సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

గాంధీ జయంతి సందర్భంగా జమ్ము&కశ్మీర్‌లో ఉపాధి కల్పన కార్యక్రమాలు నిర్వహించిన కేవీఐసీ

Posted On: 02 OCT 2020 4:41PM by PIB Hyderabad

మహాత్మాగాంధీ 151వ జయంతి సందర్భంగా; జమ్ము&కశ్మీర్‌లో ఉపాధి కల్పన కార్యక్రమాలను 'ఖద్దరు, గ్రామీణ పరిశ్రమల కమిషన్' (కేవీఐసీ‌) చేపట్టింది. 'కుమ్మరి సాధికారత పథకం' కింద, బారాముల్లాలో 100 కుమ్మరి కుటుంబాలకు ఎలక్ట్రిక్‌ కుమ్మరి చక్రాలను కేవీఐసీ ఛైర్మన్‌ శ్రీ వినయ్‌ కుమార్‌ సక్సేనా అందించారు. గందేర్బల్‌, పుల్వామా జిల్లాల్లో; నార, ఊలు అల్లికల చేతివృత్తులవారికి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బారాముల్లా జిల్లాలో. ప్రసిద్ధ స్థానిక కళ అయిన విల్లో చెక్క పని శిక్షణను కూడా ప్రారంభించారు.

 

    గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా కేవీఐసీ చేపట్టిన 150 భారీ కార్యక్రమాల్లో ఇవి కూడా భాగం. ఈ కార్యక్రమాలు జమ్ము&కశ్మీర్‌లో 500కు పైగా ప్రజలకు ఉపాధిని కల్పిస్తాయని అంచనా.

    కశ్మీరీ చేతి తయారీ కాగితం, అల్లిక పనుల కోసం జమ్ము&కశ్మీర్‌లో రెండు 'స్ఫూర్తి' క్లస్టర్లు ఏర్పాటు చేయాలని కేవీఐసీ ఛైర్మన్‌ స్థానిక కేవీఐసీ అధికారులను ఆదేశించారు. మట్టిపాత్రలు సహా అత్యంత ప్రత్యేక వస్తువుల తయారీలో జమ్ము&కశ్మీర్‌ ప్రజలకు సామర్థ్యం, నైపుణ్యం ఉన్నాయని ప్రశంసించారు.

 

    "ఖద్దరు ద్వారా కశ్మీరీ ప్రజల సాధికారత కోసం గాంధీజీ ఎప్పుడూ ఆలోచిస్తుండేవారు. మన ప్రధాని హృదయంలోనూ కశ్మీర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. జమ్ము&కశ్మీర్‌లో స్థిరమైన ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా ఆయన కలను నిజం చేయడానికి కేవీఐసీ కృషి చేస్తోంది. నార, ఊలు అల్లికలు, శాలువాలు, చేతి కాగితం, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మట్టిపాత్రలు వంటి అనేక కళారూపాలు ఇక్కడ ఉన్నాయి. చేతివృత్తులవారికి సరైన శిక్షణ, ఆధునిక సామగ్రి, తయారీ వేదికను అందించడం ద్వారా, వారి స్వయంసమృద్ధికి ఈ ఉత్పత్తులు బాటలు పరుస్తాయి" అని సక్సేనా చెప్పారు. 

    ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు. తమకు మంచి జీవనోపాధి మార్గం చూపినందుకు కేవీఐసీ ఛైర్మన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎలక్ట్రిక్‌ కుమ్మరి చక్రాన్ని పొందిన ముస్తాఖ్‌ సంతోషం వ్యక్తం చేశాడు. దీంతో తన పని సులభం కావడంతోపాటు ఉత్పత్తి, ఆదాయం పెరుగుతాయని చెప్పాడు.

 

***


(Release ID: 1661234) Visitor Counter : 129