వ్యవసాయ మంత్రిత్వ శాఖ
దక్షిణ భారత దేశంలో మొట్టమొదటి మరియు దేశంలో రెండవ కిసాన్ రైల్ అనంతపురం నుంచి న్యూ ఢిల్లీకి ప్రారంభం
కిసాన్ రైలు వ్యవసాయ ఆర్ధిక వ్యవస్థ బలోపేతానికి తోడ్పడుతుంది : శ్రీ నరేంద్ర సింగ్ తోమర్
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో పండిన ఉద్యానపంటలు దేశంలోని ఇతర ప్రాంతాలకు సులభంగా చేరుతాయి: శ్రీ వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి
వ్యవసాయ ఉత్పత్తులను సుదూర ప్రాంతాలకు వేగంగా రవాణా చేయడానికి కిసాన్ రైలు సాయపడుతుంది: శ్రీ సురేష్ సి. అంగది
Posted On:
09 SEP 2020 2:41PM by PIB Hyderabad
అనంతపురం - న్యూ ఢిల్లీ కిసాన్ రైలు ప్రారంభోత్సవ వేడుకలో బుధవారం వీడియో లింక్ ద్వారా కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమం, గ్రామీణ అభివృద్హి మరియు పంచాయత్ రాజ్ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ మరియు ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి పాల్గొని ప్రారంభోత్సవ రైలును జెండా ఊపి ప్రారంభించారు. సమావేశానికి కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి శ్రీ సురేష్ సి. అంగది అధ్యక్షత వహించారు. కిసాన్ రైలు దక్షిణ మధ్య రైల్వే లోని గుంతకల్ డివిజన్ అనంతపురం నుంచి ఢిల్లీ లోని ఆదర్శ నగర్ మధ్య నడుస్తుంది.
ఈ సందర్బంగా మాట్లాడుతూ కిసాన్ రైలు వ్యవసాయ ఆర్ధిక వ్యవస్థ బలోపేతానికి తోడ్పడుతుందని శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. రాష్ట్రంలో పేరొందిన పళ్ళు దేశంలోని ఇతర ప్రాంతాలకు సులభంగా చేరగలవని శ్రీ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గ్రామాలు - పేదలు - రైతులకు సర్వదా ప్రాధాన్యమిస్తారని శ్రీ తోమర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి యేటా సమర్పించిన బడ్జెట్లలో వ్యవసాయ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయడానికి మరియు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ప్రయత్నాలు జరిగాయని, ఇప్పుడు వాటి ఫలితాలు కనిపిస్తున్నాయని ఆయన అన్నారు. వ్యవసాయ ఉత్పత్తులను తక్కువ సమయంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు రవాణా చేయడానికి ఈ ఏడాది బడ్జెట్ లో కిసాన్ రైలు మరియు కిసాన్ ఉడాన్ గురించిన ప్రకటన చేయడం జరిగిందని అన్నారు. ఆ మేరకు మహారాష్ట్రలోని దేవలాలి నుంచి బీహార్ లోని దానాపూర్ మధ్య వారానికి ఒకసారి నడిచే దేశంలో మొట్టమొదటి కిసాన్ రైలును ఆగస్టు 7వ తేదీన ప్రారంభించడం జరిగిందని, ఆ రైలుకు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా దానిని ఇప్పుడు వారానికి రెండుసార్లు నడుపుతున్నారని తెలిపారు. ఇప్పుడు రెండవ కిసాన్ రైలు అది నడిచే మార్గంలో ఉన్న రాష్ట్రాల రైతులకు ప్రయోజనం చేకూర్చగలదని అన్నారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త వ్యవసాయ ఆర్డినెన్సులను, రూ. లక్ష కోట్ల వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి అమలు చేస్తున్నందుకు కేంద్ర వ్యవసాయ మంత్రి ప్రశంసించారు. అనంతపురంలో 2 లక్షల హెక్టార్లకు పైగా తోటల్లో పళ్ళు, కూరగాయలు పండించడం జరుగుతోందని, ఈ ప్రాంతం రైతులకు కిసాన్ రైలు ఎంతో ప్రయోజనం చేకూర్చగలదని. త్వరలోనే కిసాన్ ఉడాన్ సేవలు కూడా ప్రారంభమవుతాయని అన్నారు.
ఉద్యానవన పంటలు రాష్ట్రంలో చాలా ముఖ్యమైన కార్యక్రమమని ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి అన్నారు. టొమాటోలు, కొబ్బరికాయలు, బొప్పాయి మరియు మిరప ఉత్పత్తిలో ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని, దక్షిణాదిలో పళ్ళ ఉత్పత్తిలో అతి పెద్ద రాష్ట్రమని ముఖ్యమంత్రి అన్నారు. కోవిడ్ కాలంలో రాష్ట్రం నుంచి ఉత్తర భారతానికి ఉద్యాన పంటలను రవాణా చేయడం చాలా కష్టమైందని అన్నారు. లాక్ డౌన్ సమయంలో ఉద్యాన ఉత్పత్తులను దేశంలోని ఇతర ప్రాంతాలకు చేరవేయడానికి అనంతపురం నుంచి ముంబాయికి అనేక ప్రత్యేక రైళ్లను నడపడం జరిగిందని అన్నారు.
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని సుదూర ప్రాంతాలకు వ్యవసాయ ఉత్పత్తులను సత్వరం రవాణా చేసందుకు కిసాన్ రైలును ప్రారంభించడం జరుగుతోందని రైల్వే శాఖ సహాయ మంత్రి శ్రీ సురేష్ సి. అంగది తెలిపారు. రవాణా సమయం బాగా తగ్గిపోవడం వల్ల పంట చెడిపోతుందనే బాధ లేకుండా రైతులు తమకు ఎక్కువ ధర పలికే చోట ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. ఈ సౌకర్యం వల్ల వ్యవసాయ ఎగుమతులు కూడా పెరుగుతాయని అన్నారు.
చక్షుష పద్ధతిలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రులు శ్రీ పరుషోత్తం రూపాల మరియు శ్రీ కైలాష్ చౌదరి మరియు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు శ్రీయుతులు బి. సత్యనారాయణ, ఎం. శంకరనారాయణ, కె. కన్నబాబు, అనంతపురం పార్లమెంటు సభ్యుడు శ్రీ టి. రంగయ్య , ఇతర ప్రజా ప్రతినిధులు మరియు సీనియర్ రైల్వే అధికారులు పాల్గొన్నారు.
అనంతపురం - న్యూ ఢిల్లీ కిసాన్ రైలు గురించి
వ్యవసాయ రంగానికి ప్రాధాన్యమిస్తూ నశ్వర వ్యవసాయ ఉత్పత్తులను దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న మార్కెట్లకు రవాణా చేసే ఉద్దేశంతో కిసాన్ రైలుకు రూపకల్పన చేసి ప్రవేశపెట్టడం జరిగింది. దేశంలో రెండవది మరియు దక్షిణ భారత దేశంలో మొట్ట మొదటి కిసాన్ రైలు ప్రారంభోత్సవ ప్రయాణం ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం నుంచి న్యూ ఢిల్లీ లోని ఆదర్శ నగర్ కు బుధవారం జరిగింది. ఇప్పుడు అనంతపురం శరవేగంగా ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి పళ్ళ కోశంగా మారుతోంది. జిల్లాలో ఉత్పత్తి అవుతున్న 58 లక్షల మెట్రిక్ టన్నుల పళ్ళు, కూరగాయలలో 80% కన్నా ఎక్కువ రాష్ట్రం బయట ముఖ్యంగా ఉత్తరాదిన ఉన్న ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్ మరియు హర్యానా తదితర రాష్ట్రాలలో అమ్ముడుపోతున్నాయి. అందువల్ల జిల్లాలో పండించే పళ్ళు కూరగాయలలో ఎక్కువ భాగం రాష్ట్రం బయటి ప్రాంతాలకు రవాణా చేయడం జరుగుతోంది. ఇంతకు ముందు వాటిని రహదారి మార్గంలో రవాణా చేసేవారు. కిసాన్ రైలును ప్రారంభించడం వల్ల విశేషంగా చిన్న రైతులు, వర్తకులు తమ ఉత్పత్తులను తక్కువ ఖర్చుతో, భద్రంగా మరియు సత్వరం రవాణా చేసి ప్రయోజనం పొందడానికి వీలవుతుంది.
అనంతపురం - న్యూ ఢిల్లీ మధ్య ప్రారంభించిన మొదటి కిసాన్ రైలు 2150 కిలోమీటర్ల దూరాన్ని 40 గంటల్లో చేరుతుంది. ఈ రైలులో 14 పార్సెల్ వ్యాన్లు ఉంటాయి. వాటిలో 4 నాగపూర్ వరకు వెళ్తాయి. మిగిలిన 10 వ్యాన్లు ఆదర్శ నగర్ కు చేరుతాయి. కిసాన్ రైలులో మొత్తం 332 టన్నుల వ్యవసాయ ఉత్పత్తులు రవాణా చేస్తారు. ప్రారంభోత్సవ రైలులో టొమాటో, అరటి, బత్తాయి, బొప్పాయి, కర్బూజ మరియు మామిడి పళ్ళను నింపారు. ఈ రైలు విశేషంగా చిన్న రైతులు, వర్తకులు పళ్ళు , కూరగాయల వంటి తమ నశ్వర ఉత్పత్తులను రవాణా చేయడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. రోడ్డు మార్గంలో రవాణా కంటే కూడా రైలు పంపడం వల్ల ఖర్చు తగ్గుతుంది. సమయం ఆదా అవుతుంది. రవాణాలో వ్యవసాయ ఉత్పత్తులు దెబ్బతినడం జరుగదు.
***
(Release ID: 1652863)
Visitor Counter : 230