హోం మంత్రిత్వ శాఖ

‘అటల్ సొరంగ మార్గం’ ఇంజినీరింగ్ అద్భుతం! సొరంగం మార్గం ప్రారంభోత్సవాన ప్రధాని నరేంద్ర మోదీకి

కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కృతజ్ఞతలు

“భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి కల సాకారమైన వేళ..
యావత్భారతావనికే ఇది చారిత్రాత్మక సుదినం”

“ప్రపంచంలోనే అతిపెద్ద సొరంగ మార్గంగా రికార్డుకెక్కిన అటల్ టన్నెల్ నిర్మాణంతో లేహ్, మనాలీ ప్రాంతాల మధ్య ప్రయాణ వ్యవధి 4నుంచి 5 గంటలు తగ్గుతుంది. అన్ని కాలాల్లోనూ తెరిచి ఉండే ఈ రహదారి లహౌల్-స్పితి లోయను దేశంలోని మిగతా ప్రాంతాలతో అనుసంధానం చేస్తుంది. గతంలో కొన్ని నెలలతరబడి దేశంతో సంబంధాలు తెగిపోయి ఉండే లహౌల్- స్పితి ఇకపై సంవత్సరమంతా దేశంతో అనుసంధానమై ఉంటుంది.”

“హిమాలయ ప్రాంతానికి ఒక గొప్ప వరంలా పరిణమించనున్న అటల్ టన్నెల్. ఈ సొరంగ మార్గం కారణంగా స్థానిక ప్రజలకు మెరుగైన ఆరోగ్యరక్షణ సదుపాయాలు, వాణిజ్య అవకాశాలు, నిత్యావసర సరుకులు అందుబాటులోకి వస్తాయి.”

“మన రక్షణ సన్నద్ధతను కూడా ఇది బలోపేతం చేస్తుంది. పర్యాటక రంగానికి ఊతం లభించడంతో ఉపాధి అవకాశాలూ బాగా పెంపొందుతాయి.”

Posted On: 03 OCT 2020 6:15PM by PIB Hyderabad

‘అటల్ టన్నెల్’ పేరిట ప్రపంచంలోకెల్లా అతిపెద్ద సొరంగ మార్గం ప్రారంభమైన సందర్భంగా,.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి,.. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కృతజ్ఞతలు తెలియజేశారు. అటల్ సొరంగ మార్గం ఓ ఇంజినీరింగ్ అద్భుతమని ఆయన అభివర్ణించారు. “భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి కల వాస్తవంగా సాకారమైన ఈ వేళ,..యావద్భారతావనికీ చారిత్రాత్మకమైన సుదినం. ఇదివరకెన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో నిర్మించిన ఈ ప్రాజెక్టుకోసం నిర్విరామంగా శ్రమించిన సరిహద్దు రహదారి సంస్థ (బి.ఆర్.ఒ.)కు నా అభినందనలు. అని అమిత్ షా, సామాజిక మాధ్యమమైన ట్విట్టర్ ద్వారా ప్రతిస్పందించారు.

  “ప్రపంచంలోనే అతిపెద్ద సొరంగ మార్గంగా రికార్డుకెక్కిన అటల్ టన్నెల్ నిర్మాణంతో లేహ్, మనాలీ ప్రాంతాల మధ్య ప్రయాణ వ్యవధి 4నుంచి 5 గంటలు తగ్గుతుంది. అన్ని కాలాల్లోనూ తెరిచి ఉండే ఈ రహదారి లహౌల్-స్పితి లోయను దేశంలోని మిగతా ప్రాంతాలతో అనుసంధానం చేస్తుంది. గతంలో కొన్ని నెలలతరబడి దేశంతో సంబంధాలు తెగిపోయి ఉండే లహౌల్- స్పితి ఇకపై సంవత్సరమంతా అనుసంధానమై ఉంటుంది.” అని అమిత్ షా పేర్కొన్నారు.

  “మొత్తం ప్రాంతానికి ఒక గొప్ప వరంలా అటల్ టన్నెల్ పరిణమించ బోతోంది. ఈ సొరంగ మార్గం కారణంగా స్థానిక ప్రజలకు ఇకపై మెరుగైన ఆరోగ్యరక్షణ సదుపాయాలు, వాణిజ్య అవకాశాలు, నిత్యావసర సరుకులు అందుబాటులోకి వస్తాయి. మన రక్షణ సన్నద్ధతను కూడా ఇది బలోపేతం చేస్తుంది. పర్యాటక రంగానికీ ఊతమిస్తుంది. దీనితో ఉపాధి అవకాశాలూ బాగా పెంపొందుతాయి.”

    హిమాలయ ప్రాంతంలోని పీర్ పంజాల్ పర్వత శ్రేణిలో, సముద్ర మట్టంనుంచి 3వేల మీటర్ల (10వేలకు పైగా అడుగుల) ఎత్తులో, 9.2 కిలోమీటర్ల పొడవైన ఈ సొరంగ మార్గాన్ని అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారు. ప్రతిరోజూ 3వేల కార్లు, 1,500ట్రక్కులు 80కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించే సామర్థ్యంతో ఈ సొరంగ మార్గాన్ని నిర్మించారు. అధునాతనమైన విద్యుత్ యాంత్రిక సాంకేతిక పరిజ్ఞాన వ్యవస్థలతో ఈ సొరంగ రహదారిని తీర్చిదిద్దారు. మార్గ మధ్యంలో కలుషితమైన గాలి బయటికి వెళ్లేందుకు, తాజా గాలి లోపలికి ప్రవేశించేందుకు వీలుగా సొరంగ మార్గం వెంబజడీ పలుచోట్ల ప్రత్యేకమైన సెమీ ట్రావెర్స్ వెంటిలేషన్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. సోరంగం లోపలి గాలి నాణ్యతను కొలిచే ప్రత్యేక మానిటర్లను ప్రతి కిలోమీటరుకు ఏర్పాటు చేశారు. అగ్ని ప్రమాదాలను అదుపు చేయడానికి స్కాడా అగ్ని మాపక సదుపాయం అమర్చారు. విద్యుద్దీపాలను నిర్వహణా వ్యవస్థను, పలు రకాల ప్రయాణ భద్రతా వ్యవస్థలను కూడా ఏర్పాటు చేశారు.

   హిమాచల్ ప్రదేశ్ లోని మనాలీ ప్రాంతాన్ని, లేహ్ ప్రాంతంతో అనుసంధానం చేస్తూ, రోహ్తాంగ్ కనుమ దిగువన రూపొందించిన సొరంగ మార్గం నిర్మాణంపై చారిత్రాత్మక నిర్ణయాన్ని 2000వ సంవత్సరం జూన్ 3న తీసుకున్నారు. దివంగత నేత అటల్ బిహార్ వాజ్ పేయి హయాంలో ఈ నిర్ణయం జరిగింది. ఈ సొరంగం దక్షిణ ద్వారం వద్దకు చేరుకునేందుకు అనుసంధాన రహదారి నిర్మాణానికి 2002, మే 26న శంకుస్థాపన జరిగింది.

  రోహ్తాంగ్ సొరంగ మార్గం రహదారికి అటల్ టన్నెల్ గా నామకరణం చేయాలని 2019 డిసెంబరు 24న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది.  దేశానికి అటల్ బీహారా వాజ్ పేయి అందించిన సేవల గౌరవ సూచకంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

***

 

 

 


(Release ID: 1661454) Visitor Counter : 177