యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

భారతీయ క్రీడా ప్రాధికార సంస్థకు కొత్త లోగో ఆవిష్కరించిన కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు క్రీడా ప్రతిభకు సంస్థ ప్రోత్సాహాన్ని ప్రతిఫలింపజేస్తున్నలోగో

Posted On: 30 SEP 2020 5:28PM by PIB Hyderabad

   భారతీయ క్రీడా ప్రాధికార సంస్థ (ఎస్.ఎ.ఐ.) కొత్త గుర్తింపు చిహ్నాన్ని (లోగోను) కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ మంత్రి కిరెణ్ రిజిజు ఆవిష్కరించారు. ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో ఈ రోజు లోగో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కేంద్ర క్రీడాశాఖ కార్యదర్శి రవి మిట్టల్, భారతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు నరీందర్ బాత్రా, ఎస్.ఎ.ఐ. డైరెక్టర్ జనరల్ సందీప్ ప్రధాన్, యువజన వ్యవహారాలు, స్టేడియంలోని క్రీడా మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖ క్రీడాకారులు,  కోచ్ లు, క్రీడాభిమానులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమంలో  పాలు పంచుకున్నారు.

 

   ఈ సందర్భంగా ఎస్.ఎ.ఐ. కొత్త లోగో ప్రాధాన్యాన్ని కేంద్ర మంత్రి రిజిజు వివరించారు. దేశంలో క్రీడా వ్యవస్థకు ఎస్.ఎ.ఐ. సారథ్యం వహిస్తూ వస్తోంది. క్రీడా ప్రతిభా పాటవాలను ప్రోత్సహించడంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. క్రీడాకారులు తమ క్రీడా జీవితాన్ని సాఫీగా సాగించేలా, జీవితంలో విజయాలను, క్రీడా వైభవాన్ని సాధించేలా తగిన మద్దతును అందించింది. ఒక క్రీడాకారుడు క్రీడా జీవితంలో పురోగమించడానికి తగిన స్వేచ్ఛను క్రీడా ప్రాధికార సంస్థ అందిస్తుంది. భారతీయ క్రీడా ప్రాధికార సంస్థకు సంక్షిప్త నామమైన ఎస్.ఎ.ఐ. అన్నపదమే సంస్థకు ఒక విశిష్టమైన గుర్తింపును ఇస్తోంది. లోగోలోని భారతీయ త్రివర్ణం, నీలి రంగు చక్రం జాతీయ ఉద్దీపనను కలిగిస్తుంది. ప్రపంచంలో భారత్ కు ప్రాతినిధ్యం వహించిన అగ్రశ్రేణి క్రీడాకారులను సంస్థ తీర్చిదిద్దిందన్న సందేశాన్ని  ప్రతిఫలింపజేస్తోంది.” అని అన్నారు.

   1982లో ఆవిర్భవించిన రోజునుంచి, దేశంలో క్రీడా వ్యవస్థను, క్రీడా వాతావరణాన్ని ఇతోధికంగా ప్రోత్సహించడంలో ఎస్.ఎ.ఐ. కీలక పాత్ర పోషిస్తూ వస్తోంది. దేశవ్యాప్తంగా అట్టడుగు స్థాయిలో క్రీడా ప్రతిభను గుర్తించి, వారి ప్రతిభను మెరుగుపరచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. అట్టడుగున ఉండే క్రీడా ప్రతిభా పాటవాలను గుర్తించే స్థాయి నుంచి, సదరు క్రీడాకారుల ప్రతిభను మెరుగుపరిచి, దేశంలోనే ప్రతిభావంతులైన క్రీడాకారులుగా మలిచేంతవరకూ క్రీడా ప్రాధికార సంస్థ సాగించే పయనాన్ని కొత్త లోగో ప్రతిఫలింపజేస్తోంది. 

***



(Release ID: 1660450) Visitor Counter : 225