పర్యటక మంత్రిత్వ శాఖ

“హంపి- గతమే స్ఫూర్తి; భవితలోకి పయనం” శీర్షికన వెబినార్

దేఖో అప్నా దేశ్ కార్యక్రమం కింద నిర్వహించిన పర్యాటక మంత్రిత్వ శాఖ

Posted On: 31 AUG 2020 1:59PM by PIB Hyderabad

  “హంపి- గతమే స్ఫూర్తి; భవితలోకి పయనంశీర్షికన తాజాగా ఒక వెబినార్ సదస్సును కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ 2020 ఆగస్టు29 నిర్వహించింది. దేఖో అప్నా దేశ్ వెబినార్ సిరీస్ లో భాగంగా సదస్సును నిర్వహించారు. వారసత్వ కట్టడంగా, పర్యాటక స్థలంగా హంపికి కావలసిన అవసరాలు - అనుసరించవలసిన సమగ్రమైన మార్గంపై వెబినార్ లో ప్రధానంగా చర్చించారు. హంపి సామాజిక, ఆర్థిక, పర్యావరణ పరమైన సమస్యల పరిష్కారానికి గల మార్గాలపై కూడా చర్చించారుసుసంపన్నమైన విభిన్నమైన భారతీయ సంస్కృతిని వెలుగులోకి తెచ్చే కృషిలో భాగంగా -ఏక్ భారత్ శ్రేష్ట భారత్- కార్యక్రమం కింద అప్నా దేశ్ వెబినార్ సిరీస్ సిరీస్ ను రూపొందించారు. 

    కిష్కింద ట్రస్టు వ్యవస్థాపకురాలు, ఇన్ టాక్ ఆనెగుంది హంపి సంస్థ కన్వీనర్ శామా పవార్ వెబినార్ ను సమర్పించారు. చివరి హిందూ రాజ్యమైన విజయ నగర సామ్రాజ్యం చివరి రాజధానిగా హంపి పటిష్టతను, గొప్పతనాన్ని వెబినార్ వివరించింది. ప్రపంచ స్థాయి వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు పొందిన హంపి,..తుంగభద్రతీరంలో విలసిల్లింది. తుంగభద్ర నదితోపాటు, నిమ్నోన్నతమైన పర్వత శ్రేణులు, శిథిలాలుగా మిగిలిన కట్టడాలతో కూడిన సువిశాలమైన పల్లపు మైదానాలు హంపి ప్రత్యేకత. ఇప్పటికీ మిగిలి ఉన్న కోటలు, నదీతీర నిర్మాణాలు, రాజ భవవాలు, పవిత్ర స్థలాలు, ఆలయాలు, పుణ్య క్షేత్రాలు, స్తంబాలతో కూడిన సువిశాలమైన సమావేశ మందిరాలు, మండపాలు, స్మారక నిర్మాణాలు, సైనిక చెక్ పోస్టులు, గుర్రపు శాలలు, నీటి సరస్సులు...ఇలాంటివి 16వందలకు పైగా కట్టడాలు గత వైభవపు చిహ్నాలుగా మిగిలి ఉన్నాయి. అప్పటి రాజరిక శైలి, పట్టణ జీవనవిధానం, పవిత్ర స్థలాల వ్యవస్థకు ఇవి సాక్ష్యాధారాలుగా నిలిచాయి.

 

   వెబినార్ సమర్పించిన శామా పవార్..తన ప్రసంగాన్ని హంపి చరిత్రతో ప్రారంభించారు. తుంగభద్ర నది ప్రాచీన నామమైన పంపా అనే పేరునుంచి హంపి అనే పేరు ఆవిర్భవించింది. కంపిలి సామ్రాజ్యం శిథిలాలనుంచి ఆవిర్భవించిన విజయ నగర సామ్రాజ్యపు రాజధాని నగరంగా హంపిని క్రీస్తు శకం 1336లో తుంగభద్ర తీరంలో నిర్మించారు. కాలక్రమేణా దక్షిణ భారతదేశంలో సుప్రసిద్ధ హిందూ రాజ్యంగా ఎదిగిన విజయనగర సామ్రాజ్యం 200సంవత్సరాలపాటు  మనుగడ సాగించింది. విజయనగర పాలకులు విద్యా, విజ్ఞాన సముపార్జనా సదుపాయాలను అభివృద్ధి చేయడంతోపాటుగా, పటిష్టమైన సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఉత్తరాదినుంచి, తూర్పు ప్రాంతంనుంచి సుల్తానుల దాడులను దీటుగా ఎదుర్కొని పలు యుద్ధాలుచేశారు. రహదారులు, చెరువులు, సరస్సులు, వ్యవసాయం, మతపరమైన కట్టడాలు, ప్రజా మౌలిక సదుపాయాల నిర్మాణంలో విజయనగర పాలకులు ఎంతో వ్యయం చేశారు. బహుళ మతాల, జాతులకు ప్రాధాన్యం ఇస్తూ కట్టడాలు వెలిశాయి. హిందూ, జైన మతాల స్మారక కట్టడాలు పరస్పరం పక్కపక్కనే నిర్మాణం కావడం విశేషం. ఐయిహోల్-పట్టదికల్ శైలిలో దక్షిణ భారతదేశపు కళలు, వాస్తు శాస్త్ర ప్రకారం ప్రధానంగా భవనాలను నిర్మించారు. అయితే,.. హంపిలోని పద్మమహల్, ప్రజా స్నానఘట్టం, ఏనుగుల శాలలు మాత్రం భారత ఇస్లామిక్ వాస్తు శైలిలో నిర్మించారు.

   దక్షిణ భారత దేశంలో పత్తి, సుగంధ ద్రవ్యాల వాణిిజ్య మార్గాల నియంత్రణతో విజయనగర సామ్రాజ్యం పురోగతి సాధించింది. హంపినగరాన్ని ప్రముఖమైన వాణిజ్య కేంద్రంగా మధ్యయుగపు చరిత్రకారులు అభివర్ణించారు. అయితే,..విజయనగర సామ్రాజ్య వైభవం స్వల్పకాలమే సాగింది. కృష్ణదేవరాయల మరణంతో 1565లో ఐదు ముస్లిం సామ్రాజ్యాల అధినేతలైన బీదర్, గోల్కొండ, అహ్మద్ నగర్, బీరర్ సుల్తానులు ఉమ్మడిగా దాడి చేసి విజయనగర సామ్రాజ్యాన్ని ధ్వంసం చేశారు.

  కిష్కింద ట్రస్టు 1997లో ఏర్పాటైంది. ఆనెగుంది (హంపి)లోని వారసత్వ కట్టడాలను, స్థానిక ప్రజల జీవితాను కాపాడాలన్న సంకల్పంతో ట్రస్టును స్థాపించారు. ఆనెగుంది గ్రామపు సామాజక, ఆర్థిక, సాంస్కృతిక అభివృద్ధి కోసం కిష్కింద ట్రస్టు కృషిచేస్తూ వస్తోంది. ఆనెగుంది గ్రామంలో విలసిల్లిన హస్తకళలు, గ్రామీణ పర్యాటకం, సేంద్రియ వ్యవసాయం తదితర స్థానిక నైపుణ్యాలను కాపాడుతూగ్రామ వారసత్వ స్వభావాన్ని రక్షింంచాలనే సమీకృత లక్ష్యంతో కిష్కింద ట్రస్టు తన ఆవిరభావంనుంచి కృషిచేస్తోంది. స్థానిక ప్రజలకు సామాజికంగా, ఆర్థికంగా ప్రయోజనం కలిగించిన కళలను కాపాడాలన్నది ట్రస్టు లక్ష్యం.

   హంపిలో పర్యాటక ఆకర్షణలను వెబినార్ లో ప్రధానంగా ప్రస్తావించారు. హంపి అతి ప్రాచీన కట్టడాల్లో ఒకటైన 15 శతాబ్దపు విరూపాక్ష దేవాలయం గురించి వివరించారు. ఇందులో ప్రధాన దేవాలయాన్ని శివ స్వరూపమైన విరూపాక్ష దేవుడికి కేటాయించారు. విజయనగర సామ్రాజ్యపు తొలి కట్టడాలు, జైన దేవాలయాలు, నరసింహ దేవుడి ఏకశిలా ఆలయం తదితర కట్టడాల శిథిలాలు హేమకుంట పర్వత ప్రాంతంలో కనిపిస్తాయి. విరూపాక్ష దేవాలయానికి దక్షిణ దిశలో పర్వతం ఉంది. తూర్పున భారీ నంది విగ్రహం, దక్షిణం వైపున గణేశుడి భారీ ఏకశిల విగ్రహం నాటి హంపిలో విజయనగర సామ్రాజ్యపు శిల్పకళా వైభవానికి సాక్ష్యంగా నిలిచాయి. 6.7 మీటర్ల ఎత్తైన భారీ స్థాయి నరసింహ విగ్రహం, భారీ శివలింగం కూడా హంపి ఆకర్షణలు.

    విరూపాక్ష దేవాలయం ముందుభాగంలో మొదలయ్యే హంపి బజార్ వీధి లేదా విరూపాక్ష బజారు వీధి మాతంగ పర్వతం వరకూ కొనసాగుతుంది. రామాయణ కాలంలో రాముడు, లక్ష్మణుడు..కలసి సీతాదేవికోసం వెదుకుతూ వచ్చినపుడు మాతంగ పర్వతాన్ని కనుగొన్నారని, సుగ్రీవుడు, తన మంత్రి అయిన జాంబవంతుడు, అనుచరుడైన హనుమంతుడితో కలసి పర్వతంపైనే నివసించేవారని చెబుతారు. విరూపాక్ష ఆలయంలో చెక్కిన శిల్పాలు, అప్పటి విజయనగర సామ్రాజ్యపు కళాకారులు సాధించిన అబ్ధుత కళావైభవాన్ని చాటుతున్నాయి. ఎంతో సమతూకంగా నిర్మించిన ఆలయం స్తంబాలు సంగీతాన్ని వినిపిస్తాయి. రాణి స్నానఘట్టం, హజారా రామాలయం, కమల ప్రాసాదం, ఏనుగుల శాలలు వంటివి హంపిలో తప్పక సందర్శించవలసిన పర్యాటక ఆకర్షణలు.

  ధ్యాన స్థలంగా పేరుగాంచిన హంపి, సూక్ష్మమైన వర్ణచిత్రంగా గోచరిస్తుంది. హంపిలో పర్యటనకు కాలమే తెలియదు. ప్రకృతి సిద్ధమైన భారీ బండరాళ్లు, చెట్లు, పొదలు, నీటి నిల్వలు ఎక్కువగా ఉండే ప్రాంతాలు, తుంగభద్ర నది, పక్షుల కిలకిలా రావాలు, వన్య మృగాలు, విభిన్న వృక్ష, జంతుజాతులు,.. ఇవన్నీ హంపి ప్రకృతి సౌందర్యానికి నిదర్శనాలు. గంధపు చెట్ల వంటి విలువైన వృక్షాలు ఇక్కడ సహజంగానే పెరుగుతాయి. సేద్యపునీటి సదుపాయంతో వరిని పండిస్తారు. పక్షులను, అందమైన ప్రకృతి దృశ్యాలను, నదీ సౌందర్యాన్ని ఆస్వాదించేందుకు జనం హంపిని సందర్శిస్తారు.   

    హంపి సాంస్కృతిక వారసత్వ స్వభావాన్ని రక్షించడమే లక్ష్యంగా కిష్కింద ట్రస్టు,.. ఇన్ టాక్ ( INTACH)తో కలసి పనిచేస్తోంది. జానపద సంప్రదాయాలు, జానపద కళల పునరుద్ధరణ కోసం ఎంతో కృషి చేసింది. గ్రామీణ సంపద రక్షణలో భాగంగా, దారుల వెబడి మొక్కలు నాటడం, ప్రకృతి సంరక్షణపై అవగాహనా కార్యక్రమాలు, చర్చాగోష్టులు చేపట్టడం, స్థానికంగా అందుబాటులో ఉన్న పక్షుల జాతులపై సమాచారాన్ని నమోదు చేయడం, ప్రకృతి సౌదర్య దృశ్యాలపై ఫొటోలను నిక్షిప్తం చేయడం తదితర కార్యక్రమాలను సంస్థ నిర్వహించింది.

  1334లో ఆనెగుంది గ్రామం...ఆనెగుంది ముఖ్యమంత్రి అయిన దేవరాయ ఆనెగుంది రాజ్యం తొలి పాలకుడయ్యాడు. రామాయణ ఇతిహాస కాలంనాటి హనుమంతుడి సొంత నగరమైన కిష్కిందలో ఆనెగుంది కూడా భాగమని భావిస్తారు. ఆనెగుందికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే హనుమంతిడి జన్మస్థలమైన అంజనాద్రి ఉంది. ఆనెగుంది వీధుల్లో కాలినడకన తిరిగినపుడు,.. మహిళలు సుగంధ ద్రవ్యాలను పొడి చేయడం, ముగ్గులతో తమ ఇళ్లను అలంకరించడం, కిష్కింద ట్రస్టు కళారూపాల విక్రయ కేంద్రంకోసం అరటి నారతో సంచులు అల్లడం వంటి దృశ్యాలను చూడవచ్చు.

   గ్రామంలో ఇళ్లను రికార్డుల్లో నిక్షిప్తం చేస్తున్నారు. శిధిలమైన ఇళ్లను తగిన ప్రణాళికతో రక్షిస్తున్నారు. వారసత్వ కట్టడాలైన ఇళ్లను పర్యాటకుల వసతి గృహాలుగా తీర్చిదిద్దడం, గ్రామ గ్రంధాలయం ఏర్పాటు, బహిరంగ స్థలాల నిర్వహణ, పారిశుద్ధ్య నిర్వహణ వంటివి కిష్కింద ట్రస్టు  ప్రస్తుతం చేపట్టిన తాజా కార్యక్రమాలకు నిదర్శనాలు. స్థానికంగా అందుబాటులో ఉన్న వస్తువులను, నైపుణ్యాలను మేళవిస్తూ వివిధ వస్తువుల తయారీని ప్రోత్సహించడం ద్వారా మహిళలకు స్థానికంగా జీవనోపాధి కల్పిస్తున్నారు. అరటినారతో వస్తువులను తయారు చేయించడం, గ్రామంలోని 150-200 మంది మహిళలకు జీవనోపాధిని కల్పిస్తోంది.

   స్థానికంగా దొరికే ముడిసరుకుతో తయారు చేసే ఉత్పాదనలు గ్రామంలోని మహిళల సొంత ఆదాయానికి జీవనోపాధి కల్పిస్తున్నాయి. ఇది మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమేకాక, తమ కుటుంబ సభ్యులకు కూడా జీవనోపాధి మార్గాన్ని సూచించేందుకు దోహపడుతోంది. ఇది సృజనాత్మకత, స్నేహభావం, సమూహ జీవనం అనే విలువలను ప్రతిఫలింపజేస్తోంది.

    “ప్రదర్శన కళల ద్వారా విద్య”  పేరిట చేపట్టిన కార్యక్రమం ఎంతో పటిష్టంగా సాగుతోందిప్రత్యేక కళాకారుల ద్వారా నృత్యం, సంగీతం, రంగస్థల కళలను పిల్లలు  అభ్యసించేందుకు ఇది దోహదపడుతోంది. ప్రకృతి సంరక్షణ, పర్యావరణం తదితర అంశాలను పిల్లలు నేర్చుకునేందుకు ఉపకరిస్తుంది. సామాజిక పథకాల్లో, సమూహ జీవనంలో పిల్లలు భవిష్యత్తులో భాగస్వాములయ్యేందుకు కూడా దోహదపడుతుంది.

   పారిశుద్ధ్య కార్యక్రమం కింద,.. అవసరమైన ఉపకరణాలను అందించడం, కార్మికులకు శిక్షణ ఇవ్వడం, క్రమం తప్పకుండా వీధులు ఊడ్పించడం, పోగైన చెత్తను వర్గీకరించడం, బయో వ్యర్థాలను కంపోస్ట్ మార్చడం, ప్లాస్టిక్ వస్తువులు వంటి ఘన వ్యర్థాలను నిర్మూలించడం తదితర కార్యకలాపాలను చేపడుతున్నారు. పాఠశాల విద్యార్థులకు, అతిథి గహాల యజమానులకు, గ్రామ ప్రజలకు అవగాహనా కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. ప్రజల సమూహ భాగస్వామ్యంతో క్రమం తప్పకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు.

   వెబినార్ ముగింపు ఉపన్యాసం సందర్భంగా అదనపు డైరెక్టర్ జనరల్ రూపీందర్ బ్రార్ మాట్లాడుతూ, భూమాతను గౌరవనీయమైన పద్ధతిలో వినియోగించుకోవాలని, భవిష్యత్తరాలకోసం ప్రకృతిని పరిరక్షించాలని సూచించారు

  హంపి చేరుకోవడానికి విమాన, రైలు, రోడ్డు మార్గాలు చక్కగా అందుబాటులో ఉన్నాయి. ముగింపు సందర్భంగా,.. వెబినార్ కు సంబంధించి వీక్షకులకు ఐదు ప్రశ్నలు వేస్తున్నట్టు ప్రకటన చేశారు. వీక్షకులు mygov.in పోర్టల్ ద్వారా పాాల్గొనవచ్చు. విజేతలైన వీక్షకులకు ఒక -సర్టిఫికెట్ ప్రదానం చేస్తారు. ప్రతి వెబినార్ సదస్సుకు సంబంధించిన ప్రశ్నలను పర్యాటక మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా హ్యాండిల్స్ పై కూడా అందుబాటులో ఉంచుతారు.

  కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిధిలోని నేషనల్ గవర్నెన్స్ శాఖ భాగస్వామ్యంతో దేఖో అప్నా దేశ్ శీర్షికన వెబినార్ లను నిర్వహిస్తూ వస్తున్నారు. వెబినార్ కార్యక్రమాలు  https://www.youtube.com/channel/UCbzIbBmMvtvH7d6Zo_ZEHDA/ అనే పోర్టల్ పై అందుబాటులో ఉంటాయి. అలాగే, కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖకు సంబంధించిన అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ పై కూడా వెబినార్లు అందుబాటులో ఉంటాయి.

 ఇక పంజాబ్ శీర్షికతో నిర్వహించబోయే తదుపరి వెబినార్ సదస్సు 2020 సెప్టెంబర్ 5 నిర్వహిస్తారు. ఆరోజు ఉదయం 11గంటలకు వెబినార్ మొదలవుతుంది.

*****


(Release ID: 1650113) Visitor Counter : 286