ప్రధాన మంత్రి కార్యాలయం

జాతీయ విద్యావిధానం పై గవర్నర్ల సమావేశం ప్రారంభ సదస్సు ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి

Posted On: 07 SEP 2020 1:29PM by PIB Hyderabad

జాతీయ విద్యావిధానం పై గవర్నర్ల సమావేశం ప్రారంభ సదస్సు ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సమావేశానికి భారతదేశ రాష్ట్రపతి తో పాటు వివిధ రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, అన్ని రాష్ట్రాల విశ్వవిద్యాలయాల ఉప కులపతులు కూడా హాజరయ్యారు.

ఈ సందర్భం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, దేశం ఆకాంక్షలను నెరవేర్చడానికి విద్యావిధానం, విద్యావ్యవస్థ ముఖ్యమైన సాధనాలు అని స్పష్టంచేశారు.


విద్య బాధ్యత కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలదే అయినప్పటికీ విధాన రూపకల్పన లో వాటి జోక్యం కనీస స్థాయి లో ఉండాలని ప్రధాన మంత్రి అన్నారు.  మరింత ఎక్కువ మంది ఉపాధ్యాయులు, తల్లితండ్రులు, విద్యార్థులు విద్యావిధానం తో అనుబంధాన్ని ఏర్పరుచుకొన్నప్పుడు విద్యావిధానం ఔచిత్యం, సమగ్రత పెరుగుతాయని ఆయన అన్నారు. దేశంలో పల్లెల్లో, నగర ప్రాంతాల్లో నివసిస్తున్న లక్షలాది ప్రజల నుంచి, విద్యారంగం తో సంబంధం ఉన్నవారి వద్ద నుంచి అభిప్రాయాలను అందుకొన్న తరువాతే నూతన విద్యావిధానానికి రూపకల్పన చేసినట్లు కూడా ఆయన వివరించారు.  ఉపాధ్యాయులు, విద్యావేత్తలతో పాటు ప్రతి ఒక్కరు ఈ విధానాన్ని అక్కున చేర్చుకుంటున్నారని ఆయన అన్నారు.
 

ఈ విధానాన్ని అన్ని వర్గాలు ఆమోదిస్తున్నాయని, సంస్కరణలను ఇదివరకటి విద్యావిధానంలోనే ప్రవేశపెట్టి ఉండవలసిందన్న భావన ఏర్పడిందని ప్రధాన మంత్రి అన్నారు.  ఈ విధానం పై ఆరోగ్యకరమైన చర్చ జరుగుతూ ఉండటాన్ని ఆయన ప్రశంసించారు.  అలాంటి చర్చ అవసరం కూడా, ఎందుకంటే జాతీయ విద్యావిధానం (ఎన్ఇపి) కేవలం విద్యావ్యవస్థ ను సంస్కరించడంపైనే కాకుండా 21వ శతాబ్దపు భారతదేశ సామాజిక వ్యవస్థ కు, ఆర్థిక వ్యవస్థ కు ఒక కొత్త దిశ ను అందించడానికి కూడా ఉద్దేశించిందని ఆయన చెప్పారు.  ఈ విధానం భారతదేశాన్ని స్వయంసమృద్ధి తో కూడిన (ఆత్మనిర్భర్) భారతదేశం గా తీర్చిదిద్దడానికి ఉద్దేశించింది అని కూడా ఆయన అన్నారు.


శరవేగంగా మారుతున్న పరిస్థితులలో యువతను భావికాలానికి సన్నద్దం చేయాలన్నదే ఈ విధానం లక్ష్యమని ప్రధాన మంత్రి అన్నారు.  దేశ యువత ను జ్ఞానం పరంగా, నైపుణ్యాల పరంగా భవిష్యత్తు అవసరాల కు తగ్గట్టు సిద్దం చేయడానికి ఈ విధానాన్ని రూపొందించడమైందని ఆయన అన్నారు.


నూతన విద్యావిధానం చదువుకోవడం కన్నా నేర్చుకోవడం పై శ్రద్ధ వహిస్తుందని, పాఠ్యప్రణాళిక పరిధి కి అతీతం గా పయనిస్తూ జిజ్ఞాస ను అలవర్చే ఆలోచనలు చేసేందుకు పెద్దపీట వేస్తుందని ప్రధాన మంత్రి తెలిపారు.  ప్రక్రియ కన్నా అభినివేశానికి, ఆచరణీయతకు, పనితీరు కు మరింత ప్రాధాన్యతనిచ్చారని ఆయన చెప్పారు.  నూతన విద్యావిధానం నేర్చుకోవడం తాలూకు ఫలితాలు, ఉపాధ్యాయుల శిక్షణ, ప్రతి ఒక్క విద్యార్థి సాధికారత పై శ్రద్ధ వహిస్తుంది అని ఆయన అన్నారు.
   

నూతన విద్యావిధానం భారతదేశాన్ని 21వ శతాబ్దంలో ఒక జ్ఞానభరిత ఆర్థిక వ్యవస్థ గా రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకొందని ప్రధాన మంత్రి అన్నారు.  నూతన విద్యావిధానం ప్రముఖ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు భారతదేశంలో ఆఫ్ షోర్ క్యాంపస్ లను నెలకొల్పేందుకు అవకాశాలను కూడా కల్పిస్తుందని ఆయన తెలిపారు.  దీనితో మేధావుల వలస సమస్య కు పరిష్కారం లభించగలదని ప్రధాన మంత్రి చెప్పారు.

నూతన విధానాన్ని ఎలా అమలులోకి తీసుకురావాలని ప్రస్తుతం దేశం లో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయని ప్రధాన మంత్రి అన్నారు.  భయాందోళనలను తొలగించేందుకు విద్యారంగం తో భాగస్వామ్యం ఉన్న అన్ని వర్గాల సూచనలను, సలహాలను ఓపిక తో అరమరికలకు తావు లేకుండా వినడం జరుగుతోందని కూడా ఆయన వివరించారు.  ఈ విద్యావిధానం ప్రభుత్వం విద్యావిధానం కాదని, ఇది దేశం యొక్క విద్యావిధానం అని ఆయన తేల్చి చెప్పారు.


జాతీయ విద్యావిధానం శరవేగం గా మారుతున్న కాలానికి అనువుగా రూపొందిందని ప్రధాన మంత్రి అన్నారు.  ప్రాంతీయ, సామాజిక అసమానతల ను పరిష్కరించడం లో సాంకేతిక విజ్ఞానం హెచ్చుతగ్గులకు తావు లేకుండా చూస్తోందని ప్రధాన మంత్రి చెప్తూ, అలాగే సాంకేతిక విజ్ఞానం విద్య పై సైతం ఒక గొప్ప ప్రభావాన్ని ప్రసరిస్తోందన్నారు.

ఉన్నత విద్య లో విద్యా విభాగం, సాంకేతిక విద్యా విభాగం, వృత్తివిద్యావిభాగం మొదలైన ప్రతి ఒక్క విభాగాన్ని కూడా గిరి గీసుకొని పరిమిత లక్ష్యాలతో పనిచేసే పద్దతి ని త్రోసిరాజని, వాటిని సమగ్రంగా మలచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.


ఎన్ఇపి -2020 స్ఫూర్తి ని తు.చ. తప్పకుండా అమలు చేయాలని ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు.

***

 



(Release ID: 1652002) Visitor Counter : 229