ఆర్థిక మంత్రిత్వ శాఖ

జి 20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ (ఎఫ్‌ఎంసిబిజి) సమావేశంలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పాల్గొన్న ఆర్ధిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్

Posted On: 14 OCT 2020 9:36PM by PIB Hyderabad

కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ సౌదీ అరేబియా ఆధ్వర్యంలో జరిగిన జి 20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ (ఎఫ్‌ఎంసిబిజి) సమావేశంలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పాల్గొన్నారు. ప్రపంచ దేశాల తాజా ఆర్ధిక పరిస్థితిని, కోవిడ్ -19 మహమ్మారిని ఎదుర్కోడానికి  జి 20 దేశాలు అమలుచేస్తున్న చర్యలతో పాటు 2020 సంవత్సర అర్ర్ధిక ప్రాధాన్యతలను చర్చించడానికి జి 20 దేశాలు మంత్రులు మరియు గవర్నర్లు సమావేశమయ్యారు.  

     మొదటి సెషన్‌లో ఆర్థిక మంత్రి  జి 20 కార్యాచరణ ప్రణాళిక తాజా అంశాలను వివరించారు. కోవిడ్ -19 నేపథ్యంలో  2020 ఏప్రిల్ 15 న జరిగిన  జి 20 ఆర్థిక మంత్రులు మరియు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో ఈ ప్రణాళికను ఆమోదించారు .ప్రస్తుత ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని  జి 20 కార్యాచరణను కొనసాగించవలసి ఉంటుందని  శ్రీమతి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.  కోవిడ్ -19 ని మరింత సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి ఈ చర్యలు తప్పవని ఆమె అన్నారు.

         జి 20 కార్యాచరణ పధకంలో పొందు పరచవలసి ఉన్న అంశాలను ప్రస్తావిస్తూ వీటిలో ఆరోగ్యం మరియు ఆరోగ్య అంశాలకు సమాన ప్రాధాన్యతను ఇవ్వవలసి ఉంటుందన్నారు., అంతర్జాతీయ స్థాయిలో నియంత్రణ చర్యలను రూపొందించడానికి వివిధ దేశాలు తమ  అవసరాలకు రూపొందించి  అమలు చేస్తున్న చర్యలతో పాటు పరపతి గ్రేడ్లను తగ్గించడానికి అమలు చేస్తున్న చర్యలను పరిగణన లోకి తీసుకోవలసి ఉంటుందని శ్రీమతి సీతారామన్ పేర్కొన్నారు.

       తక్కువ ఆదాయం కలిగి ఉన్న దేశాలకు రుణ సేవ విస్తరించడానికి చొరవ తీసుకొవదం(DSSI) జి 20 కార్యాచరణ ప్రణాళికలో ప్రధాన అంశంగా ఉంది. దీని ప్రకారం తమ పట్ల సానుకూలంగా వ్యవహరించాలని తక్కువ ఆదాయం కలిగి ఉన్న దేశాల నుంచి అందే విజ్ఞప్తి మేరకు వాటికి రుణ చెల్లింపుల విషయంలో మినహాయింపులు ఇవ్వడం జరుగుతుంది. తొలుత  దీనిని  2020 చివరి వరకు అమలు చేయాలని అనుకొన్నారు.  అయితే జి 20 ఆర్ధిక మంత్రులు మరియు సెంట్రల్ బ్యాంకు గవర్నర్ల నుంచి వచ్చిన విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకొని దీనిని మరో ఆరు నెలల పాటు లేదా ఆర్ధిక పరిస్థితులు మెరుగు పడని పక్షంలో 2021 లో జరిగే అంతర్జాతీయ ద్రవ్య నిధి/ ప్రపంచ బ్యాంకు గ్రూప్ వసంత కాల సమావేశాల వరకు పొడిగించాలని నిర్ణయించారు.

          తక్కువ ఆదాయం కలిగివున్న దేశాల రుణ అంశాలను ప్రస్తావించిన శ్రీమతి సీతారామన్ పరిస్థితిని ఎదుర్కోడానికి దీర్ఘ కాలిక చర్యలను అమలు చేయవలసి ఉంటుందన్నారు. కోవిడ్ వల్ల ఎదురవుతున్న ఆర్ధిక సంక్షోభం నుంచి బయట పడడానికి ఆ దేశాలకు అండగా ఉండే విధంగా విధాన రూపకల్పన జరగాలన్నారు.

          రుణాలను సర్దుబాటు చేసే ముందు తాజా పరిస్థితిని రుణదాతలు, రుణగ్రహీతలకు సంబందించిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుందని ఆర్ధిక మంత్రి అన్నారు. ఆచరణసాధ్యంకాని నిబంధనలను విధించి రుణాలను తీసుకుంటున్న దేశాలపై అనవసర భారం పడకుండా చర్యలను తీసుకోవలసి ఉంటుందని మంత్రి అన్నారు.

***



(Release ID: 1664654) Visitor Counter : 192