శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
‘మహమ్మారి... మరోవైపు’ అంశంపై ప్రముఖుల చర్చ
విజ్ఞానశాస్త్ర, సాంకేతిక శాఖ స్వర్ణోత్సవాన ప్రసంగాల పరంపర
50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విజ్ఞాన శాస్త్ర, సాంకేతిక శాఖ గత ఐదేళ్లలోనే ఎన్నో అవకాశాలు సృష్టించింది. ఎన్నో ఇంక్యుబేటర్లు, మరెన్నో స్టార్టప్ కంపెనీలను ఏర్పాటు చేసింది. గత యాబై ఏళ్లకంటే ఐదేళ్లలో చేసిందే ఎక్కువ.
నాడు పోస్టు చేయడమైనది:
28 SEP 2020 4:51PM by PIB Hyderabad
కేంద్ర విజ్ఞాన శాస్త్ర, సాంకేతిక శాఖ (డి.ఎస్.టి) 50ఏళ్లు పూర్తి చేసుకుని స్వర్ణోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో ఆన్ లైన్ ద్వారా ప్యానెల్ చర్చను నిర్వహించారు. డి.ఎస్.టి. స్వర్ణోత్సవ ప్రసంగాల పరంపర కార్యక్రమంలో భాగంగా ఇటీవల చేపట్టిన ఈ చర్చా కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కోవిడ్-19 వైరస్ మహమ్మారి నేపథ్యంలో ఎదురైన సవాళ్లు, అందివచ్చిన అవకాశాలు అనే అంశంపై వారు చర్చించారు.
ఈ ప్యానెల్ చర్చా కార్యక్రమాన్ని జాతీయ విజ్ఞాన, సాంకేతిక పరిజ్ఞాన మండలి, డి.ఎస్.టి., విజ్ఞాన్ భవన్ కలసి సంయుక్తంగా ఆన్ లైన్ ద్వారా నిర్వహించాయి. ఈ సందర్భంగా డి.ఎస్.టి. కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ మాట్లాడుతూ.. “చర్చనీయాంశానికి రెండు విభిన్నమైన పార్శ్వాలున్నాయి. మహమ్మారి కారణంగా మనం తప్పనిసరిగా నేర్చుకున్న పాఠాలు, వాటిని విజ్ఞాన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన, సృజనాత్మక అధ్యయనంగా మార్చుకునే విధానం మొదటి పార్శ్వం కాగా, మనం ఎదుర్కొన్న సవాళ్లు, అందివచ్చిన అవకాశాలు అన్నది రెండవ పార్శ్వం. మనం కలసికట్టుగా అన్వేషించి కనిపెట్టాల్సిన అవకాశాలు, వాటిని సానుకూలంగా వినియోగించుకోవడం. మహమ్మారి రెండవ పార్శ్వం అవుతుంది. ” అన్నారు.
“కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి కారణంగా మనం గత 4 నెలల్లో ఎన్నో కీలక అంశాలు నేర్చుకున్నాం. మహమ్మారి ప్రబలిన తొలి రోజుల్లో ఎన్.95 మాస్కులు వ్యక్తిగత రక్షణ పరికరాలు (పి.పి.ఇ.సూట్లు), కృత్రిమ శ్వాస పరికరాలు (వెంటిలేటర్లు) అన్నీ దిగుమతి చేసుకునే వాళ్లం. ఆ తర్వాత కేవలం మూడు నెలల్లోనే మనం ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వెంటిలేటర్లు తయారు చేసుకోగలిగాం. మన దార్శనికత, ఆలోచనా విధానంలో స్పష్టతే ఇందుకు కారణం. పలు అధ్యయన సంస్థలనుంచి, పారిశ్రామిక రంగం వరకూ సంబంధిత భాగస్వామ్య వర్గాలన్నీ బాధ్యతతో వ్యవహరించడం, ప్రభుత్వంనుంచి తగిన సడలింపు, వెసులుబాటు లభించడంతో ఇది సాధ్యమైంది. కానిపక్షంలో ఈ ఫలితాలను సాధనకు ఏళ్లతరబడి వ్యవధి పట్టేది,” అని ప్రొఫెసర్ శర్మ అభిప్రాయపడ్డారు. సృజనాత్మక వ్యవస్థల ఏర్పాటుకు సంబంధించిన ప్రతి అంశంపై తగిన శ్రద్ధ చూపడం ద్వారా డి.ఎస్.టి. గత ఐదేళ్లలో ఎన్నో అవకాశాలు కల్పించింద న్నారు. ఎన్నో ఇంక్యుబేటర్లు, మరెన్నో స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేసిందన్నారు. గత 50 సంవత్సరాల కంటే ఐదేళ్లలో చేసిందే ఎక్కువని ప్రొఫెసర్ శర్మ పేర్కొన్నారు. .
కేవలం ఏవో కొన్ని పరిశోధనా శాలల ఏర్పాటుకు మాత్రమే పరిమితం కాకుండా విభిన్నమైన అనేక అంశాలపై శ్రద్ధ చూపిన ప్రభుత్వ సంస్థ డి.ఎస్.టి.మాత్రమేనని, రైతులు, చిన్న పట్టణాల్లో నివసించే మహిళలనుంచి అగ్రశ్రేణి సైంటిస్టులు, పాఠశాల విద్యార్థులు, పి.హెచ్.డి. స్కాలర్లవరకూ అన్ని అంశాలపైనా డి.ఎస్.టి. దృష్టిని కేంద్రీకరించిందన్నారు. పరమాణవునుంచి, ఖగోళ భౌతిక శాస్త్రం వరకూ, ఆ రెండింటి మధ్య ఉన్న ప్రతి అంశంపై డి.ఎస్.టి. తన దృష్టిని కేంద్రీకరించిందని ఆయన అన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో ప్రధాన ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్ మాట్లాడుతూ, కోవిడ్ అనంతర ప్రపంచంలో పునర్నిర్మాణ ప్రక్రియను గురించి మాట్లాడినపుడు,..కోవిడ్ పూర్వపు రోజుల స్థాయికి మనం ఇంకా చేరుకోలేదన్న సంగతిని గుర్తుంచుకోవాలన్నారు. “ కోవిడ్ వైరస్ ఫలితంగా విషయాల్లో మార్పు చోటు చేసుకుంటుంది. భౌగోళిక రాజకీయాలు, సరఫరా వ్యవస్థ, సాంకేతిక పరిజ్ఞానం, వినియోగదారుల వ్యవహార శైలి,.. ఇలా అన్నింటిలోనూ మార్పులుంటాయి. కొత్త మార్గాలు, కొత్త విధానాల గురించి మనం ఆలోచించాలి. శాస్త్రవేత్తలు తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని, నైపుణ్యాన్ని మార్కెట్ అవసరాలకు తగినట్టుగా మార్చుకునేలా వారికి తగిన ప్రోత్సాహం అందించాలి. కొత్త తరహా కంపెనీల ఏర్పాటువైపు మన సాంకేతిక నిపుణులను కార్యోన్ముఖం చేయాలి,” అని అన్నారు.
అఖిల భారత వైద్య శాస్త్రాల అధ్యయన సంస్థ (ఎయిమ్స్-ఎఐఐఎంఎస్) డైరెక్టర్, డాక్టర్ రణదీప్ గులేరియా మాట్లాడుతూ, ప్రజారోగ్య రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని, కోవిడ్ మహమ్మారి అనుభవనంనుంచి పాఠాలు నేర్చుకుని, భవిష్యత్తులో ఎలాంటి పెద్ద అంటువ్యాధి సవాళ్లనైనా ఎదుర్కొనేలా ఆరోగ్య రక్షణ వ్యవస్థను తీర్చిదిద్దాలని అన్నారు. వ్యాధి నిరోధక పద్ధతులతో కూడిన ఆరోగ్య రక్షణ వ్యవస్థ ఏర్పాటుపై దృష్టిని కేంద్రీకరించాలని, మాస్కును ధరించడం, చేతులను శుభ్రపరుచుకోవడం ద్వారా , కోవిడ్ వైరస్ ను మాత్రమే కాక శ్వాస సంబంధమైన మరెన్నో రుగ్మతలను నిరోధించవచ్చని అన్నారు.
సాఫ్ట్ వేర్ కంపెనీల, సేవల కంపెనీల జాతీయ సంఘం (నాస్ కామ్) అధ్యక్షురాలు దేవాంజని ఘోష్ మాట్లాడుతూ, ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమ, తనను తాను పూర్తిగా పునఃసృష్టి చేసుకునేందుకు ఇది వందేళ్లకొక సారి వచ్చే అవకాశమని అన్నారు. “ కోవిడ్ అనంతర ప్రపంచం, చేతితో ముట్టుకోవసిన అవసరంలేని హైపర్ డిజిటల్ స్వభావంతో ఉంటుంది. అలాంటి ప్రపంచంలో, విశ్వాసం, ప్రతిభ, సృజనాత్మకత, క్రియాశీలత వంటి నాలుగు అంశాలే విజయాన్ని నిర్వచిస్తాయి. వీటిల్లో సృజనాత్మకతపైనే మనం దృష్టిని కేంద్రీకరించాల్సి ఉంటుంది. ఎందుకంటే సృజనాత్మకతే భారతదేశం భవితవ్యాన్ని నిర్ణయించబోతోంది.” అన్నారు.


*****
(రిలీజ్ ఐడి: 1659966)
సందర్శకుల సూచీ సంఖ్య : : 144