ఆయుష్

జమ్మూ, కశ్మీర్ లో పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ సెంటర్ కు శంకుస్థాపనతో పాటు 21 ఆయుష్ ఆరోగ్య మరియు వెల్నెస్ సెంటర్లను ఆన్ లైన్ ద్వారా ప్రారంభించిన - కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి

Posted On: 26 SEP 2020 1:28PM by PIB Hyderabad

భాదేర్వాహ్ లో ఔషధ మొక్కల కోసం పంట కోతల అనంతర యాజమాన్య కేంద్రానికి శంకుస్థాపనతో పాటు జమ్మూ కశ్మీర్‌లో 21 ఆయుష్ హెల్త్ & వెల్నెస్ సెంటర్లను, కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్) , శ్రీ శ్రీపాద్ నాయక్,  ప్రధాన మంత్రి కార్యాలయం, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, 2020 సెప్టెంబర్ 25వ తేదీన వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించారు.

ఔషధ మొక్కల కోసం పంట కోతల అనంతర యాజమాన్య కేంద్రాన్ని స్థాపించడం యొక్క ఉద్దేశ్యం ఎండబెట్టడం,  వివిధ రకాలను వేరుచేయడం, ప్రాసెసింగ్, ధృవీకరణ, ప్యాకేజింగ్ మరియు స్థానిక ప్రజలు ఉత్పత్తి చేసి సేకరించిన మూలికల వంటి ముడి పదార్థాలను సురక్షితంగా నిల్వ చేయడం వంటి సౌకర్యాలను అభివృద్ధి చేయడం, మరియు తద్వారా ఆ ఉత్పత్తులకు మెరుగైన ధరను పొందటానికీ, అనుబంధ రైతుల ఆదాయాన్ని పెంపొందించుకునే అవకాశాన్ని కల్పించండం.

ఆయుష్మాన్ భారత్ ఆధ్వర్యంలో జమ్మూ కశ్మీర్‌లో నెలకొల్పిన 21 ఆయుష్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను కూడా ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రులు  ప్రారంభించారు.  వ్యాధి భారాన్నీ, జేబు ఖర్చు భారాన్ని తగ్గించడంతో పాటు, ఈ కేంద్రాల ద్వారా సంపూర్ణ ఆరోగ్య విధానం సృష్టించబడుతుంది.  ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారం, యోగా మరియు ఔషధ మొక్కల ద్వారా వ్యాధుల నివారణపై “స్వీయ సంరక్షణ” కోసం ప్రజలను శక్తివంతం చేయడం కోసం ఆయుష్ ప్రధానంగా దృష్టి పెట్టింది.

జమ్మూ కశ్మీర్‌లోని భాదేర్వాహ్ ప్రాంతంలో ఔషధ మొక్కల “పంట కోతల అనంతర యాజమాన్య కేంద్రం” నెలకొల్పాలని, ఈ ప్రాంత ప్రజలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారని, శ్రీ శ్రీపాద్ నాయక్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.  అనేక హిమాలయ జాతి ఔషధ మొక్కల సాగులో ఈ ప్రాంతానికి గల అతి పెద్ద సామర్థ్యాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా వివరించారు.  కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాన్ని అమలు చేయడంలో కేంద్ర పాలిత ప్రాంత  ప్రభుత్వ అధికారులు చేసిన కృషిని మంత్రి ప్రశంసించారు.  జమ్మూ, కశ్మీర్ అభివృద్ధి వేగాన్ని పెంపొందించేందుకు భారత ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని ఆయన పేర్కొన్నారు.

ఈ పోస్ట్ హార్వెస్ట్ సెంటర్, ఔషధ మొక్కల పెంపకందారులకు, సేకరణదారులకు అందించే ఇతర సౌకర్యాలతో పాటు, యువతలో ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని, డాక్టర్ జితేంద్ర సింగ్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.  వీటితో పాటు, ఆయుష్ హెల్త్ అండ్ వెల్నెస్ కార్యక్రమం నిరుపేదలకు సేవలను అందించడంతో పాటు, అంతర్జాతీయ స్థాయిలో ఆయుష్ ‌ను ప్రోత్సహిస్తుందని ఆయన తెలియజేశారు. 

*****


(Release ID: 1659447) Visitor Counter : 113