రైల్వే మంత్రిత్వ శాఖ
కోల్‌కతా నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో కోల్‌కతా ఈస్ట్-వెస్ట్ మెట్రో కారిడార్‌కు కేంద్రం అనుమతి
మెట్రో లైన్ పొడవు 16.6 కి.మీ.
ప్రాజెక్టు విలువ రూ.8575 కోట్లు
Posted On:
07 OCT 2020 4:08PM by PIB Hyderabad
కోల్‌కతా ఈస్ట్-వెస్ట్ మెట్రో కారిడార్ ప్రాజెక్టు సవరించిన వ్యయ అంచనా రూ.8574.98 కోట్లను కేంద్రం ఆమోదించింది. దీనిపై రైల్వే మంత్రిత్వ శాఖ పంపిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. కోల్‌కతాలోని సాల్ట్ లేక్ సెక్టార్-5, హౌరా మైదాన్‌ను కలుపుతూ మెట్రో కారిడార్ ఉంటుంది. మొత్తం పొడవు 16.6 కి.మీ. ప్రత్యేక ప్రయోజన సంస్థ (స్పెషల్ పర్పస్ వెహికల్)గా కోల్‌కతా మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్, ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపడుతోంది. 2021 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును ప్రాజెక్టును పూర్తి చేయాలని కరోనాకు ముందు లక్ష్యంగా నిర్ణయించారు. ప్రాజెక్టు పూర్తిలో కరోనా ప్రభావాన్ని తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. గంగానది అడుగు భాగం నుంచి సొరంగాన్ని నిర్మించడం, దేశంలోనే భూమికి అత్యంత దిగువన ఉన్న మెట్రో స్టేషన్‌గా హౌరా స్టేషన్‌ను నిర్మించడం వంటి కఠినమైన సాంకేతిక సవాళ్లు ఈ ప్రాజెక్టులో ఉన్నాయి. దేశంలో ముఖ్య నది కింద నుంచి నిర్మిస్తున్న తొలి మెట్రో మార్గం కూడా ఇదే.
వ్యాపార జిల్లా కోల్‌కతాతో; పశ్చిమాన ఉన్న పారిశ్రామిక నగరం హౌరాను, తూర్పున ఉన్న సాల్ట్ లేక్ సిటీని సురక్షిత, సౌకర్యవంత ప్రజా రవాణా ద్వారా కలపడం ఈ మెట్రో ప్రాజెక్టు లక్ష్యం. కోల్‌కతా మెట్రోపాలిటన్ ప్రాంతంలోని మూడు కీలక భాగాలైన హౌరా, కోల్‌కతా వ్యాపార ప్రాంతం, సాల్ట్ లేక్‌లోని కొత్త ప్రాంతాలను ఈ కారిడార్ కలపడం వల్ల; కోల్‌కతాతోపాటు ప్రక్కనే ఉన్న హౌరా, బిధానంగర్‌లో వేగవంతమైన రవాణాలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. ఐటీ హబ్‌లోని ముఖ్య ప్రాంతాలైన హౌరా, సీల్దా, ఎస్‌ప్లాండే, సాల్ట్ లేక్ సెక్టార్-5ను ఈ కారిడార్ కలుపుతుంది.
ఇంటర్‌ఛేంజ్ హబ్‌ల నిర్మాణం ద్వారా మెట్రో, సబ్-అర్బన్ రైల్వే, జల, రహదారి రవాణా వంటి బహుళ విధానాలను ఈ కారిడార్ అనుసంధానిస్తుంది. ప్రతిరోజూ లక్షలాది మంది సాఫీగా ప్రయాణాలు కొనసాగించడానికి వీలు కల్పిస్తుంది.
ప్రాజెక్టు ఉపయోగాలు:
• సురక్షిత, సమర్థ, పర్యావరణహిత ప్రయాణ వ్యవస్థను అందిచడం ద్వారా ప్రజలకు ఉపయోగం
• ప్రయాణ సమయం తగ్గుదల
• ఇంధన వినియోగం తగ్గుదల
• రహదారి మౌలిక సదుపాయాలపై మూలధన వ్యయం తగ్గుదల
• కాలుష్యం, ప్రమాదాలు తగ్గుదల
• రవాణా ఆధారిత అభివృద్ధిలో మెరుగుదల
• కారిడార్‌లోని భూముల విలువలో పెరుగుదల, అదనపు ఆదాయం
• ఉపాధి కల్పన
• కోల్‌కతాలో వాహన రద్దీ తగ్గుదల, కాలుష్య నియంత్రణ
(Release ID: 1662414)
Visitor Counter : 151