యూహ సంస్థలకు చెందిన అధికారులు; ఎన్.ఈ.పి.ఆర్.ఓ.ఎఫ్.ఏ.ఎన్. - నెట్‌వర్క్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ఆఫ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్, ప్రముఖ ఆహార వ్యాపార కార్పొరేట్ సంస్థలు, పారిశ్రామిక సంస్థలు, తప్పనిసరి ఆహార నియమాల అమలు భాగస్వామ్య సంస్థలు, అభివృద్ధి సంస్థలకు చెందిన సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్సు ద్వారా పాల్గొన్నారు.
*****
(Release ID: 1665325)
Visitor Counter : 294