రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
గ్వాలియర్-మొరేనా ఫ్లై ఓవర్ జాతికి అంకితం
Posted On:
28 SEP 2020 11:47AM by PIB Hyderabad
మధ్యప్రదేశ్‌లోని మొరేనా పట్టణంలో నిర్మించిన ఫ్లై ఓవర్‌ను కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ జాతికి అంకితం చేశారు. ఎన్‌హెచ్-3పై 1.42 కి.మీ. పొడవుతో, రూ.108 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. కేంద్ర మంత్రులు థావర్‌చంద్ గెహ్లోత్, శ్రీ ఫగ్గన్ సింగ్ కులస్తే, రహదారి రవాణా&హైవేల శాఖ సహాయ మంత్రి శ్రీ వి.కె.సింగ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహన్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాజస్థాన్‌లోని ధోల్‌పూర్-మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ను ఈ ఫ్లై ఓవర్ అనుసంధానిస్తుంది. ఈపీసీ పద్ధతిలో, ముందుగా నిర్దేశించుకున్న 18 నెలల గడువులోనే వంతెనను నిర్మించారు. నాలుగు లైన్ల ఈ వంతెన పొడవు 780 మీటర్లు. ధోల్‌పూర్ వైపు నుంచి 300 మీటర్ల రిటైనింగ్ వాల్, గ్వాలియర్ వైపు నుంచి 340 మీటర్ల రిటైనింగ్ వాల్ ఉంది. రెండు వైపులా సర్వీస్ రోడ్లను నిర్మించారు. ఫ్లై ఓవర్ రాకతో మోరెనాలో వాహనాల రద్దీ తగ్గి; సమయం, ఇంధనం ఆదా అవుతాయి.
ఈ ప్రాజెక్టును త్వరగా మంజూరు చేసి, గడువులో పూర్తయ్యేలా చేసినందుకు కేంద్ర రహదారి రవాణా&హైవేల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీని, నరేంద్ర సింగ్ తోమర్ అభినందించారు. ప్రాజెక్టును చురుగ్గా పర్యవేక్షించినందుకు సహాయ మంత్రి వి.కె.సింగ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దీర్ఘకాలంలో ఈ ప్రాంతంలో రవాణా సౌలభ్యాన్ని ఫ్లై ఓవర్ పెంచుందని చెప్పారు.
మొరేనా ఫ్లై ఓవర్ నిర్మాణంతో చరిత్ర మారిందని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ అన్నారు. కేంద్ర నుంచి మొరేనా కోరుకున్నది నెరవేరిందని చెప్పారు. జిల్లాలో చేపట్టిన అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రస్తావించారు. అభివృద్ధికి సాక్షులుగా మారడంతోనే సరిపెట్టుకోకుండా, మనస్పూర్తిగా అందులో పాల్గొనాలని మొరెనా ప్రజలకు పిలుపునిచ్చారు.
ప్రజా సౌకర్యాలను సులభతరం చేసే అభివృద్ధిపై కేంద్రం దృష్టి పెట్టిందని రహదారి రవాణా&హైవేల శాఖ సహాయ మంత్రి శ్రీ వి.కె.సింగ్ చెప్పారు. ఈ ప్రాంతంలో ఇదే ప్రధాన అనుసంధాన మార్గం కాబట్టి, ప్రస్తుత విస్తరణను ముఖ్యమైనదిగా అభివర్ణించారు. గతంలో ఉన్న బ్లాక్ స్పాట్లలో ప్రమాదాలను తగ్గించడానికి కూడా ఫ్లై ఓవర్ సాయపడుతుందని అభిప్రాయపడ్డారు.
***
(Release ID: 1659753)
Visitor Counter : 156