సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

వ్యవసాయ బిల్లులపై తప్పుదోవ పట్టించే అపోహలు స్వార్థ ప్రయోజనాల ద్వారా వ్యాప్తి చెందుతున్నాయి: డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 24 SEP 2020 5:23PM by PIB Hyderabad

చిన్న చిన్న రాజకీయ లాభాల కోసం రైతులను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్న కొన్ని స్వార్థ ప్రయోజన శక్తుల ద్వారా వ్యవసాయ బిల్లుల గురించి తప్పుదోవ పట్టించే అపోహలు వ్యాప్తి చెందుతున్నాయని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు ఇక్కడ వ్యాఖ్యానించారు. 

 

పార్లమెంటులో మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లుల్లో ప్రస్తావించని కొన్ని నిబంధనల పేరిట నిరాధారమైన పుకార్లు వ్యాపించడం హాస్యాస్పదమైన వ్యంగ్యం అని దూరదర్శన్‌కు ఇచ్చిన వివరణాత్మక ఇంటర్వ్యూలో డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఉదాహరణకు, కనీస మద్దతు ధర (ఎం.ఎస్.‌పి) ఆగిపోయిందని నమ్మిస్తూ, రైతులను తప్పుదారి పట్టించడానికి విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతోంది.  అయితే బిల్లుల్లో, ఎమ్.ఎస్.పి. విధానానికి సంబంధించి అటువంటి సూచన ఏదీ లేదు, పైగా ఎం.ఎస్.పి. వ్యవస్థ మునుపటిలా కొనసాగుతుందని బిల్లు స్పష్టంగా సూచిస్తోందని, ఆయన వివరించారు. 

మరోవైపు, డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులు రైతుకు తన పంటను ఎవరికైనా, ఎక్కడైనా, విక్రయించుకునే స్వేచ్ఛను, ఎంపికను ఇవ్వడంతో పాటు, పెద్ద కంపెనీలలో చేరడం ద్వారా ఎక్కువ లాభాలు సంపాయిదించాలనుకుంటే, తద్వారా వ్యవసాయ రంగం యొక్క ప్రజాస్వామ్యీకరణకు దారితీస్తాయని వివరించారు.  అదే విధంగా, ఏ బిల్లు లోనూ, మాండీలు ముగుస్తాయన్న ఒక చిన్న సూచన కూడా లేదనీ, మరో మాటలో చెప్పాలంటే,  మార్కెట్ వ్యవస్థ మునుపటిలా కొనసాగుతుందనీ,  ఆయన స్పష్టం చేశారు.  అదేవిధంగా, వ్యవసాయ మరియు ఆహార విధాన కేంద్రం (ఏ.ఎఫ్.పి.సి) కూడా అమలులో ఉంటుందని చెప్పారు. 

అదేవిధంగా,  కాంట్రాక్టు పేరిట పెద్ద కంపెనీల దోపిడీని ఎదుర్కోవలసివస్తుందని చెప్పడం ద్వారా రైతులను రెచ్చగొడుతున్నారని, డాక్టర్ జితేంద్ర సింగ్ ఆరోపించారు.  అయితే, దీనికి చాలా విరుద్ధంగా, ఇటివంటి ఏ దోపిడీ నుండైనా రైతులను రక్షించడానికి ఈ బిల్లులో తగిన నిబంధనలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.  

డాక్టర్ జితేంద్ర సింగ్, ఈ విషయాన్ని మరింత వివరంగా తెలియజేస్తూ,  కాంట్రాక్టు మరియు ఒప్పందం రైతులకు నిర్ణీత ధరను పొందటానికి హామీ ఇస్తుందనీ, రైతులు ఎటువంటి జరిమానా లేకుండా ఏ సమయంలోనైనా దీనిని ఉపసంహరించుకోవచ్చుననీ పేర్కొన్నారు. 

ఇది మాత్రమే కాదు, డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, రైతుల భూమిని అమ్మడం, అద్దెకు ఇవ్వడం లేదా తనఖా పెట్టడాన్ని ఈ బిల్లులు స్పష్టంగా నిషేధించాయి.  ఎందుకంటే ఒప్పందం పంటలపై ఉంది కానీ, భూమిపై కాదని స్పష్టం చేశారు. అందువల్ల, పెద్ద వ్యాపారవేత్తలు రైతుల భూమిని ఆక్రమించుకుని, వారిని వెట్టి చాకిరీ కూలీలుగా మారుస్తారనే తప్పుడు వాదనను ఆయన ఖండించారు. 

బహిరంగ మార్కెట్లో పంటల విక్రయానికి తగిన సురక్షిత విధానాలను కూడా ఈ వ్యవసాయ బిల్లులు అందిస్తాయని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.  ఒక ఉదాహరణను ప్రస్తావిస్తూ, ఒక రైతు దేశంలో ఎక్కడైనా పంటను బహిరంగ మార్కెట్లో విక్రయించడానికి ఎంచుకున్నప్పుడు, పంట కొనుగోలుదారుడు ఒకే రోజున మొత్తం చెల్లింపు చేయడానికి కట్టుబడి ఉండాలి, లేదా విధానపరమైన సమయం అవసరమైతే, మూడు పనిదినాలలో తప్పక చెల్లించవలసి ఉంటుంది.  ఒకవేళ ఆ విధంగా చెల్లించని పక్షంలో, కొనుగోలుదారుపై జరిమానా విధించే నిబంధనలు కూడా ఉన్నాయి అని ఆయన తెలియజేశారు. 

బిల్లులను వ్యతిరేకిస్తూ, రైతులను రెచ్చగొట్టే వారు వాస్తవానికి, ఈ విషయాన్ని ఎన్నికల సమస్యగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారని డాక్టర్ జితేంద్ర సింగ్ ఆరోపించారు.

<><><>


(Release ID: 1658874) Visitor Counter : 182