ఉప రాష్ట్రపతి సచివాలయం
కనీవినీ ఎరుగని ముందుజాగ్రత్తల మధ్య పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం
అర్థవంతమైన చర్చలు, ఏకాభిప్రాయంతో చట్టాలు జరగాలని కోరిన రాజ్యసభ చైర్మన్ శ్రీ ఎం వెంకయ్యనాయుడు
సభ సాఫీగా జరిగేందుకు దోహదపడాలని సభ్యులకు చైర్మన్ వినతి
కోవిడ్-19 మహమ్మారిని నియంత్రించటానికి మార్గదర్శనం చేయాలని సభ్యులకు విజ్ఞప్తి
కోవిడ్ మీద పోరులో యోధులకు, రికార్డు స్థాయిలో ధాన్యం పండించిన రైతులకు శ్రీనాయుడు అభినందనలు
రాజ్యసభ 50 గంటలకు పైగా కోవిడ్ మీద చర్చిందన్న రాజ్యసభ చైర్త్మన్
ఫలవంతమైన చర్చలతో గడిచిన మూడు సెషన్లు సరికొత్త ధోరణి చాటాయి: చైర్మన్
కొత్తగా/మళ్ళీ ఎన్నికైన సభ్యుల ప్రమాణం/ధ్రువీకరణ
నాడు పోస్టు చేయడమైనది:
14 SEP 2020 6:02PM by PIB Hyderabad
కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ముందెన్నడూ లేనంత కట్టుదిట్టమైన సురక్షిత చర్యలమధ్య ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలయ్యాయి. అర్థవంతమైన చర్చల ద్వారా సభాసమయాన్ని సద్వినియోగం చేయాలని, ఏకాభిప్రాయంతో చట్టాలు చేయాలని రాజ్యసభ చైర్మన్ శ్రీ వెంకయ్యనాయుడు సభ్యులకు విజ్ఞప్తి చేశారు.
భారత చరిత్రలోనే మొట్టమొదటి సారిగా అటు రాజ్య సభ, ఇటు లోక్ సభ ప్రాంగణాలు వేరు వేరు సమయాల్లో నడపటం ద్వారా సభ్యులు పూర్తిగా భౌతిక దూరం నియమాలు పాటించటానికి వీలు కుదిరింది. దీనివలన రాజ్యసభ ఇప్పుడు తన చాంబర్, గ్యాలరీలతో బాటు లోక్ సభ చాంబర్ ను కూడా వాడుకోగలిగింది.
సభ ముందు చెప్పుకోదగినంత పెద్ద ఎజెండా ఉందని, సభా కార్యకలాపాలు సాఫీగా సాగటానికి సభ్యులు సహకరించాలని శ్రీ వెంకయ్యనాయుడు తన ప్రారంభోపన్యాసంలో విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మారి మీద, ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం మీద, సామాజిక జీవనం మళ్ళీ గాడిలో పడే విషయంలో అమూల్యమైన సూచనలతో మార్గదర్శనం చేస్తామని సభ్యులమీద ప్రజలకు ఎంతో నమ్మకముందన్నారు.
సభాసమయం 18 సమావేశాలకే పరిమితం కావటాన్ని ప్రస్తావిస్తూ, ఈ కొద్దిపాటి సమయంలోనే కీలకమైన చట్టాలమీద, కోవిడ్ మహమ్మారి సహా దేశానికి ముఖ్యమైన అంశాల మీద అర్థవంతమైన చర్చలు జరపటం మీద దృష్టి సారించాల్సి ఉందన్నారు.
175 రోజుల విరామం తరువాత సభ్యులను కలుకోవటం సంతోషంగా ఉందని చెబుతూ, వందేళ్ళకిందట దాడిచేసిన స్పానిష్ ఫ్లూ తరువాత మానవాళిమీద దాడిచేసిన అతిపెద్ద మహమ్మారిగా కోవిడ్-19 ను అభివర్ణించారు. జనాభాలో రెండో అతిపెద్ద దేశమైనా భారత్ లో కోవిడ్ వలన జరిగిన నష్టాన్ని వ్యాప్తి పరంగాను, మరణాల సంఖ్య పరంగాను కనీస స్థాయికే పరిమితం చేయగలిగామన్నారు.
కోవిడ్-19 సరికొత్త పరిస్థితిని నిర్వచించిందని చెబుతూ, భారత్ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసిందన్నారు. డాక్టర్లు, నర్సులు, పోలీసులు, పారామిలిటరీ దళాలు, పారిశుద్ధ్యసిబ్బంది, మీడియా సిబ్బంది, అత్యవసర సేవలందించినవారితో సహా కోవిడ్ యోధులందరి సేవలనూ ఆయన ప్రశంసించారు. లాక్ డౌన్ నిబంధనలు ఉన్నప్పటికీ రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి సాధించిన రైతులను కూడా ఆయన అభినందించారు. వాక్సిన్ కోసం శాస్త్ర వేత్తలు చేస్తున్న కృషికి త్వరలోనే ఫలితం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
రవాణా ఆంక్షల సడలింపు అనంతరం వివిధ విభాగాల స్థాయీ సంఘాలు పనిచేయటం ప్రారంభించాయని చెబుతూ, సమావేశాల మధ్య విరామంలో వారు మహమ్మారికి సంబంధించిన అనేక కోణాలను, దాని ప్రభావాన్ని పరిశీలించారన్నారు. అలాంటి ఏడు రాజ్యసభ కమిటీలు ఈ ఏడాది జులై నుంచి 26 సమావేశాలు జరిపాయని, వివిధ అంశాలమీద 56 గంటల 40 నిమిషాలపాటు చర్చించగా అందులో 50 గంటలకు పైగా కోవిడ్ మహమ్మారి మీద, దాని ప్రభావం మీద, అడ్డుకోవటం మీదనే సాగాయన్నారు.
రాజ్యసభ ఏర్పాటైన నాటినుంచీ ఇప్పటివరకూ దాని పనితీరుమీద సవివరమైన పరిశోధన జరపాలని రాజ్యసభ సెక్రెటేరియట్ ను ఆదేశించామని చెప్పారు. రాజ్యసభ చైర్మన్ గా శ్రీ వెంకయ్యనాయుడు గత నెలలో మూడేళ్ళు పూర్తిచేసుకున్నారు. 1978 నుంచి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు గడిచిన పాతికేళ్ళుగా ఉత్పాదకత తగ్గుతూ వస్తోందన్నారు. అయితే, గడిచిన ఐదేళ్ళలో మూడు వరుస సమావేశాల ఉత్పాదకత 94.60% గా నమోదు కావటం సంతృప్తినిస్తోందన్నారు. "ఈ సరికొత్త పరిస్థితి ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నాను" అన్నారు.
రాజ్యసభ విభాగాల స్థాయీ సంఘాల హాజరు సెప్టెంబర్ 2019 - మార్చి 2020 మధ్య కాలంలో మొదటిసారిగా 50% దాటుతూ 50.73% నమోదైందని చైర్మన్ వ్యాఖ్యానించారు. 2017-18లో అది 44.87% గా నమోదైంది.
అసాధారణ సమయాల్లో అసాధారణ చర్యలు అనివార్యమని అభిప్రాయపడుతూ ఓర్పు, క్రమశిక్షణ, పట్టుదల ద్వారా ఈ కష్టకాలంనుంచి గట్టెక్కగలమని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాజ్యసభ సాయంత్రం 3.00 గంటలకు తన కార్యకలాపాలు ప్రారంభించగా ముందుగా 15 మంది కొత్తగా/మళ్ళీ ఎన్నికైన సభ్యుల ప్రమాణం/ధ్రువీకరణ జరిగాయి.
దశలవారీ పునః ప్రారంభం (అన్ లాక్ 4) మీద 2020 ఆగస్టు 29 నాటి హోం మంత్రిత్వశాఖ మార్గదర్శకాలను ఉటంకిస్తూ కొంతమంది సభ్యులుమొత్తం వర్షాకాల సమావేశాల హాజరు నుంచి మినహాయింపు కోరారు. సభ ఆమోదంతో వారందరినీ గైర్హాజరుకు అనుమతించారు.
హిందీ దివస్ జరుపుకుంటున్న సందర్భాన్ని ప్రస్తావిస్తూ, అన్ని భాషలకూ సమాన ప్రాధాన్యం ఉందని చైర్మన్ అన్నారు. హిందీతో బాటు అన్ని భాషలూ నేర్చుకుంటూ వాటిని ప్రోత్సహించటానికి అందరూ కృషి చేయాలన్నారు.
రాజ్యసభ 14వ డిప్యూటీ చైర్మన్ గా శ్రీ హరివంశ్ ను రాజ్యసభ ఎన్నుకుంది. కొత్తగా ఎన్నికైన డిప్యూటీ చైర్మన్ కు చైర్మన్ తన అభినందనలు తెలియజేశారు.
****
(రిలీజ్ ఐడి: 1654394)
సందర్శకుల సూచీ సంఖ్య : : 169