ఉప రాష్ట్రపతి సచివాలయం
సభా గౌరవాన్ని కాపాడటం నా బాధ్యత: రాజ్యసభ చైర్మన్
• సభ్యుల సస్పెన్షన్ బాధాకరమే.. కానీ తప్పలేదు
• దీర్ఘకాలం పాటు సస్పెన్షన్ నిర్ణయం సభ్యుల ఆలోచనా ధోరణిని సానుకూలంగా మారుస్తుందని భావిస్తున్నాను: చైర్మన్
• సభ్యుల సభా బహిష్కరణ సమయంలోనూ బిల్లులు ఆమోదం పొందిన ఘటనలను ఉదహరించిన రాజ్యసభ చైర్మన్
• సభాకార్యక్రమాలు సజావుగా సాగడంలో ప్రతి సభ్యుడు సహకరించాలని విజ్ఞప్తి
• ఈ సమావేశాల్లో రాజ్యసభలో 100.69% ఉత్పాదకత నమోదైందని వెల్లడి.
Posted On:
23 SEP 2020 4:27PM by PIB Hyderabad
నియమ, నిబంధలనకు అనుగుణంగా పార్లమెంటు ఎగువసభను నడుపుతూ సభా గౌరవాన్ని కాపాడటం తన ధర్మమని రాజ్యసభ చైర్మన్ శ్రీముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. కొందరు సభ్యులపై సస్పెన్షన్ విధింపు బాధాకరమే అయినప్పటికీ.. సభా నియమాలను ఉల్లంఘించడమే కాకుండా సభా మర్యాదాలను కాలరాసిన వారి విషయంలో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని ఆయన స్పష్టం చేశారు. అనుకున్న కాలపరిమితి కంటే ఎనిమిది రోజుల ముందే రాజ్యసభను నిరవధిక వాయిదా వేసే ముందు చైర్మన్ సభనుద్దేశించి ప్రసంగిస్తూ.. తమ నిరసనను తెలియజేసే హక్కు విపక్షాలకు ఉంటుందని అయితే ఏ విధంగా నిరసన తెలియజేస్తున్నారనే విషయంపై ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు.
సిద్ధాంత వైరుధ్యాలను వెల్లడించేందుకు రాజ్యసభ ఒక చక్కని వేదికన్న చైర్మన్.. దీర్ఘకాలం పాటు సభను బహిష్కరించడం వల్ల విపక్ష సభ్యులు తమ ఆలోచనలను, సిద్ధాంతాలను సభ ద్వారా సమర్థవంతంగా ప్రజలకు వెల్లడించే చక్కటి అవకాశాన్ని కోల్పోతారని పేర్కొన్నారు.
మూడు శ్రామిక చట్టాలను ఆమోదించవద్దంటూ విపక్షనేత గులాంనబీ ఆజాద్, ఇతర సభ్యులు రాసిన లేఖను ఉటంకిస్తూ.. సభ చరిత్రలో సభ్యులు కార్యక్రమాలను బహిష్కరించినపుడు, వాకౌట్ చేసినపుడు కూడా సభాకార్యక్రమాలు యథావిధిగా జరగడం, వివిధ బిల్లులు ఆమోదం పొందిన సందర్భాలను గుర్తుచేశారు. 2013లో సభ్యుల సభా బహిష్కరణ నేపథ్యంలోనూ ఆర్థిక బిల్లు, వినియోగ బిల్లుల ఆమోదం పొందిన విషయాన్ని చైర్మన్ ప్రస్తావించారు. ఈ మూడు శ్రామిక బిల్లులను వాయిదా వేయాలని లేఖలో కోరారని, ఈ విషయాన్ని ప్రభుత్వంతో చర్చించి ఉంటే బాగుండేదన్నారు. దీనికితోడు కొందరు సభ్యులు ఆదివారం నాడు సభలో జరిగిన ఘటనను సమర్థించుకోవడాన్ని దృష్టిలో ఉంచుకుని, సభా గౌరవం తగ్గకూడదనే ఉద్దేశంతో, బిల్లులు ప్రజా ప్రయోజనాలతో ముడిపడి ఉన్నందున ఈ మూడు శ్రామిక బిల్లులను ఆమోదింపజేశామని చైర్మన్ వెల్లడించారు. ‘నిబంధనల ప్రకారం బిల్లులకు ప్రాధాన్యత ఉంటుందని నచ్చకపోతే వ్యతిరేకించాలి, బలముంటే ఓడించాలి లేదంటే మెజారిటీ అభిప్రాయాన్ని గౌరవించాలి. ఇది ప్రజాస్వామ్య మూలసూత్రం. అంతేగానీ అడ్డుపడకూడదు’ అని చైర్మన్ తెలిపారు.
ఈసారి రాజ్యసభ సమావేశాలు ఉత్పాదకత విషయంలో సంతృప్తికరంగానే సాగాయని.. కొన్ని అంశాలు ఆవేదన కలిగించాయని ఆయన పేర్కొన్నారు. ‘భవిష్యత్తు మంచిగా ఉండాలంటే మనమంతా సంయుక్తంగా ఆలోచించాల్సిన అవసరముంది’ అని చైర్మన్ పిలుపునిచ్చారు. రాజ్యసభ చరిత్రలో తొలిసారిగా సభ డిప్యూటీ చైర్మన్‌ను తొలగించాలంటూ దాఖలైన తీర్మానాన్ని తిరస్కరించడం జరిగిందని.. నియమావళి ప్రకారం 14రోజుల ముందుగా ఈ నోటీసు ఇవ్వనందునే.. ఈ విజ్ఞప్తిని తిరస్కరించినట్లు ఆయన స్పష్టం చేశారు.
గతంలో ఎన్నడూ జరగని.. ఘటనలు చోటుచేసుకోవడం సభా గౌరవాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరినీ తీవ్రంగా బాధించాయన్న చైర్మన్.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి సభ్యుడిదన్నారు. కొందరు సభ్యులు సస్పెండ్ అయి, మరికొందరు సభాకార్యక్రమాలను బహిష్కరించినప్పుడు బిల్లులు ఆమోదం పొందడం ఇదేం మొదటిసారి కాదన్నారు. అయితే ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని సభ్యులకు సూచించారు.
రాజ్యసభతో 22 ఏళ్ల అనుబంధం ఉందన్న చైర్మన్, అనేక సందర్భాల్లో గందరగోళం మధ్యలో బిల్లులు ఆమోదం పొందినపుడు ఆవేదనకు గురయ్యానని పేర్కొన్నారు. రాజ్యసభ చైర్మన్‌గా ఇలాంటివి చూస్తుంటే మరింత బాధ కలుగుతోందన్నారు. కళ్లముందు జరుగుతున్న ఘటనలపై నిస్సహాయత వ్యక్తం చేస్తూ.. తప్పనిసరి పరిస్థితుల్లో నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం బాధాకరమని పేర్కొన్నారు. కర్తవ్యాన్ని నిర్వహించడం చైర్మన్‌తన బాధ్యతని.. బాధ్యతలనుంచి వైదొలగడం తన నైజం కాదన్నారు.
1997, 2012లో రెండుసార్లు రాజ్యసభలోని సభ్యులందరూ సభా గౌరవాన్ని కాపాడతామని, నియమ, నిబంధలను గౌరవిస్తామని ముక్తకంఠంతో తీర్మానించిన విషయాన్ని చైర్మన్ గుర్తుచేశారు. సభ సజావుగా జరగడంలో ప్రతి సభ్యుడూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, సహకరించాలి అని సూచించారు. అప్పుడే ప్రజల ఆకాంక్షలను పూర్తిచేసినవారమవుతామని గుర్తుచేశారు.
విపక్ష నేత గౌరవాన్ని తగ్గిస్తున్నారంటూ.. విపక్షనేత గులాంనబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలపై చైర్మన్ స్పందిస్తూ.. సభాకార్యక్రమాలు సజావుగా సాగడంలో విపక్షనేత కేంద్రబిందువన్నారు. సభా కార్యక్రమాల నిర్వహణ, నిర్ణయాలు తీసుకోవడం వంటి విషయాల్లో తాను వ్యక్తిగతంగా విపక్షనేతలను సంప్రదించిన విషయాన్ని స్పష్టం చేశారు.
కరోనా మహమ్మారి నేపథ్యంలో రాజ్యసభ 252వ సమావేశాలు పదిరోజులపాటు ఆరు వేర్వేరు ప్రాంతాలనుంచి (పార్లమెంటు ఉభయసభలు, గ్యాలరీలు) సమావేశమైన విషయాన్ని రాజ్యసభ చైర్మన్ గుర్తుచేశారు. రాజ్యసభ చరిత్రలో తొలిసారిగా ఈ విధంగా సమావేశాలు నిర్వహించడం జరిగిందన్నారు.
కరోనా మహమ్మారి సవాల్ విసురుతున్న నేపథ్యంలో ఎనిమిదిరోజుల ముందుగానే సభా కార్యక్రమాలను ముగించాల్సి వచ్చిందన్న చైర్మన్.. అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో సరికొత్త సాధారణ జీవితాన్ని అలవర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ పదిరోజులపాటు జరిగిన రాజ్యసభ సమావేశాల్లో 25 బిల్లులు ఆమోదం పొందగా.. ఆరు బిల్లులను కొత్తగా ప్రవేశపెట్టినట్లు చైర్మన్ వెల్లడించారు. సభ 100.69% ఉత్పాదకతను నమోదు చేసిందన్నారు. సభాకార్యక్రమాల ఉత్పాదకత విషయంలో గత మూడు సమావేశాలుగా జరుగుతున్న స్ఫూర్తి ఈ సారి కూడా కొనసాగిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఈ సమావేశాల్లో.. సభ్యులు అడిగిన 1,567 ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానాలు అందాయని, సభ్యులు 92 శూన్యకాల, 66 ప్రత్యేక ప్రస్తావ (స్పెషల్ మెన్షన్) తీర్మానాల ద్వారా సభ్యులు అత్యవసర ప్రజోపయోగ అంశాలను లేవనెత్తారని చైర్మన్ వెల్లడించారు. ఇందులో కరోనా నేపథ్యంలో తలెత్తిన అంశాలతోపాటు లద్దాఖ్ సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులు వంటి అంశాలు ఉన్నాయన్నారు.
కరోనాపై యుద్ధంలో మొదటి వరుస పోరాట యోధులుగా ఉన్న వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, శాస్త్రవేత్తలు, పోలీసులు, సాయుధ బలగాలతోపాటు రైతుల పాత్రను గుర్తుచేసుకున్న చైర్మన్, వారందరికీ అభినందనలు తెలియజేశారు.
***
(Release ID: 1658419)
Visitor Counter : 241