ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

స్వచ్ఛంద నేత్రదానానికి ప్రతినబూనుదాం - ఉపరాష్ట్రపతి

-         అవయవదానంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి

-         ఈ దిశగా స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు రంగం కూడా కలిసిరావాలని సూచన

-         జిల్లా స్థాయిలోనూ సేకరించిన అవయవాలను నిల్వ ఉంచే సామర్థ్యాన్ని పెంచుకోవాలి

-         సక్షమ్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ నేత్రదాన పక్షోత్సవాల ముగింపు సమావేశంలో ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచన*

Posted On: 08 SEP 2020 6:39PM by PIB Hyderabad

నేత్రదాన మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. అవయవదానంపై ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావలసిన అవసరం ఉందని ఆయన తెలిపారు. దివ్యాంగుల సంక్షేమం కోసం కృషిచేస్తున్న సక్షం (సమదృష్టి, క్షమత, వికాస్ మరియు అనుసంధాన్ మండల్) స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన నేత్రదాన పక్షోత్సవాల ముగింపు సందర్భంగా అంతర్జాల వేదిక ద్వారా ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. నేత్రదానాన్ని శ్రేష్ఠమైన దానంగా అభివర్ణించిన ఉపరాష్ట్రపతి.. ఈ మహోన్నత యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. సమాజానికి మనమిచ్చే అత్యున్నతమైన కానుకల్లో నేత్రదానం కూడా ఒకటన్నారు.

దృష్టిలోపాన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యగా పేర్కొన్న ఉపరాష్ట్రపతి.. భారతదేశంలో దాదాపుగా 46లక్షల మంది కంటిచూపులేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. వీరిలో ఎక్కువమంది 50 ఏళ్లు పైబడినవారే అన్నారు. అంధత్వానికి కంటిశుక్లాల సమస్య తర్వాత కార్నియా సమస్యలు రెండో అతిపెద్ద కారణమని.. దేశవ్యాప్తంగా ఏడాదికి దాదాపుగా 20వేల కేసులు నమోదవుతున్నాయన్నారు. కార్నియా బాధితుల్లో ఎక్కువమంది యువకులు, చిన్నారులే ఉండటం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి, కంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం, సమస్య తీవ్రత తక్కువగా ఉన్నప్పుడే చికిత్స చేయించుకోవడం, లేదా కార్నియా శస్త్ర చికిత్సలు చేయించుకోవడం వంటి వాటిద్వారా భవిష్యత్తులో దృష్టిలోపం, అంధత్వం రాకుండా జాగ్రత్తపడవచ్చని సూచించారు.

కార్నియా మార్పిడి శస్త్ర చికిత్స కోసం కార్నియా దాతల అవసరాన్ని నొక్కిచెప్పిన ఆయన.. నేత్రదానానికి ముందుకు వచ్చేవారి సంఖ్య పెరగాలని సూచించారు. తద్వారా దేశం నుంచి కార్నియా అంధత్వాన్ని నిర్మూలించడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో నేత్రదానం చేసేవారి సంఖ్య తక్కువగా ఉండటాన్ని ప్రస్తావిస్తూ.. ప్రజల్లో చైతన్యం తీసుకురావడం, జిల్లా స్థాయిలో వైద్య వ్యవస్థలో మౌలికసదుపాయాలను కల్పించడం ద్వారా అవయవాల దానం, మార్పిడిని ప్రోత్సహించాలని సూచించారు.

భారతీయ సంస్కృతి, సంప్రదాయంలో అవయవదానానికి ఉన్న ప్రాధాన్యతను వివరిస్తూ.. శిబి చక్రవర్తి, దధీచి మహాముని వంటి వారు తమ శరీరాలను సమాజ సంక్షేమం కోసం అర్పించిన విషయాన్ని గుర్తుచేశారు. మళ్లీ నాటి విలువలను పునర్నిర్వచించుకుంటూ.. అవయవదానాన్ని ప్రోత్సహించేలా ప్రజల్లో చైతన్యం కల్పించాల్సిన అవసరాన్ని ఉపరాష్ట్రపతి నొక్కిచెప్పారు. అవయవదానానికి ఒకరు ముందుకొస్తే.. అది చుట్టుపక్కల వారికి ప్రేరణ కలిగిస్తుందని.. తద్వారా సమాజంలో అవయవదానం ఆవశ్యకతపై చైతన్యానికి బీజం పడుతుందన్నారు. ప్రతి భారతీయుడు మరీ ముఖ్యంగా యువత ఈ మహాయజ్ఞంలో కీలకపాత్ర పోషించాలని సూచించారు.

ఈ ప్రక్రియలో సమయం ఆవశ్యకతను వివరించిన ఉపరాష్ట్రపతి, దాత శరీరం నుంచి కంటితోపాటు ఇతర అవయవాలను సేకరించిన తర్వాత వాటిని భద్రపరిచేందుకు సరైన వసతులను ఏర్పాటుచేసుకోవడం కూడా కీలకమన్నారు. జిల్లా కేంద్రాలు, ద్వితీయశ్రేణి పట్టణాల్లో.. దాతలనుంచి సేకరించడం, అక్కడే అవసరమున్న గ్రహీతలకు శస్త్రచికిత్సల ద్వారా మార్పిడి చేయడానికి కావాల్సిన నిపుణులు, మౌలిక వసతులపైనా దృష్టిపెట్టాల్సిన అవసరముందన్నారు.

ఇప్పటికే ఈ దిశగా జరుగుతున్న ప్రయత్నాలను అభినందనీయమన్న ఉపరాష్ట్రపతి.. 2006-07లో ఒక శాతంగా ఉన్న అంధత్వ బాధితుల సంఖ్య.. 2019 నాటికి 0.36 శాతానికి తగ్గినట్లు పేర్కొన్న జాతీయ అంధత్వ సర్వే వివరాలను ఉటంకించారు. ఈ మార్పులో భాగస్వాములైన ప్రతి ఒక్కరినీ ఆయన అభినందించారు. ప్రతి ఒక్కరికి ఆరోగ్యకరమైన కంటిచూపు ఉండాలన్న లక్ష్యంతో జరుగుతున్న జాతీయ అంధత్వ, దృష్టిలోప నియంత్రణ కార్యక్రమాన్ని (ఎన్పీసీబీ&వీఐ) కూడా ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. ఈ కార్యక్రమం ద్వారా 2019-20లో 64 లక్షల కంటి శుక్లాల ఆపరేషన్లు జరగగా.. 65వేల మంది దాతలనుంచి కళ్లను సేకరించారని.. పాఠశాల విద్యార్థులకు 8.57 లక్షల కళ్లద్దాలను పంపిణీ చేయడం అభినందనీయమని తెలిపారు.

 

ఈ దిశగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతోపాటు స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు సంస్థలు చొరవతీసుకోవాలని సూచించారు. కంటివైద్యులు, ఆప్తమాలజీ విద్యార్థులు సమీపంలోని గ్రామాలకు వెళ్లి ప్రజలకు కంటిసమస్యలు రాకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి విస్తృత ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. కంటితోపాటు కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, హృదయం మొదలైన అవయవాలను దానంపై చైతన్య కార్యక్రమాలు చేపట్టడంలో యువత చొరవతీసుకోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు.

దివ్యాంగుల సమస్యలను అర్థం చేసుకుని ఆయా ప్రాంతాల్లో వారికి సహాయం చేసేందుకు సక్షమ్ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. ఈ సంస్థ చేపట్టిన కాంబా (కార్నియా అంధత్వ ముక్త భారత్ అభియాన్), ప్రాణదా, ప్రణవ్, సక్షమ్ సేవా సంకుల్ తదితర కార్యక్రమాలను అభినందించారు. కరోనా చికిత్సను అందించని ఆసుపత్రుల్లో కంటి బ్యాంకు కార్యక్రమాలు పున:ప్రారంభం కావడాన్ని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రశంసించారు.

అంతర్జాల వేదిక ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో సక్షమ్ అధ్యక్షుడు డాక్టర్ దయాళ్ సింగ్ పన్వర్, ఉపాధ్యక్షుడు డాక్టర్ పవన్ స్థాపక్, కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ సుకుమార్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ సంతోష్ కుమార్ క్రలేటి తదితరులు పాల్గొన్నారు.

***



(Release ID: 1652455) Visitor Counter : 151