ప్రధాన మంత్రి కార్యాలయం
నూతన జాతీయ విద్యావిధానం-2020 లో భాగంగా ‘21వ శతాబ్దంలో పాఠశాల విద్య’ అంశంపై ఏర్పాటుచేసిన సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
Posted On:
11 SEP 2020 3:30PM by PIB Hyderabad
అందరికీ నమస్కారం,
కేంద్ర మంత్రిమండలిలో నా సహచరుడు, కేంద్ర విద్యామంత్రి శ్రీ రమేశ్ పోఖ్రియాల్ నిశంక్ గారు, విద్యాశాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ ధౌత్రే గారు, విద్యావిధానం ముసాయిదా కమిటీ అధ్యక్షుడు డాక్టర్ కస్తూరి రంగన్ గారు, కమిటీలోని గౌరవ సహచర సభ్యులు, ఈ సదస్సులో పాల్గొంటున్న వివిధ రాష్ట్రాలకు చెందిన మేధావులు, అధ్యాపకులు, సోదర, సోదరీమణులారా.. ఈరోజు మనమంతా.. భారతదేశ భవ్యమైన భవిష్యత్తుకు పునాది వేసే ఓ చరిత్రాత్మక క్షణంలో భాగస్వాములయ్యాం. నూతన యుగానికి పునాదివేసిన అద్భుతమైన క్షణమిది. 21వ శతాబ్దంలో భారతదేశానికి సరికొత్త దిశానిర్దేశం చేసేదే మన నూతన జాతీయ విద్యావిధానం.
మిత్రులారా,
గత మూడు దశాబ్దాల్లో భారతదేశంలోని దాదాపు ప్రతి రంగంలో విస్తృతమైన మార్పులు వచ్చాయి. ప్రతి వ్యవస్థ పూర్తిగా మారిపోయింది. ఈ మూడు దశాబ్దాల్లో మన జీవితాల్లో కూడా ఏదీ గతంలో లాగా లేదు. అన్నీ మారినా మన సమాజానికి భవిష్యత్ మార్గదర్శన చేసే విద్యావిధానం మాత్రం ఇంకా పాతగానే ఉండిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మన తరగతి గదిలోని పాడయిన బ్లాక్ బోర్డ్ ను మార్చడం ఎంత అవసరమో.. మన విద్యావిధానాన్ని మార్చడం కూడా మార్చాల్సిన ఆవశ్యకత ఉంది. పాఠశాలల్లో ఉండే పిన్-అప్ బోర్డులో విద్యార్థుల మార్కులకు సంబంధించిన వివరాలు, వారు వేసిన చిత్రాలు, విద్యార్థులకు చెప్పాల్సిన ముఖ్యమైన ఆదేశాలు మొదలైన వివరాలు పిన్ చేస్తారు. అది నిండిపోయిన తర్వాత అవన్నీ తీసేసి.. కొత్త వివరాలను పిన్ చేయాల్సి వస్తుంది. నూతన జాతీయ విద్యావిధానం కూడా అలాంటిదే.
నూతన జాతీయ విద్యావిధానం కూడా భారతదేశ సరికొత్త ఆశలు, ఆకాంక్షలు, అవకాశాలను సుసంపన్నం చేసుకునేందుకు ఓ చక్కటి వేదిక. దీన్ని రూపొందించడం వెనక.. ప్రతి ప్రాంతం, ప్రతి రంగం, ప్రతి భాషకు చెందిన నిపుణులు, మేధావుల నాలుగైదేళ్లుగా పగలు, రాత్రి తేడాలేకుండా చేసిన కఠోరమైన శ్రమ దాగి ఉంది. అయినా ఈ పని ఇంకా పూర్తవలేదు. అసలు పని ఇప్పుడే మొదలైంది. అదే మన నూతన జాతీయ విద్యావిధానాన్ని ప్రభావవంతంగా అమలుచేయడం. ఈ పని మనమంతా కలిసి చేయాల్సి ఉంటుంది. ఈ విద్యావిధానాన్ని ప్రకటించిన. తర్వాత మీలో చాలా మందిలో.. ఈ విద్యావిధానం అంటే ఏంటి? గతంలో ఉన్నదానితో పోలిస్తే దీనికున్న తేడా ఏంటి? పాఠశాలు, కళాశాలల వ్యవస్థలో ఏమేం మార్పులు వస్తాయి? ఇందులో అధ్యాపకుల కోసం ఏముంది? విద్యార్థుల కోసం ఏముంది? అన్నింటికంటే ముఖ్యంగా.. దీన్ని విజయవంతంగా అమలుచేయడానికి మనమేం చేయాలి? వంటి చాలా ప్రశ్నలు తలెత్తాయని నాకు తెలుసు. ఇవన్నీ సహేతుకమైనవి. వీటి గురించి ఆలోచించడం కూడా తప్పనిసరి. అందుకే మనమంతా ఇవాళ ఇక్కడ సమావేశమయ్యాం.. భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై చర్చించుకుంటాం. నిన్న మీ మధ్య గంటల తరబడి వివిధ అంశాలపై మేధోమధనం జరిగిందని నాకు చెప్పారు.
టీచర్లు వారి అంచనాల ప్రకారం బోధనా సామాగ్రిని సిద్ధం చేసుకోవడం. విద్యార్థులు మీ బొమ్మల మ్యూజియంను తయారు చేసుకోవడం.. తల్లిదండ్రులతో అనుసంధానానికి పాఠశాలల్లో సామాజిక గ్రంథాలయం అవసరం.. చిత్రాలతోపాటు బహుభాషా నిఘంటువు అందుబాటులో ఉంచాల్సిన ఆవశ్యకత.. పాఠశాలలోనే వంటగది, ఉద్యానవనం ఉండటం వంటి ఎన్నో అంశాలపై మీ మధ్య చర్చ జరిగింది. దీనికి సంబంధించి భిన్నమైన ఆలోచనలు వచ్చాయి. చాలా మంచి మార్పు ఇది. ఈ విద్యావిధానాన్ని అమలుచేసేందుకు ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు ఉత్సాహంగా పలుపంచుకుంటుండం అన్నింటికంటే ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తోంది.
నూతన విద్యావిధానాన్ని అమలుచేసేందుకు కొన్నిరోజుల క్రితం కేంద్ర విద్యాశాఖ.. దేశవ్యాప్తంగా ఉన్న టీచర్లను.. మైగవ్ పోర్టల్ ద్వారా సలహాలు, సూచలను ఇవ్వాలని కోరింది. ఒక వారంలోపే.. 15లక్షలకు పైగా సూచలను అందాయి. ఆ సూచలను.. జాతీయ విద్యావిధానాన్ని మరింత ప్రభావవంతంగా మార్చేందుకు దోహదపడతాయి. ఈ విషయంలో మరింత పకడ్బందీగా ముందుకు వెళ్లేందుకు కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
మిత్రులారా,
ఏ దేశాభివృద్ధిలోనైనా ఆ దేశ యువతరం, యువశక్తి పోషించే పాత్ర అత్యంత కీలకం. కానీ ఆ యువశక్తి నిర్మాణం బాల్యంనుంచే ప్రారంభం అవుతుంది. వారి బాల్యంలో నేర్పించేది, నేర్చుకునేదే వారి భవిష్యత్ జీవనం ఎలా ఉండాలనేది నిర్ణయిస్తుంది. చిన్నారులకు చెప్పే చదువు, వారి చుట్టూ ఉండే వాతావరణం ఆధారంగానే.. భవిష్యత్తులో ఓ వ్యక్తిగా ఎలా ఉంటాడు? ఆయన వ్యక్తిత్వం ఎలా ఉంటుందనేది నిర్ధారితం అవుతుంది. అందుకే నూతన జాతీయ విద్యావిధానంలో అలాంటి పరిపూర్ణమైన వ్యక్తిత్వాన్ని నిర్మించేందుకు అనువైన చదువును నేర్పించడంపైనే.. దృష్టి కేంద్రీకరించడం జరిగింది. పూర్వ-ప్రాథమిక పాఠశాలలో.. చిన్నారి తొలిసారి తన తల్లిదండ్రుల వద్ద ప్రేమగా పెరిగిన తర్వాత మొదటిసారి బయటకు రావడం మొదలవుతుంది. చిన్నారి తన భావనలను, తనలో ఉన్న నైపుణ్యాన్ని అంతకుముందుకంటే బాగా అర్థం చేసుకునేందుకు అదే అత్యంత అనువైన సమయం. అందుకోసం చిన్నారులకు – సరదాగా, ఆడుతూ పాడుతూ అభ్యసించడం, ఓ పని చేస్తూ దాని ద్వారా నేర్చుకోవడం, ఆవిష్కరణాభ్యాసం వంటివాటిని నేర్పించే చక్కటి వాతావరణాన్ని నిర్మించేటటువంటి పాఠశాలల అవసరముంది.
కరోనా సమయంలో ఇదంతా ఎలా సాధ్యమని మీరు ఆలోచిస్తున్న సంగతి నాకు అర్థమైంది. ఇది ఆలోచించడం కంటే అమల్లో పెట్టడంపై ఆదారపడి ఉంటుంది. అటు కరోనాతో నెలకొన్న పరిస్థితి ఎప్పటికీ ఇలాగే ఉండదు. పిల్లలు ఒక్కో తరగతి పెరుగుతున్న కొద్దీ వారిలో కొత్త విషయాలు తెలుసుకోవాలన్న భావన పెరగాలి. వారి మనసు, ఆలోచన వైజ్ఞానిక, తార్కిక పద్ధతిలో ఆలోచించడం ప్రారంభమవ్వాలి. వారి ఆలోచన గణితశాస్త్రంలో.. అమలులో విజ్ఞానశాస్త్రం కనిపించేంత పరిపక్వత రావాలి. ఇది అత్యంత ఆవశ్యకం. వారి ఆలోచనలో గణితశాస్త్రం ఉండాలంటే.. కేవలం గణితం విషయంలోని సమస్యలను పరిష్కరించడమే కాదు.. ఇది ఒకరమైన ఆలోచనా పద్ధతి. ఇలాంటి ఆలోచన పద్ధతులను విద్యార్థులకు నేర్పించాలి. ప్రతి అంశాన్ని.. గణిత, తార్కికరూపంలో అర్థం చేసుకునో దృష్టికోణమది. అలాంటప్పుడు ఒక అంశాన్ని మన మెదడు వేర్వేరు కోణాల్లో విశ్లేషించుకునేందుకు వీలుంటుంది. మనస్సు, మెదడు మధ్య సమన్వయం కోసం ఈ దృష్టికోణాన్ని అలవర్చుకోవడం మంచిది. అందుకోసమే నూతన జాతీయ విద్యవిధానం.. వివిధ దృష్టికోణాలపై ఎక్కువ దృష్టిపెట్టింది. మనలో కొంతమంది ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు ఇలాంటివి మన పాఠశాలలో ముందునుంచే అమలుచేస్తున్నామే అనే ప్రశ్న ఉత్పన్నమవ్వొచ్చు. కానీ చాలా పాఠశాలల్లో ఇలాంటివేవీ ఉండవు. అందుకే అందరికీ సమానత్వం అందాలనే ఈ ప్రయత్నం. అది చాలా అవసరం. నేను ఇవాళ మీతో ఇంత విస్తారంగా, ప్రతి చిన్న అంశాన్ని ప్రస్తావించేందుకు ప్రయత్నించేందుకు ఇది కూడా ఓ కారణం.
మిత్రులారా,
నూతన విద్యావిధానంలో మొన్నటివరకున్న 10+2 విధానానికి బదులుగా 5+3+3+4 వ్యవస్థను తీసుకురావడం చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. ఇందులో భాగంగా ప్రారంభ బాల్య సంరక్షణతోపాటు విద్యకు పునాదులను వేయడానికి బాగుంటుంది. మనం గమనిస్తే.. పట్టణాలు, నగరాల్లో ప్రయివేటు పాఠశాల్లోనే ప్లే-స్కూల్ రూపంలో విద్య అందుతోంది. కానీ ఇప్పుడు ఈ విధానం గ్రామాలకు చేరుతుంది.. పేద, ధనిక అంతరాల్లేకుండా ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వస్తుంది. ప్రాథమిక విద్యపై దృష్టిపెట్టడం ఈ విధానం యొక్క ప్రధాన లక్ష్యం. నూతన విద్యావిధానం ప్రకారం.. అక్షరాస్యతకు పునాది, అంకెలు మొదలైన వాటిపై అవగాహన కల్పించడాన్ని ఓ జాతీయ మిషన్‌గా తీసుకెళ్లబోతున్నాం. ప్రాథమిక భాషలో పరిజ్ఞానం, అంకెలు-సంఖ్యల్లో పరిజ్ఞానం, సులభమైన లేఖలు, కథలను చదివి, అర్థం చేసుకోగల సామర్థ్యాన్ని పిల్లల్లో పెంపొందించడం చాలా ముఖ్యం. దీని వల్ల చిన్నారి భవిష్యత్తులో నేర్చుకునేందుకు చదవడం అలవాటవుతుంది. అందుకోసం ప్రారంభస్థాయిలోనే పిల్లలకు చదవడాన్ని నేర్పించాలి. ఇదంతా అక్షరాస్యతకు పునాది, అంకెలను నేర్పించడం ద్వారానే సాధ్యమవుతుంది.
మిత్రులారా,
మూడో తరగతి పూర్తిచేసుకున్న ఏ విద్యార్థి అయినా.. నిమిషానికి 30-35 పదాలు సులభంగా చదవగలిగేలా సిద్ధం చేయాలి. మీరు దీన్ని మౌఖిక అభ్యాసన పటిమ (ఓరల్ రీడింగ్ ఫ్లుయెన్సీ) అంటారు. మనం పిల్లవాడిని ఈ స్థాయికి తీసుకురాగలిగితే.. ఇలా చదివేలా తీర్చిదిద్దగలి, నేర్పించగలిగితే.. భవిష్యత్తులో ఆ విద్యార్థి మిగిలిన విషయాలను సులభంగా అర్థం చేసుకోగలడు. ఇందుకోసం 20-25 మంది విద్యార్థులన్న బృందానికి.. మీలో ఎందరిపేర్లు మీకు గుర్తున్నాయో చెప్పండని అడగండి. ఎంత వేగంగా వారి పేర్లను చెప్పగలరు అని అడగండి. ఆ పేర్లను వేగంగా చెబుతూ వారిని నిల్చోమని చెప్పండి. తద్వారా ఆ పిల్లాడిలో ఎన్నిరకాల ప్రతిభ వృద్ధి జరుగుతుందో గమనించండి. తద్వారా విద్యార్థి ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఆ తర్వాత తోటి మిత్రుల పేర్లను లిఖితపూర్వకంగా ఇవ్వాలని చెప్పండి. ఫొటోలను చూయించి గుర్తించమని అడగండి. ఇదోరకమైన అభ్యాసన ప్రక్రియ. దీని ద్వారా తర్వాతి తరగతుల్లో విద్యార్థులపై భారం మెల్లిగా తగ్గుతుంది. ఉపాధ్యాయులపైనా ఒత్తిడి తగ్గుతుంది. అంతే కాదు.. కూడికలు, తీసివేతలు, గుణాకారం, భాగాహారం వంటి కనీస గణిత సూత్రాలను విద్యార్థులు సులభంగా నేర్చుకోగలుగుతారు. పుస్తకాలు, తరగతి గదులనుంచి బయటకొచ్చి వాస్తవ ప్రపంచానికి.. మన జీవితాన్ని, మన చుట్టూ ఉన్న సమాజాన్ని అనుసంధానించినపుడే.. ఇది సాధ్యమవుతుంది. దీనికి సంబంధించిన ఒక ఉదాహరణ ఈశ్వర చంద్ర విద్యాసాగర్ రాసిన కథలో.. పిల్లలు వాస్తవప్రపంచం నుంచి ఎలా నేర్చుకోవచ్చో పేర్కొన్నారు. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ఎనిమిదేళ్ళ వయసులో ఉన్నపుడు వారికింకా ఇంగ్లీష్ నేర్పించలేదు. ఒకసారి వారు తన తండ్రితో కలిసి కోల్‌కతా వెళ్తున్నప్పుడు మార్గమధ్యంలో ఆంగ్లంలో రాసిన మైలురాళ్లు కనిపించాయి. అప్పుడు వారు.. ఇదేంటని తండ్రిని అడిగితే.. ఆయన కోల్‌కతా మనమింకా ఎంతదూరంలో ఉన్నామో తెలిపేందుకు ఈ ఆంగ్ల భాషలో రాసిన మైలురాళ్లు పాతారని చెప్పారు. ఈ సమాధానంతో ఈశ్వర చంద్ర విద్యాసాగర్ మనస్సులో ఉత్సుకత, ఆంగ్లం నేర్చుకోవాలన్న జిజ్ఞాస పెరిగింది. అలా కనబడిన ప్రతి మైలురాయి వద్ద ఇంకెత దూరంలో ఉందని అడిగి తెలుసుకున్నారు. కోల్‌కతా చేరుకునే లోపే ఆయన ఆంగ్లంలో అంకెలు.. వన్, టూ, త్రీ.. నేర్చుకున్నారు. ఈ జిజ్ఞాసే మనల్ని కొత్త విషయాలు తెలుసుకునేందుకు శక్తినిస్తుంది.
మిత్రులారా,
విద్యను మన చుట్టుపక్కల వాతావరణంతో అనుసంధానిస్తే.. అది విద్యార్థి జీవితంపై, సమాజంపైనా ప్రభావం చూపుతుంది. జపాన్‌లో ‘షిరిన్-యోకు’ అనే పద్ధతి అమల్లో ఉంది. షిరిన్ అంటే అడవి అని, యోకు అంటే స్నానం చేయడం అని అర్థం. అంటే ‘అటవీ స్నానం’ అని అర్థం. విద్యార్థులను సమీపంలోని అడవికి తీసుకెళ్తారు. వారికి ప్రకృతి, పర్యావరణంపై చక్కటి అవగాహన కలిగేలా చేస్తారు. మొక్కలు, చెట్లను, పుష్పాలను చూడటం, తాకడం, రుచిచూడటం, వాసన చూడటం చేయాలని చెబుతారు. దీని వల్ల చిన్నారికి ప్రకృతితో తాను మమేకమైన అనుభూతి కలుగుతుంది. విద్యార్థి సంపూర్ణ వికాసానికి బాటలు పడతాయి. వారు ఆ వాతారణాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తారు. ఒకేసారి చాలా విషయాలు నేర్చుకుంటారు. నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓ కార్యక్రమం ప్రారంభించాం. అన్ని పాఠశాలలకు సమాచారం ఇచ్చి.. ఆ ఊళ్లో ఎక్కువ వయసున్న చెట్టు ఏది? దాని వయసెంత? మొదలైన విషయాలను విద్యార్థులు శోధించేలా వారిని ప్రోత్సహించి వివరాలు పంపాలని తెలిపాం. ఇందుకోసం విద్యార్థులకు సమీపంలోని ప్రాంతాల్లో చెట్లు, ఉద్యానవనాల్లోకి వెళ్లడం, చెట్లను గమనించడం, ఉపాధ్యాయులను అడగటం చేస్తారు. తమ అన్వేషణ పూర్తయిన తర్వాత విద్యార్థులు పాఠశాలకు తిరిగి వచ్చి.. ఆ చెట్టు గురించి, ఆ చెట్టు విశిష్టత గురించి పాటలు, కథలు రాయాలని సూచించాం. ఈ ప్రయత్నంలో భాగంగా విద్యార్థులు ఎన్నో చెట్లను చూస్తారు. వాటి గురించి తెలుసుకుంటారు. కావాల్సిన దానికోసం అన్వేషిస్తారు. చాలా అంశాలపై వారికి ఈ ప్రయత్నంలో అవగాహన కలిగింది. మేం చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమైంది. ఓవైపు విద్యార్థులకు పర్యావరణం, ప్రకృతికి సంబంధించిన అవగాహన కలిగింది. పనిలో పనిగా తమ ఊరి గురించిన సమాచారం కూడా వారికి తెలిసింది. ఇలాంటి కొత్తవి, ఆసక్తికరమైన ప్రయత్నాలను మనం వెతకాలి. ఆధినిక యుగంలో అభ్యాసనలో - కార్యక్రమాల్లో పాల్గొనడం (ఎంగేజ్), అన్వేషించడం (ఎక్స్‌ప్లోర్), అనుభవాన్ని సంపాదించడం (ఎక్స్‌పీరియన్స్), భావాలను వ్యక్తపరచడం (ఎక్స్‌ప్రెస్), రాణించడం (ఎక్సెల్) – మూలమంత్రం కావాలి. విద్యార్థులు వారి వారి ఆసక్తులకు, అభిలాషలకు అనుగుణంగా కార్యక్రమాలు, ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం కావాలి. తమకు కావాల్సినదాన్ని అన్వేషించాలి. కార్యక్రమాలు, ఘటనలు, ప్రాజెక్టులను విభిన్న దృష్టికోణాల్లో గమనించి అనుభవాన్ని పొందాలి. అది వ్యక్తిగత అనుభవమైనా కావచ్చు.. లేదా బృందంతో కలిసి పనిచేస్తుంటే సంయుక్త అనుభవమైనా కావొచ్చు. ఆ తర్వాత తన అనుభవాన్ని అక్షరబద్ధం చేసి తన భావాలను వ్యక్తపరచడం నేర్చుకోవాలి. వీటన్నింటికీ కలుపుకుని మళ్లీ తన ప్రతిభాపాటవాలకు మరింత మెరుగుపరుచుకోవాలి. మన పిల్లలను కొడలు, గుట్టలు, చారిత్రక ప్రాంతాలు, పొలాలు, సురక్షిత తయారీకేంద్రాలు వంటి వాటికి తీసుకెళ్లాలి.
ఉదాహరణకు.. మీరు తరగతి గదిలో రైల్వే ఇంజన్ గురించి బోధిస్తారు. ఈ విషయాన్ని నేర్పించండి కానీ.. గ్రామానికి దగ్గరగా ఒక రైల్వే స్టేషన్ ఉంటే పిల్లలను తీసుకెళ్లండి. ఇంజన్ ఎలా ఉందో పిల్లలకు చూపించండి. వీలున్నప్పుడు బస్‌స్టేషన్ తీసుకెళ్లండి. బస్సు ఎలా ఉంటుందో చూపించండి. చూస్తూనే నేర్చుకోవడం ప్రారంభిస్తారు. చాలా మంది అధ్యాపకులు, ప్రిన్సిపాల్ లు మేం ఇలాగే చేస్తున్నాం కదా అని అనుకుంటున్నారు. చాలా మంది ఉపాధ్యాయులు సృజనాత్మకతను పెంపొందించేందుకు కృషిచేస్తారు. విద్యార్థులకు నేర్పించేందుకు మన:పూర్వకంగా కష్టపడతారు. కానీ ప్రతిచోటా ఇలాంటి వాతావరణం ఉండదు. అందుకే చాలా మంది విద్యార్థులకు ప్రయోగాత్మక అనుభవం ఉండదు. మనం ఇలాంటి విషయాలను ఎంత ఎక్కువగా విస్తరింపజేస్తే.. మన తోటి టీచర్లకు నేర్చుకునేందుకు అవకాశం లభిస్తుంది. ఆ తర్వాత వారు తమ అనుభవంతో పిల్లలకు లబ్ధి చేకూరుస్తారు
మిత్రులారా,
మన దేశంలో ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. సంప్రదాయ కళలు, చేతివృత్తులు, ఉత్పత్తులు ఇలా గుర్తింపును పొందాయి. బిహార్‌లో భగల్పూర్ చీరల్లాగా.. అక్కడి పట్టు నాణ్యత మనందరికీ తెలిసిందే. అక్కడి విద్యార్థులు చీరల కేంద్రాన్ని సందర్శించాలి. పట్టునుంచి దుస్తులు ఏలా నేస్తారో అడిగి తెలుసుకోవాలి. మనం చేస్తున్న పనిని వారికి నేర్పించాలి. తరగతి గదిలోనే వారికి ప్రశ్నలను చెప్పాలి. వెళ్లి వచ్చిన తర్వాత మీరు ఏమేం ప్రశ్నలు వేశారు.. ఏయే సమాధానాలు వచ్చాయో విద్యార్థులను అడిగి తెలుసుకోవాలి. ఇదే కదా అభ్యసన ప్రక్రియ. మీరు దారాన్ని ఎక్కడినుంచి తీసుకొస్తారు? దారం ఏ రంగులో ఉంటుంది? చీరపై మెరుపు ఎలా వస్తుంది? వంటి ప్రశ్నలను వారు ప్రత్యేకంగా వారికి చెప్పాలి. అప్పుడు పిల్లలు తమకు వీలున్నట్లుగా ప్రశ్నలు అడుగుతారు. దీని ద్వారా పిల్లలకు నేర్చుకునేందుకు అవకాశం దొరుకుతుంది.
పాఠశాలల్లో ఇలాంటి నైపుణ్య శ్రామికులను పిలిపించి ప్రదర్శనలు, వర్క్ షాప్‌లు ఏర్పాటుచేయవచ్చు. ఉదాహరణకు ఊళ్లలో మట్టి పాత్రలు చేసేవారుంటే పిలిపించి.. వారితో ప్రదర్శన ఏర్పాటు చేయించండి. తర్వాత పిల్లలను ఏమేం తెలుసుకున్నారో అడగండి. ఇలాంటి వాటి వల్ల పిల్లలు చాలా సులభంగా నేర్చుకుంటారు. విద్యార్థుల ఉత్సాహం, జిజ్ఞాస పెరుగుతాయి. నేర్చుకోవాలన్న తపన కనబడుతుంది. లోతైన అవగాహన అవసరమైన ఎన్నో రంగాలున్నాయి. కానీ మనం వాటిపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. కొన్నిసందర్భాల్లో అవి అంత పెద్ద ప్రాధాన్యమైనవి కావనిపిస్తుంది. ఒకవేళ విద్యార్థులు వీటిని చూస్తే.. వాటి గురించి తెలుసుకోవడంతోపాటు ఆ నైపుణ్యాలను అందిపుచ్చుకునేందుకు, గౌరవించేందుకు వీలుంటుంది.
పెద్దయ్యాక పిల్లల్లో ఎవరైనా ఆ రంగంలోకి వెళ్లి స్థిరపడాలనుకుంటే, పదిమందికి ఉద్యోగాలు కల్పించాలనుకుంటే.. చిన్నప్పుడు నేర్చుకున్న విషయం పనికివచ్చినట్లే కదా. విద్యార్థుల్లోని శక్తి, సామర్థ్యాలను జాగృతం చేయాలన్న చర్చ జరగాలి. పిల్లలు ఆటో రిక్షాల్లో పాఠశాలలకు వస్తారు. మీరెప్పుడైనా వారిని మీ ఆటో డ్రైవర్ పేరేంటని, ఆయనెక్కడుంటాడని అడిగారా? ఆటో డ్రైవర్ ఎప్పడైనా తన పుట్టినరోజు జరుపుకున్నాడా, నువ్వెప్పుడైనా ఆయన ఇంటికి వెళ్లావా? ఆయనెప్పుడైనా మీ తల్లిదండ్రులను కలిశాడా? అని అడిగాడా తెలుసుకోండి. లేదంటే ఈ ప్రశ్నలకు సమాధానం తీసుకురమ్మని పిల్లలకు చెప్పండి. తర్వాత క్లాసులో అందరినీ వాళ్ల రిక్షా డ్రైవర్ గురించి చెప్పమనండి. అప్పుడు పిల్లల్లో ఆయన పట్ల గౌరవభావాలు పెంపొందుతాయి. మా నాన్న డబ్బులిస్తాడు అందుకే ఈ డ్రైవర్ నన్ను రోజూ ఆటోలో స్కూలుకు తీసుకొస్తాడని మాత్రమే అని ఆలోచించడం ఆపేస్తారు. ఆటో రిక్షావాలాకు నా జీవితంలో ఉన్న పాత్ర ఏంటి? నాకోసం ఆయనేం చేస్తున్నాడు అనే ఆలోచన ప్రారంభిస్తారు. ఇదే విధంగా రేపు ఆ విద్యార్థి ఇంజనీరింగ్, ఆసుపత్రి, ఫైర్ స్టేషన్ వంటి ఏ రంగాన్ని ఎంచుకున్నా ఆ రంగంలో వీలైనంత ఎక్కువ సమర్థవంతంగా పనిచేయడానికి ఏమేం చేయగలనో ఆలోచిస్తాడు. అక్కడ కూడా కొత్త విషయాలు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. పిల్లలను కూడా ఆసుపత్రులకు తీసుకెళ్లాలి, అక్కడి వసతులు చూపించాలి. ఎన్ని రాకల వైద్యులుంటారు? డెంటిస్ట్ ఎవరు? ఆప్తమాలజిస్ట్ ఎవరు? ఆయన వద్ద ఏయే పరికరాలుంటాయి? వంటి వాటి గురించి తెలుసుకునేందుకు పిల్లలో జిజ్ఞాస పెరుగుతుంది.
మిత్రులారా,
నూతన విద్యావిధానాన్ని ఈ అంశాలు ఉండే విధంగా రూపొందించాం. పాఠ్యప్రణాళికను తగ్గించి మౌలిక అంశాలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలనేది మా ఉద్దేశం. అభ్యసనను సమగ్ర, క్రమశిక్షణతో కూడిన, వినోదభరితమైన విధానంగా మార్చేందుకు జాతీయ పాఠ్యప్రణాళిక విధానాన్ని అభివృద్ధి చేస్తున్నాం. 2022లో భారతదేశం 75వ స్వతంత్ర్య దినోత్సవం జరుపుకునేనాటికి.. మన విద్యార్థులు సరికొత్త విద్యావిధానంతో సరికొత్త భవిష్యత్తువైపు అడుగులు వేస్తుండాలని నిర్ణయించాం. ఇది కూడా ముందుచూపు, భవిష్యత్తుకోసం సిద్ధం చేసే విధంగా శాస్త్రీయమైన పాఠ్యప్రణాళిక సిద్ధం చేస్తాం. ఇందుకోసం అందరి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నాం. అందరి ప్రతిపాదనలను, ఆధునిక విద్యా వ్యవస్థలను కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తాం.
మిత్రులారా,
భవిష్యత్ ప్రపంచం.. ప్రస్తుత పరిస్థితికంటే చాలా భిన్నంగా ఉండబోతోంది. ఇందుకు కావాల్సిన వాటిని మనం ఇప్పుడే చూడవచ్చు, గ్రహించవచ్చు. ఇందుకోసం మన విద్యార్థులను 21వ శతాబ్దపు నైపుణ్యతను అందించి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరముంది. 21వ శతాబ్దపు నైపుణ్యత అంటే ఏంటి?
విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మకత, పరస్పర సహకారం, ఉత్సుకత, సమాచార మార్పిడి ఇవే 21వ శతాబ్దానికి అవసరమైన నైపుణ్యాలు. మన విద్యార్థులు సుస్థిరమైన భవిష్యత్తును, శాస్త్రవిజ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి. ఆ దిశగా ఆలోచన చేయాలి.. ఇదంతా కాలానికి అనుగుణంగా మారాల్సినవి. చాలా ఆవశ్యకం కూడా. అందుకే చిన్నారులు ప్రారంభం నుంచే కోడింగ్ నేర్చుకోవాలి, కృత్రిమ మేధను అర్థం చేసుకోవాలి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్, రొబోటిక్స్ వంటి వాటిని అవగతం చేసుకోవాలి. ఇవన్నీ మనం సమీప భవిష్యత్తులో చూడబోయేవే.
మిత్రులారా,
ఇంతకుముందున్న మన విద్యావిధానం విద్యార్థిని కట్టిపెట్టేసేది. ఉదాహరణకు.. సైన్స్ పై ఆసక్తి ఉన్నవిద్యార్థికి ఆర్ట్స్, కామర్స్ నేర్చుకునేందుకు అవకాశం ఉండేది కాదు. ఆర్ట్స్, కామర్స్ విద్యార్థులు సైన్స్ చదవలేరు కాబట్టి.. చరిత్ర, భూగోళశాస్త్రం, అకౌంట్స్ నేర్చుకునేవారు. కానీ వాస్తవ ప్రపంచంలో కేవలం ఒక విషయాన్ని నేర్చుకుంటే అన్ని అంశాలు తెలిసిపోతాయా? నిజం చెప్పాలంటే అన్ని విషయాలు ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉంటాయి. ఈ విషయాల అభ్యసన ఎప్పుడూ పరస్పర ఆధారితమే. విద్యార్థి ఒక విషయాన్ని ఎంచుకుని విద్యనభ్యసించిన తర్వాత.. మరో విషయంలో చదువుకుని ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. అందుకే ప్రస్తుత వ్యవస్థ కొత్త విషయాన్ని మార్చుకునేందుకు అవకాశం కల్పించడం లేదు. పెద్ద సంఖ్యలో డ్రాపవుట్లు పెరిగేందుకు ఇది కూడా ఒక కారణం. నూతన విద్యవిధానంలో విద్యార్థులకు నచ్చిన విషయాలను ఎంచుకునే స్వేచ్ఛను కల్పిస్తున్నాం. ఇది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. మన యువత సైన్స్, హ్యుమానిటీ, కామర్స్ లను కలిపి చదువుకునేందుకు వీలుంటుంది. ప్రతి విద్యార్థికి తన ప్రతిభకు తగ్గ అవకాశం కచ్చితంగా లభిస్తుంది.
మిత్రులారా,
నూతన జాతీయ విద్యావిధానం మరో పెద్ద సమస్యను కూడా పరిష్కరిస్తోంది. ఇక్కడ అనుభవజ్ఞులు, విషయ నిపుణులు హాజరయ్యారు. దేశంలో నేర్చుకోవడాన్ని ప్రోత్సహించే విద్యావిధానం బదులు, మార్కులు, మార్క్ షాట్లను ప్రోత్సహించే విద్యావిధానం నడుస్తోందని మీరంతా గమనించే ఉంటారు. పిల్లలు ఆడుతున్నప్పుడు కూడా నేర్చుకునేవారు, కుటుంబంతో మాట్లాడుతున్నప్పుడు కూడా నేర్చుకునేవారు, తల్లిదండ్రులతో బయటకు పోయినప్పుడు కూడా నేర్చుకునేవారు. కానీ తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఏం నేర్చుకున్నావని అడిగి ఉండకపోవచ్చు. ఎన్ని మార్కులు వచ్చాయి. ర్యాకు ఎంత వచ్చింది? అనే అడిగి ఉంటారు. ఒక పరీక్ష, ఒక మార్క్ షీట్ విద్యార్థి అభ్యసనకు, వారి మానసిక వికాసానికి గీటురాయి అవుతుందా?. మార్క్ షీట్ విద్యార్థులపై మానసిక ఒత్తిడిని పెంచే ప్రెజర్ షీట్ గా మారిపోయింది, కుటుంబానికి పరువు సమస్యగా మారిందనేది వాస్తవం. చదువుతో అనుసంధానమై ఉండే ఈ ఒత్తిడినుంచి పిల్లలను తప్పించి వారిలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడమే నూతన జాతీయ విద్యావిధానం ఉద్దేశం.
విద్యార్థులపై ఒత్తిడి పడని విధంగా పరీక్షలుండాలి. ఒక పరీక్ష ద్వారా వారి ప్రతిభ మూల్యాంకనం జరగడం కూడా సరికాదు. స్వీయ మూల్యాంకనం, తోటి విద్యార్థులతో పోటీద్వారా విద్యార్థుల్లోని వివిధ కోణాలను విశ్లేషించవచ్చు. అందుకే నూతన విద్యావిధానంలో మార్క్ షీట్ బదులు హోలిస్టిక్ రిపోర్ట్ కార్డ్ (సమగ్ర ప్రగతి పత్రం) ఆధారంగా మూల్యాంకనం జరుగుతుంది. ఈ సమగ్ర ప్రతి పత్రం.. విద్యార్థి యొక్క ప్రత్యేక సామర్థ్యం, అభిరుచి, దృక్పథం, ప్రతిభ, నైపుణ్యం, సామర్థ్యం, సాధ్యాసాధ్యాలతో కూడి వివరణాత్మక పత్రం అవుతుంది. మూల్యాంకన వ్యవస్థ సమగ్రాభివృద్ధి కోసం జాతీయ మూల్యాంకన కేంద్రం ‘పరఖ్’ను ఏర్పాటుచేస్తాం.
మిత్రులారా,
జాతీయ విద్యా విధానం వచ్చినప్పటి నుంచి.. పిల్లలకు బోధించే భాష ఏదనే విస్తృత చర్చ జరుగుతోంది. ఇందులో ఏయే మార్పులు చేస్తున్నారు? భాష విద్యనభ్యసించేందుకు ఒక మాధ్యమం మాత్రమే.. భాషే మొత్తం విద్య కాదనే శాస్త్రీయ అంశాన్ని మనం అర్థం చేసుకోవాలి. పుస్తక అధ్యయనంలో చిక్కుకున్న కొంతమంది ఈ వ్యత్యాసాన్ని మరచిపోతారు. అందుకే ఏ భాషలోనైతే విద్యార్థి సులభంగా నేర్చుకోగలడో, విషయాలను అవగతం చేసుకోగలడో అదే భాష అది మాధ్యమం కావాలి. పిల్లాడిని చదివిస్తున్నప్పుడు మనం చెబుతున్న అంశాన్ని అతడు అర్థం చేసుకుంటున్నాడా లేదా అనేది అర్థం చేసుకోవాలి. ఒకవేళ అర్థం చేసుకుంటే ఎంత సులభంగా అర్థమవుతోంది? విషయ పరిజ్ఞానాన్ని అర్థం చేసుకునే కంటే భాషను అర్థం చేసుకోవడంలోనే విద్యార్థికి ఎక్కువ ఇబ్బంది అవుతోందా? ఈ అంశాల ఆధారంగానే ప్రపంచంలోని చాలా దేశాల్లో వారి వారి మాతృభాషల్లోనే విద్యను బోధిస్తున్నారు.
మీలోని చాలా మందికి తెలుసు.. 2018లో ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్‌మెంట్ (పిసా) ప్రకారం.. టాప్ ర్యాంకింగ్ లోఉన్న దేశాలు.. ఎస్టోనియా, ఐర్లండ్, ఫిన్లాండ్, జపాన్, దక్షిణ కొరియా, పోలండ్ వంటి దేశాల్లో మాతృభాషలోనే విద్యావిధానం ఉంటుంది. ఏ భాషలోనైతే రోజు మాట్లాడుకుంటారో? ఏ భాషలో నైతే వింటూ తల్లిదండ్రులు, చుట్టుపక్కలవారినుంచి వింటారో... ఆ భాషే చదువుకునేందుకు ఉత్తమమైన మాధ్యమం. లేదంటే కొత్త భాషలో నేర్చుకున్న దాన్ని తన భాషలోకి తర్జుమా చేసుకుని అర్థం చేసుకునేందుకే సమయమంతా వ్యర్థమవుతుంది. దీని ద్వారా పసిమనసుపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. మన దేశంలో దీని కారణంగా మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మాధ్యమం మారితే.. తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చదువుతున్నారో అర్థం చేసుకోలేదు. తద్వారా విద్య ఎంతమాత్రమూ ఓ సహజమైన ప్రక్రియగా ఉండదు. పాఠశాలలో చేయాల్సిన ఓ డ్యూటీగా మిగిలిపోతుంది. పాఠశాలకు, తల్లిదండ్రులకు మధ్య ఓ స్పష్టమైన గీత గీసినట్లవుతుంది.
అందుకోసం వీలైనంత వరకు.. కనీసం ఐదో తరగతి వరకైనా.. మాతృభాషలో విద్యాబోధన జరిగేలా చూడాలని నూతన జాతీయ విద్యావిధానం చెబుతోంది. కొందరు ఈ అంశంపై భ్రమల్లో ఉంటున్నారు. నూతన విధానంలో మాతృభాషతోపాటు ఇతర భాషలు నేర్చుకోవడంపై ఎటువంటి నిషేధం లేదు. ఆంగ్లంతోపాటు అంతర్జాతీయ భాషలేవైనా నేర్చుకోవచ్చు. అన్ని భారతీయ భాషలను ప్రోత్సహించాలనేదే మా అభిమతం. తద్వారా భారతదేశ యువత వివిధ ప్రాంతాల్లోని భాష, సంస్కృతులను అవగతం చేసుకుని.. బంధాలను, అనుబంధాలను బలోపేతం చేసుకునేందుకు వీలవుతుంది.
మిత్రులారా,
నూతన జాతీయ విద్యావిధానాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరిది, ఉపాధ్యాయులది. కొత్త విధానంలో అభ్యసన కావొచ్చు.. పరఖ్ ద్వారా కొత్త పరీక్ష అయ్యుండొచ్చు.. విద్యార్థులను సరికొత్త మార్గంలో తీసుకెళ్లడం ఉపాధ్యాయుల బాధ్యతే. ఎందుకంటే విమానం ఎంత అధునాతమైనదైనా.. నడపాల్సింది పైలటే కదా. అందుకే చాలా మంది టీచర్లు చాలా కొత్త విషయాలను నేర్చుకుని కొత్తదనాన్ని ప్రదర్శించాల్సిన అవసరముంది. 2022లో భారతదేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవ జరుపుకునే నాటికి నూతన విద్యావిధానం ద్వారా ప్రతి విద్యార్థి సరికొత్త దిశలో ప్రయాణించేలా చేయాల్సిన బాధ్యత మనందరిదీ. అందుకే టీచర్లు, ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, తల్లిదండ్రులకు చేస్తున్న విజ్ఞప్తి ఒక్కటే.. మీ అందరి సహాయ సహకారాలతోనే నూతన విధానం విజయవంతంగా అమలవుతుంది.
నా ప్రసంగాన్ని ముగించే ముందు ఉపాధ్యాయులతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు కరోనా నేపథ్యంలో విధించిన అన్ని నిబంధనలను పాటించండి. రెండు గజాల సురక్షిత దూరం, మాస్క్ వాడటం, కుటుంబంలోని పెద్దల విషయంలో పూర్తి సంరక్షణ, స్వచ్ఛత ను పాటిస్తూ.. కరోనాపై పోరాటానికి నేతృత్వం వహించాలి. ఉపాధ్యాయులకు ఇదేం పెద్ద విషయం కాదు. ఈ విషయాలన్నింటినీ ప్రతి ఇంటికీ చేర్చగలిగేవారు మీరే. ఉపాధ్యాయుడు చెప్పే విషయాలను విద్యార్థి సావధానంగా వింటాడు. ఓ విద్యార్థికి ఈ మాట ప్రధానమంత్రి చెప్పాడని, ఉపాధ్యాయుడు చెప్పాడని చెప్పండి. నేను పూర్తి విశ్వాసంతో చెప్పగలను. ప్రధానమంత్రి చెప్పినదాన్ని ప్రశ్నించే అవకాశముంది. కానీ టీచర్ చెప్పినదాన్ని ప్రశ్నించకుండానే అమలు చేయగలడు. ఇంటికెళ్లి మా టీచర్ చెప్పాడని చెబుతాడు. అధ్యాపకుడంటే వారి మనస్సులో ఉండే గౌరవభావానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. ఈ విశ్వాసం, గౌరవభావమే ఉపాధ్యాయులకు మరింత శక్తినిస్తుంది. భారతదేశంలోని రుషులు, మునులు, గురువులు తపస్సు చేసి వారసత్వంగా మనకు అందించారు. ఇది మీ బాధ్యతను మరింత పెంచుతుంది.
భారతదేశ ఉజ్వల భవిష్యత్తును దేశంలోని ఉపాధ్యాయులంతా ఓ మిషన్ గా తీసకుని ముందుకెళ్తారనే విశ్వాసం నాకుంది. మీరు మనసుపెట్టి బోధిస్తే దేశంలోని ప్రతి విద్యార్థి నేర్చుకునేందుకు సిద్ధమవుతాడు. మీ ఆదర్శాలను పాటించేందుకు, మీ ఆకాంక్షలను చరితార్థం చేసేందుకు సిద్ధపడతాడు. పగలు, రాత్రి శ్రమించేందుకు వెనుకాడడు. ఒకసారి టీచర్ చెబితే దేన్నయినా స్వీకరించేందుకు సిద్ధపడతాడు. ఇందుకోసం తల్లిదండ్రులు, టీచర్లు, విద్యాసంస్థలు, ప్రభుత్వ వ్యవస్థలు, మనమంతా కలిసి ముందుకెళ్దాం. ఈ జ్ఞాన యజ్ఞం, విద్యా యజ్ఞంలో భాగంగా సెప్టెంబర్ 5 నుంచి వివిధ క్షేత్రాల్లో తమ పనులను ప్రారంభించారు. ఇది కచ్చితంగా శుభఫలితాలను అనుకున్న సమయానికంటే ముందే అందిస్తుందని నాకు విశ్వాసముంది. అందుకోసం మనమంతా కలిసి పనిచేయాల్సిన అవసరముంది.
మీ అందరికీ మరోసారి ధన్యవాదములు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు తెలుపుతూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.
ధన్యవాదములు
****
(Release ID: 1653521)
Visitor Counter : 556
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam