రాష్ట్రప‌తి స‌చివాల‌యం

21వ శతాబ్దపు అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా జాతీయ విద్యా విధానం భారత దేశాన్ని ముందుకు నడిపిస్తుంది

ఎన్ఇపి భారత దేశాన్ని జ్ఞాన భూమిగా మారుస్తుంది

‘జాతీయ విద్యా విధానం 2020’ పైన గవర్నర్ల సదస్సును
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రారంభించారు

Posted On: 07 SEP 2020 2:15PM by PIB Hyderabad
‘జాతీయ విద్యా విధానం (ఎన్ఇపి) కేవలం ఒక పత్రం మాత్రమే కాదు... జాతి ఆకాంక్షలను సాకారం చేసే ఒక ప్రయత్నం’ అన్న ఏకాభిప్రాయంతో ఈ అంశంపైన ఒక రోజు వర్చువల్ సదస్సు ఈ రోజు (2020 సెప్టెంబర్ 7) ఉదయం ప్రారంభమైంది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ‘నిషాంక్’, గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు, రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల విద్యా శాఖల మంత్రులు, పాలనాధికారులు ఈ విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.
నూతన విద్యా విధానాన్ని ప్రభుత్వ పరిధికి పరిమితం చేయడం సరైంది కాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. సదస్సులో ప్రారంభోపన్యాసం చేసి చర్చకు శ్రీకారం చుట్టిన ప్రధాని ‘‘విదేశాంగ విధానం లేదా రక్షణ విధానం తరహాలోనే విద్యా విధానం కూడా ప్రభుత్వాలతో నిమిత్తం లేకుండా దేశానికి సంబంధించినది’’ అని ఉద్ఘాటించారు.
ఆ అభిప్రాయంతో ఏకీభవించిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, అన్ని సామాజిక తరగతుల నుంచీ వచ్చిన లక్షలాది సూచనల లోనుంచి భావనలకు రూపుకట్టడం ద్వారా... ఈ విధానాన్ని ఒక పొందికైన మరియు ప్రభావవంతమైన పత్రంగా మదించిన తీరును అభినందించారు. దేశాన్ని ఒక ‘జ్ఞాన భూమి’గా తీర్చిదిద్దే లక్ష్యం దిశగా ఈ విధానానికి మార్గనిర్దేశనం చేయడంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాత్రను కోవింద్ కొనియాడారు.
జాతీయ విద్యా విధానంపై గవర్నర్ల సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రపతికి స్వాగతం పలికారు. జాతీయ విద్యా విధానం అమలు ప్రక్రియలో ఈ సదస్సు చాలా ముఖ్యమైనదని ప్రధాని చెప్పారు. ఎన్ఇపిని అందరూ స్వాగతిస్తున్నారని, ఎందుకంటే.. అది వాళ్ల సొంతమైనదిగా ప్రజలు అంగీకరించారని పేర్కొన్నారు. ఏదైనా ఒక విధానం విజయవంతం కావడానికి ఈ అంగీకారమే పునాది అని ప్రధాని చెప్పారు. విస్తృతమైన భాగస్వామ్యం, తోడ్పాటు ఈ విధానం సొంతదన్న భావనకు దారి తీశాయని ఆయన పేర్కొన్నారు. ఈ విధానం కేవలం విద్యకు సంబంధించినది మాత్రమే కాదని, 21వ శతాబ్దపు నూతన సామాజిక - ఆర్థిక మార్పులకు ఇండియాను సిద్ధం చేస్తుందని కూడా ప్రధాని ఉద్ఘాటించారు. ‘ఆత్మ నిర్భర్ భారత్’ విధానానికి అనుగుణంగా స్వయం సమృద్ధి సాధించేందుకు ఈ విధానం దేశాన్ని సిద్ధం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే, ఎన్.ఇ.పి.ని విజయవంతం చేయాలంటే, దానిపై ఉన్న అన్ని సందేహాలను నివృత్తి చేయవలసి ఉందన్నారు. 
ప్రధాన మంత్రి ఎన్ఇపి మూల సూత్రాల విషయమై మాట్లాడుతూ, ఈ విధానం పాఠ్యాంశాలు – ప్రాక్టికల్ సామర్ధ్యం, లభ్యత - మదింపుల కంటే... అభ్యాసం, పరిశోధనలపై కేంద్రీకరించడం పైనే దృష్టి పెట్టిందని చెప్పారు. ఇప్పటిదాకా అనుసరించిన ‘అందరికీ ఒకటే కొలమానం’ దృక్పథం నుంచి బయట పడటానికి ఈ విధానం (ఎన్ఇపి) ఒక అసాధారణ ప్రయత్నమని ప్రధాని నొక్కి చెప్పారు. 
అభ్యాసంతో సంస్కృతి, భాష, సంప్రదాయాలను సమీకృతం చేయడం తప్పనిసరి అని, తద్వారా పిల్లలు సమగ్రమైన పద్ధతిలో అభ్యసించగలుగుతారని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. నూతన విధానం సరిగ్గా ఇదే అంశంపైన కేంద్రీకరించి కృషి చేసిందని పేర్కొన్నారు. విద్యార్ధులు తమకు ఇష్టం లేకపోయినా సమాజం ఒత్తిడితో కొన్ని విభాగాలను ఎంచుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల నుంచి మారుస్తూ, విద్యార్ధులు తమ అభిరుచి ప్రకారం ఏ విభాగాన్నైనా ఎంచుకునే వేదికను అందించడానికి జాతీయ విద్యా విధానం పథక రచన చేసిందని తెలిపారు. ఈ నేపథ్యంలో, వారికి వృత్తి విద్య అవకాశాన్ని కూడా కల్పించడం జరుగుతుందని, అది వారు ఉపాధి నైపుణ్యాలను సంపాదించడానికి దోహదం చేస్తుందని చెప్పారు. ప్రపంచ స్థాయిలో జ్ఞానానికి నాడీ కేంద్రంగా ఇండియాను తీర్చిదిద్దడానికి తగిన చర్యలు తీసుకోవలసి ఉందని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం ఇండియాలో ఉత్తమ అంతర్జాతీయ సంస్థలను ఏర్పాటు చేయవలసి ఉందన్నారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు సాంకేతిక పరిష్కారాలను ఉపయోగించుకోవలసి ఉందన్నారు. సాధారణ ప్రజలు భరించగలిగిన, అందుబాటులో ఉండే సౌకర్యాలను కల్పించడం ఎన్ఇపి ప్రాధాన్యత అని ప్రధాని స్పష్టం చేశారు.
నియంత్రణను సరళతరం, క్రమబద్ధీకరణ గావించిన విషయాన్ని కూడా ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. నిజానికి, ఆరోగ్యకరమైన పోటీని ప్రవేశపెట్టే దిశలో విద్యా సంస్థలకు గ్రేడులతో స్వయంప్రతిపత్తి కల్పించడం ఓ దశ అని ఆయన పేర్కొన్నారు. నాణ్యమైన ఉన్నత విద్యను అందించేందుకు ఈ చర్య సంస్థలకు స్ఫూర్తినిస్తుందని అభిప్రాయపడ్డారు. సెప్టెంబర్ 25 లోగా సాధ్యమైనన్ని యూనివర్శిటీలలో వర్చువల్ సదస్సులను నిర్వహించి, ఎన్ఇపి అమలు చేయడంపై చర్చను ప్రారంభించాలని ప్రధాన మంత్రి సూచించారు. 
మనవైపు నుంచి మార్పును స్వీకరించే లక్షణాన్ని మనం గరిష్టంగా చూపించినప్పుడే ఈ విధానం విజయవంతం అవుతుందని ప్రధానమంత్రి సదస్సు భాగస్వాములను ఉద్ధేశించి చెప్పారు. ఈ విధానం ఒక నిర్ధిష్ట ప్రభుత్వానిది కాదని, మొత్తం దేశానిదని ఆయన ఉద్ఘాటించారు. జాతీయ విద్యా విధానం ప్రజల ఆకాంక్షల ఫలితం అని, అందువల్ల ఈ విధానం ఉద్ధేశాలను, స్ఫూర్తిని తూ.చ. తప్పకుండా అమలు చేయడానికి అన్ని చర్యలూ తీసుకోవాలని ప్రధాని పునరుద్ఘాటించారు.
భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ ఈ సదస్సును ఉద్ధేశించి మాట్లాడుతూ, జాతీయ విద్యా విధానం (ఎన్ఇపి) దేశాన్ని, ముఖ్యంగా యువతను 21వ శతాబ్దపు అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు నడిపిస్తుందని చెప్పారు. ప్రధాన మంత్రి దార్శనిక నాయకత్వానికి, ఈ చారిత్రక పత్రం రూపకల్పనలో ఆయన పోషించిన స్ఫూర్తిమంతమైన పాత్రకు గాను రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ విద్యా విధానానానికి రూపమిచ్చినందుకు కమిటీ ఛైర్మన్ డాక్టర్ కస్తూరి రంగన్ ను, మంత్రులును, విద్యా మంత్రిత్వ శాఖ అధికారులను కూడా అభినందించారు. విస్తృతమైన ప్రక్రియ ద్వారా దేశంలోని 675 జిల్లాల్లో గల 2.5 లక్షల గ్రామ పంచాయతీలు, 12,500 స్థానిక సంస్థల నుంచి వచ్చిన రెండు లక్షల సూచనలను పరిగణనలోకి తీసుకున్నారని పేర్కొన్నారు. సమర్ధవంతంగా మార్పులను తీసుకురాగలిగితే భారత దేశం విద్యలో సూపర్ పవర్ గా అవతరిస్తుందని రాష్ట్రపతి విశ్వాసం వ్యక్తం చేశారు. 
రాష్ట్రాల విశ్వవిద్యాలయాల కులపతులుగా గవర్నర్లకు ఎన్ఇపి అమలులో కీలకమైన పాత్ర ఉంటుందని రాష్ట్రపతి చెప్పారు. దేశంలో 400 రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, వాటికి అనుబంధంగా 40,000 కళాశాలలు ఉన్నాయని, అందువల్ల వాటి మధ్య సమన్వయ సాధన, చర్చ తప్పనిసరి అని, విశ్వవిద్యాలయాల ఛాన్సలర్లు కూడా అయిన గవర్నర్ల ద్వారానే ఇది జరగవలసి ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు.  
సామాజిక న్యాయానికి విద్య అత్యంత ప్రభావవంతమైన మార్గమని రాష్ట్రపతి కోవింద్ ఉద్ఘాటించారు. అందువల్లనే జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో 6 శాతం మేరకు కేంద్రం, రాష్ట్రాలు విద్యపై వెచ్చించాలని జాతీయ విద్యా విధానం పిలుపునిచ్చిందని చెప్పారు. క్రియాశీలమైన ప్రజాస్వామిక సమాజం కోసం ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయడంపై ఎన్ఇపి కేంద్రీకరించిందని, అదే సమయంలో విద్యార్ధుల్లో ప్రాథమిక హక్కులు, విధులు, రాజ్యాంగ విలువలు, దేశభక్తి పట్ల గౌరవాన్ని పాదుకొల్పుతుందని అభిప్రాయపడ్డారు. 
ఎన్ఇపిని గవర్నర్లకు వివరిస్తూ... సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (ఎస్.ఇ.డి.జి.ల)కు అనేక కార్యక్రమాల ద్వారా ఈ విధానం ప్రాధాన్యత ఇచ్చిందని రాష్ట్రపతి కోవింద్ చెప్పారు. 2025 నాటికి ప్రాథమిక పాఠశాల స్థాయిలోని అందరు పిల్లలకూ పునాది అక్షరాస్యత, గణిత విద్యను అందించడం ఈ విధానంలో భాగమని తెలిపారు. 
ఎన్ఇపిలో అధ్యాపకుల పాత్రను రాష్ట్రపతి కోవింద్ నొక్కి చెప్పారు. నూతన విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయులు కేంద్రక పాత్ర కలిగి ఉంటారని, అత్యంత ఆశాజనకమైన వ్యక్తులు బోధనా వృత్తికి ఎంపికవుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ ధృక్కోణంతో ఉపాధ్యాయ విద్య కోసం ఒక కొత్త సమగ్రమైన పాఠ్య ప్రణాళికను వచ్చే ఏడాదికల్లా రూపొందించనున్నట్లు రాష్ట్రపతి వెల్లడించారు.
రాష్ట్రపతి కోవింద్ వృత్తి విద్య ప్రాధాన్యత గురించి మాట్లాడుతూ, భారత దేశ శ్రామిక జనంలో 5 శాతం కంటే తక్కువ మంది వృత్తి విద్యను అభ్యసించారని, పశ్చిమ దేశాలతో పోలిస్తే ఇది నామమాత్రమని వ్యాఖ్యానించారు. అందువల్ల ఎన్ఇపి వృత్తి విద్యను కూడా ప్రధాన విద్యా స్రవంతిలో భాగంగా గుర్తించిందని, ఇక వృత్తి విద్యకు కూడా సమాన ప్రతిపత్తిని ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. తద్వారా విద్యార్ధులు మరింత నిపుణులుగా మారడమే కాకుండా గౌరవం దక్కుతుందని, శ్రమను గౌరవించడం అలవడుతుందని రాష్ట్రపతి చెప్పారు.
ప్రాథమిక విద్యా దశలో బోధనా మాధ్యమంగా మాతృభాష ఉండాలన్నది విస్తృతంగా అంగీకరించబడిన అంశమని, అందువల్ల నూతన విధానం త్రి–భాషా సూత్రపు స్ఫూర్తిని స్వీకరించిందని రాష్ట్రపతి కోవింద్ చెప్పారు. భారతీయ భాషలు, కళలు, సంస్కృతిని ప్రోత్సహించడమనే ప్రయోజనం ఇందులో ఇమిడి ఉందని, గొప్ప భాషా వైవిధ్యం గల భారత దేశపు ఐక్యత, సమగ్రతలను కాపాడటంలో ఇదొక ముఖ్యమైన అంశమని ఆయన పేర్కొన్నారు.
నాణ్యమైన విద్యను సాధించే లక్ష్యంలో బహుళ అంశాల అధ్యయనం ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిందని, అందువల్ల నూతన విద్యా విధానం ప్రకారం.. బహుళ విభాగాల పరిశోధనా విశ్వ విద్యాయాలు (MERU) స్థాపించబడతాయని రాష్ట్రపతి చెప్పారు. ఇవి అర్హతగల, బహుముఖ, సృజన శీలురైన యువత అభివృద్ధికి దోహదం చేస్తాయన్నారు. తక్కువ లభ్యత ఉన్న ప్రాంతాల్లో ఉన్నత విద్యను అందించేందుకు... 2030 నాటికి ప్రతి జిల్లాలో లేదా సమీపంలో ఒక పెద్ద బహుళ విభాగపు ఉన్నత విద్యా సంస్థ ఏర్పాటు కావాలన్న లక్ష్యాన్ని నూతన విద్యా విధానం కింద నిర్దేశించుకున్నట్లు రాష్ట్రపతి చెప్పారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన సమూహాలకు నాణ్యమైన ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకెళ్ళడం కోసం ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. వీటికి తోడు భారత దేశాన్ని ప్రపంచ విద్యా గమ్యస్థానంగా తీర్చి దిద్దడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రతిష్టాత్మక విదేశీ విశ్వవిద్యాలయాలు భారత దేశంలో విద్యను అందించేందుకు అనుమతించాలనే యోచన ఉందని రాష్ట్రపతి తెలిపారు. 
ఈ విద్యా విధానం విజయవంతం కావడమన్నది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమర్ధవంతమైన సహకారంపై ఆధారపడి ఉందని రాష్ట్రపతి కోవింద్ అభిప్రాయపడ్డారు. విద్య రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో ఉందని గుర్తు చేస్తూ... దానికి కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయంతో కూడిన చర్య అవసరమని పేర్కొన్నారు. నూతన విద్యా విధానం అమలు కోసం కొంతమంది గవర్నర్లు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించారంటూ వారి ఉత్సుకతను రాష్ట్రపతి ప్రశంసించారు. ఆయా గవర్నర్లు సంబంధిత రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులు, విశ్వవిద్యాలయాల ఉప కులపతులతో చర్చకు శ్రీకారం చుట్టారని చెప్పారు. నూతన విధానం అమలుపై నిర్ధిష్ట అంశాల ఆధారంగా ఆన్ లైన్ సదస్సులను నిర్వహించాలని గవర్నర్లకు రాష్ట్రపతి సూచించారు. సూచనలను కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు పంపాలని, తద్వారా వాటిని దేశవ్యాప్తంగా ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు. గవర్నర్లు, విద్యా మంత్రుల ఇలాంటి సహకారం భారత దేశాన్ని ‘జ్ఞాన భూమి’గా మార్చడంలో సహాయపడుతుందంటూ రాష్ట్రపతి కోవింద్ తన ప్రసంగాన్ని ముగించారు.

***


(Release ID: 1652112) Visitor Counter : 305