ఆర్థిక మంత్రిత్వ శాఖ

పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలోని ఎన్.‌పి.ఎస్. మరియు ఎ.పి.వై. చందాదారుల ద్వారా ఏ.యూ.ఎం. ఐదు ట్రిలియన్ల రూపాయలను దాటింది

2020 అక్టోబర్, 10వ తేదీ వరకు 10.50 లక్షల మంది సభ్యులతో 8,186 కార్పొరేట్ సంస్థలు నమోదయ్యాయి

ఏ.పి.వై. కింద 2.5 కోట్ల మంది చందాదారులు చేరారు

Posted On: 16 OCT 2020 10:11AM by PIB Hyderabad

పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పి.ఎఫ్.‌ఆర్.‌డి.ఎ) ఈ రోజు 5 లక్షల కోట్ల రూపాయల మేర అసెట్సు అండర్ మేనేజ్‌మెంట్ (ఎ.యు.ఎం) మార్కును దాటినట్లు ప్రకటించింది.  నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్.‌పి.ఎస్) మరియు అటల్ పెన్షన్ యోజన (ఎ.పి.వై) కింద చందాదారులు చెల్లించిన చందాలు, 12 సంవత్సరాల వ్యవధిలో ఈ మైలురాయి సంఖ్యను చేరుకోడానికి సంయుక్తంగా దోహదపడ్డాయి.

గత కొన్ని సంవత్సరాలుగా, ప్రభుత్వ రంగం నుండి 70.40 లక్షల మంది ఉద్యోగులు, ప్రభుత్వేతర రంగం నుండి 24.24 లక్షల మంది ఉద్యోగులు ఈ పథకంలో చేరడంతో ఎన్.‌పి.ఎస్. చందాదారుల సంఖ్య చెప్పుకోదగిన స్థాయిలో వృద్ధి చెందింది.  

చందాదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరియు చందాదారులకు స్నేహపూర్వకంగా అందుబాటులో ఉండే విధంగా,  చందాదారుల రిజిస్ట్రేషన్, నిష్క్రమణ ప్రక్రియ మరియు ఇతర సేవా అభ్యర్థనలను రూపొందించే ప్రయత్నంలో, చందాదారుల ప్రామాణీకరణకు సంబంధించి, ఓ.టి.పి. / ఈ-సైన్ ఆధారిత ఆన్ ‌బోర్డింగ్, ఆఫ్‌ లైన్ ఆధార్ ఆధారిత ఆన్ ‌బోర్డింగ్, కె.వై.సి. ధృవీకరణ తర్వాత థర్డ్ పార్టీ ఆన్‌ బోర్డింగ్, ఇ-నామినేషన్, ఎం.పి.ఎస్. చందాదారుల కోసం ఈ-నిష్క్రమణ వంటి కొత్త పద్ధతులను,  పి.ఎఫ్.‌ఆర్.‌డి.ఎ. నియంత్రణ సంస్థ, క్రమం తప్పకుండా పరిచయంచేసి అమలుచేస్తోంది. 

ఐదు లక్షల కోట్ల రూపాయల మేర ఏ.యూ.ఎం. సాధించడం ఒక ఘన విజయమని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పి.ఎఫ్.‌ఆర్.‌డి.ఎ) చైర్మన్ శ్రీ సుప్రతీం బందోపాధ్యాయ్ పేర్కొన్నారు. పి.ఎఫ్.ఆర్.డి.ఏ. మరియు ఎన్.పి.ఎస్. పట్ల చందాదారుల నమ్మకాన్ని ఇది ప్రతిబింబిస్తోందని ఆయన అన్నారు.  సమర్థవంతమైన వ్యవస్థలు మరియు నిపుణులైన ఫండ్ నిర్వాహకులతో మార్కెట్ ఆధారిత రాబడిని అందించే విధంగా తాము రూపొందించి, అమలుచేస్తున్న ఒక బలమైన, వినూత్న విధానం, చందాదారులు వారి పదవీ విరమణ మొత్తాలను ఇక్కడ కూడబెట్టుకునేలా చేసిందని ఆయన వివరించారు. ఈ మహమ్మారి సమయంలో, పదవీ విరమణ ప్రణాళిక కేవలం పొదుపు లేదా పన్ను ప్రయోజన ఎంపిక కాదని కార్పొరేట్లు మరియు వ్యక్తుల యొక్క పెరుగుతున్న పొదుపు మొత్తాల ద్వారా మరియు ఈ సవాలు కాలంలో ఎన్.‌పి.ఎస్. నమోదు దాదాపు 14 శాతం పెరగడం ద్వారా బయటపడిందని ఆయన తెలియజేశారు. 

పి.ఎఫ్.ఆర్.డి.ఏ. గురించి

పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పి.ఎఫ్.‌ఆర్.‌డి.ఎ) అనేది పార్లమెంటు చట్టం ద్వారా స్థాపించబడిన చట్టబద్ధమైన సంస్థ.  ఈ చట్టం వర్తించే జాతీయ పెన్షన్ వ్యవస్థ (ఎన్.‌పి.ఎస్) మరియు పెన్షన్ పథకాల క్రమబద్ధమైన వృద్ధిని నియంత్రించడం, ప్రోత్సహించడం మరియు నిర్ధారించడం కోసం ఈ సంస్థను  ఏర్పాటు  చెయడం జరిగింది.  ప్రారంభంలో 2004 జనవరి, 1వ తేదీ నుండి నియమితులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం మాత్రమే ఈ ఎన్.‌పి.ఎస్. ను ప్రకటించారు. ఆ తరువాత దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగుల కోసం ఈ పధకాన్ని అమలుచేశాయి.  ఆ తర్వాత ఈ ఎన్.‌పి.ఎస్. పధకాన్ని స్వచ్ఛంద ప్రాతిపదికన భారతీయ పౌరులందరికీ (నివాసి/ప్రవాసీ/విదేశీ)  మరియు కార్పొరేట్ సంస్థల ఉద్యోగుల కోసం విస్తరించారు.

2020 అక్టోబర్, 10వ తేదీ నాటికి, ఎన్.‌పి.ఎస్. మరియు అటల్ పెన్షన్ యోజన కింద మొత్తం చందాదారుల సంఖ్య 3.76 కోట్లు దాటింది.  అదే విధంగా, అసెట్ అండర్ మేనేజ్‌మెంట్ (ఏ.యూ.ఎం) 5,05,424 కోట్ల రూపాయలకు పెరిగింది.

*****



(Release ID: 1665207) Visitor Counter : 92