మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

4 కేంద్రీయ విద్యాలయాలకు కొత్త భవనాలు

ఒడిశా, రాజస్థాన్, హర్యానాలలో ప్రారంభించిన కేంద్ర విద్యామంత్రి

దాదాపు 4వేల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందన్న మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 08 OCT 2020 4:04PM by PIB Hyderabad

   నాలుగు కేంద్రీయ విద్యాలయ సంస్థలకోసం 3 రాష్ట్రాల్లో కొత్తగా నిర్మించిన భవనాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ‘నిషాంక్’ గురువారం వర్చువల్ పద్థతిలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. ఒడిశాలో రెండు కేంద్రీయ విద్యాలయ సంస్థల కొత్త భవనాలకు, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లో ఒక్కొక్కటి చొప్పున భవనాలకు ప్రారంభోత్సవం జరిగింది.  ఒడిశాలోని నయాగఢ్, రాయ్ రంగ్.పూర్ (మహుల్దిహా) ప్రాంతాల్లో రెండు కేంద్రీయ విద్యాలయాలకు, రాజస్థాన్ లోని హనుమాన్ గఢ్ లో ఒక కేంద్రీయ విద్యాలయకు, హర్యానా రాష్ట్రం, ఫరీదాబాద్.లో ఉన్న నంబర్ కేంద్రీయ విద్యాలయకు కొత్తగా అధునాతన భవనాలను నిర్మించారు.  

 

  వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరిగిన ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రి రమేశ్ పోఖ్రియాల్ ‘నిషాంక్’ మాట్లాడుతూ,. ఇప్పటివరకూ తాత్కాలిక భవనాల్లో సాగుతున్న నాలుగు కేంద్రీయ విద్యాలయ సంస్థలకు రూ. 70కోట్ల వ్యయంతో కొత్త భవనాలను నిర్మించినట్టు చెప్పారు. దీనితో ఒడిశా, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లోని దాదాపు 4వేల మంది విద్యార్థులకు ప్రయోజన చేకూరుతుందన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా, విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, ప్రిన్సిపాళ్లకు, కేంద్రీయ విద్యాలయాల నిర్వహణా కమిటీ సభ్యులకు కేంద్రమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అధునాతన సదుపాయాలతో నిర్మించిన ఈ కొత్త భవనాలవల్ల ఈ 4 సంస్థల్లో బోధన, విద్యాభ్యాస ప్రక్రియలు మరింత బలోపేతం అవుతాయని, విద్యార్థులకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ఆయన చెప్పారు. తాత్కాలిక భవనాల్లో నడుస్తున్న కేంద్రీయ విద్యాలయ సంస్థలకు స్థలం బదిలీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని పోఖ్రియాల్ రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.

   నాలుగు కేంద్రీయ విద్యాలయ సంస్థలకు ‘హరిత భవనాల’ నియమావళికి అనుగుణంగానే కొత్త భవనాల నిర్మాణం  జరిగిందని, గరిష్టస్థాయిలో నీటి వినియోగం లక్ష్యంగా వర్షపునీటి సంరక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేశారని మంత్రి చెప్పారు. దివ్యాంగులు కూడా ప్రవేశించడానికి వీలుగా తగిన సదుపాయం ఈ భవనాల్లో ఉందన్నారు. క్రీడలు, ఇతర వ్యాయామ కార్యకలాపాలకు తగిన స్థలాన్ని కేటాయించారన్నారు.

 

  కొత్తగా నిర్మించిన కేంద్రీయ విద్యాలయ సంస్థల భవనాల వివరాలు ఇవీ:

  1. కేంద్రీయ విద్యాలయ, నయాగఢ్ (ఒడిశా).

  2010-12లో ఈ కేంద్రీయ విద్యాలయను స్థాపించారు. 1నుంచి 12వరకూ తరగతులను ఇప్పటివరకూ తాత్కాలిక భవనాల్లో నిర్వహిస్తూ వచ్చారు. తాజాగా అన్ని అధునిక సదుపాయాలతో ర. 16.39కోట్ల వ్యయంతో కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కె.వి.ఎస్.) చక్కని భవనాన్ని నిర్మించింది. ఒడిశా రాష్ట్రంలో ప్రస్తుతం 62 కేంద్రీయ విద్యాలయ సంస్థలు ఉన్నాయి.

 

 

  1. కేంద్రీయ విద్యాలయ మహుల్దిహా, రాయిరంగ్ పూర్ (ఒడిశా).

  2016-17లో ఈ కేంద్రీయ విద్యాలయ సంస్థను స్థాపించారు. 1నుంచి 11వరకూ తరగతులను ఇప్పటివరకు తాత్కాలిక భవనాల్లో నిర్వహిస్తూ వచ్చారు. అన్ని అధునాతన సదుపాయాలతో ఒక చక్కని భవనాన్ని రూ. 16.06 కోట్ల ఖర్చుతో కె.వి.ఎస్. నిర్మించింది.

  1. కేంద్రీయ విద్యాలయ, హనుమాన్ గఢ్ (రాజస్థాన్)

  ఈ కేంద్రీయ విద్యాలయ సంస్థను 2014-15లో స్థాపించారు. 1నుంచి 10వరకూ తరగతులను ఇప్పటివరకు తాత్కాలిక భవనాల్లో నిర్వహిస్తూ వచ్చారు. కొత్తగా రూ. 16.06 కోట్ల ఖర్చుతో అన్ని ఆధునిక సౌకర్యాలతో చక్కని భవనాలను కె.వి.ఎస్. నిర్మించింది. ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్రంలో 77 కేంద్రీయ విద్యాలయ సంస్థలు నడుస్తున్నాయి.

  1. కేంద్రీయ విద్యాలయ నంబర్. 3, ఫరీదాబాద్ (హర్యానా)

  ఈ కేంద్రీయ విద్యాలయ సంస్థను 2003-04లో స్థాపించారు. 1నుంచి 11వరకూ తరగతులను ఇప్పటివరకు తాత్కాలిక భవనాల్లో నిర్వహిస్తూ వచ్చారు. కొత్తగా రూ. 20.19 కోట్ల ఖర్చుతో అన్ని ఆధునిక సౌకర్యాలతో చక్కని భవనాలను కె.వి.ఎస్. నిర్మించింది. ప్రస్తుతం హర్యానా రాష్ట్రంలో 34 కేంద్రీయ విద్యాలయ సంస్థలు నడుస్తున్నాయి.

******


(రిలీజ్ ఐడి: 1662866) సందర్శకుల సూచీ సంఖ్య : : 129
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Odia , English , Urdu , हिन्दी , Manipuri , Punjabi , Tamil