ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

3 లక్షల టెలీమెడిసిన్ సేవలతో రికార్డు నెలకొల్పిన ఆరోగ్య మంత్రిత్వశాఖ వారి ఈ-సంజీవని

గత 20 రోజుల్లోనే లక్ష టెలీ సలహా సంప్రదింపులు

Posted On: 08 SEP 2020 1:46PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వారి  టెలీమెడిసిన్ సేవల వేదిక ఈ-సంజీవని మొత్తం 3 లక్షల  సలహా సంప్రదింపులు జరిపింది. ఈ వేదిక లక్షన్నర టెలీ సలహాలు పూర్తి చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని  ఆగస్టు 9న జరిగిన సమావేశానికి  కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ అధ్యక్షా వహించిన సంగతి తెలిసిందే. కేవలం నెలరోజుల్లోనే ఈ వేదిక రెట్టింపు సలహాలు, సంప్రదింపులు నమోదు చేసుకుంది. వీటిలో లక్ష గత 20 రోజుల్లోనే నమోదు కావటం మరో విశేషం. మొదటి లక్ష సలహా సంప్రదింపులు 2020 జులై 23న పూర్తి కాగా, ఆ తరువాత లక్ష కేవలం 26 రోజుల్లోనే ఆగస్టు  18 నాటికి పూర్తయ్యాయి.

 

భౌతిక దూరం పాటించేలా చూస్తూ టెలిమెడిసిన్ సేవలు డాక్టర్లను, రోగులను అనుసంధానం చేయటానికి బాగా ఉపయోగపడుతున్నాయి. ఈ ఇన్ఫెక్షన్ కారక వ్యాధి వలన సంప్రదాయ వైద్య చికిత్స రిస్క్ తో కూడుకున్నదనే అభిప్రాయం నెలకొన్న తరుణంలో తప్పనిసరి ఆరోగ్య సంరక్షణకు ఈ పద్ధతి అవసరమైంది.  ఇది రెండు రకాల టెలిమెడిసిన్ సేవలందిస్తుంది. డాక్టర్ నుంచి డాక్టర్ కు సలహాలను అందించే ఈ-సంజీవని ఒకటి కాగా, రోగి నుంచి డాక్టర్ కి సలహాలిచ్చే ఈ-సంజీవని ఒపిడి మరొకటి. మొదటిది ఆయుష్మాన్ భారత్ హెల్త్, వెల్ నెస్ సెంటర్ కార్యక్రమానికి మూలస్తంభం లాంటిది. దీనిని మొత్తం లక్షన్నర ఆరోగ్య కేంద్రాలలో టెలి-సలహాలు ఇవ్వటానికి 2019. నవంబర్ లో ప్రారంభించారు. డిసెంబర్ 2022 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. రాష్ట్రాలు తమ పరిధిలోని వైద్య కళాశాలలు, జిల్లా ఆస్పత్రులను గుర్తించి ప్రత్యేక వైద్య కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంది.

 

ఆరోగ్య మంత్రిత్వశాఖ తమ రెండో దశ టెలీ కన్సల్టేషన్ సేవలను ఈ సంజీవని ఒపిడి పేరుతో ఈ ఏడాది ఏప్రిల్ 13న విడుదల చేసింది.  దీని సాయంతో డాక్టర్లు నేరుగా పేషెంట్లతో మాట్లాడే వెసులుబాటు కలుగుతుంది. అయితే, కోవిడ్ సమయంలో కోవిడ్ నియంత్రణకు ఇదొక వరంలా మారింది. వైరస్ వ్యాపించకుండా అడ్డుకోవటంతోబాటు కోవిడేటర వైద్య చికిత్సకు కూడ వెసులుబాటు కలిగింది. ఇప్పటివరకు 23 రాష్ట్రాలు ఈ సంజీవనిని అమలు చేయగా మిగిలిన రాష్ట్రాలు కూడా త్వరలో ప్రారంభించబోతున్నాయి. తమిళనాడు ఒక్కటే 97,204  సలహా సంప్రదింపులు జరిపింది. అన్న్నీ ఈ-సంజీవని యాప్ మీద ఉన్నాయి, ఉత్తరప్రదేశ్ 65,173 సంప్రదింపులతో రెండో స్థానంలో నిలిచింది. హిమాచల్ ప్రదేశ్ 30,869 టెలి కన్సల్టేషన్లు జరిపిమూడో స్థానంలో నిలవగా, 30,189  కన్సల్టేషన్లతో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో, 28,173 కన్సల్టేషన్లతో కేరళ ఐదో స్థానంలో నిలిచాయి.

 

ఆగస్టు 26 నుంచి భారత ప్రభుత్వపు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సి జి హెచ్ ఎస్) కూడా ఢిల్లీలోని తమ లబ్ధిదారులకు ఈ సంజీవని ఒపిడి ద్వారా  ప్రత్యేకమైన ఆరోగ్య సేవలు అందించటం ప్రారంభించాయి. సి జి హెచ్ ఎస్  ఈసంజీవని ఒపిడి మీద నాలుగు ప్రత్యేక విభాగాలు ప్రారంభించింది.  అవి ఇ ఎన్ టి, మెడిసిన్, ఆప్తాల్మజీ, ఆర్థోపెడిక్ విభాగాలలో సేవలందిస్తున్నాయి.

***


(Release ID: 1652412) Visitor Counter : 217