కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
ఉమంగ్ యాప్ ద్వారా మెరుగైన రీతిలో ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈ పి ఎఫ్ ఓ) సేవలు
2019 ఆగస్టు నుంచి ఈ యాప్ కు 47.3కోట్ల హిట్లు రాగా వాటిలో 88% లేక 41.6కోట్ల హిట్లు ఈ పి ఎఫ్ ఓ సేవలకు సంబంధించినవి
Posted On:
28 SEP 2020 5:17PM by PIB Hyderabad
నవతరం పాలనకు సంబంధించిన ఏకీకృత సేవల మొబైల్ యాప్ (ఉమంగ్) భవిష్య నిధి చందాదారుల నుంచి విస్తృత ఆదరణ పొందింది. కోవిడ్ -19 విశ్వ మహమ్మారి విజృంభణ తరువాత ఈ పి ఎఫ్ సభ్యులు ఇల్లు కదలకుండా ఎలాంటి అవాంతరాలు లేకుండా భవిష్యనిధి సంస్థ సేవలను పొందగలుగుతున్నారు. ఉమంగ్ యాప్ ద్వారా ఇదివరకు అందుబాటులో ఉన్న 16 సేవలకు తోడుగా ఇప్పడు ఈ పి ఎఫ్ ఓ మరో కొత్త సేవను ప్రారంభించింది. ఇప్పుడు ఈ పి ఎస్ సభ్యులు ఉద్యోగుల పెన్షన్ స్కీము, 1995 కింద తమ స్కీము సర్టిఫికెట్ కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేయవచ్చు.
ఈ పి ఎఫ్ ఖాతాలో జమ అయిన మొత్తాన్ని విత్ డ్రా చేసుకొని పదవీ విరమణ వయసు వచ్చిన తరువాత పెన్షన్ ప్రయోజనాలు పొందదలచిన సభ్యులు భవిష్య నిధి సంస్థలో తమ సభ్యత్వాన్ని కొనసాగించదలచినట్లయితే వారికి స్కీము సర్టిఫికెట్ ఇస్తారు. ఉద్యోగుల పెన్షన్ స్కీము, 1995 ప్రకారం స్కీములో ఒక సభ్యుని సంచిత సభ్యత్వం కనీసం 10 సంవత్సరాలు ఉన్నట్లయితే సభ్యునికి పెన్షన్ పొందేందుకు అర్హత వస్తుంది. ఒక ఉద్యోగం మాని మరొక ఉద్యోగంలో చేరినప్పుడు ఇంతకు ముందు ఉద్యోగంలో ద్వారా పొందిన పెన్షన్ సర్వీసును కొత్త ఉద్యోగం ద్వారా పొందిన పెన్షన్ సర్వీసుకు కలిపేందుకు స్కీము సర్టిఫికెట్ నిశ్చయం చేస్తుంది. తద్వారా పెన్షన్ ప్రయోజనాల మొత్తం పెరుగుతుంది. అంతేకాక పింఛను పొందటానికి అర్హుడైన సభ్యుని అకాల మరణం సంభవించినట్లయితే అతని కుటుంబ సభ్యులు కుటుంబ పింఛను పొందటానికి స్కీము సర్టిఫికెట్ ఉపయోగపడుతుంది.
ఉమాంగ్ యాప్ ద్వారా స్కీము సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేయడంలో ఉన్న సౌలభ్యం వల్ల సభ్యులు కోవిడ్ -19 మహమ్మారి కాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా దరఖాస్తు చేయవచ్చు. అంతేకాక అనవసర కాగితం ఖర్చు ఉండదు. ఈ సౌకర్యం వల్ల 5.89 కోట్ల మంది భవిష్య నిధి సంస్థ సభ్యులకు ప్రయోజనం కలుగుతుంది. ఉమాంగ్ యాప్ సేవలు పొందడానికి సార్వత్రిక ఖాతా సంఖ్య మరియు ఈ పి ఎఫ్ ఓలో నమోదైన మొబైల్ నెంబరు అవసరం.
అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సభ్యుల ముంగిట్లోకి చేర్చి విజయం సాధించిన ఈ పి ఎఫ్ ఓ ఉమంగ్ యాప్ ద్వారా సేవలు అందించడంలో అగ్రగామి సంస్థగా విశేష ప్రజాదరణ పొందింది. ఈ యాప్ కు 2019 ఆగస్టు నుంచి మొత్తం 47.3కోట్ల హిట్లు రాగా వాటిలో 41.6 కోట్ల లేక 88% హిట్లు ఈ పి ఎఫ్ ఓ సేవలకు సంబంధించినవి ఇండియాలో మొబైల్ ఫోన్ల ద్వారా డిజిటల్ కనెక్టివిటీ బాగా వృద్ధిచెందింది. మారుమూల ప్రాంతాల్లో ఉండే సభ్యులు కూడా అంకాత్మక మాధ్యమం ద్వారా సమాచారాన్ని పొందడానికి వీలుగా ఈ పి ఎఫ్ ఓ సంస్థ ఉమంగ్ సౌకర్యాన్ని ఉపయోగించుకొని అధికాధికంగా సేవలను అందుబాటులోకి తెస్తోంది.
"ఉమంగ్ గురించి"
దేశంలో వేగవంతమైన చురుకైన పాలన అందించడానికి ఉమంగ్ (నవతరం పాలనకు సంబంధించిన ఏకీకృత సేవల మొబైల్ యాప్) ను కేంద్ర ప్రభుత్వ ఎలెక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (మీటి) మరియు జాతీయ ఈ-గవర్నెన్స్ డివిజన్ (ఎన్ ఈ జి డి) అభివృద్ధి చేశాయి.
భారత పౌరులు దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచయినా కేంద్ర ప్రభుత్వం నుంచి స్థానిక సంస్థల వరకు మరియు పౌర కేంద్రక ఈ - గవర్నెన్స్ సేవలను పొందడానికి వలసిన వేదికను ఉమంగ్ సమకూరుస్తుంది.
***
(Release ID: 1659969)
Visitor Counter : 204