ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
వైరస్ వ్యాప్తి గొలుసును క్రియాశీలంగా అడ్డుకోవాలని, మరణాల రేటును 1 శాతం కంటే దిగువకు తేవాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ హితవు
కేసుల మోతాదు, మరణాలు ఎక్కువగా కనిపిస్తున్న నాలుగు రాష్ట్రాల్లోని 15 జిల్లాల్లో ‘కోవిడ్’ అదుపు & స్పందన తీరుపై కేంద్ర ఆరోగ్య శాఖ సమీక్ష
Posted On:
04 SEP 2020 6:58PM by PIB Hyderabad
కోవిడ్ కేసులు అధికంగా నమోదవుతున్న 15 జిల్లాలకు సంబంధించి నాలుగు రాష్ట్రాల - ఆంధ్రప్రదేశ్, పంజాబ్, కర్నాటక, తమిళనాడు - ఆరోగ్య శాఖల కార్యదర్శులతో నేడు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆ 15 జిల్లాల్లో చిత్తూరు, ప్రకాశం, మైసూరు, బెంగళూరు అర్బన్, బళ్లారి, కొప్పల్, దక్షిణ కన్నడ, దావణగెరె, లూధియానా, పాటియాలా, చెన్నై, కోయంబత్తూర్, సాలెం, లక్నో, కాన్పూర్ నగర్ ఉన్నాయి. ఆయా జిల్లాల్లో కోవిడ్-19 యాక్టివ్ కేసుల సంఖ్య, మరణాల రేటు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గత నాలుగు వారాల్లో కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఆయా రాష్ట్రాల ఆరోగ్య శాఖల కార్యదర్శులతో పాటు జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర జిల్లా స్థాయి అధికారులు ఈ డిజిటల్ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.
కోవిడ్ పరీక్షలు, పాజిటివ్ రేటు, మరణాల రేటు వంటి కీలక పరామితుల విషయంలో ఆయా జిల్లాల స్థితి, పని తీరుపై ఉన్న సమాచారాన్ని కేంద్ర కార్యదర్శి స్థూలంగా వివరించారు. నియంత్రణ చర్యల కొనసాగింపు అవసరం, పరీక్షల పెంపు, పేషెంట్లకు వైద్య- పరీక్షల ప్రక్రియ అమలు వంటి అంశాలపై ఆయన కేంద్రీకరించారు. రాష్ట్రాల ఆరోగ్య శాఖల కార్యదర్శులు ఈ 15 జిల్లాల్లో కోవిడ్ ప్రస్తుత పరిస్థితిపై లోతైన విశ్లేషణను ఈ సందర్భంగా కేంద్ర కార్యదర్శి ముందుంచారు. నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, వైరస్ బాధితులతో సహచరించినవారిని కనిపెట్టడం, నిఘా చర్యలు, కేంద్రాల వారీగా మరణాల రేట్లు, వారాల వారీగా కొత్త కేసులు - మరణాల పరంగా మారుతున్న పరిస్థితులు తదితర అంశాలు వారు సమర్పించిన వివరాల్లో ఉన్నాయి. వచ్చే నెల రోజుల కోసం రూపొందించిన కార్యాచరణ ప్రణాళికలను కూడా వారు వెల్లడించారు.
జిల్లాలో నిర్వహించిన ఆర్.టి - పి.సి.ఆర్, ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షల విభజన, లక్షణాలున్నా యాంటీజెన్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చిన కేసులకు సంబంధించి పున:పరీక్షల శాతం, పరీక్షా ప్రయోగశాలల వినియోగం, గృహాలలోనే విడిగా ఉంటున్న కేసుల స్థితి, ఆసుపత్రుల్లో చేరుతున్న కేసుల స్థితి, ఆక్సిజన్ సదుపాయం ఉన్న పడకలు నిండుతున్న తీరు, ఐసియు పడకలు, వెంటిలేటర్ల వంటి అంశాల పరంగా సూక్ష్మమైన వివరాలను కేంద్రంతో పంచుకున్నారు.
ఈ కింద పేర్కొన్న నిర్ధిష్ట అంశాలపై చర్యలు తీసుకోవలసిందిగా రాష్ట్రాలకు కేంద్రం సూచించింది:
- కఠినమైన నియంత్రణ చర్యల అమలు, భౌతిక దూర నియమాల అనుసరణ, చురుగ్గా ఇంటింటికీ కేసుల శోధన, చుట్టుప్రక్కల కఠిన నియంత్రణ వంటి వాటి అమలు ద్వారా వైరస్ వ్యాప్తిని పరిమితం చేయడం, చివరికి విచ్ఛిన్నం చేయడం.
- జిల్లాల మొత్తంలో పరీక్షలను ముమ్మరం చేయడం ద్వారా కేసులను ముందుగానే గుర్తించడం, ఆర్.టి - పి.సి.ఆర్ పరీక్షల సామర్ధ్యాన్ని ఐచ్ఛికంగా ఉపయోగించడం, హాట్ స్పాట్లు మరియు జన సాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలను ప్రాథమిక పరీక్షలుగా వినియోగించడం.
- ఇంట్లోనే వేరుగా ఉంటున్న కేసులను సమర్ధవంతంగా పర్యవేక్షించడం, వ్యాధి పురోగమించిన కేసులను త్వరితగతిన ఆసుపత్రుల్లో చేర్చడం.
- వైద్య సాయం అవసరమైన రోగులకు... ముఖ్యంగా ఇతర వ్యాధులు కూడా ఉన్నవారికి, వృద్ధులకు లోపరహితమైన ఆసుపత్రి సదుపాయం, త్వరితగతిన చేర్చడం.
- ఆరోగ్య సంరక్షణ విధుల్లో ఉన్నవారికి వైరస్ సంక్రమించకుండా కాపాడటం కోసం ఆసుపత్రుల్లో సమర్ధవంతమైన సంక్రమణ నియంత్రణ చర్యలను చేపట్టడం.
- అదే తీవ్రతతో మహమ్మారిని అదుపు చేయడానికి తమ ప్రయత్నాల కొనసాగింపు కోసం జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులు జిల్లా నిర్ధిష్ట ప్రణాళికలను సవరించాలి.
***
(Release ID: 1651468)
Visitor Counter : 157