ప్రధాన మంత్రి కార్యాలయం

ఐక్య రాజ్య స‌మితి సాధార‌ణ స‌భ ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్ర‌సంగం

Posted On: 22 SEP 2020 9:46AM by PIB Hyderabad

ఐక్య రాజ్య స‌మితి సాధార‌ణ స‌భ అధ్య‌క్షుడు శ్రీ వోల్క‌న్ బోజ్‌ కిర్‌, శ్రేష్ఠులు, మ‌హిళ‌లు, స‌జ్జ‌నులారా,


న‌మ‌స్తే.


డెబ్భయ్ అయిదు సంవ‌త్స‌రాలకు పూర్వం యుద్ధ భయాల్లో నుంచి ఒక కొత్త ఆశ రేకెత్తింది.  మాన‌వ జాతి చ‌రిత్ర లో మొట్ట‌మొద‌టి సారిగా, యావ‌త్తు ప్ర‌పంచం కోసం ఒక సంస్థ ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది.  ఐరాస అధికారపత్రంలో వ్య‌వ‌స్థాప‌క సంత‌కందారుగా ఉన్న భార‌త‌దేశం ఆ ప‌విత్ర‌ దార్శ‌నిక‌త లో పాలుపంచుకొంది.  ఈ ఘ‌ట‌న భార‌త‌దేశం స్వీయ సిద్ధాంత‌మైన ‘వ‌సుధైవ కుటుంబ‌క‌మ్‌’ (ఈ సృష్టి అంతా ఒకే కుటుంబం అనే భావన) కు అద్దం పట్టింది.  


మ‌న ప్ర‌పంచం ప్ర‌స్తుతం ఒక ఉత్త‌మ‌ ప్రాంతం గా ఉందంటే అందుకు కార‌ణం ఐక్య రాజ్య స‌మితే.  ఐరాస పతాకం నీడలో అభివృద్ధి, శాంతి అనే ఆశ‌యాల‌ ను ముందుకు తీసుకుపోయిన వారంద‌రికీ- ఐరాస శాంతి ప‌రిర‌క్ష‌క ద‌ళం సహా- మ‌నం శ్ర‌ద్ధాంజ‌లి ని ఘ‌టిద్దాం.  ఐరాస శాంతి ప‌రిర‌క్ష‌క ద‌ళాలకు పెద్ద ఎత్తున సైనికుల‌ ను అందించిన దేశాల్లో భార‌త‌దేశం కూడా ఉంది.  


ఎన్నో మైలురాళ్ళ‌ను అధిగ‌మించిన‌ప్ప‌టికీ, సిస‌లైన లక్ష్యాన్ని చేరుకోవడం ఇంకా అసంపూర్తిగానే మిగిలింది.  చేయ‌వ‌ల‌సిన ప‌నులు ఎన్నో ఉన్నాయని ఈ రోజున మ‌నం స్వీకరిస్తున్న దీర్ఘ ప్రభావ ప్ర‌క‌ట‌న సూచిస్తోంది. ఆ పనుల్లో.. ఘ‌ర్ష‌ణ ను నివారించ‌డం, అభివృద్ధి జ‌రిగేట‌ట్లు చూడ‌టం, జ‌ల‌వాయు ప‌రివ‌ర్త‌న సంబంధిత స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డం, అస‌మాన‌త‌ల‌ను త‌గ్గించ‌డం, డిజిట‌ల్ సాంకేతిక ప‌రిజ్ఞానాల ను పూర్తి స్థాయిలో వినియోగించుకోవ‌డం.. వంటివి ఉన్నాయి.  ఐక్య రాజ్య స‌మితిని సైతం సంస్క‌రించ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఉంద‌ని ఈ ప్ర‌క‌ట‌న అంగీక‌రిస్తోంది.


కాలం చెల్లిన వ్య‌వ‌స్థ‌ల తో వర్తమానంలోని స‌వాళ్ళ ను మ‌నం ఎదుర్కోలేం.  స‌మ‌గ్ర సంస్క‌ర‌ణ‌లకు బాట వేయ‌కుండా ఐరాస విశ్వాస సంబంధిత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒక దేశంపై మ‌రొక దేశం ప‌ర‌స్ప‌రం ఆధార‌ప‌డ్డ ప్ర‌స్తుత ప్ర‌పంచంలో సంస్క‌రణలకు చోటిచ్చే బ‌హుళ పక్షీయ సంస్థలు మనకు ఎంతైనా అవ‌స‌రం. అలాంటి సంస్థలు ఈనాటి వాస్త‌వాల‌కు అద్దం ప‌డుతూ, స్టేక్ హోల్డ‌ర్స్ అంద‌రికీ వారి వారి అభిప్రాయాలను వెల్లడించడానికి అవకాశాలిస్తూ, స‌మ‌కాలీన స‌వాళ్ళ ను ప‌రిష్క‌రించేవిగా ఉండి, మాన‌వాళి సంక్షేమం పట్ల సైతం శ్ర‌ద్ధ వహించేవి అయి ఉండాలి.
ఇలాంటి గ‌మ్యాన్ని చేరుకొనే ప్రయాణంలో, అన్ని దేశాలతో క‌ల‌సి పయనించేందుకు భార‌త‌దేశం ఎదురుచూస్తోంది.

 

మీకు ఇవే ధ‌న్య‌వాదాలు.
 

న‌మ‌స్తే.

https://youtu.be/Ym90Jx9W7fs



 

***



(Release ID: 1657616) Visitor Counter : 180