రాష్ట్రప‌తి స‌చివాల‌యం

2020 సాంవత్సరానికి జాతీయ క్రీడలు మరియు సాహసకృత్యాలలో ప్రతిభావంతులకు అవార్డులు ప్రదానం చేసిన భారత రాష్ట్రపతి

Posted On: 29 AUG 2020 2:09PM by PIB Hyderabad

మున్నెన్నడూ జరగని విధంగా చక్షుష పద్ధతిలో భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ 2020 సంవత్సరంలో జాతీయ క్రీడలు మరియు సాహసకృత్యాలలో ప్రతిభ కనబరచిన వారికి అవార్డులను ప్రదానం చేశారు.  రాష్ట్రపతి భవన్ లో శనివారం (29 ఆగస్టు, 2020)  అవార్డులను ప్రదానం చేస్తూ   ఈ అవార్డు విజేతలు సాధించిన ఘనత క్రీడలలో భారతావనికి ఉన్న అపారమైన శక్తి సామర్ధ్యాలను స్మరణకు తెస్తోందని రాష్ట్రపతి అన్నారు.  

భవిష్యత్తుకు ఉన్నత ప్రమాణాలను నిర్దేశిస్తూ,  మున్ముందు ఇండియా క్రీడలలో సమున్నత  స్థానానికి చేరగలదని,  2028లో జరుగనున్న ఒలింపిక్స్ పోటీల్లో ఇండియా అధిక సంఖ్యలో పతకాలను గెలవడం ద్వారా మొదటి పది దేశాలలో స్థానం పొందాలనే ఆకాంక్షతో కృషి చేయాలని రాష్ట్రపతి అన్నారు. బెంగళూరు, పూణే, సోనేపట్, చండీగఢ్, కోల్కతా, లక్నో, ఢిల్లీ, ముంబయి, భోపాల్, హైదరాబాద్ మరియు  ఇటానగర్ తో సహా  దేశవ్యాప్తంగా 11 కేంద్రాలలో సమావేశమైన  అధికారులు, క్రీడాకారులు, క్రీడల శిక్షకులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడుతూ "మనం ఈ లక్ష్యాన్ని సాధించగలమనే నమ్మకం నాకుంది"  అని రాష్ట్రపతి అన్నారు.  అవార్డు ప్రదానోత్సవానికి హాజరైన కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ సహాయ (స్వతంత్ర విధులు) మంత్రి శ్రీ కిరణ్ రిజిజు న్యూఢిల్లీ నుంచి స్వాగతోపన్యాసం చేశారు.  

 

విశ్వవ్యాప్తంగా ప్రబలిన కోవిడ్-19 మహమ్మారి క్రీడా ప్రపంచంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపిందని రాష్ట్రపతి అన్నారు.   ఒలింపిక్ క్రీడలు వాయిదాపడ్డాయి.    దేశంలో క్రీడా శిక్షణ, అభ్యాసంపై కూడా దాని ప్రభావం పడింది.  అభ్యాసం, పోటీలు లేనందువల్ల ఆటగాళ్లు, క్రీడా శిక్షకులకు ప్రేరణ కొరవడింది. అది  వారి మానసిక, భౌతిక సంసిద్ధతను సవాలుగా మారింది.  ఆన్ లైన్ శిక్షణ మరియు వెబినార్ ల ద్వారా ఆటగాళ్లు మరియు శిక్షకుల మధ్య సంబంధాలు కొనసాగుతున్నందుకు ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు.  విశ్వ మహమ్మారి ప్రభావం ఉన్నప్పటికినీ ఈ రోజు జరిగిన ఈ కార్యక్రమం క్రీడలకు సంబంధించిన కార్యకలాపాలు కొనసాగించే ప్రయత్నమని ఆయన అన్నారు.  

దేశంలో క్రీడల్లో వైవిధ్యం పెరగడం పట్ల రాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేశారు.  ఈ రోజు అవార్డుల విజేతలు 20కి పైగా క్రీడలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.  కబడ్డీ, ఖో ఖో,  మల్ల ఖంబ్  వంటి సంప్రదాయ ఆటలకు ప్రజాదరణ పెరగడం వల్ల సామాన్య ప్రజానీకం కూడా క్రీడలపై అభిరుచిని పెంచుకోవడానికి తోడ్పడుతుందని అన్నారు.  ఇప్పుడు క్రికెట్, ఫుట్ బాల్ తో పాటు   వాలీబాల్, కబడ్డీ వంటి ఆటల్లో లీగ్ టోర్నమెంట్లకు ప్రజాదరణ పెరుగుతోంది.  ఇది సంతోషకరమైన మార్పు.  

 

భాగస్వామ్య పక్షాలు అందరూ పాల్గొన్నప్పుడే క్రీడా సంస్కృతిని ప్రోత్సహించవచ్చునని రాష్ట్రపతి అన్నారు.  అది కేవలం  ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని అన్నారు.  క్రీడలలో పెట్టుబడి పెట్టడం  జాతి నిర్మాణానికి జరిగే సమష్టి ప్రయత్నం తద్వారా సమాజం బలపడుతుంది. క్రీడలను ప్రోత్సహించడానికి కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు (ఎన్జీవోలు)  మరియు విద్యా సంస్థలు తమవంతు కృషి చేయడం సంతోషకరమని రాష్ట్రపతి అన్నారు.  అందరి సమష్టి కృషి ద్వారా ఇండియా క్రీడలలో అగ్ర స్థానానికి చేరగలదనే విశ్వాసాన్ని రాష్ట్రపతి వ్యక్తం చేశారు.  

క్రీడలలో సమర్థతకు గుర్తింపుగా క్రీడా పురస్కారాలను ప్రతి ఏటా ఇవ్వడం జరుగుతోంది.  నాలుగేళ్ళ పాటు క్రీడలలో అద్భుతమైన మరియు  విశిష్ట ప్రతిభ కనబరిచిన క్రీడాకారునికి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న  అవార్డు ప్రదానం చేయడం జరుగుతుంది.  వరుసగా నాలుగేళ్ల పాటు నిలకడైన ప్రతిభ,  పనితీరు కనబరచిన వారికి అర్జున అవార్డు ఇస్తారు.  ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పోటీలలో  పతకాలు సాధించిన విజేతలను  తయారు చేసిన కోచ్ లకు ద్రోణాచార్య అవార్డు ఇస్తారు.  క్రీడల అభివృద్ధికి జీవిత కాలం కృషి చేసిన వారికి ధ్యాన్ చాంద్ అవార్డు ఇస్తారు.  క్రీడలను ప్రోత్సహించడంలో మరియు అభివృద్ధిలో గణనీయమైన కృషి చేసిన  ప్రైవేటు మరియు ప్రభుత్వ రంగంలోని కార్పొరేట్ సంస్థలను  రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్  పురస్కారంతో సన్మానిస్తారు. ఇంటర్ - వర్సిటీ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన యూనివర్శిటీకి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీని బహుకరిస్తారు.  క్రీడాకారులకు అవార్డులతో పాటు  దేశ ప్రజలలో అసమాన సాహసం కనబరచిన వారిని టెన్సింగ్ నార్కే జాతీయ సాహస అవార్డు బహూకరించి గుర్తిస్తారు.  


 

****


(Release ID: 1649691) Visitor Counter : 211