ప్రధాన మంత్రి కార్యాలయం
రాజ్య సభ ఉపాధ్యక్షుడు శ్రీ హరివంశ్ నారయణ్ సింగ్ ఎన్నిక కావడం పైప్రధాన మంత్రి ప్రతిస్పందన
Posted On:
15 SEP 2020 9:09AM by PIB Hyderabad
శ్రీ హరివంశ్ గారు ఈ సభ కు ఉపాధ్యక్షుని గా రెండోసారి ఎన్నికైనందుకు యావత్తు సభ తరఫున, దేశ ప్రజలందరి తరఫున ఆయన కు అభినందనలు తెలియజేస్తున్నాను అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు..
సామాజిక సేవ, పత్రికా రచన లలో హరివంశ్ గారికి ఉన్న చిత్తశుద్ధి ని నేను హృదయపూర్వకంగా ఎంతగానో గౌరవిస్తున్నాను. ఆయన తో బాగా సన్నిహిత పరిచయం ఉన్న వారికి కూడా ఆయన అంటే నాకు ఉన్న గౌరవం, అభిమానం ఉంటాయని, అలాగే ఈ సభ లో ప్రతి సభ్యుని కి, ప్రతి సభ్యురాలి కి కూడా ఇదే భావనలు ఉంటాయని ప్రధాన మంత్రి అన్నారు. ఈ గౌరవాదరణల ను హరివంశ్ గారు స్వయంగా సంపాదించుకున్నారు. ఆయన పని చేసే విధానం బట్టి, సభా కార్యకలాపాల ను ఆయన నిర్వహించే తీరును బట్టి చూసినప్పుడు ఇది స్వభావికమే. సభ లో వీరు పోషించిన నిష్పక్షపాత భూమిక ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తోందని ఆయన అన్నారు.
చైర్‌మన్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ రాజ్య సభ సభ్యులు ఇక సభ కార్యకలాపాలను సాఫీగా నిర్వహించడం లో డిప్యూటీ చైర్‌మన్ కు సహాయాన్ని అందిస్తారని చెప్పారు. హరివంశ్ గారు ప్రతిపక్షం తో సహా, ప్రతి ఒక్కరికీ సంబంధించిన వారని, ఆయన ఏ పార్టీకి ఎలాంటి వివక్షను ప్రదర్శించలేదని ప్రధాన మంత్రి అన్నారు. పార్లమెంటు సభ్యులను నియమావళికి అనుగుణంగా నడుచుకొనేటట్లు చూడటం అనేది చాలా సవాళ్ళతో కూడుకున్న పని అని, అయితే హరివంశ్ గారు ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని సంపాదించుకొన్నారని ఆయన చెప్పారు.
హరివంశ్ గారు బిల్లులకు ఆమోద ముద్ర ను పొందడం కోసం గంటల తరబడి అదే పనిగా సభలో కూర్చున్నారని, ఆయన విజయానికి ఈ రెండేళ్ళ కాలం సాక్షిగా నిలిచిందని ప్రధాన మంత్రి అన్నారు. దేశ గతిని, భవిష్యత్తును మార్చివేసిన అనేక చరిత్రాత్మకమైన బిల్లులు ఈ సభ ఆమోదాన్ని పొందాయన్నారు. పదేళ్ళ కాలంలో అత్యధిక బిల్లులను ఆమోదించి, అది కూడా లోక్ సభ ఎన్నికలు అయిన ఒక సంవత్సర కాలం లోపలే ఈ పనిని చేసి రికార్డు ను సృష్టించినందుకు సభను ఆయన ప్రశంసించారు. సభ ఫలప్రదంగా పని చేయడంతో పాటు, సభ లో సానుకూల వాతావరణం కూడా పెరిగిందని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ వారి అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయగలిగారన్నారు.
హరివంశ్ గారు నిరాడంబరంగా ఉంటారని, ఆయన జీవితాన్ని ఎంతో నమ్రతతో ఆరంభించారని ప్రధాన మంత్రి అన్నారు. హరివంశ్ గారికి మొట్టమొదటిసారిగా ప్రభుత్వ ఉపకార వేతనం లభించినప్పుడు ఆయన స్కాలర్‌షిప్ సొమ్మును ఇంటికి తీసుకువెళ్ళేందుకు బదులుగా, పుస్తకాలను కొన్నారన్నారు. పుస్తకాలతో హరివంశ్ గారికి గొప్ప అనుబంధం ఉందని ఆయన అన్నారు. శ్రీ జయప్రకాశ్ నారాయణ్ వల్ల శ్రీ హరివంశ్ ఎంతగానో ప్రభావితులు అయ్యారని ప్రధాన మంత్రి అన్నారు. సామాజిక అంశాలపై సుమారు నాలుగు దశాబ్దాలపాటు కృషి చేసిన హరివంశ్ గారు 2014 లో పార్లమెంటులో అడుగుపెట్టారని ప్రధాన మంత్రి అన్నారు.
హరివంశ్ గారు వినమ్రతకు, వినయానికి పేరెన్నికగన్నారని ప్రధాన మంత్రి అన్నారు.
హరివంశ్ గారు రాజ్య సభ లో అనేక కమిటీల కు అధ్యక్షత వహించి, వాటి పనితీరును మెరుగు పరిచారని ప్రధాన మంత్రి అన్నారు. పార్లమెంటు సభ్యుడు అయిన తరువాత హరివంశ్ గారు ఎంపీ లంతా మరింతగా నైతికతకు కట్టుబడి ఉండేటట్లు తన వంతుగా గొప్ప ప్రయత్నం చేశారని ప్రధాన మంత్రి అన్నారు. పార్లమెంటు పనులు, తన బాధ్యతలు చూసుకొంటూనే, హరివంశ్ గారు మేధావిగా, ఆలోచనాపరునిగా, కూడా పేరు తెచ్చుకొన్నారని చెప్పారు.
ప్రధాన మంత్రి హరివంశ్ గారికి తన శుభాకాంక్షలను తెలియజేశారు. సభ 250 సార్లకు పైగా సమావేశం కావడమే భారత ప్రజాస్వామ్య పరిణతికి ఒక రుజువు అని ప్రధాన మంత్రి అన్నారు.
***
(Release ID: 1654430)
Visitor Counter : 125
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam