గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

గ్రామీణ అంకుర సంస్థల వ్యవస్ధాపకత కార్యక్రమం (ఎస్.వి.ఈ.పి) గ్రామీణ ప్రాంతాల్లోని సంస్థలను ముందుకు నడిపిస్తోంది, గ్రామీణ పారిశ్రామికవేత్తలను తయారుచేస్తోంది


ఎస్.వి.ఈ.పి. వ్యాపార సహాయ సేవలను మరియు మూలధన సహాయాన్ని 23 రాష్ట్రాలలోని 153 బ్లాక్‌లకు విస్తరించింది

2020 ఆగష్టు నాటికి, సుమారు ఒక లక్ష సంస్థలకు మద్దతు ఇస్తుండగా - అందులో 75 శాతం సంస్థలు మహిళల యాజమాన్యం, నిర్వహణలోలో ఉన్నాయి

Posted On: 05 SEP 2020 1:07PM by PIB Hyderabad

కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ,  దీన్ దయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (డి.ఏ.వై-ఎన్.ఆర్.ఎల్.ఎమ్)  ద్వారా  గ్రామీణ అంకుర సంస్థల వ్యవస్ధాపకత కార్యక్రమం (ఎస్.వి.ఈ.పి)  2016 నుండి ఉప పథకంగా అమలౌతోంది.  గ్రామీణ పేదలు పేదరికం నుండి బయటపడడానికి మద్దతు ఇవ్వాలనే లక్ష్యంతో,  సంస్థలను ఏర్పాటు చేయడానికి మరియు సంస్థలను స్థిరీకరించే వరకు సహాయాన్ని అందించడానికి వారికి మద్దతు ఇవ్వడం కోసం ఈ కార్యక్రమాన్ని అమలుచేయడం జరుగుతోంది.  సంస్థల అభివృద్ధి కోసం స్థానిక కమ్యూనిటీ క్యాడర్లను సృష్టించేటప్పుడు ఆర్థిక సహాయం మరియు వ్యాపార నిర్వహణ, నైపుణ్యాలపై శిక్షణతోపాటు స్వయం ఉపాధి అవకాశాలను అందించడంపై ఎస్.వి.ఈ.పి. దృష్టి పెడుతుంది.

ఎస్.వి.ఈ.పి. గ్రామీణ అంకురసంస్థల యొక్క ఆర్ధిక, ఇంక్యుబేషన్ మరియు నైపుణ్యాలకు సంబంధించిన పర్యావరణ వ్యవస్థ వంటి  మూడు ప్రధాన సమస్యలను పరిష్కరిస్తుంది.  గ్రామీణ సంస్థలను ప్రోత్సహించడానికిగాను, ఎస్.వి.ఈ.పి. క్రింద కార్యకలాపాలను వ్యూహాత్మకంగా రూపొందించబడ్డాయి.  కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ - ఎంటర్ప్రైజ్ ప్రమోషన్ (సి.ఆర్.పి-ఈ.పి) ను అభివృద్ధి చేయడం, ఈ కార్యక్రమ కీలక అంశాలలో ఒకటి.   స్థానికంగా ఉండే వీరు, గ్రామీణ సంస్థలను ఏర్పాటు చేసే వ్యవస్థాపకులకు మద్దతు ఇస్తారు.  SVEP బ్లాకులలో బ్లాక్ రిసోర్స్ సెంటర్ (బి.ఆర్.సి) ని ప్రోత్సహించడం, కమ్యూనిటీ రిసోర్స్ వ్యక్తులను పర్యవేక్షించడం మరియు నిర్వహించడం, ఎస్.వి.ఈ.పి. రుణ దరఖాస్తును అంచనా వేయడం మరియు సంబంధిత బ్లాక్‌లోని సంస్థకు చెందిన సమాచారం యొక్క రిపోజిటరీగా పనిచేయడం అనేది మరొక కీలక మైన అంశం.  సమర్థవంతంగా మరియు స్వతంత్రంగా పనిచేయడానికి స్థిరమైన ఆదాయ నమూనాకు మద్దతు ఇవ్వడానికి బి.ఆర్.సి. లూస్ తనపాత్ర ను పోషిస్తాయి.

కొత్త సంస్థలను ఏర్పాటు చేయడానికీ, ఉన్న సంస్థలను బలోపేతం చేయడానికీ, గ్రామీణ సమాజాలను సమీకరించడంపై ఎస్.వి.ఈ.పి. మొదలు పెట్టిన ప్రారంభ సంవత్సరాల్లో దృష్టి సారించింది.  బి.ఆర్.సి. సభ్యుల కోసం వ్యాపార నిర్వహణ అంశాలపై శిక్షణ మరియు సామర్థ్యం పెంపుపై పెట్టుబడి పెట్టింది. సి.ఆర్.పి-ఈ.పి. లతో ఒక బృందాన్ని తయారుచేసి, వారికి తీవ్రమైన శిక్షణ ఇచ్చింది.  వ్యవస్థాపకులకు వారి ప్రస్తుత సంస్థలను పెపొందించుకోడానికీ, కొత్త సంస్థలను స్థాపించడానికీ అవసరమైన సహాయ, సహకారాలను అందించింది. 

గత కొన్ని సంవత్సరాలుగా, ఎస్.వి.ఈ.పి. అద్భుతమైన పురోగతి సాధించింది.  2020 ఆగష్టు నాటికి 23 రాష్ట్రాలలో 153 బ్లాకులకు వ్యాపార సహాయ సేవలతో పాటు, మూలధన తోడ్పాటు నందించింది.  కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్-ఎంటర్‌ప్రైజ్ ప్రమోషన్ (సి.ఆర్.‌పి-ఈ.పి) శిక్షణ పొందిన 2 వేల మంది కార్యకర్తలు గ్రామీణ పారిశ్రామికవేత్తలకు అవసరమైన సేవలందిస్తున్నారు. 2020 ఆగష్టు నాటికి, సుమారు లక్ష సంస్థలకు వీరు సహాయ, సహకారాలు అందించారు.  ఎస్.వి.ఈ.పి. కి, అహ్మదాబాద్‌లోని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్ (ఈ.డి.ఐ.ఐ), సాంకేతిక సహాయ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. 

క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 2019 సెప్టెంబరు నెలలో నిర్వహించిన ఎస్.వి.ఈ.పి. యొక్క మధ్యకాలిక సమీక్ష నివేదించిన బ్లాకులలో సర్వే చేసిన వ్యవస్థాపకులలో 82 శాతం మంది, ఎస్.సి., ఎస్.టి. మరియు ఓ.బి.సి. వర్గాల వారు ఉన్నట్లు పేర్కొంది. ఇది, ఎన్.ఆర్.ఎల్.ఎం. ముఖ్య ఆశయాలలో ఒకటైన సామాజిక చేరికను సూచిస్తుంది.   వీటిలో 75 శాతం సంస్థలను మహిళలు స్వంతంగా నిర్వహిస్తున్నారు. ఈ సంస్థల సగటు నెలసరి ఆదాయం తయారీ రంగంలో 39,000 - 47,800 రూపాయలుగా; సేవల విషయంలో 41,700 రూపాయలుగా,  ట్రేడింగ్ రంగంలో 36,000 రూపాయల వరకు ఉంది. వ్యవస్థాపకుల మొత్తం గృహ ఆదాయంలో 57 శాతం ఎస్.వి.ఈ.పి. సంస్థల ద్వారా అని అధ్యయనం ద్వారా వెల్లడయ్యింది. 

ఎస్.వి.ఈ.పి. వ్యక్తిగత మరియు సమూహ సంస్థలను ప్రోత్సహిస్తుంది, ప్రధానంగా తయారీ, వాణిజ్య మరియు సేవా రంగాలపై సంస్థలను ఏర్పాటు చేస్తుంది, ప్రోత్సహిస్తుంది.  స్థానిక డిమాండ్ మరియు పర్యావరణ వ్యవస్థ ఆధారంగా వ్యాపారాలను లాభదాయకంగా నడిపించే వ్యవస్థాపకుల సామర్థ్యాలను పెంపొందించడానికి ఈ కార్యక్రమం ఎక్కువగా పెట్టుబడి పెట్టింది.  సి.ఆర్.పి-ఈ.పి. లు ధృవీకరించబడ్డాయి మరియు వ్యవస్థాపకులకు వ్యాపార సహాయ సేవలను అందిస్థాయి.  వ్యాపార ప్రణాళిక మరియు లాభ, నష్టాల ఖాతా తయారీ వంటి సాంకేతిక అంశాలలో ప్రసార నష్టాన్ని తగ్గించడానికి ప్రామాణిక ఇ-లెర్నింగ్ మాడ్యూళ్ళను రూపొందించడానికి ఐ.సి.టి. ని ఉపయోగించడంపై ఎస్.వి.ఈ.పి. కింద పెట్టుబడులు పెట్టడం కూడా జరుగుతాయి.

కోవిడ్ మహమ్మారికి ప్రతిస్పందన : 

దేశం కరోనావైరస్ మహమ్మారి (కోవిడ్ -19) తో పోరాడుతున్న నేపథ్యంలో, డి.ఏ.వై-ఎన్.ఆర్.ఎల్.ఎం. కు చెందిన మహిళా స్వయం సహాయక సంఘాలు సమర్థవంతమైన ఫ్రంట్‌ లైన్ ప్రతిస్పందనగా ముందుకు వచ్చాయి.  గ్రామీణ వర్గాలకు,  అత్యంత హాని కలిగించే జనాభాకు, తక్షణ ఉపశమనం కలిగించే విధంగా సేవలందించారు.  ఇక్కడ పరిస్థితి యొక్క బాధ్యతలను ఈ స్వయం సహాయక మహిళలు తమ భుజాన వేసుకున్నారు. దేశవ్యాప్తంగా మాస్కులు, రక్షిత పరికరాలు, శానిటైజర్లు, హ్యాండ్ వాష్ వంటి అనేక నాణ్యమైన ఉత్పత్తులను ఉత్పత్తి చేయడంలో బలమైన శక్తి ‌గా అవతరించారు.  వీరు ఉత్పత్తి చేసిన వస్తువులను స్థానిక పాలనా యంత్రాంగం సేకరించి, వివిధ భాగస్వాములకు పంపిణీ చేసింది. ఇతరుల అవసరాలను తీర్చే సమయంలో, ఈ స్వయం సహాయక గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలు తమకు తాము ఆదర్శంగా నిలబడి, అదనపు ఆదాయాన్ని సమకూర్చుకున్నారు. 

2020 ఆగష్టు 14వ తేదీ నాటికి, ఫేస్ మాస్కులు, రక్షిత వస్తు సామగ్రి, శుభ్రపరిచే ఉత్పత్తుల తయారీలో సుమారు 3,18,413 మంది స్వయం సహాయక సంఘ సభ్యులు నిమగ్నమై ఉన్నారు. 29 రాష్ట్రాల్లోని మహిళా స్వయం సహాయక సంఘ సభ్యులు, 903 కోట్ల రూపాయల అంచనా టర్నోవర్ తో,  23.07 కోట్ల ఫేస్ మాస్కులు, 1.02 లక్షల లీటర్ల హ్యాండ్ వాష్ మరియు 4.79 లక్షల లీటర్ల కు పైగా శానిటైజర్ ‌ను ఉత్పత్తి చేశారు.  లాక్ డౌన్ సమయంలో దేశంలో చాలా వ్యాపారాలు నిలిచిపోగా, ఈ గ్రామీణ మహిళలు ఒక్కొక్కరూ సుమారు 29,000 రూపాయల మేర అదనపు అంచనా ఆదాయాన్ని ఆర్జించారు.

ఈ మహిళల స్వయం సహాయక సంఘాలు ఉత్పత్తి చేసిన ఫేస్ మాస్కులు కోవిడ్-19 లాక్ ‌డౌన్ సమయంలో అత్యంత విజయవంతమైన ఉత్పత్తిగా పేరు గాంచాయి.  59 వేల స్వయం సహాయక సంఘాలకు చెందిన 2.96 లక్షల మంది సభ్యులు దాదాపు 150 రోజుల్లో 23.37 కోట్ల ఫేస్ మాస్కులను ఉత్పత్తి చేశారు.  357 కోట్ల రూపాయల వ్యాపార విలువైన ఈ  ఉత్పత్తులను ప్రభుత్వ సేకరణ ద్వారా ప్రజలకు సరఫరా చేస్తున్నారు.

కొంతమంది మహిళా స్వయం సహాయక సంఘాలు కమ్యూనిటీ వంటశాలలు నడుపుతూ, 5.72 కోట్లకు పైగా నిరుపేదలు, బలహీన సంఘ సభ్యులకు వండిన భోజనం అందజేస్తున్నారు.

కొన్ని రాష్ట్రాల నుండి మహిళా పారిశ్రామికవేత్తలు చేపట్టిన కార్యక్రమాలు క్రింద పేర్కొనబడ్డాయి:

శ్రీమతి శారదా దేవి : బీహార్

బోధ్ గయా బ్లాక్‌కు చెందిన అతియా పంచాయతీలోని ఖాజావతి గ్రామానికి చెందిన పారిశ్రామికవేత్త శ్రీ దిలీప్ కుమార్ 2018 లో రెడీమేడ్ బట్టలు (పిల్లల బట్టలు, పైజామా మొదలైనవి) తయారీని ప్రారంభించారు.  ఏక్తా సి.ఎల్.‌ఎఫ్. ఆధ్వర్యంలోని ఆనంద్ గ్రామ సంస్థ రామ్ ఎస్.‌హెచ్.‌జి. సభ్యురాలైన అతని భార్య శ్రీమతి శారదా దేవి, కేవలం 30 రోజుల్లో 18,565 మాస్కులు తయారు చేసి రికార్డు సృష్టించింది.  బోధ్ గయ లోని బి.ఆర్.సి. (ఎస్.వి.ఈ.పి) నుండి 50,000 రూపాయల ఆర్ధిక సహాయం తీసుకుని ప్రత్యేకమైన కుట్టు యంత్రాన్ని (సహాయక యూనిట్లతో పాటు) ఆమె కొనుగోలు చేయడంతో ఈ ఉత్పత్తి సాధ్యమైంది.  మరో 60,000 రూపాయల రుణాన్ని దిలీప్ కుమార్ అందుకున్నారు. దీనికి తోడు స్వంత వ్యాపారం నుండి 1.28 లక్షల రూపాయల ఈక్విటీని కూడా ఇందు కోసం సమకూర్చారు. 

ఆమె తయారుచేసిన మాస్కులను జిల్లా పాలనా యంత్రాంగం మరియు వివిధ ప్రభుత్వ విభాగాలు తులనాత్మకంగా అధిక ధరలకు కొనుగోలు చేశాయి.  కేవలం 30 రోజుల్లో అమ్మకాలు 3.71 లక్షల రూపాయలకు చేరుకున్నాయి.  అందులో ఆమె ఈ వ్యాపారంలో కనీసం 1.68 లక్షల రూపాయల లాభాన్ని ఆర్జించింది.  భవిష్యత్తులో సంభవించే వ్యాపార విపత్తు నుండి తనను రక్షించడానికి ముందుకు వచ్చినందుకు ఆమె బి.ఆర్.సి. బోధ్ గయ బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు.  2019-20 ఆర్ధిక సంవత్సరానికి బిజినెస్ టర్నోవర్ 6.50 లక్షల రూపాయలకు చేరింది.  ఇది 2018-19 ఆర్థిక సంవత్సరంలో 1.80 లక్షల రూపాయల లాభాన్ని ఆర్జించింది.

శ్రీమతి భాగ్యశ్రీ లోంధే : మహారాష్ట్ర

శ్రీమతి భాగ్యశ్రీ లోండే, 2014 లో బార్షి తాలూకాలోని జహాన్పూర్ గ్రామంలోని జిజావు స్వయం సహాయక సంఘంలో చేరారు, అక్కడ వివిధ సామాజిక  విషయాలలో పాల్గొనడానికి, నేర్చుకోవడానికి, చర్చించడానికి ఆమెకు అవకాశం లభించింది. సఖి మహిళా గ్రామ సంఘ్ (వి.ఓ) ను భాగ్యశ్రీ ఏర్పాటు చేసింది, ఇది ఉన్నతమైన శిక్షణ తీసుకోడానికి ఆమెకు సహాయపడింది. ముందుగా, ఆమె జిజావుమాసాలా, అప్పడాలు, ఊరగాయల వంటి చిన్న వ్యాపారాన్ని ప్రారంభించింది. 

 

భాగ్యశ్రీ కి 2016 మే నెలలో, ఎస్.వి.ఈ.పి. బి.ఆర్.సి., బార్షి నుండి సి.ఈ.ఎఫ్. గా 45,000 రూపాయల రుణం లభించింది. దీంతో, స్థానికంగా లభించే సేంద్రీయ ముడి పదార్థాలను వినియోగించి, ఒక వైపు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకుంటూ, మరొక వైపు వినియోగదారులకు స్థానిక రుచులను అందించడానికి కృషి చేశారు.   ఆమె ముంబైలోని మహాలక్ష్మి సరస్ 2019-2020 లో పాల్గొన్నారు.  అక్కడ ఆమె 10 రోజులలో ఐదు 5 లక్షల రూపాయల మేర వ్యాపారం చేసి, 1.50 లక్షల రూపాయల లాభాన్ని ఆర్జించారు. 

 

ఆమె అక్కడితో ఆగకుండా, ఆమె వ్యాపారాన్ని పెంచడానికీ, ఉత్పత్తులను సమీప పట్టణాలకు మార్కెట్ చేయడానికకీ, అజీవికా గ్రామీణ ఎక్స్‌ప్రెస్ యోజన (ఏ.జి.ఈ.వై) కింద ఒక వాహనం తీసుకున్నారు.  (ఏ.జి.ఈ.వై. అనేది గ్రామం నుండి సమీప పట్టణాలకు గ్రామీణ అనుసంధానం ప్రోత్సహించడానికి డి.ఏ.వై-ఎన్.ఆర్.ఎల్.ఎమ్. యొక్క ఉప-పథకం) ఫలితంగా కార్యకలాపాల స్థాయి పెరిగింది. యూనిట్ రోజుకు 60 కిలోల మసాలా, 300 ప్యాకెట్ల ఊరగాయల ఉత్పత్తి స్థాయికి చేరింది. దీంతో రాబడి నెలకు 45,000 రూపాయలకు చేరింది. కోవిడ్-19 లాక్ డౌన్ సమయంలో, కూరగాయలు మరియు ఇతర కిరాణా సామాగ్రిని రైతుల నుండి నేరుగా వినియోగదారులకు వారి ఇంటి వద్ద విక్రయించే అవకాశాన్ని ఆమె తీసుకున్నారు. 

 

తన వ్యాపారాన్ని కొనసాగించడానికి, మరింత తెలుసుకోవాలనే భాగ్యశ్రీ ఉత్సాహం, యశ్వంత్ రావు మహారాష్ట్ర సార్వజనిక విశ్వవిద్యాలయం నుండి తన 10 వ తరగతి పూర్తి చేయడానికి సహాయపడింది.  యు.ఎమ్.ఈ.డి-డి.ఏ.యు-ఎన్.ఆర్.ఎల్.ఎమ్. తో ఆమెకు పరిచయం అయిన తర్వాతే ఇది జరిగింది.  ఆమె ఎన్.‌ఆర్.‌ఎల్.‌ఎం. నుంచి కృషి సఖి, వ్యాపారాభివృద్ధి శిక్షణ పొందారు. అలాగే,  షోలాపూర్ కృషి విజ్ఞాన కేంద్రం నుండి జొన్న ప్రాసెసింగ్, ఫోస్టాక్ శిక్షణలతో పాటు, వివిధ శిక్షణాలను కూడా ఆమె తీసుకున్నారు.  వ్యవస్థాపకురాలిగా భాగ్యశ్రీ వ్యాపారం చేసే కళను నేర్చుకున్నారు.  జిజావు గృహ ఉద్యోగ్ ద్వారా ఆమె అనేక మహిళా కార్మికులకు ఉపాధి కల్పించారు.  కొత్త ఉత్పత్తులను ప్రారంభించటానికీ, మరిన్ని యంత్రాలను కొనడానికీ, వారి వ్యాపారాన్ని విస్తరించడానికీ, వారు కొత్త మార్కెట్ మార్గాలను అన్వేషిస్తున్నారు. 

శ్రీమతి పూనం: ఉత్తర ప్రదేశ్

చాలా గౌరవప్రదమైన కుటుంబం నుండి వచ్చిన శ్రీమతి పూనమ్ తన ఆర్థిక సమస్యలను, సామాజిక నిషేధాలను అధిగమించి, ఉత్తర ప్రదేశ్ లోని నజీబాబాద్ బ్లాక్ నుండి "ఉత్తమ సి.ఆర్.పి-ఈ.పి. ప్రదర్శకురాలు" బిరుదును సంపాదించడానికి ముందుకు సాగారు.  స్వయం సహాయక సంఘ సభ్యురాలిగా, ఆమె తన ప్రయాణం ప్రారంభించింది. స్వతంత్రంగా జీవిస్తూ, ఇతరులకు సహాయపడాలనే కోరిక,  ఆమెను ఎస్.వి.ఈ.పి. క్రింద సి.ఆర్.పి-ఈ.పి. గా చేరడానికి ప్రేరేపించింది.  బి.ఈ.డి. పూర్తి చేసిన తరువాత, ఆమె ఒక ప్రయివేటు పాఠశాల ఉపాధ్యాయుడిని వివాహం చేసుకుంది.  వివాహం తర్వాత, ఆమె కేవలం ఇంటి పనులకు మాత్రమే పరిమితం చేయబడింది.   అయితే, ఆమె బయటకు వచ్చి స్వయం సహాయక బృందం లో చేరగలిగింది. ఇది, ఆమె  దృక్పథాన్ని మార్చి స్వతంత్రంగా జీవించడానికి అవకాశం కల్పించింది.  స్వయం సహాయక సంఘానికి చెందిన సముహ్ సఖి,  పూనమ్ ‌ను ఎస్.‌వి.ఈ.పి. కార్యక్రమానికి పరిచయం చేసింది.  వ్యవస్థాపకురాలిగా మారాలనే ఆమె అభిరుచి, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోడానికి తోడ్పడింది. పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన అనంతరం, ఆమె కఠినమైన 54 రోజుల సి.ఆర్.పి-ఈ.పి. శిక్షణ పూర్తిచేసుకున్నారు.  సంస్థ అభివృద్ధి గురించీ, స్థిరమైన జీవనోపాధిని ప్రోత్సహించడానికి అది నిర్వహిస్తున్న పాత్ర గురించీ, ఆమె, అక్కడ, వివరంగా తెలుసుకున్నారు. 

పూనమ్ తన అనుభవాలను వివరిస్తూ, “నేను చదువుకున్న తర్వాత కూడా పెద్దగా ఏమీ చేయలేక పోయాను.  అయితే, ఎస్.వి.ఈ.పి. కారణంగా, నేను స్వతంత్రంగా జీవిస్తున్నాను. నా స్వంత జీవనోపాధిని సంపాదిస్తున్నాను.  అలాగే ఇతరులు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించుకోడానికి సహాయపడుతున్నాను. ఇది నాకు ఎంతో సంతృప్తిని ఇస్తోంది.” అని పేర్కొన్నారు.   వ్యాపార ప్రణాళికలు, నెలవారీ సంప్రదింపులు, రుణాలు మరియు మార్కెట్ అనుసంధానం వంటి విషయాలలో, ఆమె సుమారు 40 సంస్థలకు సహకరిస్తున్నారు. ఆమె అంకితభావం మరియు నేర్చుకోవాలనే ఉత్సాహం ఆమె కలలను సాకారం చేసుకోడానికి సహాయపడ్డాయి. బ్లాక్‌ లో కార్యక్రమం విజయవంతంగా అమలు చేయడానికి దోహదపడ్డాయి. 

ఎస్.వి.ఈ.పి. లో మార్కెట్ ఒక  ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది : హర్యానా 

స్థానిక మార్కెట్లు / హాట్ / బజార్లు వారానికి ఒకటి లేదా రెండు సార్లు, వారాంతాల్లో లేదా నెలవారీ గ్రామీణ భారతదేశం అంతటా పనిచేస్తాయి. ఇవి ఒక ముఖ్యమైన ఆర్థిక వేదికగా పనిచేస్తాయి. ఇక్కడ వ్యవసాయ ఉత్పత్తులు, ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, మూలికలు, పౌల్ట్రీ ఉత్పత్తులు, కిరాణా, ఫాన్సీ వస్తువులు, బట్టలు, పాత్రలు, పాదరక్షలు, సుగంధ ద్రవ్యాలు వంటి రోజువారీ వస్తువుల క్రయ, విక్రయాలు జరుగుతాయి.   ఒక సాధారణ గ్రామీణ హాట్ లలో ఎక్కువగా దేశీయ, సౌకర్యవంతమైన మరియు బహుళ స్థాయిలో ఉంటాయి. ఇవి వివిధ రకాల ఆర్ధిక కార్యకలాపాలకు అనుగుణంగా ఉంటాయి.  వివిధ పండుగలు, ఉత్సవాలను వినియోగించుకోవడంతో పాటు, స్థానిక పారిశ్రామికవేత్తల మార్కెట్ ఉత్పత్తుల కోసం పింజూరు మరియు ఘరౌండా ల్లోని ఎస్.వి.ఈ.పి.  బ్లాకులలో,   హర్యానా రాష్ట్ర మిషన్, స్థానిక హాట్ లను ఏర్పాటు చేసింది.  ఈ మార్కెట్లను స్థాపించడానికి వివిధ శాఖలతో సమన్వయం చేసుకోవడంలో స్థానిక పంచాయతీతో పాటు జిల్లా, బ్లాక్ యూనిట్లు ముఖ్యమైన పాత్ర పోషించాయి.

ఈ స్థానిక మార్కెట్లను స్థాపించడం ఎస్.వి.ఈ.పి. వ్యవస్థాపకులను డిమాండ్ ఆధారిత ఉత్పత్తిని చేపట్టడానికి, వారి సంస్థను ప్రచారం చేయడానికి మరియు సంపాదించే అవకాశాలను పెంచడానికి ప్రేరేపించింది.  రెండు బ్లాకులలో, హస్తకళలు, ఇంట్లో తయారుచేసిన ఊరగాయలు, మసాలా పౌడర్లు, జనపనార ఉత్పత్తులు మరియు ఉన్ని ఉత్పత్తులు వంటి కొత్త ఉత్పత్తులను పరిచయం చేయడంలో ఈ మార్కెట్లు చాలా బాగా పనిచేశాయి.  సుమారు 200 సంస్థలకు చెందిన ఎస్.‌వి.ఈ.పి. వ్యవస్థాపకులు హర్యానాలోని 2 బ్లాకులలో ఏర్పాటు చేసిన 8 గ్రామీణ మార్కెట్లలో తమ ఉత్పత్తులను విక్రయించి 6.31 లక్షల రూపాయల ఆదాయాన్ని ఆర్జించారు.

*****

 



(Release ID: 1651702) Visitor Counter : 456