గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రత్యేకించి ప్రమాదకర స్థితిలో ఉన్న గిరిజన తెగల (పివిటిజిల) భద్రతకు సంబంధించి అండమాన్ నికొబార్‌దీవుల అప్రమత్తత
దేశీయ గిరిజన తెగల సంక్షేమం, భద్రతకు సంబంధించి అండమాన్ నికొబార్ పాలనాయంత్రాంగంతో , గిరిజన మంత్రిత్వశాఖ నిరంతరం సంప్రదిస్తున్నది: కేంద్ర మంత్రియ శ్రీ అర్జున్ ముండా
గిరిజనుల రక్షణ, భద్రతకు ఎన్నో సానుకూల చర్యలు తీసుకోవడం జరిగింది.
Posted On:
29 AUG 2020 7:08PM by PIB Hyderabad
అండమాన్ నికోబార్ దీవులలో ,ప్రత్యేకించి ప్రమాదకరస్థితిలో ఉన్న గిరిజన తెగల (పివిటిజిలు) భద్రత, విషయంలో అప్రమత్తంగా ఉన్నట్టు అండమాన్ నికోబార్ పాలనా యంత్రాంగం తెలియజేసింది. ఈమేరకు కేంద్ర గిరిజన మంత్రిత్వశాఖకు అండమాన్ నికోబార్ దీవుల పాలనా యంత్రాంగం ఒక నివేదిక సమర్పిస్తూ, 2020 మార్చి నెల మధ్య నుంచి, అంటే అండమాన్ నికోబార్ దీవులలో కోవిడ్ -19 కేసులు నమోదు కాకముందు నుంచే పివిటిజిల భద్రత, రక్షణకు సంబంధించి ఎన్నో సానుకూల చర్యలు తీసుకున్నట్టు తెలిపింది.
అండమాన్ నికొబార్ దీవులలో ఆరు నోటిఫైడ్ గిరిజన తెగలు ఉన్నాయి. నికొబార్ దీవులకు చెందిన వారు కాకుండా మిగిలిన ఐదు తెగలు, గ్రేట్ అండమానీయులు, జరావా, సెంటినిలీస్ ఒంగె, షోంపెన్ లను ప్రమాదకర స్థితిలో ఉన్న గిరిజన తెగలుగా గుర్తించారు.
కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అర్జున్ ముండా ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఒక సందేశమిస్తూ, అండమాన నికోబార్ దీవులు తమ దీవులలోని గిరిజనుల భద్రత , రక్షణ విషయంలో అప్రమత్తంగా ఉన్నట్టు తెలిపారు. ప్రత్యేకించి ప్రమాదకర స్థితిలో ఉన్న గిరిజన తెగల భద్రత , రక్షణ విషయంలో అప్రమత్తంగా ఉన్నట్టు ఆయన వెల్లడించారు. సమీకృత గిరిజనాభివృద్ధి అథారిటీ, గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖలు అండమాన్ నికొబార్ దీవుల పాలనా యంత్రాంగంతో ఈ విషయమై నిరంతరం సంబంధాలు కలిగిఉన్నట్టు ఆయన వెల్లడించారు.
పివిటిజిల రక్షణ,సంక్షేమ కార్యకలాపాలను , రిజిస్టర్డ్ సొసైటీ అయిన అండమాన్ ఆదిమ జానజాతి వికాస్ సమితి (ఎఎజెవిఎస్) పర్యవేక్షిస్తున్నది. అలాగే నికోబార్ జిల్లా డిప్యూటి కమీషనర్ సమీకృత గిరిజనాభివృద్ధి అధారిటీ ద్వారా (ఐటిడిఎ) నికోబార్ గిరిజనుల సంక్షేమం, వారి బాగోగులు చూస్తున్నారు.
గ్రేట్ అండమాన్ కు చెందిన వారిని జరావా వారిని గతంలో పాలనాయంత్రాంగం బయటి వారితో కలవకుండా చూసేందుకు స్ట్రెయిట్ దీవికి, జరావా రిజర్వు పశ్చిమ తీరానికి తరలించారు. జరావా గిరిజన తెగల భద్రతను దృష్టిలొ ఉంచుకుని కాన్వాయ్ ల సంఖ్యను కూడా పరిమితం చేశారు. క్షేత్రస్థాయిలో పనిచేసేవారు ముఖానికి మాస్కు , చేతికి గ్లోవ్ లు ధరించి, తగిన దూరం పాటిస్తూ గిరిజన తెగలతో మాట్లాడాల్సిందిగా సూచించారు. కోవిడ్ -19 మహమ్మారికి సంబంధించి గిరిజనులకు ఫోటోలు , వీడియోల ద్వారా వారి స్వంత భాషలో ముందస్తు జాగ్రత్తలు తెలియజేస్తూ వారికి అవగాహన కల్పించడం జరిగింది.
ఎఎజెవిఎస్, ఇతర విభాగాలకు చెందిన క్షేత్రస్థాయి వ్యక్తులు గిరిజన ప్రాంతాలకు వెళ్లడానికి ముందు వారికి కొవిడ్ పరీక్షలు నిర్వహించి ఆ తర్వాతే వెళ్లడానికి అనుమతిస్తున్నారు. గిరిజన సెటిల్ మెంట్‌లలో నియమించిన అధికారులను గిరిజన సెటిల్ మెంట్ ప్రాంతాలకు వెలుపల తిరగవద్దని, బయటి వ్యక్తులను కలవ వద్దని సూచించడం జరిగింది.
అలాగే, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వారందరికీ ఎప్పటికప్పుడు కోవిడ్ -19 పరీక్షలు నిర్వహిస్తున్నారు. జరావాలకు బాణాలు తయారు చేసుకోవడానికి స్టీలు, అవసరమైన పరికరాలు ఇచ్చి వారికి పనికల్పిస్తున్నారు. ఎఎజెవిఎస్, పొలీసు, అటవీ విభాగం, మత్స్యశాఖ పశ్చిమ తీరంలో గస్తీని ముమ్మరం చేశాయి. కోవిడ్ కారణంగా, జరావా తెగ వారితో మాటలు కలపవద్దని మత్స్యకారులకు సూచించడం జరిగింది. కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టేందుకు జరావా తెగ వారిని చిన్న చిన్న బృందాలుగా నివసించాల్సిందిగా కోరడం జరిగింది. ఇయేతెర్‌జి, బాంబూఫ్ టిక్రి, ఫూల్‌టాలా,సంతిపూర్, కతాయిడేరా లలో జరావా తెగ కదలికలను ఎఎజెవిఎస్ సిబ్బంది జాగ్రత్తగా గమనించడం జరుగుతోంది. గ్రేట్ అండమానీయులందరినీ 2020 ఏప్రిల్ లో కోవిడ్ పరీక్షలు నిర్వహించి స్ట్రెయిట్ దీవికి తరలించినప్పటికీ, చాలామంది గ్రేట్ అండమానీయులు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నారు. పోర్టుబ్లెయిర్‌లో నివసిస్తున్నారు. అందువల్ల చాలా కుటుంబాల వారు 2020 జూన్‌లో అన్ లాక్ ప్రకటించిన తర్వాత తిరిగి పోర్టు బ్లెయిర్ కు వచ్చారు. ఆగస్టు 2020లో కోవిడ్ -19 కేసులు పెరిగిపోవడంతో అండమానీయుల తెగకు చెందిన వారిని తిరిగి స్ట్రెయిట్ దీవికి వెళ్లాల్సిందిగా సూచించడం జరిగింది.
కోవిడ్ -19 కు సంబంధించి పరీక్షలు నిర్వహించగా కొందరు అండమానీయ గిరిజన తెగల వారిలో స్వల్పకోవిడ్ లక్షణాలతో పాజిటివ్ గా తేలింది.వీరిలో ముగ్గురు గిరిజనులు కోలుకున్నారు. మిగిలినవారు జిబి పంత్ ఆస్పత్రిలో ముందుజాగ్రత్తగా లేదా హోమ్ ఐసొలేషన్‌గా ఉంచారు. చాలామంది గిరిజనులను, అంటే కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయిన వారి కుటుంబాలను మినహా మిగిలిన వారిని తిరిగి స్ట్రెయిట్ దీవికి తరలించడం జరిగింది. కోవిడ్ యాక్టివ్ కేసులుగా ఉన్నవారందరూ మంచి ఆరోగ్యంతో ఉన్నారు. వీరి ఆరోగ్య పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఇక గ్రేట్ అండమానీయులలో కోవిడ్ -19 కేసులకు సంబంధించి అక్కడి పాలనాయంత్రాంగం, డుగాంగ్ క్రీక్ కు చెందిన ఓంగె గిరిజన తెగకు చెందిన వారినుంచి నమూనాలను సేకరించి చూడగా వారందరికీ నెగటివ్ రిపోర్టు వచ్చింది. త్వరలోనే జరావా గిరిజన తెగలో నమూనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రత్యేకంగా ప్రమాదకర స్థితిలో ఉన్న గిరిజన తెగల (పివిటిజిల)ను రక్షించడానికి, వారి భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్టు , దీనికి తాము చిత్తశుద్ధితొ కట్టుబడి ఉన్నట్టు అండమాన్ నికోబార్ పాలనాయంత్రాంగం పునరుద్ఘాటించింది.
మానవజాతి వారసత్వాన్ని రక్షించుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నట్టు వారు తెలిపారు.
అండమాన్ నికోబార్ దీవులలో పివిటిజిల రక్షణకు తీసుకున్న చర్యలకోసం క్లిక్ చేయండి.
***
(Release ID: 1649802)