రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

రూ. 14 వేల కోట్ల విలువైన 9 ప్రధాన ర‌హ‌దారుల ప్రాజెక్టుల‌కు పునాది రాయి వేసిన ప్ర‌ధాని

ఈ ప్రాజెక్టులు పూర్త‌యితే బిహార్ లోని అన్ని న‌దుల‌కు వంతెన‌ల సౌక‌ర్యం

ప్ర‌ధాని ప్యాకేజీ కింద గంగా న‌దిపై వంతెన‌ల సంఖ్య 17

రాష్ట్రంలో ప్ర‌ధాన‌ర‌హ‌దారులు, వంతెన‌ల నిర్మాణాల్ని త్వ‌రిత‌గ‌తిన చేస్తున్నందుకు కేంద్రానికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసిన ముఖ్య‌మంత్రి శ్రీ నితీష్ కుమార్‌

బాక్సర్ నుంచి వార‌ణాసికి నేరుగా ర‌హ‌దారి కోసం కేంద్రానికి సీఎం విజ్ఞ‌ప్తి

Posted On: 21 SEP 2020 3:26PM by PIB Hyderabad

బిహార్ రాష్ట్రానికి చెందిన 9 హైవే ప్రాజెక్టుల‌కు ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ పునాది రాయి వేశారు. బిహార్ లోని అన్ని గ్రామాలకు ఇంట‌ర్ నెట్ సౌక‌ర్యం క‌ల్పించ‌డం కోసం హ‌ర్ గావ్ ఆప్టిక‌ల్ ఫైబ‌ర్ కేబుల్ ప‌థ‌కానికికూడా శంఖుస్థాప‌న చేశారు. విర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య‌మంత్రి శ్రీ నితీష్ కుమార్ అధ్య‌క్ష‌త వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు కేంద్ర, రాష్ట్ర‌మంతులు, అధికారుల‌తోపాటు బిహార్ గ‌వ‌ర్న‌ర్ శ్రీ ఫ‌గు సింగ్ కూడా పాల్గొన్నారు. 


ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మాట్లాడుతూ బిహార్ లో మౌలిక స‌దుపాయాల అభివృద్ధి, ఆర్ధిక కార్య‌క‌లాపాల‌ను వేగిరం చేయడానికి ఈ ప‌నులు చేప‌ట్టామ‌ని ఇది రాష్ట్ర చ‌రిత్ర‌లో ముఖ్య‌మైన రోజ‌ని అన్నారు. మౌలిక స‌దుపాయాల‌ను క‌లిగిన దేశం త‌ప్ప‌కుండా ప్ర‌గ‌తి సాధిస్తుంద‌నే విష‌యాన్ని చ‌రిత్ర చెబుతోంద‌ని, అందుకే భారీగా ఈ రంగంలో నిధుల‌ను కేటాయిస్తున్నామ‌ని ప్ర‌ధాని అన్నారు. ఈ రోజున గ‌తానికంటే రెండింత‌లు వేగంగా ప్ర‌ధాన ర‌హ‌దారుల‌ను నిర్మించ‌డం జ‌రుగుతోంద‌ని ప్ర‌ధాని స్ప‌ష్టం చేశారు. ర‌హ‌దారుల నిర్మాణానికి కేటాయిస్తున్న నిధులు కూడా గ‌తానికంటే ఐదింత‌లు ఎక్కువ‌గా వున్నాయ‌ని అన్నారు. మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న కార్య‌క్ర‌మంద్వారా దేశంలో అత్య‌ధికంగా ల‌బ్ధి పొందుతున్న రాష్ట్రాల్లో బిహార్ ఒక‌ట‌ని ప్ర‌ధాని చెప్పారు. ఈ రోజున ప్రారంభ‌మైన ప్రాజెక్టులు రాష్ట్రంలోని అన్ని ప్ర‌ధాన నగ‌రాల‌ను క‌లుపుతాయ‌ని ప్ర‌ధాని అన్నారు. బిహార్ లో ర‌హ‌దారుల నిర్మాణంతోపాటు రాష్ట్రంలోని న‌దుల‌పై వంతెన‌ల నిర్మాణానికి కూడా కేంద్రం త‌గిన ప్రాధాన్య‌త ఇస్తోంద‌ని స్ప‌ష్టం చేశారు. దీనివ‌ల్ల బిహార్ లో న‌దులపై 17 వంతెనలు నిర్మాణ‌మ‌వుతున్నాయని వివ‌రించారు. రాబోయే నాలుగైదు సంవత్స‌రాల్లో దేశంలో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న కోసం 110 ల‌క్ష‌ల కోట్ల‌ను కేంద్రం ఖ‌ర్చు చేయ‌బోతోంద‌ని ప్ర‌ధాని అన్నారు. ఈ నిధుల్లో 19 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల‌ను కేవ‌లం ప్ర‌ధాన ర‌హ‌దారుల‌కోస‌మే కేటాయించిన‌ట్టు ప్ర‌ధాని చెప్పారు. 
ర‌హ‌దారులకు సంబంధించిన మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న విష‌యంలో కేంద్రం చేస్తున్న కృషి కార‌ణంగా బిహార్ రాష్ట్రం కూడా ల‌బ్ధి పొందుతోంద‌ని ప్ర‌ధాని అన్నారు. 2015లో ప్ర‌క‌టించిన ప్ర‌ధాన మంత్రి ప్యాకేజీ ద్వారా రాష్ట్రానికి సంబంధించి 3 వేల కిలోమీట‌ర్ల జాతీయ ర‌హ‌దారుల నిర్మాణం ప్ర‌తిపాదించ‌డం జ‌రిగింది. దీనికి తోడు భార‌త్ మాలా ప్రాజెక్టు కింద ఆరున్నర కిలోమీట‌ర్ల జాతీయ ర‌హ‌దారిని రాష్ట్రంలో నిర్మిస్తున్నారు. ఈ రోజున బిహార్ లో జాతీయ ప్ర‌ధార ర‌హ‌దారి గ్రిడ్ ప‌నులు చాలా వేగంగా న‌డుస్తున్నాయ‌ని, తూర్పు, ప‌శ్చిమ బిహార్ ప్రాంతాల‌ను క‌ల‌ప‌డం కోసం నాలుగు లేన్లు క‌లిగిన 5 ప్రాజెక్టులు నిర్మాణంలో వున్నాయ‌ని, ఉత్త‌ర భార‌త‌దేశంతో, ద‌క్షిణ భార‌త‌దేశాన్ని క‌ల‌ప‌డం కోసం 6 ప్రాజెక్టులు నిర్మాణంలో వున్నాయ‌ని ప్ర‌ధాని వివ‌రించారు. 
ఈ సంద‌ర్భంగా మాట్లాడిన ముఖ్య‌మంత్రి శ్రీ నితీష్ కుమార్ ప్ర‌ధాని ప్యాకేజీతోపాటు రాష్ట్రంలో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న కోసం కేంద్రం చ‌క్క‌గా కృషి చేస్తోంద‌ని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్ర‌ధాని చేస్తున్న కృషి అభినంద‌నీయ‌మ‌ని అన్నారు. రాష్ట్రంలో ప్ర‌ధాన ర‌హ‌దారుల‌ను, వంతెన‌ల్ని కేంద్రం చాలా వేగంగా నిర్మిస్తోంద‌ని, బాక్స‌ర్ వార‌ణాశిల‌ను నేరుగా క‌లిపే ర‌హ‌దారిని నిర్మించాల‌ని కేంద్రాన్ని కోరారు. అలాగే ర‌హ‌దారుల‌పై ఎలాంటి ట్రాఫిక్ స‌మ‌స్య‌లు రాకుండా వుండ‌డానికి గాను జాతీయ ర‌హ‌దారుల వెడ‌ల్పు అన్ని చోట్లా ఒకే విధంగా వుండేలా చూడాల‌ని కోరారు. బిహార్ రాష్ట్ర ప్ర‌జ‌ల జాతీయ త‌ల‌స‌రి ఆదాయం పెంచ‌డానికిగాను కేంద్రం ఎంత చేయాలో అంతా చేస్తోంద‌ని ముఖ్య‌మంత్రి అన్నారు. ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడుకోవ‌డం కోసం జాతీయ ర‌హ‌దారులకు ఇరువైపులా భారీ ఎత్తున మొక్క‌ల‌ను నాటే కార్య‌క్ర‌మం చేప‌డ‌తామ‌ని అన్నారు.  
ఈ సంద‌ర్భంగా మాట్లాడిన కేంద్ర న్యాయ‌, ఎల‌క్ట్రానిక్ మ‌రియు స‌మాచార సాంకేతిక శాఖ మంత్రి శ్రీ ర‌విశంక‌ర్ ప్రసాద్ ఈ రోజున రాష్ట్రానికి సంబంధించిన భౌతిక‌, డిజిట‌ల్ మౌలిక ప‌దుపాయాలకు సంబంధించిన ముఖ్య‌మైన ప్రాజెక్టులు ప్రారంభ‌మ‌వుతున్నాయ‌ని ఇది రాష్ట్రానికి సంబంధించి చారిత్రాత్మ‌క రోజ‌ని అన్నారు. ఇంట‌ర్ నెట్ సేవ‌లందించే హ‌ర్ గావ్ ఆప్టిక‌ల్ ఫైబ‌ర్ కేబుల్ నిర్మాణాన్ని కేంద్ర ఎల‌క్ట్రానిక్స్ మ‌రియు స‌మాచార సాంకేతిక‌త శాఖ నిర్మిస్తుంద‌ని అన్నారు. గ్రామీణ ప్రాంతాల‌కు ఎల‌క్ట్రానిక్ సేవలందించ‌డంలో ఇది చాలా ముఖ్య‌మని అన్నారు. 

 


ఈ సంద‌ర్భంగా మాట్లాడిన కేంద్ర స‌హాయ మంత్రి శ్రీ వికె సింగ్ రాష్ట్రంలో రూ. 14, 258 కోట్ల విలువైన ప్ర‌ధాన ర‌హ‌దారుల‌ను నిర్మిస్తున్నామ‌ని వీటిద్వారా మెరుగైన ర‌వాణా సౌక‌ర్యం ఏర్ప‌డి రాష్ట్రానికి ఆర్ధికంగా ల‌బ్ధి చేకూరుతుంద‌ని అన్నారు. ప‌లు రాష్ట్రాల‌తో బిహార్ రాష్ట్రానికి ర‌వాణా సౌక‌ర్యాలు బాగా మెరుగవుతాయ‌ని వివ‌రించారు. ట్రాఫిక్ స‌మ‌స్య‌లు ప‌రిష్కార‌మ‌వుతాయ‌ని అన్నారు. 
ఈ సంద‌ర్భంగా మాట్లాడిన రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి శ్రీ సుశీల్ కుమార్ మోడీ కేంద్ర రాష్ట్ర స‌హ‌కారానికి సంబంధించి బిహార్‌, కేంద్రం మ‌ధ్య‌న వున్న స‌త్ సంబంధాలు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తాయ‌ని అన్నారు. రాష్ట్రంలో న‌దుల‌పై వంతెన‌లు గ‌తంలో ఒక‌టి వుంటే ఇప్పుడు 17 స‌మ‌కూర‌బోతున్నాయ‌ని అన్నారు. 
బిహార్ రాష్ట్రంలో గ‌ణ‌నీయ‌మైన‌స్థాయిలో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న కోసం 2015లో ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ ఒక ప్ర‌త్యేక ప్యాకేజీని ప్ర‌క‌టించారు. దీనికి సంబంధించిన 75 ప్రాజెక్టుల‌ను రూ. 54, 700 కోట్ల‌తో చేప‌ట్ట‌డం జ‌రిగింది. వీటిలో 13 ప్రాజెక్టులు పూర్త‌య్యాయి. మిగ‌తా వాటికి సంబంధించి ప‌నులు వివిధ ద‌శ‌ల్లో వున్నాయి. ఈ ప్రాజెక్టులన్నీ పూర్త‌యితే బిహార్ లోని అన్ని న‌దుల‌పైనా వంతెన‌ల నిర్మాణం పూర్త‌వుతుంది. అంతే కాదు రాష్ట్రంలోని అన్ని జాతీయ ర‌హ‌దారులు వెడ‌ల్పయి బ‌లోపేత‌మ‌వుతాయి. ప్ర‌ధాని ప్యాకేజీకింద గంగా న‌దిపైన మొత్తం వంతెన‌ల సంఖ్య 17. 

 

***



(Release ID: 1657592) Visitor Counter : 162