రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

డిఫెన్సు ఇండియా స్టార్ట్ అప్ ఛాలెంజ్ -4 అంకుర వ్యవస్థను ప్రారంభించిన భారత రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్;

ఆత్మ నిర్భర్ భారత్ ప్రచారోద్యమ స్పూర్తితో స్వావలంబన సాధించడంలో రక్షణ అంకుర వ్యవస్థ ఏర్పాటు నిర్ణయాత్మక చర్య అని రక్షణ మంత్రి అన్నారు

సైనికులు వినూత్న కల్పనల సృష్టికి పాటుపడటాన్ని ప్రోత్సహించడానికి మొట్టమొదటిసారిగా ఐడెక్స్4ఫవ్జి ప్రారంభం

Posted On: 29 SEP 2020 4:27PM by PIB Hyderabad

రక్షణ రంగ సామర్ధ్యాన్ని పెంచడానికి వినూత్న కల్పనలు రూపకల్పనను విస్తరించే లక్ష్యంతో మంగళవారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన ఐడెక్స్ కార్యక్రమంలో రక్షణ  మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ డిఫెన్సు ఇండియా స్టార్ట్ అప్ ఛాలెంజ్ - (డిస్క్ 4) అంకుర వ్యవస్థను ప్రారంభించారు.  ఈ సందర్బంగా సైనికుల ప్రతిభను ప్రోత్సహించే  ఐడెక్స్4ఫవ్జి మరియు  ఉత్పత్తుల నిర్వహణ పద్ధతులకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా రక్షణ మంత్రి ప్రారంభించారు.  ఈ  ప్రయత్నాల ద్వారా ఐడెక్స్ - డి ఐ ఓ స్థాయి గుణాత్మకంగా మరియు పరిమాణాత్మకంగా పెరుగగలదని భావిస్తున్నారు.  

ఐడెక్స్4ఫవ్జి వ్యవస్థ వంటిది ఏర్పాటు చేయడం ఇదే మొట్టమొదటిసారి.  భారత సాయుధ దళాల సభ్యుల కల్పనాశక్తిని ప్రోత్సహించడం దీని ఉద్దేశం.  సైనికుల నుంచి /  క్షేత్రీయ విభాగాల నుంచి  మిత వ్యయంతో చేపట్టగల వినూత్న యోచనలను ప్రోత్సహించడం జరుగుతుంది.  భారత సైన్యంలో 13 లక్షల మంది రక్షణ సిబ్బంది యుద్ధ క్షేత్రంలో,  సరిహద్దుల్లో తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్ని ఎదుర్కొంటూ,  ఆయుధ సామాగ్రిని ఉపయోగిస్తూ మన భూభాగాన్ని రక్షిస్తున్నారు.  అందువల్ల ఆ సామాగ్రిని మెరుగుపరచడానికి సంబంధించి వారికి ఎన్నో కొత్త కొత్త ఆలోచనలు,  వినూత్న కల్పనలు వచ్చే అవకాశం ఉంది.  వారి కల్పనాశక్తిని ప్రోత్సహించి మద్దతు ఇచ్చే యంత్రాంగం లేదా సాధనసామగ్రి అందుబాటులో లేదు.  ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న ఐడెక్స్4ఫవ్జి ఈ గవాక్షాన్ని తెరిచి మన సైనికులు నవీకరణ ప్రక్రియలో,  వినూత్న కల్పనల సృష్టిలో భాగస్వాములు కావడానికి దోహదం చేస్తుంది.  తద్వారా వారికి గుర్తింపు మరియు  పారితోషికం లభిస్తుంది.  ఇందుకోసం త్రివిధ దళాల ప్రధాన కార్యాలయాలు  దేశవ్యాప్తంగా ఉన్న సైనికులు,  క్షేత్రీయ విభాగాలు  అధిక సంఖ్యలో పాల్గొనడానికి అవసరమైన మద్దతును ఇచ్చి  ప్రోత్సహిస్తాయి.  

ఈ సందర్బంగా మాట్లాడుతూ ఐడెక్స్ ద్వారా చేపడుతున్న కార్యక్రమం ఒక సమర్ధవంతమైన రక్షణ అంకుర వ్యవస్థ అని,  ఆత్మ నిర్భర్ భారత్ ప్రచారోద్యమ స్పూర్తితో స్వావలంబన సాధించడంలో  రక్షణ అంకుర వ్యవస్థ ఏర్పాటు నిర్ణయాత్మక చర్య అని రక్షణ మంత్రి అన్నారు  దేశంలో మొట్టమొదటిసారిగా వివిధ భాగస్వామ్య పక్షాలు కలసికట్టుగా రక్షణ రంగంలో వినూత్న కల్పనలను ప్రోది చేయడానికి అనువైన వాతావరణం ఏర్పాటైందని శ్రీ రాజ్ నాథ్ సింగ్ అన్నారు.  "రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి మరియు స్వావలంబన సాధించడానికి ప్రైవేటు రంగం ప్రాతినిధ్యం కీలకం.  ఇందుకోసం మేము కొన్ని చర్యలు చేపట్టాం.  వాటిలో ప్రైవేటు రంగంతో భాగస్వామ్యం, సాంకేతిక మార్పిడి,  రక్షణ ఉత్పత్తుల తయారీలో నేరుగా 74% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించడం రక్షణ సామగ్రిలో  101 వస్తువుల దిగుమతులను నిషేధించి  దేశీయంగా సేకరించడం వంటివి ఉన్నాయి"  అని రక్షణ మంథి తెలిపారు.  కొత్తగా సోమవారం నుంచి  రక్షణ సేకరణ పధ్ధతి 2020ని ప్రారంభించినట్లు మంత్రి వెల్లడించారు.   రక్షణ వినూత్నకల్పనల సంస్థ (డి ఐ ఓ) పేరిట ఏర్పాటు చేసిన వేదికను సాయుధ దళాలు పూర్తిగా వినియోగించుకోవాలని,   అదేవిధంగా అంకుర సంస్థలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.  

రక్షణ మంత్రితో పాటు రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ శ్రీపాద యశో నాయక్ ,  రక్షణ  సిబ్బంది ప్రధానాధికారి జనరల్ బిపిన్ రావత్ ,  రక్షణ శాఖ కార్యదర్శి  డాక్టర్ అజయ్ కుమార్ మరియు రక్షణ ఉత్పత్తి శాఖ కార్యదర్శి శ్రీ రాజా కుమార్ కూడా ఈ కార్యక్రమంలో ప్రసంగించారు.  

డిస్క్ 4 అంకుర వ్యవస్థ ద్వారా సాయుధ దళాలు, యుద్ధసామగ్రి ఫ్యాక్టరీ బోర్డు (ఓ ఎఫ్ బి),  రక్షణరంగ ప్రభుత్వ సంస్థలు   11 సవాళ్ళను విసిరాయి.   ఈ సవాళ్ళకు సరితూగే సాంకేతిక పరిజ్ఞానం ఉన్న అంకుర సంస్థలు గాని,  వినూత్న కల్పనలు రచించగల సమర్థులు గాని,  ఎం ఎస్ ఎం ఈలు గాని తమ  అనుప్రయోగాలను ప్రతిపాదించి రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో భాగస్వాములు కావచ్చు.  

భారత రక్షణ రంగంలో వినూత్న కల్పనలను పెంపొందించడానికి రక్షణ ఉత్పత్తుల శాఖ చొరవతో ప్రారంభమైన ఐడెక్స్ ను  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2018 ఏప్రిల్ లో ప్రారంభించారు.  తదనంతరం రక్షణ రంగానికి చెందిన ప్రభుత్వ సంస్థలు బి ఈ ఎల్, హెచ్ ఎ ఎల్  ఉమ్మడిగా రక్షణ వినూత్నకల్పనల  సంస్థ (డి ఐ ఓ) ను ఏర్పాటు చేశాయి.  2018లో ఏర్పాటైన ఈ సంస్థ కాలక్రమేణా తన కార్యకలాపాల స్థాయిని, పరిమాణాన్ని విస్తరించింది.

భాగస్వామ్య పక్షాలన్నింటిని ఒకే వేదిక మీదకు తీసుకురావడం ద్వారా ఐడెక్స్ కార్యక్రమం విజయం సాధించింది. రక్షణ మంత్రిత్వ శాఖ,  ఐడెక్స్ ఎంపిక చేసిన అంకుర సంస్థలు, ఇంక్యుబేటర్లు,   త్రివిధ దళాలకు (సైనిక దళం, నౌకా దళం, వైమానిక దళం) చెందిన కేంద్ర సంస్థలు,  రక్షణ వినూత్నకల్పనల సంస్థ (డి ఐ ఓ),   రక్షణ రంగానికి చెందిన ప్రభుత్వ సంస్థలు,  యుద్ధసామగ్రి ఫ్యాక్టరీ బోర్డు (ఓ ఎఫ్ బి),  మేధావి వర్గం,  ప్రయివేటు పరిశ్రమలు మరియు పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు ఐడెక్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా  500కు పైగా అంకుర సంస్థలు మరియు వినూత్న కల్పనలకు రూపకల్పన చేసినవారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

***


(Release ID: 1660271) Visitor Counter : 277