బొగ్గు మంత్రిత్వ శాఖ
బొగ్గు రంగంలో పరిశోధనల కోసం వెబ్ సైట్ ను ప్రారంభించిన - బొగ్గు మంత్రిత్వ శాఖ
పూర్తి చేసిన మరియు కొనసాగుతున్న పరిశోధన ప్రాజెక్టుల వివరాలు ఈ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి
ఆర్ & డి ప్రాజెక్టులలో పారదర్శకతను ఇది పెంపొందిస్తుంది
Posted On:
09 OCT 2020 5:32PM by PIB Hyderabad
"బొగ్గు రంగంలో జ్ఞానం మరియు పరిశోధన పనులను వ్యాప్తి చేయడానికి మరియు ప్రోత్సహించడానికి వెబ్ సైట్ సహాయం చేస్తుంది", అని బొగ్గు మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ అనిల్ జైన్ పేర్కొన్నారు. బొగ్గు రంగంలో ఆర్ & డి కార్యకలాపాలను ప్రోత్సహించడానికి ఈ రోజు వెబ్ సైట్‌ను ప్రారంభించిన శ్రీ జైన్ మాట్లాడుతూ, ఈ వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేయడంలో సి.ఎం.పి.డి.ఐ. చేసిన ప్రయత్నాలను అభినందించారు. బొగ్గు రంగంలో ఆర్ & డి కోసం వివిధ ప్రతిష్టాత్మక సంస్థలు చేసిన ప్రయత్నాల వెబ్ లింక్ లను కూడా ఈ వెబ్‌సైట్‌లో ఉంచాలని ఆయన సూచించారు.
మంత్రిత్వ శాఖ యొక్క పరిశోధన మరియు అభివృద్ధి (ఆర్ & డి) కార్యకలాపాలను ప్రోత్సహించడానికీ, బొగ్గు రంగంలో ఆర్ & డి ప్రయత్నాల కోసం పరిశోధనా సంస్థలను ఆకర్షించడానికీ, బొగ్గు మంత్రిత్వ శాఖ ఈ వెబ్ సైట్ ను ప్రారంభించింది. మంత్రిత్వ శాఖకు చెందిన స్టాండింగ్ సైంటిఫిక్ రీసెర్చ్ కమిటీ 56 వ సమావేశంలో శ్రీ అనిల్ జైన్ ఈ వెబ్ సైట్ (https://scienceandtech.cmpdi.co.in/) ను ప్రారంభించారు. కోల్ ఇండియా కు చెందిన ఆర్ & డి సంస్థ, సెంట్రల్ మైన్స్ ప్లానింగ్ & డిజైన్ ఇన్ స్టిట్యూట్ లిమిటెడ్ (సి.ఎం.పి.డి.ఐ) ఈ వెబ్ సైట్ ను రూపొందించి, అభివృద్ధి చేసింది.
బొగ్గు పరిశోధన ప్రాజెక్టులను వివిధ రూపాలతో అమలు చేయడానికి వీలుగా, తగిన మార్గదర్శకాలను ఈ వెబ్ సైట్ లో విస్తృతంగా పేర్కొనడం జరుగుతుంది. తద్వారా ఏ సంస్థ అయినా తమ ప్రతిపాదనలను నిర్ణీత పద్ధతిలో సమర్పించవలసి ఉంటుంది. పారదర్శకతను కలిగి ఉండటానికీ, ప్రాజెక్టుల యొక్క పునరావృత స్వభావాన్ని నివారించడానికీ వీలుగా పూర్తి చేసిన ప్రాజెక్టుల ఫలితాలనూ, అదేవిధంగా కొనసాగుతున్న పరిశోధనా ప్రాజెక్టుల జాబితాలను ఈ వెబ్ సైట్ లో పొందుపరుస్తారు. బొగ్గు మరియు లిగ్నైట్ రంగానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు, వార్తా కథనాలతో పాటు, వివిధ ప్రచురణలు కూడా ఈ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయి. భవిష్యత్తులో బొగ్గు పరిశోధన కోసం గుర్తించబడిన వివిధ ప్రాంతాలను, అంశాలను ఈ వెబ్ సైట్ లో పొందుపరుస్తారు.
ఉత్పత్తి, ఉత్పాదకత, భద్రత, బొగ్గు లబ్ధి, వినియోగం, పర్యావరణం, పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛమైన బొగ్గు సాంకేతిక పరిజ్ఞానం మరియు అనుబంధ రంగాలు మొదలైన వాటి మెరుగుదల కోసం బొగ్గు శాస్త్ర సాంకేతిక విజ్ఞానం (ఎస్ & టి) ప్రణాళిక ద్వారా బొగ్గు మరియు లిగ్నైట్ రంగాలలో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రోత్సహిస్తోంది. ఈ విషయాలపై పరిశోధనలు నిర్వహించడానికి, బొగ్గు మంత్రిత్వ శాఖ నిధులను కూడా అందిస్తుంది.
బొగ్గు మరియు లిగ్నైట్ ఉత్పత్తి సంస్థల క్రియాశీల భాగస్వామ్యంతో, జాతీయ పరిశోధన మరియు విద్యాసంస్థలైన ఐ.ఐ.టి.లు, ఎన్.ఐ.టి.లు, ఐ.ఐ.ఎస్.సి, ఎన్.ఆర్.ఎస్.సి, సి.ఎస్.ఐ.ఆర్. ప్రయోగశాలలతో పాటు, ఇతర ప్రముఖ విశ్వవిద్యాలయాలు మొదలైనవి ప్రస్తతం పరిశోధన ప్రాజెక్టులను అమలు చేస్తున్నాయి. పరిశోధన ప్రాజెక్టుల కోసం కొత్త ప్రభావిత ప్రాంతాలను బొగ్గు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి సాంకేతిక కమిటీ గుర్తిస్తుంది. సి.ఎం.పి.డి.ఐ. వెబ్ సైట్ లో వీటిని పొందుపరుస్తారు. వీటి ఆధారంగా అవసరమైన పరిశోధనల ప్రతిపాదనలు సంవత్సరమంతా సమర్పించబడతాయి.
*****
(Release ID: 1663281)
Visitor Counter : 181