రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

ప్రస్తుతం ఏటా 1.5 లక్షల వరకు ఉన్న రోడ్డు ప్రమాదాల మరణాలను సగానికి పైగా తగ్గించాలనే లక్ష్యం 2030 వరకు కాకుండా 2025 సంవత్సరంలోనే సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేసిన శ్రీ గడ్కరీ

ప్రమాద హేతువులైన బ్లాక్ స్పాట్లను తొలగించేందుకు తగు మార్గదర్శక చర్యలు సూచించేలా జిల్లా కమిటీలకు నాయకత్వం వహించాల్సిందిగా ఎంపీ లకు పిలుపు ఇచ్చిన కేంద్ర మంత్రి; ప్రపంచంలోనే ఉత్తమ పద్ధతులను అవలంబించేలా తగు సూచనలకు ఆహ్వానం

పీపీపీ విధానం ద్వారా మున్సిపల్, ప్రాంతీయ, జాతీయ స్థాయిలో ఇంటెలిజెంట్ రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడానికి రూపొందించే విధానం, టెండరింగ్ నమూనాలకు ఆదేశాలు ఇస్తున్నాం: శ్రీ గడ్కరీ

రహదారి భద్రత పై వెబినార్ లో శ్రీ గడ్కరీ ప్రసంగించారు

Posted On: 08 SEP 2020 3:56PM by PIB Hyderabad

ప్రస్తుతం ఏటా 1.5 లక్షల వరకు ఉన్న రోడ్డు ప్రమాదాల మరణాలను సగానికి పైగా తగ్గించాలనే లక్ష్యం 2030 వరకు కాకుండా 2025 సంవత్సరంలోనే సాధిస్తామని  కేంద్ర రోడ్డు రవాణా, హైవేలు, ఎంఎస్ఎంఈ శాఖల మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ విశ్వాసం వ్యక్తం చేశారు. రహదారి భద్రతపై జరిగిన వెబినార్ లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ వాటాదారుల సహకారంతో ఈ లక్ష్యాన్ని ఫాస్ట్ ట్రాక్ లో అధిగమిస్తామని  ఆయన అన్నారు. 

దేశంలో ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌ ఏర్పాటుతో సహా రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి తమ మంత్రిత్వ శాఖ చాలా కార్యక్రమాలు చేపట్టిందని శ్రీ గడ్కరీ తెలిపారు. జాతీయ రహదారులపై బ్లాక్ స్పాట్లు లేకుండా చేయడానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీలు చెరో రూ.7000 కోట్లు అందిస్తున్నాయని ఆయన అన్నారు. జాతీయ రహదారులపై బ్లాక్ స్పాట్లను ఇప్పటికే గుర్తించామని వీటిని తొలగించడానికి కేంద్రం ఇప్పటికే రూ.20,000 కోట్లు ఖర్చు చేసిందని ఆయన వెల్లడించారు. ఏటా జరుగుతున్న సుమారు 1.5 లక్షల రోడ్డు ప్రమాద మరణాలలో, 53,000 మంది హైవే ప్రమాదాలలోనే మరణిస్తున్నారని ఆయన చెప్పారు. ప్రపంచ బ్యాంకు సహాయంతో ఒక ప్రాజెక్టును అమలు చేయడం ద్వారా తమిళనాడు రాష్ట్రం, ప్రమాదాల్లో మరణాలను 25% తగ్గించిందని శ్రీ గడ్కరీ అన్నారు.

వివిధ వాటాదారుల ముఖ్యమైన పాత్రను ప్రస్తావించిన ఆయన, ముఖ్యంగా విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు, ఎన్జిఓలు, రాష్ట్ర ప్రభుత్వాలు మొదలైన వాటి సహకారం మనకు అవసరమని ఆయన చెప్పారు. జిల్లా రహదారి కమిటీలకు అధ్యక్షత వహించే పార్లమెంటు సభ్యులకు, బ్లాక్ స్పాట్లను గుర్తించి, పరిష్కారాలను చూపాలని శ్రీ గడ్కరీ సూచించారు . రాష్ట్ర, మునిసిపల్ రోడ్లపై బ్లాక్ స్పాట్లను గుర్తించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు, అక్కడ ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎమ్మెల్యేలు, ఎంపిల సహకారం ఎంతో అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. కోవిడ్ మహమ్మారి వల్ల కలిగే ఒత్తిడిని తగ్గించి, పిపిపి మోడ్‌లో దేశంలో తెలివైన రహదారి రవాణా అవస్థాపనను నిర్మించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. పిపిపి విధానం ద్వారా మునిసిపల్, ప్రావిన్షియల్, జాతీయ స్థాయిలో ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌ను అభివృద్ధి చేయడానికి విధానాన్ని, టెండరింగ్ నమూనాలను రూపొందించడానికి ఆదేశాలు జారీ చేస్తున్నట్లు శ్రీ గడ్కరీ తెలియజేశారు. ఇందుకు అతను అన్ని వాటాదారుల సలహాలను ఆహ్వానించారు. తద్వారా ప్రపంచ ఉత్తమ పద్ధతులను దేశంలో అనుసరించే వ్యవస్థను అమల్లోకి తెస్తామని శ్రీ గడ్కరీ తెలిపారు. 

***



(Release ID: 1652506) Visitor Counter : 142