వ్యవసాయ మంత్రిత్వ శాఖ
ఆత్మనిర్భర్ ఖేతి కింద జాతతీయ రబీ ప్రచార కార్యక్రమం 2020ని ప్రారంభించిన కేంద్ర వ్యవసాయ , రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్రసింగ్ తోమర్
2019-2020 లో కోవిడ్ -19 వంటి అననుకూలతలు ఉన్నప్పటికీ, రికార్డు స్థాయిలో 296.65 మిలియన్ టన్నుల ఆహారధాన్యాలు పండించినందుకు రైతులను , రాష్ట్రప్రభుత్వాలను అభినందించిన కేంద్ర మంత్రి శ్రీనరేంద్రసింగ్ తోమర్
రబీ 2020 ప్రచారానికి సంబంధించిన జాతీయ సదస్సు,2020-21కి 301 మిలియన్ టన్నుల ఆహారధాన్యాల దిగుబడి లక్ష్యంగా పెట్టుకుంది.
Posted On:
21 SEP 2020 2:23PM by PIB Hyderabad
కోవిడ్ -19 కారణంగా ఏర్పడిన అననుకూల పరిస్థితులలో సైతం 2019-20లో ఆహార ధాన్యాల ఉత్పత్తిని రికార్డు స్థాయిలో 296.65 మిలియన్ టన్నుల మేరకు సాధించినందుకు కేంద్ర వ్యవసాయం , రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్రసింగ్ తోమర్ రైతులను , రాష్ట్ర ప్రభుత్వాలను అభినందించారు.
పప్పులు, నూనెగింజల ఉత్పత్తి 23.15, 33.42 మిలియన్ టన్నులుగా ఉండనుంది. పత్తి దిగుబడి 354.02 లక్షల బేళ్లుగా అంచనా వేస్తున్నారు. దీనితో ఇండియా ప్రపంచంలో మొదటిస్థానానికి చేరుకోనుంది. ఈ సంవత్సరం భారత వ్యవసాయరంగ చరిత్రలో ఒక మైలురాయి. 2020-09-11 నాటికి ఈ ఏడాది ఖరీఫ్ నాట్లు 1113 లక్షల హెక్టార్లు అంటే సాధారణ నాట్ల కంటే ఇది 46 లక్షల హెక్టార్లు ఎక్కువ. దీనితో దేశ ఆహార, పౌష్టికాహార భద్రతకు మంచి అవకాశం కల్పిస్తుంది. ఈ అద్భుత విజయాన్ని సాధించినందుకు రైతులు, రాష్ట్రప్రభుత్వాలు అభినందనలకు అర్హులని మంత్రి అన్నారు.
రబీ ప్రచారం 2020 జాతీయ సదస్సునుద్దేశించి మాట్లాడుతూ మంత్రి, తన అధ్యక్షతన ఖరీఫ్ 2020-21పురోగతిపై సమీక్షా సమావేశం జరిగినట్టు చెప్పారు. రబీ సీజన్‌పై త్వరలో సమీక్షా సమావేశం నిర్వహిస్తామన్నారు. దేశంలో వ్యవసాయ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు రైతుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు తీసుకుంటోంది. ఇటీవల వ్యవసాయ మౌలికసదుపాయాల ఫండ్ (ఎఐఎఫ్) పథకం కింద సుమారు 1 లక్ష కోట్ల రూపాయలను నాలుగు సంవత్సరాల కాలానికి ప్రారంభించారు. దీనిని కోల్డ్ స్టోరేజ్, వేర్‌హౌస్, ప్యాకేజింగ్, పండ్లు మగ్గబెట్టడం వంటి వాటిని వ్యవసాయ ఎంటర్‌ప్రెన్యుయర్లు, రైతు సంఘాలు, స్థానిక ప్రభుత్వ ఏజెన్సీలు చేపట్టేందుకు ఏర్పాటు చేశారు.ఆయా రాష్ట్రాల మొత్తం వ్యవసాయ, అనుబంధ రంగాల దిగుబడి విలువ ఆధారంగా తాత్కాలిక కేటాయింపులు చేశారు. బ్యాంకు వడ్డీపై 3 శాతం వడ్డీ రాయితీ ఇస్తారు.దీనితో వడ్డీ రేటును 5 నుంచి 5.5 శాతంగా ఉండేట్టు చూస్తారు. 10,000 రైతు ఉత్పాదక సంస్థల (ఎఫ్.పి.ఒ)లను ఏర్పాటు చేయడం మరో కీలక నిర్నయం. ఇది అధిక రాబడి సాధించేందుకు రైతులను సంఘటితం చేయడం గా చెప్పుకోవచ్చు. వీటిని కంపెనీ లేదా సహకార చట్టం కింద రిజిస్టర్ చేస్తారు, వీటిలో 15 శాతం ఆకాంక్షిత, నోటిఫైడ్ గిరిజన ప్రాంతాలలో ఏర్పాటు చేస్తారు.
వ్యవసాయ రంగం పరిస్థితిని మరింత మెరుగుపరిచేందుకు మార్కెటింగ్ నుంచి రైతులకు విముక్తి కల్పించేందుకు రెండు బిల్లులను పార్లమెంటు ఆమోదించినట్టు మంత్రి చెప్పారు. రైతు ఉత్పత్తులు, వాణిజ్య, వ్యాపార (ప్రొత్సాహక, సులభతర)బిల్లు 2020 ను, ధరల హామీపై రైతుల సాధికారత, రక్షణ ఒప్పందం, రైతు సేవల బిల్లు 2020 వ్యవసాయ, అనుబంధ రంగాలలోని రైతులకు మేలు చేస్తుందన్నారు. రైతులు తమ ఉత్పత్తులను దేశంలోని వివిధ ప్రాంతాలలో అమ్మడానికి ఇది వీలు కల్పిస్తుందని ఆయన చెప్పారు. ప్రభుత్వం కనీస మద్దతు ధర విధానాన్నిప్రస్తుత నెట్ వర్కు ద్వారా కొనసాగిస్తుందని ఆయన చెప్పారు. ఈ చర్యలు పెద్ద ఎత్తున ప్రైవేటు పెట్టుబడులు ఈ రంగంలోకి రావడానికి దోహదపడతాయని ఇది వ్యవసాయ రంగం సత్వర అభివృద్ధికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఉపయోగపడుతుందని అన్నారు.
సూక్ష్మ నీటిపారుదల కింద రాగల ఐదు సంవత్సరాలలో 100 లక్షల హెక్టార్లకు నీటిని అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. ఇందుకు 5000 కోట్ల రూపాయలతో ప్రత్యేక మైక్రో ఇరిగేషన్ ఫండ్‌ను నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రూరల్ డవలప్‌మెంట్ (నాబార్డ్)తో కలిసి ఏర్పాటు చేశారు. దీనిని చిన్న నీటిపారుదలను విస్తరించేందుకు ఏర్పాటు చేశారు. 2019-20 సంవత్సరంలో బిందు, తుంపర సేద్య వ్యవస్థను అనుసరించడం ద్వారా సుమారు 11 లక్షల రైతులు ప్రయోజనం పొందారు. గత ఐదు సంవత్సరాలలో మైక్రో ఇరిగేషన్ కింద సుమారు 47.92 లక్షల హెక్టార్లకు నీరు అందించారు. ఇందులో 2019-20 సంవత్సరానికి 11.72 లక్షల హెక్టార్లు మైక్రో ఇరిగేషన్ సదుపాయం కల్పించడం జరిగింది. ఇది చెప్పుకోదగిన విజయం.
ఇండియాలో ప్రధానంగా మూడు పంట సీజన్లు ఉన్నాయి. అవి ఒకటి ఖరీఫ్, మరొకటి రబీ, మూడోది వేసవి సీజన్. ఈ సీజన్లలొ పెద్ద ఎత్తున పప్పులు, తృణధాన్యాలు,నూనెగింజలు, వాణిజ్యపంటలు పండిస్తారు. దేశంలో పండే పంటలో సగం పంట రబీ సీజన్‌లొ వస్తుంది. అందువల్ల ఇది ఎంతో ముఖ్యమైన పంట సీజన్. ప్రతి సీజన్‌కు ముందు జాతీయ సదస్సును నిర్వహించి ఆ సీజన్‌కు సన్నద్దత, సకాలంలో విత్తనాలు ఎరువులు ఇతర పరికరాల అందుబాటు గురించి సమీక్షిస్తారు. ఈ సారి మంచి వర్షాలు కలిసి రిజర్వాయర్లు నిండుగా ఉన్నాయి. ఇదొక మంచి అవకాశం.
ఈ సదస్సు 2020-21 సంవత్సరానికి 301 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తిని లక్ష్యంగా నిర్ణయించింది. ఇందులొ ధాన్యం 119.6 మిలియన్ టన్నులు, గోధుమలు 108.00 మిలియన్ టన్నులు, జొన్నలు 5.00 మిలియన్ మెట్రిక్ టన్నులు, మొక్కజొన్నలు 9.57 మిలియన్ టన్నులు, సజ్జలు 29 మిలియన్ టన్నులు, 47.80 టన్నులు ముతక పప్పుధాన్యాలు లక్ష్యంగా ఉన్నాయి. పప్పుధాన్యాలు, నూనెగింజల ఉత్పత్తిపైన మరింత దృష్టి పెట్టడం జరుగుతుంది. వీటికి సంబంధించి పప్పుధాన్యాలు 25.60 మిలియన్ టన్నులు, నూనెగింజలు, 37 మిలియన్ టన్నుల లక్ష్యంగా నిర్ణయించారు. దిగుమతి చేసుకునే వంటనూనెలను తగ్గించేందుకు పెద్ద ఎత్తున చమురు గింజల దిగుబడిపై దృష్టిపెట్టడం జరుగుతుంది. అలాగే ఆయిల్ పామ్ ప్లాంటేషన్‌ను దేశీయంగా చేపడతారు. ఈ రబీలో చమురుగింజల కింద ఆవాల దిగుబడి లక్ష్యాన్ని 92 లక్షల టన్నుల నుంచి 125 లక్షల టన్నులకు పెంచారు.
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమం, పంచాయతి రాజ్ శాఖ సహాయ మంత్రి శ్రీ పురుషోత్తమ్ రూపాల, కేంద్ర వ్యవసాయ , రైతుసంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ కైలాశ్ చౌదరి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సదస్సుకు వ్యవసాయం, సహకారం, రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి, వ్యవసాయ పరిశోధన విద్య విభాగం కార్యదర్శి, ఐసిఎఆర్ డైరక్టర్ జనరల్ ,ఎరువుల విభాగం కార్యదర్శి, వివిధ కేంద్ర మంత్రిత్వశాఖలకు చెందిన సీనియర్ అధికారులు, రాష్ట్రప్రభుత్వాల సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
***
(Release ID: 1657442)
Visitor Counter : 224