వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
'వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్' జాతీయ పోర్టబిలిటీ క్లస్టర్‌లోకి తమిళనాడు, అరుణాచల్ ప్రదేశ్
- ఓఎన్ఓఆర్‌సీ కింద మొత్తం 28 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలు సజావుగా అనుసంధానించబడి ఉన్నాయి
Posted On:
01 OCT 2020 5:10PM by PIB Hyderabad
'వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్' (ఓఎన్ఓఆర్‌సీ) జాతీయ పోర్టబిలిటీ క్లస్టర్లోకి నేడు మరో రెండు రాష్ట్రాలు అనుసంధానించబడ్డాయి. ఇప్పటి వరకు ఈ క్లస్టర్‌లో 26 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలు అనుసంధానించబడి ఉండగా తాజాగా దీని పరిధిలోకి తమిళనాడు, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు అనుసంధానించబడ్డాయి.
ఈ రాష్ట్రాలను జాతీయ క్లస్టర్‌తో అనుసంధానించడానికి అవసరమైన సన్నాహక కార్యకలాపాలు అనగా.. ఈపీఓఎస్ సాఫ్ట్‌వేర్ ఆధునికీకరణ, సెంట్రల్ ఐఎమ్-పీడీఎస్, అన్నవితరణ పోర్టల్స్‌తో అనుసంధానం, సెంట్రల్ రిపోజిటరీలో రేషన్ కార్డులు / లబ్ధిదారుల డేటాను పంచుకొనేందుకు వీలుగా లభ్యతతో పాటుగా.. జాతీయ పోర్టబిలిటీ లావాదేవీల యొక్క అవసరమైన పరీక్ష మొదలైన చర్యలు చేపట్టడం జరిగింది. ఈ రెండు రాష్ట్రాల్లో అవసరమైన ఆయా చర్యలు ఇప్పటికే పూర్తయ్యాయి. దీంతో, ఇప్పుడు మొత్తం 28 రాష్ట్రాలు/ యూటీలు 'వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్' ప్రణాళిక ప్రకారం ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నాయి. దీంతో అక్టోబరు 1వ తేదీ నుంచి 28 రాష్ట్రాలు/ యూటీలలోని వలస పీడీఎస్ లబ్ధిదారులు.. తమకు కేటాయించిన సబ్సిడీ ఆహార ధాన్యాలను ఒకే రీతిలో మరియు కేంద్రం నిర్ణయించిన ధరలలో తమకు నచ్చిన ఏదైనా ఒక చౌక ధరల దుకాణం (ఎఫ్‌పీఎస్) నుండి పొందవచ్చు.
ఆధార్ ప్రామాణీకరణతో రేషన్..
కేంద్ర ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖలోని ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ ఎన్ఎఫ్ఎస్ఏ కింద అందించే ప్రయోజనాలను 'వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్' (ఓఎన్ఓఆర్‌సీ) ద్వారా దేశవ్యాప్త పోర్టబిలిటీని అమలు చేస్తోంది. ఎన్ఎఫ్ఎస్ఏ లబ్ధిదారులకు ఒక ఎంపికను అందించాలని లక్ష్యంగా ఓఎన్ఓఆర్‌సీని అమలు చేస్తోంది. ఆయా రాష్ట్రాల్లోని లబ్ధిదారులు దేశంలో ఎక్కడైనా తమకు నచ్చిన ఏదైనా ఈపీఓఎస్ అనుసంధానించబడిన చౌక ధరల దుకాణం (ఎఫ్‌పీఎస్) నుండి ఎన్‌ఎఫ్‌ఎస్ఏ కింద తమ పేరున్న ఆహార ధాన్యాలను తీసుకోవచ్చు. ఈపీఓఎస్ పరికరంలో ఆధార్ ప్రామాణీకరణతో తమ ప్రస్తుత / అదే రేషన్ కార్డును ఉపయోగించడం ద్వారా ఆహార ధాన్యాలను పొందవచ్చు.
6 రాష్ట్రాలు / యూటీల్లో సజావుగా..
ఈ సౌకర్యం ఇప్పటికే 26 రాష్ట్రాలు / యూటీల్లో సజావుగా ప్రారంభించబడింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, దాద్రా & నగర్ హవేలి, డామన్ & డయ్యూ, గోవా, గుజరాత్, హర్యాణా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మిజోరాం, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తెలంగాణ, త్రిపుర, ఉత్తర ప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్, మణిపూర్, నాగాలాండ్, ఉత్తరాఖండ్, లక్షద్వీప్, లద్ధాఖ్‌లలో ఇది అందుబాటులోకి వచ్చింది. మిగతా రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా మార్చి 2021 నాటికి, ఈ జాతీయ పోర్టబిలిటీలో విలీనం కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
వలస లబ్ధిదారులకు మేలు..
ఈ వ్యవస్థ ద్వారా తాత్కాలిక ఉపాధిని వెతుక్కొంటూ తమతమ నివాస స్థలాన్ని తరుచూ మార్చుకుంటూ వెళ్లే ఎన్ఎఫ్ఎస్ఏ వలస లబ్ధిదారులు తదితరులకు మేలు జరుగుతుంది. ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ కలిగిన చౌక ధరల దుకాణంలో బయోమెట్రిక్ / ఆధార్ ఆధారిత ప్రామాణీకరణతో ఇప్పటికే ఉన్న రేషన్‌కార్డ్ ఉపయోగించడం ద్వారా 28 రాష్ట్రాలు / యూటీలలో ఎక్కడైనా తమకు నచ్చిన ఎఫ్‌పీఎస్ నుండి తమకు లభించే ఆహార ధాన్యాల కోటా వారు పొందవచ్చు.
****
(Release ID: 1660855)
Visitor Counter : 211