ప్రధాన మంత్రి కార్యాలయం

బిహార్‌ లో అనేక అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం సందర్భంలో ప్రధాన మంత్రి ప్రసంగం

Posted On: 15 SEP 2020 2:31PM by PIB Hyderabad

బిహార్ గవర్నర్ శ్రీ ఫాగూ చౌహాన్ గారు, ముఖ్యమంత్రి శ్రీ నీతీశ్  కుమార్ గారు, కేంద్ర మంత్రిమండలి లో నా సహచరులు శ్రీ హర్దీప్ సింగ్ పురీ గారు, శ్రీ రవిశంకర్ ప్రసాద్ గారు, కేంద్ర మంత్రిమండలి లోని, రాష్ట్ర మంత్రిమండలి లోని సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నా ప్రియ మిత్రులారా,

ఈరోజున ప్రారంభోత్సవం జరుగుతున్న 4 పథకాల్లో పట్నా నగరంలోని బేవూర్-లీచ్ కమే సివరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్‌ కాకుండా మిగిలినవన్నీ ‘అమృత్ పథకం’తో పాటు సీవాన్, ఛప్రా లలోని జల సంబంధిత ప్రాజెక్టులు. వీటికి తోడు, ముంగేర్, జమాల్ పుర్ లలో నీటి సమస్యలను తీర్చేందుకు నీటి సరఫరా ప్రాజెక్టులు, ముజప్ఫర్ పుర్ లో ‘నమామి గంగే పథకం’ లో భాగంగా రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ స్కీమ్ కు కూడా నేడు శంకుస్థాపన చేయడం జరిగింది. పట్టణాల్లో ఉండే పేదలు, మధ్యతరగతి ప్రజల జీవితాలను సరళతరంగా మార్చేందుకు ఉద్దేశించిన ఈ పథకాలకుగాను మీ అందరికీ అనేకానేక శుభాకాంక్షలు.

మిత్రులారా,

నేటి ఈ కార్యక్రమం ఒక విశేషమైన రోజున జరుగుతున్నది. ఈ రోజు మనం ఇంజినీర్ల దినోత్సవాన్ని కూడా జరుపుకొంటున్నాం. నేడు భారతదేశపు గొప్ప ఇంజినీర్ శ్రీ మోక్షగుండం విశ్వేశరయ్య గారి జయంతి. ఈ రోజును ఆయన ను స్మరించుకోవడానికి అంకితం చేయడమైంది. దేశ నిర్మాణంలో, ప్రపంచ నిర్మాణంలో మన భారతదేశ ఇంజినీర్ల పాత్ర చిరస్మరణీయం. అంకితభావం, సూక్ష్మమైన అంశాలపై తీసుకునే జాగ్రత్తలు, చొరవ ప్రపంచవ్యాప్తంగా మన ఇంజనీర్లకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. ఇది వాస్తవం. భారతదేశ నిర్మాణంలో, 130 కోట్ల మంది భారతీయుల జీవితాలను సరళీకృతం చేయడంలో మన ఇంజినీర్ల పాత్ర పై మేం గర్వపడుతున్నాం. ఈ సందర్భంగా ఇంజినీర్లందరికీ వారి నిర్మాణ కౌశలానికి నమస్కరిస్తున్నాను. జాతి నిర్మాణం లో భాగం గా చేపడుతున్న కార్యక్రమాల్లో బిహార్ పాత్ర కూడా కీలకమే. ఎందుకంటే దేశాభివృద్ధి ని మరింత ముందుకు తీసుకెళ్లే లక్షల మంది ఇంజినీర్లలో చాలా మంది బిహార్ కు చెందిన వారే. బిహార్‌ కు చెందిన ఎందరో మంది యువతీ యువకులు ఇంజినీరింగ్ సంస్థల్లో చేరి తమ సత్తా ను చాటుతున్నారు. బిహార్ గడ్డ నవ్యావిష్కరణలకు, సృజనాత్మకతకు పర్యాయపదం గా మారింది. ఇవాళ పూర్తయిన ప్రాజెక్టుల్లోనూ బిహార్ ఇంజినీర్ల పాత్ర కీలకంగా ఉంది. అందుకే బిహార్ ఇంజినీర్లకు జాతీయ ఇంజినీర్ల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.

మిత్రులారా, 

బిహార్ చారిత్రక నగరాలు ఉన్న భూమి. వేల ఏళ్లుగా పట్టణ చరిత్రకు బిహార్ వారసత్వంగా నిలిచింది. ప్రాచీన భారతంలో గంగానది ఒడ్డున విలసిల్లిన ఆర్థిక, సాంస్కృతిక, రాజనీతి రంగాల్లో ఇక్కడి ప్రాంతాలు సమృద్ధిని సాధించాయి. సంపన్న నగరాలుగా నిలిచాయి. కానీ విదేశీ పాలన సందర్భంగా ఇంతటి అద్భుతమైన చరిత్ర ఉన్న బిహార్‌ కు తీవ్రనష్టం జరిగింది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా దశాబ్దాల తరబడి బిహార్‌ కు ప్రముఖ నేతల మార్గదర్శనం లభించింది. వీరంతా విదేశీ పాలన లో బిహార్‌ కు జరిగిన నష్టాన్ని పూరించేందుకు అంకిత భావంతో ప్రయత్నించారు. ఇంతటి ప్రయత్నాల తర్వాత కూడా బిహార్‌ లో కనీస మౌలిక వసతుల నిర్మాణం, రాష్ట్ర  ప్రజలకు ఆధునిక సౌకర్యాల కల్పన లు చోటు చేసుకోలేదు. అధికారం లో ఉన్నవారి ప్రాధాన్యతలు మారిపోయాయి. దీని ఫలితంగా రాష్ట్రంలో పాలన దృష్టి కీలకమైన అంశాల నుంచి మరలిపోయింది. దీని కారణంగా బిహార్ గ్రామాలు మరింత వెనుకబడిపోగా.. నగరాల ఘనమైన చరిత్ర మసకబారుతూ వచ్చింది. మారుతున్న జనాభా, పరిస్థితులకు అనుగుణంగా వసతుల కల్పన జరగలేదు. రోడ్లు, వీధులు, తాగునీరు, పారిశుద్ధ్య వ్యవస్థ వంటి ఎన్నో సమస్యల పరిష్కారాన్ని ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చారు. అంతటితో ఆగకుండా పనుల పేరు తో భారీ కుంభకోణాలకు పాల్పడ్డారు.

మిత్రులారా, 

పాలనలో స్వార్థం చేరితే.. అది ఓటు బ్యాంకు వ్యవస్థగా మారి పీడిత, వంచిత, శోషిత, వెనుకబడిన వర్గాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. బిహార్ ప్రజలు దశాబ్దాలుగా ఈ బాధను భరించారు. ఎప్పుడైతే తాగునీరు, పారిశుద్ధ్యం వంటి కనీస వసతులను కల్పించలేదో.. అప్పుడు మన తల్లులు, సోదరీమణులు, పేదలు, దళితులే ఎక్కువగా ఇబ్బందులు పడతారు. వెనుకబడిన వర్గాలు మరింత వెనుకబడతాయి. మురికి కూపంలో ఉండటం వల్ల, తప్పనిసరి పరిస్థితుల్లో పరిశుద్ధమైన నీటిని తాగలేక ప్రజలను అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దీని వల్ల వారెంత సంపాదించినా అది అనారోగ్యానికే ఖర్చయిపోతుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని ఏళ్ల వరకు ఆ అప్పులు తీర్చుకునేందుకే కుటుంబ సంపాదనంతా సరిపోతుంది. ఈ పరిస్థితుల్లో బిహార్‌ లోని ఓ పెద్ద వర్గం ఈ అప్పులు, అనారోగ్యం, నిస్సహాయత, నిరక్షరాస్యతను తమకు అనుకూలంగా మార్చుకుంది. ఓ రకంగా చెప్పాలంటే ప్రభుత్వాలు చేసిన తప్పిదాల కారణంగా సమాజంలోని అధిక సంఖ్యాక ప్రజల ఆత్మవిశ్వాసం తీవ్రంగా దెబ్బతిన్నది. పేదల పట్ల ఇంతకన్నా పెద్ద అన్యాయం ఇంకేముంటుంది?

మిత్రులారా,

గత దశాబ్దంన్నర కాలం నుంచి నీతీశ్ గారు, సుశీల్ గార్లతో పాటు వారి జట్టు.. సమాజం లో అత్యంత వెనుకబడిన వర్గాలు కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి నింపేందుకు కృషి చేస్తోంది. మరీ ముఖ్యంగా బాలికలకు విద్య, పంచాయతీరాజ్ సహా స్థానిక సంస్థల్లో వంచిత, పీడిత, శోషిత వర్గాలకు సరైన భాగస్వామ్యాన్ని కల్పిస్తోంది. దీని ద్వారా ఆయా వర్గాల ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. 2014 తర్వాత ఓ రకమైన బలమైన పునాది వేసే దిశగా.. మౌలిక సదుపాయాల కల్పన పథకాల్లో గ్రామపంచాయతీలు, స్థానిక సంస్థల భాగస్వామ్యానికి ప్రాధాన్యాన్ని ఇస్తున్నాం. ఇప్పుడు ప్రణాళికలు రూపొందించడం మొదలుకుని.. పథకాల అమలు వరకు అంతా స్థానిక సంస్థలదే బాధ్యత. అందుకోసం వారు ఆయా ప్రాంతాలకు అవసరమైనట్లుగా వసతుల కల్పనపై దృష్టి పెట్టేందుకు వీలుంటుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం, బిహార్ ప్రభుత్వం పట్టణాల్లోనూ తాగునీరు, పారిశుద్ధ్యం వంటి మౌలికవసతుల కల్పనలో ఎప్పటికప్పుడు మార్పులు తీసుకొస్తున్నాయి. అమృత్ పథకంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివిధ పథకాల ద్వారా.. గత నాలుగైదేళ్లలో బిహార్‌ లోని పట్టణాల్లో లక్షల కుటుంబాలకు సురక్షిత తాగునీటి పథకం అందుబాటులోకి వచ్చింది. ఈ కార్యక్రమాల కొనసాగింపు ద్వారా రానున్న రోజుల్లో ఇంటింటికీ పైప్ లైన్ ద్వారా తాగునీరు పొందే రాష్ట్రాల్లో బిహార్ కూడా చేరబోతోంది. ఇది బిహార్ గౌరవాన్ని పెంచే మరో గొప్ప కార్యక్రమం కానుంది.

తమ ముందున్న భారీ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో కరోనా సంకట పరిస్థితిలోనూ బిహార్ ప్రజలు అదేపని గా  పాటుపడ్డారు. గత కొద్ది నెలల్లో బిహార్ గ్రామీణ ప్రాంతాల్లోని 57 లక్షలకు పైగా కుటుంబాలకు పైప్ లైన్ ద్వారా తాగునీటిని అందించే వ్యవస్థ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇందులో ‘ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ యోజన’ పాత్ర కూడా ఇందులో కీలకంగా ఉంది. కరోనా కారణంగా వివిధ రాష్ట్రాల నుంచి బిహార్‌ కు చేరుకున్న స్థానిక కార్మిక సోదరులు ఈ పని ని చేసి చూపించారు. జల్ జీవన్ మిషన్ ఇలా వేగంగా పూర్తవడంతో దీనిని బిహార్ శ్రామికులకే అంకితం చేస్తున్నాను. గత ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా 2 కోట్లకు పైగా నీటి కనెక్షన్లను ఇవ్వడమైంది. ఇవాళ దేశవ్యాప్తంగా రోజుకు 1 లక్షకు పైగా ఇళ్లకు ఈ కనెక్షన్లతో అనుసంధానమవుతున్నాయి. సురక్షితమైన మంచినీరు పేదలు, మధ్యతరగతి ప్రజల జీవనాన్ని మార్చడంతో పాటు అనారోగ్యం బారిన పడకుండా వారిని కాపాడుతుంది.

మిత్రులారా,

పట్టణ ప్రాంతాల్లోనూ లక్షల మందికి మంచినీటి కనెక్షన్లు అందించే కార్యక్రమాలు వేగవంతం అయ్యాయి. బిహార్ వ్యాప్తంగా అమృత్ పథకంలో భాగంగా దాదాపు 12 లక్షల కుటుంబాలకు మంచినీటిని అందించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. ఇందులో దాదాపు 6 లక్షల కుటుంబాలకు ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాం. మిగిలిన కుటుంబాలకు కూడా వీలైనంత త్వరగా మంచినీటిని అందుబాటులోకి తీసుకొస్తాం. ఇవాళ శంకుస్థాపన జరిగిన కార్యక్రమాలన్నీ మా ఈ లక్ష్యంలో భాగమే.

మిత్రులారా,

పట్టణీకరణ నేటి వాస్తవికత. ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణ వేగంగా పెరుగుతోంది. దీనికి భారతదేశమేమీ మినహాయింపు కాదు.  
పట్టణీకరణ ఓ సమస్య అనే భావన మనలో కొన్నేళ్లుగా నాటుకుంది. కానీ అది సరైంది కాదని నా అభిప్రాయం.  ఆ రోజుల్లో బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు ఈ వాస్తవాన్ని అర్థం చేసుకున్నారు. అందుకే  పట్టణీకరణను ఆయన ప్రోత్సహించారు. పేదందరికీ సమాన అవకాశాలు దక్కే పట్టణాలు, నగరాల నిర్మాణం జరగాల్సిన అవసరముందని ఆనాడే అంబేడ్కర్  భావించారు. అలాంటి సమృద్ధి, గౌరవం, భద్రత, సశక్త సమాజ నిర్మాణం జరగాలనే సంకల్పంతోనే మేం ముందుకెళ్తున్నాం. అందరికీ, మరీ ముఖ్యంగా యువత కు, ముందడుగు వేసేందుకు అవసరమైన అన్ని అవకాశాలను కల్పించే పట్టణాలు కావాలి. ప్రతి కుటుంబానికి శ్రేయస్సుతో పాటు సుఖసంతోషాలు ఉండే పట్టణాలు కావాలి. పేదలకు, దళితులకు, వెనుకబడిన వర్గాలకు చెందిన వారికి, మహిళలకు గౌరవపూర్వకమైన జీవనానికి అవకాశం లభించే పట్టణాలు అవసరం. రక్షణ ఉండాలి. చట్టాలు సరిగ్గా అమలవ్వాలి. సమాజంలోని అన్ని వర్గాలు ఒకరితో ఒకరు కలిసి జీవించే పరిస్థితులు ఉండాలి. ఆధునిక వసతులు ఉండాలి. దీన్నే జీవించడం లో సరళత్వం (ఈజ్ ఆఫ్ లివింగ్) అంటున్నాం. ఇదే మన దేశం కల. దీన్ని సాకారం చేసుకునే దిశగా మనం ముందుకెళ్లాలి.

మిత్రులారా, 

ఈరోజు దేశంలో ఓ కొత్త రకమైన పట్టణీకరణ ను చూస్తున్నాం. ఎప్పుడూ దేశ భౌగోళిక చిత్రపటంలో కనిపించని ప్రాంతాలు కూడా నగరాలుగా వృద్ధి చెందుతున్నాయి. పెద్ద పెద్ద ప్రైవేటు పాఠశాలలకు, ధనవంతుల పిల్లలు చదువుకునే పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లలేని యువకులకు కూడా ఇప్పుడు సరికొత్త విద్యావకాశాలు అందుబాటులోకి వచ్చాయి. విజయం దిశగా అడుగులు వేస్తున్నారు. కొన్నాళ్ల క్రితం.. నగరీకరణ అంటే.. పెద్ద పెద్ద నగరాలను అందంగా రంగులతో తీర్చిదిద్దడమేనన్న భావన ఉండేది. కొన్ని ఎంపిక చేసుకున్న నగరాల్లో ఒకటి రెండు నగరాలను అభివృద్ధి చేసి మొత్తం రాష్ట్రాభివృద్ధిగా చూపించేవారు. కానీ ఇప్పుడు ఈ ఆలోచన, విధానం మారుతోంది. భారతదేశ నగరీకరణ లో బిహార్ ప్రజలు కీలక పాత్రను పోషిస్తున్నారు.

మిత్రులారా,

‘ఆత్మనిర్భర్ బిహార్’, ‘ఆత్మనిర్భర్ భారత్’ మిషన్‌లను మరింత వేగవంతం చేయడం, దేశంలోని చిన్న చిన్న పట్టణాలను భావి అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం అత్యంత అవసరం. ఈ లక్ష్యం తోనే ‘అమృత్ మిషన్’ ద్వారా బిహార్ లోని అనేక పట్టణాల్లో కనీస మౌలిక వసతుల తో పాటు ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ కు, ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ కు అనుకూలంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. ‘అమృత్ మిషన్’ ద్వారా మంచినీటి తో పాటు పారిశుద్ధ్యం,  గ్రీన్ జోన్లు, ఎల్ ఇడి వీధిదీపాలు మొదలైన ఆధునిక వ్యవస్థలను కూడా అందుబాటు లోకి తెస్తాం. ఈ మిషన్ ద్వారా బిహార్ లోని పట్టణాల్లో లక్షల మందికి అవసరమైన పారిశుద్ధ్య అవసరాలను తీర్చేలా కార్యక్రమాలు అమలవుతున్నాయి. వీటితో పాటు వీలైనన్ని ఎక్కువ సౌకర్యాలు కల్పిస్తూ పేదలు ఉండే బస్తీలను అభివృద్ధి చేస్తాం. బిహార్ లోని 100 కు పైగా నగరపాలక సంస్థల్లో 4 లక్షల ఎల్ఇడి వీధి దీపాలను అమర్చడం జరిగింది. దీని ద్వారా మన చిన్న పట్టణాల్లోని వీధులు వెలుగులను విరజిమ్ముతున్నాయి. దీంతోపాటు వేల కోట్ల రూపాయల ఆదా కూడా అవుతోంది. ప్రజా జీవితం లో కూడా సౌలభ్యం పెరిగింది.

మిత్రులారా,

బిహార్ ప్రజలకు, బిహార్ నగరాలకు గంగా నదితో విడదీయలేని సంబంధం ఉంది. రాష్ట్రం లోని 20 పెద్ద, ముఖ్యమైన నగరాలు గంగానది ఒడ్డునే ఉన్నాయి. గంగానది స్వచ్ఛత, గంగానది ప్రభావం నగర ప్రజలపై స్పష్టంగా కనబడుతుంది. అందుకోసం గంగానది స్వచ్ఛతను దృష్టిలో ఉంచుకుని 6 వేల కోట్ల రూపాయలతో 50కి  పైగా ప్రాజెక్టులకు ఆమోదం తెలపడమైంది. గంగానది ఒడ్డున ఉన్న అన్ని నగరాల్లోని మురికి కాలువల నీటిని గంగానదిలో కలవకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం అనేక నీటి శుద్ధి  ప్లాంటులను ఏర్పాటుచేస్తున్నాం. ఇవాళ పట్నాలో బేవూర్, కరమ్-లీచక్ పథకం ప్రారంభమైంది. దీని ద్వారా ఈ ప్రాంతంలోని లక్షల మందికి మేలు జరుగుతుంది. దీంతోపాటు గంగానది ఒడ్డున ఉన్న గ్రామాలను ‘గంగా గ్రామ్’ లుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ గ్రామాల్లో లక్షల కొద్దీ టాయిలెట్ లను నిర్మించిన తరువాత, వ్యర్థాల నిర్వహణ, సేంద్రియ వ్యవసాయం వంటి వృత్తులకు ప్రస్తుతం ప్రోత్సాహకాలను ఇవ్వడం జరుగుతోంది. 

మిత్రులారా,

గంగానది ఒడ్డున ఉన్న గ్రామాలు, పట్టణాలు, నగరాలు ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా ఉన్నాయి. ఇందుకోసం గంగానది ని ప్రక్షాళన చేసే కార్యక్రమంలో భాగంగా తీసుకుంటున్న చర్యలు కొనసాగుతున్న కొద్దీ.. ఆధునిక వసతులతో పర్యాటక కేంద్రాలను అనుసంధానం చేస్తున్నాం. ‘నమామి గంగే మిషన్’ ద్వారా దేశంలో 180 కి పైగా ఘాట్ల నిర్మాణం జరుగుతోంది. ఇందులో 130 ఘాట్లు పూర్తవ్వగా.. మిగిలిన వాటిలో పని దాదాపు పూర్తికావొచ్చింది. దేశవ్యాప్తంగా గంగానది ప్రవహించే ప్రాంతాల్లో రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పేరుతో ఆధునీకరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. పట్నా రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ పూర్తయింది కూడా. ముజప్ఫర్ పుర్ లోనూ అలాంటి రివర్ ఫ్రంట్ ను నిర్మించేందుకు పునాదిరాయిని వేయడమైంది. ముజప్ఫర్ పుర్ లోని అఖాడా ఘాట్, సీధీ ఘాట్, చంద్‌వారా ఘాట్ లను అభివృద్ధి చేస్తే అవి ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా మారతాయి. బిహార్ లో శరవేగంగా జరుగుతున్న పనులను చూస్తూంటే.. దశాబ్దంన్నర క్రితం ఉన్న బిహా ర్‌కు, ప్రస్తుత బిహార్‌ కు అసలు పొంతనే లేదనిపిస్తోంది. దశాబ్దంన్నర కు ముందు బిహార్ ను ఇలా కూడా అభివృద్ధి చేయవచ్చనే ఆలోచన అయినా ఉండేది కాదు. కానీ నీతీశ్ గారి ప్రయత్నం, కేంద్ర ప్రభుత్వ సహకారం దీన్ని నిజం చేసి చూపించాయి. ఈ ప్రయత్నాలు బిహార్ ప్రజలు, మరీ ముఖ్యంగా బిహారీ మహిళలు పడుతున్న కష్టాలను రాబోయే మంగళప్రదమైన ఛటీ మాత పూజ కాలం నాటికి తగ్గించే విధంగా తోడ్పడతాయని నేను ఆశిస్తున్నాను. బిహార్ లోని పట్టణాలను, గ్రామాలను కలుషిత నీటి బారి నుంచి కాపాడేందుకు- ఛటీ మాత శీర్వాదాలతో- మేం చిత్తశుద్ధితో పనిచేయడాన్ని కొనసాగిస్తాం.

మిత్రులారా, 

ప్రభుత్వం ఇటీవల ‘ప్రాజెక్ట్ డాల్ఫిన్’ ను గురించి ఒక ప్రకటన చేసిన సంగతి ని మీరు వినే ఉంటారు. ఈ మిషన్ లో గంగా నదిలోని డాల్ఫిన్ లకు కూడా చాలా మేలు జరుగుతుంది. గంగానది ని కాపాడుకోవడంలో భాగంగా గంగేయ డాల్ఫిన్ ను సంరక్షించుకోవాల్సిన అవసరముంది. పట్నా నుంచి భాగల్ పుర్ వరకు గంగానది లో డాల్ఫిన్ లు మనుగడ సాగిస్తున్నాయి. అందుకే ‘ప్రాజెక్ట్ డాల్ఫిన్’ ద్వారా బిహార్ కే ఎక్కువ లబ్ధి చేకూరనుంది. ఇక్కడ పర్యాటకానికి తోడు జీవవైవిధ్యాని
కి కూడా ప్రోత్సాహం లభించగలదు.

మిత్రులారా, 

కరోనా మహమ్మారి విసురుతున్న సవాల్ నేపథ్యంలోనూ బిహార్ లో అభివృద్ధి, సుపరిపాలన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయి; ఇక ముందు కూడా కొనసాగుతాయి. సర్వశక్తులను ఒడ్డి ముందుకు వెళ్లేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. అయితే అదే సమయం లో, సంక్రమణ ను నివారించాలన్న సంకల్పాన్ని బిహార్ లో ప్రతి ఒక్క పౌరునితో పాటు దేశం లో ప్రతి ఒక్క పౌరుడు విస్మరించకూడద్దు. మాస్కులు, పరిశుభ్రత, సురక్షిత దూరాన్ని పాటించడం అనేవి మనల్ని మనం కాపాడుకోవడానికి పనికొచ్చే ముఖ్యమైన అస్త్రాలు. టీకామందు లను తీసుకురావడం కోసం  మన శాస్త్రవేత్తలు రేయింబగళ్లు కృషి చేస్తున్నారు, అయితే  ఒక మందు వచ్చేంత వరకు ఎలాంటి అలసత్వం తగదన్న సంగతి ని మనం తప్పక గుర్తుంచుకోవాలి.

ఈ మనవి తో, మరోసారి, ఈ అభివృద్ధి కార్యక్రమాల నేపథ్యం లో మీకందరికీ హృద‌యపూర్వక అభినందనలను తెలియజేస్తున్నాను.

మీకు ఇవే ధన్యవాదాలు.

***



(Release ID: 1655049) Visitor Counter : 203