రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

భారతదేశంలో ఫార్మా, వైద్యపరికరాల విభాగంలో పెట్టుబడులకు ఇదే ఉత్తమ సమయం, ఫార్మా రంగం 2030 నాటికి 12,000 కోట్ల డాలర్లకు చేరుతుంది : శ్రీ గౌడ

ఫార్మా పరిశ్రమ ఔషధ సరఫరాల్లో అంతర్జాతీయ సరఫరాదారుగా మారడానికి పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించాలి : శ్రీ గౌడ

Posted On: 01 OCT 2020 7:04PM by PIB Hyderabad

భారతదేశంలో ఫార్మా, వైద్యపరికరాల రంగంలో పెట్టుబడులకు ఇదే సరైన సమయమని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి శ్రీ డివి సదానంద గౌడ అన్నారు. దేశీయ ఫార్మా రంగం 2024 నాటికి 6,500 కోట్ల డాలర్లకు, 2030 నాటికి 12,000 కోట్ల డాలర్లకు చేరుతుందని, అలాగే వైద్య పరికరాల పరిశ్రమ 2025 నాటికి 5,000 కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా అని చెప్పారు. 

సిఐఐ “లైఫ్ సైన్సెస్ సదస్సు 2020”లో శ్రీ గౌడ గురువారం ప్రారంభోపన్యాసం చేశారు.

కేంద్రం చేపట్టిన పలు వ్యాపారానుకూల సంస్కరణలు వర్థమాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఉత్తమ పెట్టుబడుల గమ్యంగా మారేందుకు దోహదపడినట్టు మంత్రి చెప్పారు. అలాగే ఫైనాన్షియల్ ఇంక్లూజన్, అవినీతి నిర్మూలనకు; కార్మిక చట్టాలు, నిబంధనల అమలు సరళీకరణకు విధానాలు అమలు పరచడం కూడా భారత్ ఉత్తమ పెట్టుబడుల గమ్యంగా మారడానికి సహాయపడ్డాయని ఆయన అన్నారు. 2018-19 సంవత్సరంలో భారతదేశం 7300 కోట్ల డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్ డిఐ) ఆకర్షించింది. అంతకు ముందు ఏడాదితో పోల్చితే ఇది 18% అధికం. ఫార్మా, వైద్య పరికరాల రంగాలను ప్రత్యేకంగా ప్రస్తావించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. భారత ఫార్మారంగంలో పెట్టుబడులకు ఇదే సరైన సమయమని చెబుతూ ఫార్మా పరిశ్రమ 2024 నాటికి 6,500 కోట్ల డాలర్లకు, 2030 నాటికి 12,000 కోట్ల డాలర్లకు చేరుతుందని, అలాగే వైద్య పరికరాల పరిశ్రమ 28% వార్షిక వృద్ధితో 2025 నాటికి 5,000 కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనాగా తెలిపారు.
వచ్చే నాలుగైదు సంవత్సరాల కాలంలో భారతదేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందడంలో కీలక పాత్ర పోషించగల సామర్థ్యం ఫార్మా, వైద్యపరికరాల పరిశ్రమలకుందని కేంద్రమంత్రి చెప్పారు. ఈ నేపథ్యంలో అత్యాధునిక మౌలిక వసతులు, ప్రపంచ శ్రేణి సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ లతో కూడిన మూడు బల్క్ డ్రగ్, నాలుగు వైద్య పరికరాల తయారీ పార్కుల ఏర్పాటుకు కేంద్రం మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. అలాగే దేశీయ తయారీదారులకు స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించడం లక్ష్యంగా ఈ పార్కుల్లోని కొత్త తయారీ యూనిట్లకు ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాలు (పిఎల్ఐ) కూడా ప్రభుత్వం అందిస్తుందని ఆయన చెప్పారు.

కోవిడ్-19 సంక్షోభ పరీక్షా కాలంలో ఫార్మా పరిశ్రమ సేవలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ దేశంలో ఫార్మా, వైద్యపరికరాల రంగం సమయానికి అనుగుణంగా స్పందించిందని ప్రశంసించారు. చక్కని మిశ్రమ విధానాల ద్వారా మెగా బల్క్ డ్రగ్, వైద్యపరికరాల పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా ప్రభుత్వం సంక్షోభాన్ని అవకాశంగా మలిచేందుకు కృషి చేస్తున్నదని చెప్పారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కూడా ప్రారంభం నుంచి ఈ ప్రయత్నాలను ముందుకు నడిపించడంలో వ్యక్తిగతంగా కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ బల్క్ డ్రగ్స్, వైద్య పరికరాల పార్కుల అభివృద్ధి పథకాల ద్వారా దేశం రూ.78,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించి 2.5 లక్షల అదనపు ఉపాధి అవకాశాలు అందుబాటులోకి తెస్తుందని అంచనాగా చెప్పారు. 

ఒకప్పుడు పిపిఇ కిట్ల దిగుమతిదారుగా ఉన్న భారత్ ఈ రోజున రోజుకి 5 లక్షలకు పైగా పిపిఇ కిట్ల తయారీ సామర్థ్యంతో ప్రపంచంలోనే రెండో పెద్ద ఉత్పత్తిదారుగా మారడం దేశానికే గర్వకారణమన్నారు. అలాగే అతి తక్కువ కాలంలోనే ఏడాదికి 3 లక్షల వెంటిలేటర్ల తయారీ సామర్థ్యం సాధించిందని, ఎన్-95 మాస్కుల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించిందని ఆయన చెప్పారు.

ప్రపంచంలో అతి పెద్ద ఔషధ సరఫరాదారుల్లో ఒకటిగా హోదాను నిలబెట్టుకునేందుకు ఫార్మా పరిశ్రమ పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరించాలని శ్రీ గౌడ పిలుపు ఇచ్చారు. కొత్త ఔషధాలను కనుగొనడం లేదా భారత్ లో మరింత మెరుగుదలలు సాధించగలిగినప్పుడే వృద్ధి అవకాశాలు పూర్తిగా వినియోగించుకోగలుగుతామని ఆయన అన్నారు. కోవిడ్-19కు తొలి వ్యాక్సిన్ భారత ఫార్మా పరిశ్రమే అందించగలదని, అతి తక్కువ ధరకు దాన్ని సరఫరా చేసే పరిశ్రమగా గుర్తింపు సాధించగలదన్న విశ్వాసం మంత్రి ప్రకటించారు.

కోవిడ్-19 అనంతర ప్రపంచంలో అందుబాటులోకి రానున్న అవకాశాలు ఉపయోగించుకోగల పోటీ సామర్థ్యం పొందడంలో భారత ఫార్మా పరిశ్రమ కొత్త శకంలోకి ప్రవేశించేందుకు చేయాల్సిన కృషిపై ప్రపంచ ప్రతినిధులందరూ తమ ఆలోచనలు పంచుకునేందుకు చక్కని వేదిక కల్పించడంలో సిఐఐ లైఫ్ సెన్సెస్ కాంక్లేవ్ కృషిని ఆయన ప్రశంసించారు.

కొత్త ట్రాయ్ చైర్మన్ గా బాధ్యతలు చేపడుతున్న ఫార్మా శాఖ ఔట్ గోయింగ్ కార్యదర్శి శ్రీ పిడి వఘేలా, బయో టెక్నాలజీ శాఖ కార్యదర్ధి డాక్టర్ రేణు స్వరూప్, భారత డ్రగ్ కంట్రోలర్ జనరల్ డాక్టర్ విజి సోమాని, సిప్లా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్ పర్సన్ శ్రీమతి సమీనా హమీద్, సిఐఐ బయెటెక్నాలజీ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజేశ్ జైన్, సిఐఐ ఫార్మా కమిటీ చైర్మన్ శ్రీ జివి ప్రసాద్, సిఐఐ ఫార్మా కమిటీ వైస్ చైర్మన్ శ్రీ వివేక్ కామత్, పరిశ్రమకు చెందిన ఇతర దిగ్గజాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

***
 



(Release ID: 1660932) Visitor Counter : 106