రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

50వేల కిలోమీటర్లమేర రహదారుల నిర్మాణానికి రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ పథకం

వాటిలో నాలుగు, ఆరు వరుసలు కలిగిన రహదారులే ఎక్కువ

ఆకర్షణీయమైన ఆదాయంపై పెట్టుబడిదార్లకు హామీ

ఐఎన్వీఐటీ భేటీలో రోడ్డు రవాణా, రహదారుల శాఖ కార్యదర్శి ప్రసంగం

Posted On: 11 SEP 2020 2:09PM by PIB Hyderabad

భారతీయ ఆర్థిక శక్తి సామర్థ్యాలను తిరిగి పరిపుష్టం చేసేందుకు జాతీయ మౌలిక సదుపాయాల పైప్ లైన్ ప్రాజెక్టు పేరిట ఒక భారీ కార్యక్రమాన్ని ప్రభుత్వం పట్టాలెక్కించింది. కార్యక్రమంలో ప్రధాన భాగంగా రహదారుల అభివృద్ధిని చేపట్టింది. ప్రణాళికా వ్యయంలో పావు వంతుకుపైగా రహదారుల అభివృద్ధికే కేటాయించింది. రహదారుల విస్తరణతో అనుసంధాన సమస్య, రవాణా సంబంధమైన ఖర్చులు తగ్గడంతోపాటుగా, వాహనాల యాజమాన్యంలో వృద్ధి కూడా చోటుచేసుకుంటుంది.

  మౌలిక సదుపాయాల పైప్ లైన్ ప్రాజెక్టులో భాగంగా, మౌలిక సదుపాయాల పెట్టుబడుల ట్రస్టు(ఐఎన్వీఐటీ) ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం తెలిపింది. నిర్మాణం పూర్తయి, కనీసం ఒక ఏడాది టోల్ రుసుం వసూలు రికార్డు కలిగిన జాతీయ రహదారులను ఆర్థికంగా ప్రయోజకరంగా మార్చేందుకు జాతీయ రహదారుల సంస్థకు  ట్రస్టు ఉపకరిస్తుంది. ఏదైనా గుర్తించిన రహదారి వ్యవస్థకు సంబంధించి టోల్ రుసుం విధించేందుకు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థకు హక్కు ఉంటుందిఎంతో బృహత్తరమైన ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టేలా  బలమైన ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ వస్తోంది.

  న్యూఢిల్లీలో నిన్న సాయంత్రం ప్రముఖ పెట్టుబడిదార్లు, భారీ పెట్టుబడి దార్ల గ్రూపులతో జరిగిన సమావేశంలో రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి గిరిధర్ ఆరమనే ప్రసంగించారు. దేశంలో 50వేల కిలోమీటర్లకు పైగా రహదారులను నిర్మించాలని తమ మంత్రిత్వ శాఖ సంకల్పించిందన్నారుఎక్కువ భాగం, నాలుగు వరుసలు, ఆరు వరుసలు కలిగిన విశాలమైన రోడ్లనే నిర్మిస్తున్నట్టు చెప్పారు. పెట్టుబడుదార్ల గ్రూపులకు విశాలమైన ప్రాతిపదికను అందించే వేదికగా ఐఎన్వీఐటీని పరిగణించాలని ఆయన పెట్టుబడిదార్లకు సూచించారు. రహదారుల అభివృద్ధికోసం నిధుల సమీకరణకు ఐఎన్వీ ఐటీ ఒక ఆకర్షణీయమైన వాహకంగా పనిచేయగలదని హామీ ఇచ్చారు. ఆకర్షణీయమైన ఆదాయం లభించేలా, ఇబ్బందులను తొలగించేలా ఐఎన్వీఐటీ ఆస్తులను ఎంపిక చేస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. ప్రతిపాదిత రహదారులకు సుదీర్ఘమైన రుసుం వసూలు చరిత్ర ఉంటుందని, సుంకం విధింపు ప్రక్రియ  కూడా ఆకర్షణీయంగా ఉండవచ్చని అన్నారు. పెట్టుబడులకు తగిన విలువ చేకూరేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

   పెట్టుబడులు పెట్టే భాగస్వాములను డైరెక్టర్ల బోర్డులోకి తీసుకురావడం ద్వారా పెట్టుబడుల యాజమాన్య వ్యవస్థను ప్రజాస్వామ్య బద్ధం చేస్తామని గిరిధర్ అరమనే చెప్పారు. కంపెనీని వృత్తిపరమైన ప్రమాణాలతో నిర్వహించేందుకు  చర్యలు తీసుకుంటామన్నారు. వృత్తి నైపుణ్యం, సామర్థ్యం ప్రాతిపదికగానే ప్రాజెక్టు మేనేజర్ల ఎంపిక ప్రక్రియ ఉంటుందని ఆయన చెప్పారు.

***


(Release ID: 1653347) Visitor Counter : 144