సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
ఇండియాను తయారీ రంగ హబ్‌గా మార్చడానికి నైపుణ్యంగల సిబ్బంది అవసరం: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి
భివాడి వద్ద టెక్నాలజీ సెంటర్(టిసి)ని ప్రారంభించిన శ్రీ నితిన్ గడ్కరి, త్వరలో 15 కొత్త టిసి ల ఏర్పాటు
Posted On:
31 AUG 2020 3:37PM by PIB Hyderabad
కేంద్ర సూక్ష్మ, చిన్న , మధ్యతరహా సంస్థలు, (ఎం.ఎస్.ఎం.ఇ), రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి శ్రీ నితిన్‌గడ్కరి , రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలోని భివాడి వద్ద ఏర్పాటుచేసిన టెక్నాలజీ సెంటర్‌ను వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించారు. తయారీ రంగం దేశ జిడిపిలో 22 నుంచి 24 శాతం సమకూరుస్తున్నదని, ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ భారత్ పిలుపుమేరకు 15 నూతన టెక్నాలజీ సెంటర్లు(టిసిలు) ఏర్పాటు చేస్తున్నామని, ప్రస్తుతం ఉన్న 18 టిసిలను నైపుణ్యంగల సిబ్బందిని తయారు చేసేందుకు ఉన్నతీకరిస్తున్నామని చెప్పారు. మన దేశం తయారీ రంగ హబ్‌గా మారాలంటే నైపుణ్యంగల పనివారు అవసరమని ఆయన అన్నారు.
ఈ రంగంలో టిసిలు ఒక చోదక శక్తిగా పనిచేస్తాయని, టిసిలకు రుణాలు అందించే ఆలోచనలో ఉన్నామని అన్నారు. దీనివల్ల వారు , స్థానిక పరిశ్రమ అవసరాలను తీర్చేందుకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్నిసమకూర్చుకోవచ్చని, కొత్త యంత్రాలు కొనుగోలు చేయవచ్చని ఆయన అన్నారు. ఈ టిసిల విస్తరణ కేంద్రాలపై కూడా కృషి చేస్తున్నట్టు ఆయన తెలిపారు. విస్తరణ కేంద్రాలకు అవసరమైన భూమి, ఇతర లాజిస్టిక్‌లకు మద్దతు కల్పించాల్సిందిగా ఆయన రాష్ట్రప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఈ విస్తరణ కేంద్రాలు కొత్త పరిశ్రమల అవసరాలు, ప్రస్తుత పరిశ్రమల అవసరాలను తీర్చగలవని ఆయన అన్నారు. ప్రస్తుత పాలిటెక్నిక్‌లు, ఐటిఐలు, ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించిన మౌలికసదుపాయాలను యువతకు నైపుణ్యాలు కల్పించేందుకు వినియోగించాలని, ఇందుకు పరిశ్రమ మద్దతు తీసుకోవాలని ఆయన కోరారు.
ఎం.ఎస్.ఎం.ఇ , పశుగణాభివృద్ధి,పాడి పరిశ్రమ, మత్స్యశాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాప్ చంద్ర సారంగి మాట్లాడుతూ, టెక్నాలజీ కేంద్రం ఏర్పాటైనందుకు, భివాండి ప్రజలను, రాజస్థాన్ ప్రజలను అభినందించారు. ఇది ఈ ప్రాంత అభివృద్ధికి ఒక మైలు రాయిగా రుజువు చేసుకోగలదన్న ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. కోవిడ్ -19 కారణంగా దేశం ఆర్ధిక సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్నదని, అలాంటి సమయంలో ఈ కేంద్రాలు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంటాయని అన్నారు . ఇవి ఉత్పత్తి పెంచడానికి, నిరుద్యోగాన్ని తగ్గించడానికి, స్వావలంబిత దేశ కలలు నెరవేర్చడానికి ఉపకరిస్తాయని అన్నారు. దేశ యువత నైపుణ్యాలు మెరుగుపరచుకోవలసిందిగాను, ఆ రకంగా పరిశ్రమలకు ఉపయోగపడే రీతిలో తమను తాము సిద్దం చేసుకోవలసిందిగా ఆయన కోరారు. అలాగే ప్రధానమంత్రి పిలుపు ఇచ్చిన ఆత్మనిర్భర్ భారత్ కు అనుగుణంగా స్పందించాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు.
ఎం.ఎస్.ఎం. ఇ కార్యదర్శి ఎ.కె.శర్మ మాట్లాడుతూ, రానున్న టెక్నాలజీ కేంద్రాలు జనరల్ ఇంజనీరింగ్, ఆటోమోటివ్, పరిమళద్రవ్యాలు, రుచి,, ఇఎస్‌డిఎం రంగాల చెందిన పరిశ్రమలకు సహాయపడనున్నాయి. వీటికి అత్యధునాతన తయారీ రంగ సాంకేతిక పరిజ్ఞానం, అంటే సిఎన్‌సి యంత్రాలు, 3 డి తయారీ, అడిటివ్ తయారీ, లేజర్, అల్ట్రాసోనిక్ యంత్రాలు ,రోబోటిక్‌లు, ప్రాసెస్ ఆటోమేషన్, ఖచ్చితమైన కొలతలు తీయగల పరికరాలు, మెట్రాలజీ పరికరాలు, అధునాతన ఎలక్ట్రానిక్ తయారీ సదుపాయాలు, కాలిబ్రేషన్, ఎలక్ట్రానిక్ డిజైనింగ్ కు సంబంధించి అధునాత ఎలక్ట్రానిక్స్ తయారీ సదుపాయాలు కల్పించనున్నట్టు చెప్పారు. ఎం.ఎస్.ఎం. ఇ మంత్రిత్వశాఖ డవలప్ మెంట్ కమిషనర్ ద్వారా టెక్నాలజీ సెంటర్ సిస్టమ్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. దీని కింద 15 టెక్నాలజీ సెంటర్లు ఏర్పాటు చేయడంతోపాటు ప్రస్తుతం ఉన్న 18 టెక్నాలజీ సెంటర్ల స్థాయి పెంచనున్నారు.
రాజస్థాన్ ప్రభుత్వ పరిశ్రమలు, స్టేట్ ఎంటర్ ప్రైజెస్ శాఖ మంత్రి శ్రీ ప్రసాదిలాల్ మీనా, పార్లమెంటు సభ్యుడు శ్రీ మహంత్ బాలక్‌నాథ్, శాసనసభ సభ్యుడు శ్రీ సందీప్ యాదవ్ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(Release ID: 1650029)
Visitor Counter : 201