పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

ప్రైవేటు భాగస్వామ్యంతో జంతుప్రదర్శన శాలల స్థాయీకరణ, విస్తరణకు ప్రణాళిక : ప్రకాశ్ జవదేకర్

Posted On: 05 OCT 2020 2:54PM by PIB Hyderabad

   దేశంలోని 160 జంతు ప్రదర్శన శాలల (జూలను) స్థాయిని పెంచే విషయమై ప్రభుత్వం సమాలోచన జరుపుతోందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి  ఈ రోజు చెప్పారు. వన్యజీవులకు మానవాళికి మధ్య అన్యోన్యతను పెంపొందించేందుకు, వన్యజీవుల ప్రవర్తనాశైలిపై ప్రజలకు మరింత నిశితంగ అవగాహన కలిగించేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు చెపారు. విభిన్నమైన వన్యజీవులకు, వన్యప్రాణులకు మనదేశం ఆవాసం కావడం మనకు ఎంతో గర్వకారణమన్నారు. 2020వ సంవత్సరపు వన్యజీవుల వారోత్సవం సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు.

 

DSC_1801.jpg

  దేశంలోని అన్ని జంతుప్రదర్శన శాలల స్థాయీకరణ, విస్తరణ లక్ష్యంగా ఒక విధానం ప్రస్తుతం రూపొందుతోందని, రానున్న బడ్జెట్ లో ఈ అంశాన్ని చేర్చుతామని జవదేకర్ తెలిపారు. ఈ ప్రణాళిక తయారీలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు, కార్పొరేషన్లకు, వాణిజ్యసంస్థలకు, ప్రజలకు కీలకపాత్ర ఉంటుందన్నారు. వన్యజీవులు, ప్రకృతి, మానవాళి మధ్య అనుసంధానం ఏర్పరచడానికి,.. జంతు ప్రదర్శన శాలల సందర్శకులకు, ప్రత్యేకించి పిల్లలకు, విద్యార్థులకు, రేపటితరం చిన్నారులకు మంచి అనుభవాన్ని చవిచూపించడానికి ఈ ప్రణాళిక దోహదపడుతుందన్నారు.

 

    ఈ సందర్భంగా, కేంద్ర జంతు ప్రదర్శన శాలల ప్రాధికార సంస్థ (సి.జెడ్.ఎ.), ఇంధన, ప్రకృతి వనరుల సంస్థ (టెరీ-టి.ఇ.ఆర్.ఐ.) రూపొందించిన ఒక నివేదికను జవదేకర్ ఆవిష్కరించారు. -పర్యావరణ వ్యవస్థపై ఆర్థికపరమైన మధింపు, జాతీయ జూవలాజికల్ పార్క్, న్యూఢిల్లీ- పేరిట ఈ నివేదికను రూపొందించారు. దేశంలో మానవాళి సంక్షేమానికి, జంతు ప్రదర్శన శాలల వంటి వన్యజీవుల ఆవాసాల ప్రాధాన్యాన్ని, వాటి విస్తరణకు ఉన్న ఆశ్యకతను ఈ నివేదికలో వివరించారు.

  పర్యావరణ వ్యవస్థపై ఆర్థికపరమైన మధింపు పేరిట ఇలా అధ్యయనం చేపట్టడం దేశంలో, బహుశా,..ప్రపంచంలోనే ఇది తొలిసారి కావచ్చు. ఈ అధ్యయనం ప్రకారం జీవవైవిధ్య పరిరక్షణ, ఉపాధి అవకాశాల కల్పన, కర్బన అవశేషాలను వేరుచేయడం, అధ్యయనం, పరిశోధన, వినోదాత్మక, సాంస్కృతిక అంశాలతో కలిపి పర్యావరణం వ్యవస్థ సేవల మొత్తం ఆర్థిక విలువ 423కోట్లుగా లెక్కించారు.  అయితే,..కర్బన నిల్వలు, జంతు ప్రదర్శన శాలలు అందించే భూమి విలువ వంటి వాటిని కలిపితే  ఈ విలువను 55వేల కోట్లుగా ఉండవచ్చని అంచనా వేశారు. (ఈ-రిపోర్ట్).

   జంతు ప్రదర్శన శాలల్లో ఉండే వన్య ప్రాణుల నిర్వహణ, సంక్షేమంకోసం మరింత ఉత్సాహంగా పనిచేసేలా జూపార్క్ అధికారులను, సిబ్బందిని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన సి.జెడ్.ఎ.-ప్రాణిమిత్ర అవార్డులను కేంద్ర మంత్రి జవదేకర్ ఈ సందర్భంగా ప్రదానం చేశారు. ప్రతిభావంతమైన డైరెక్టర్/క్యూరేటర్, ప్రతిభావంతమైన వెటర్నేరియన్,  ప్రతిభావంతమైన బయాలజిస్ట్/ఎడ్యుకేషనిస్ట్, ప్రతిభావంతమైన అనిమల్ కీపర్ వంటి 4 కేటగిరీలలో ఈ పురస్కారాలను మంత్రి ప్రదానం చేశారు.

 

 

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జవదేకర్,.. వర్చువల్ పద్ధతిలో ఆన్ లైన్ ద్వారా దేశవ్యాప్తంగా  వివిధ ప్రాంతాల్లోని విద్యార్థుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. వన్యప్రాణుల సంరక్షణ, మానవాళి-వన్యజీవరాసుల మధ్య అన్యోన్యత తదితర అంశాలపై అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. దేశంలోని అత్యంత విలువైన వన్యజీవుల పరిరక్షణకు మనం అంతా కలసికట్టుగా కృషిచేయాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

 

DSC_1786.jpg

 

  దేశంలోని జంతు ప్రదర్శన శాలల పనితీరుపై పర్యవేక్షణకు, వన్యజీవుల పరిరక్షణా వ్యూహాల రూపకల్పనకు దోహదపడేందుకు కేంద్ర జంతు ప్రదర్శన శాలల ప్రాధికార సంస్థ (సి.జెడ్.ఎ.) ఏర్పాటైంది. జంతువులకు ఆవాసం కల్పించడం, వాటి సంక్షేమం చూడటంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలు పాటిస్తున్న జంతు ప్రదర్శన శాలలు, జంతు సంరక్షణ కేంద్రాలు దేశంలో 160 వరకూ ఉన్నట్టు సి.జెడ్.ఎ. గుర్తించింది.  దేశంలోని వివిధ జూపార్కులలో ప్రస్తుతం 567 జంతు జాతులు బోనుల్లో, ప్రత్యేక రక్షణ ఏర్పాట్ల మధ్య ఉన్నాయి. వీటిలో,. 114 జంతువులు అంతరిస్తున్న జీవ జాతుల రకానికి చెందినవి ఉన్నాయి. దేశంలోని జూ పార్కులు మొత్తం 56,481 జంతువులకు ఆశ్రయం కల్పిచి వాటికి రక్షణ కల్పిస్తున్నాయి.

  ఈ కార్యక్రమంలో, కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రిత్వ శాఖ అటవీ విభాగం ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ సంజయ్ కుమార్, వన్యప్రాణి విభాగం అదనపు డైరెక్టర్ జనరల్ సౌమిత్ర దాస్ గుప్తా, ప్రాజెక్ట్ టైగర్ విభాగం అదనపు డైరెక్టర్ జనరల్, సి.జెడ్.ఎ. సభ్య కార్యదర్శి  డాక్టర్ ఎస్.పి. యాదవ్, మంత్రిత్వ శాఖలోని ఇతర సీనియర్ అధికారులు పాలుపంచుకున్నారు.

***



(Release ID: 1661773) Visitor Counter : 185