ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

చికిత్సా విధానాల పాటింపుపై ప్రైవేట్ ఆస్పత్రులతో ఆరోగ్య మంత్రిత్వశాఖ వర్చువల్ సమావేశం


రోగులను చేర్చుకోవటం నిరంతరం సాగాలని ఆదేశం

Posted On: 12 SEP 2020 4:49PM by PIB Hyderabad

భారత వాణిజ్య, పరిశ్రమల మండలుల సమాఖ్య (ఫిక్కీ), అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) తో కలిసి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఈ రోజు కోవిడ్ చికిత్సమీద ప్రైవేట్ ఆస్పత్రులతో ఒక వర్చువల్ సమావేశం నిర్వహించింది. కోవిడ్ బాధితులలో నివారించగల మరణాలను తగ్గించటంలో ప్రైవేట్ ఆస్పత్రులు ఉత్తమ విధానాల ఆచరణ గురించి చర్చించటానికి ఈ వేదిక ఉపయోగపడింది. 

 దేశ వైద్య రంగానికి ముందెన్నడూ ఎరుగని విధంగా కోవిడ్-19 సవాలు విసరగా, దీనిని సమర్థంగా ఎదుర్కోవటానికి ప్రభుత్వంతోబాటు ప్రైవేటు పరిశ్రమ కూడా రంగంలో దిగింది. ఇందులో భాగంగా ఉపయోగిమ్చిన మెరుగైన విధానాలను పరస్పరం పంచుకునేందుకు ఏర్పాటు చేసిన ఈ సదస్సులో  దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు తమ అనుభవాలను వెల్లడించాయి. మంత్రిత్వశాఖ కూడా ఆస్పత్రుల ప్రతినిధులు కోవిడ్ చికిత్స సందర్భంగా తమ ఆస్పత్రులలో ఎదుర్కున్న  కీలకమైన అంశాలను, ఎదురైన సమస్యలను, సవాళ్ళను వెల్లడించేలా ప్రోత్సహించింది.

 ఈ వర్చువల్ సమావేశాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కార్యదర్శి ప్రారంభించారు. ఏ కోవిడ్ బాధితునికీ పడక ఇవ్వటాన్ని నిరాకరించకూడదని, సకాలంలో తగిన చికిత్స అందించాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉందన్న విషయాన్ని మరోమారు ఈ సమావేశంలో ఆయన స్పష్జ్తం చేశారు. ఈ ఉమ్మడి లక్ష్యం ద్వారా ప్రతి ఒక్కరికీ అందుబాటు ధరలో వైద్యం అందించాలని ప్రభుత్వం భావిస్తున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కలసి కేంద్ర ప్రభుత్వం కోవిడ్ మరణాలను 1% లోపుకు తగ్గించటమే ధ్యేయంగా పెట్టుకున్న విషయాన్ని కూడా గుర్తు చేశారు.

 న్యూ ఢిల్లీలోని అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్), సెంటర్స్ ఆఫ్ ఎక్సెలెన్స్,  ఆధ్వర్యంలో నిర్వహించిన టెలి-కన్సల్టేషన్ సెషన్స్ ద్వారా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని ఐసియు డాక్టర్ల సామర్థ్యం పెంచటం కూడా ఉత్తమ ఆచరణ విధానాల చర్చలో భాగమయ్యాయి. దీనికి తోడుగా వ్యాధి నివారణకు, నియంత్రణకు, తొలిదశలోనే గుర్తించటానికి లాంటి చర్యల వలన పెద్ద సంఖ్యలో కోవిడ్ బారినుంచి కోలుకొని బైటపడటానికి వీలైందని, మరణాల సంఖ్య వేగంగా తగ్గుతూ వచ్చిందని ఈ సమావేశం చర్చించింది.

దీర్ఘకాల వ్యాధులతోబాధపడేవారిని, వృద్ధులను సకాలంలో గుర్తించి చికిత్స అందించటం ద్వారా మరణాల సంఖ్యను బాగా తగ్గించగలిగినట్టు ఈ సమావేశం అభిప్రాయపడింది. ఇన్ఫెక్షన్ నిరోధానికి, నియంత్రణకు పాటించాల్సిన విధానాలను అనుసరిస్తూ ఆరోగ్య రంగ సిబ్బందిని కాపాడుకునేలా ఆస్పత్రులను ప్రోత్సహించిన విధానాన్ని సమీక్షించారు. సిబ్బందిని ఎప్పటికప్పుడు ప్రేరణ పొందేలా ఉత్సాహపరచటం కూడా అందులొ భాగమని గుర్తుచేశారు. అదే విధంగా ఆస్పత్రులు నిరాటంకంగా కోవిడ్ బాధితులను చేర్చుకోవాలని సూచించారు. ఇంతకుముందు గడించిన అనుభవం ఆధారంగా వైవిధ్య భరితమైన చికిత్స అందించటంలో ఉన్న ప్రాధాన్యాన్ని కూడా గుర్తుచేశారు.

ప్రైవేట్ ఆస్పత్రులకు చెందిన సీనియర్ డాక్టర్లు కోవిడ్ మీద పోరులో భాగంగా ఎదురైన తమ అనుభవాలను, ఎదుర్కున్న సవాళ్లను ఈ సమావేశంలో పంచుకున్నారు. అనేక అత్యుత్తమ చికిత్సావిధానాల గురించి కూడా తెలియజేశారు. కీలకమైన అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సందర్భానికి అనుగుణంగా టెక్నాలజీను వాడుకుంటూ మధ్య తరహా,  చిన్న పట్టణాలలోని ఆస్పత్రి సిబ్బందికి సూచనలిస్తూ సాగిన తీరును వివరించారు. బాధితులను చిన్న కేంద్రాలనుంచి పెద్ద ఆస్పత్రులకు తరలించటంలో జరిగిన జాప్యాన్ని, చాలామందికి ఆరోగ్య బీమాలేకపోవటం వలన ఆర్థికంగా ఎదురైన వత్తిడి తదితర అంశాలను సమావేశం చర్చించింది. ఈ సదస్సుకు  దేసవ్యాప్తంగా ఉన్న 150కి పైగా ఆస్పత్రుల ప్రతినిధులు, సీనియర్ డాక్టర్లు హాజరయ్యారు.

ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ బలరామ్ భార్గవ, ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ గులేరియా, ఆరోగ్యమ్ కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రెటరీ శ్రీ లవ్ అగర్వాల్, ఫిక్కీ అధ్యక్షురాలు, అపోలో ఆస్పత్రుల జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్తర్ సంగీతా రెడ్డి, ఫిక్కీ హెల్త్ సర్వీసెస్ కమిటీ చైర్ పర్సన్, మెడికా గ్రూప్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ అలోక్ రాయ్ తదితరులు పాల్గొన్నారు.

 

***



(Release ID: 1653648) Visitor Counter : 207