వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

వాణిజ్యం, పెట్టుబడులు మరియు సహకారంపై భారత-మెక్సికో మధ్య ఐదో ద్వైపాక్షిక ఉన్నత స్థాయి సదస్సు జరిగింది.

Posted On: 13 OCT 2020 1:55PM by PIB Hyderabad

ఇండియా-మెక్సికో ద్వైపాక్షిక హై-లెవల్ గ్రూప్ ఆన్ ట్రేడ్, ఇన్వెస్ట్‌మెంట్ అండ్ కోఆపరేషన్ (బిహెచ్‌ఎల్‌జి) ఐదవ సమావేశం అక్టోబర్ 9,2020 న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. ఈ సమావేశానికి భారత ప్రభుత్వ వాణిజ్య కార్యదర్శి డాక్టర్ అనుప్ వాధవన్ మరియు మెక్సికో ప్రభుత్వం తరఫున ఆ దేశ విదేశీ వాణిజ్య ఉపమంత్రి శ్రీమతి లుజ్ మారియా డి లా మోరా అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఇరు దేశాల నుండి పలు మంత్రిత్వ శాఖలు, విభాగాలు మరియు వాణిజ్యసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇటీవలి కాలంలో భారత్ మరియు మెక్సికో దేశాల మధ్య ద్వైపాక్షిక మరియు వాణిజ్య సంబంధాలలో సాధించిన పురోగతిని ఇరుపక్షాలు ప్రశంసించాయి. ఆడియో-విజువల్ కో-ప్రొడక్షన్, ద్వైపాక్షిక పెట్టుబడులు, వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ యాక్సెస్, శానిటరీ అండ్ ఫైటోసానిటరీ (ఎస్పీఎస్) పై సహకారం, టెక్నికల్ బారియర్స్ టు ట్రేడ్ వంటి అనేక ద్వైపాక్షిక ఆంశాలపై ఇరు పక్షాలు చర్చించాయి. రెండు దేశాల మధ్య మేధో సంపత్తి హక్కులలో సహకారం, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం, ప్రజల మధ్య సంబంధాలు మెరుగుపర్చడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఇరుదేశాల ప్రతినిధులు చర్చించారు.

ఇరు దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య సహకారం పెంపొందించుకునే విధంగా పలు సంస్థలు ఈ సదస్సుల్లో  అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఎలక్ట్రానిక్స్ & కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (ఈఎస్‌సీ) ఆఫ్ ఇండియా, మెక్సికన్ ఛాంబర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ (సీఏఎన్‌ఐఈటీఐ) మధ్య అవగాహన ఒప్పందం కుదురింది. భారత్ మరియు మెక్సికో మధ్య వ్యాపార సంబంధాల అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) మరియు మెక్సికన్ బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్ అండ్ టెక్నాలజీ (సీవోఎంసీఈ)ల మధ్య కూడా అవగాహన ఒప్పందం కుదిరింది.

ఔషధాలు, వైద్య పరికరాలు, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయ ఉత్పత్తులు, మత్స్య సంపద, ఆహార ప్రాసెసింగ్ మరియు ఏరోస్పేస్ పరిశ్రమ మొదలైన వాటిలో మెరుగైన సహకారం ద్వారా ఇరు దేశాలమధ్య ద్వైపాక్షిక వాణిజ్యసంబంధాన్ని విస్తరించుకోవాలని నిర్ణయించినట్టు ఈ సదస్సు విజయవంతంగా పూర్తయిన అనంతరం ఉమ్మడి ప్రకటన వెలువడింది.

***(Release ID: 1664139) Visitor Counter : 157