కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

బీహార్ కొత్త విధానమండలికి సరికొత్త టెలిఫోన్ ఎక్స్ ఛేంజ్

బీహార్ గ్రామీణ ప్రాంతాలకోసం వైర్ లెస్ బి ఎస్ ఎన్ ఎల్
భారత్ ఎయిర్ ఫైబర్ ప్రారంభించిన మంత్రి రవిశంకర్ ప్రసాద్

సులభంగా అమర్చటానికి వీలైన, విశ్వసనీయమైన భారత్ ఎయిర్ ఫైబర్
నెలవారీ చందా రూ. 349 తో ప్రారంభం

వచ్చే ఆరు నెలల్లో మరో 50 ఎయిర్ ఫైబర్
సెక్టార్ యాంటెన్నాలు: మంత్రి రవిశంకర్ ప్రసాద్

Posted On: 29 AUG 2020 4:13PM by PIB Hyderabad

అందరికీ బ్రాడ్ బాండ్ అన్న భారత ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చే క్రమంలో బి ఎస్ ఎన్ ఎల్ సంస్థ మరో అడుగు ముందుకేసిందని కేంద్ర కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్, ఐటి, న్యాయ శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఆయన ఈ రోజు బీహార్ విధానమండలి ఆవరణలో కొత్తతరపు టెలిఫోన్ ఎక్స్ ఛేంజ్ ని, దానాపూర్ టెలిఫోన్ ఎక్స్ ఛేంజ్ వద్ద భారత్ ఎయిర్ ఫైబర్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యూ ఢిల్లీ నుంచి ప్రారంభించారు. బీహార్ ఉపముఖ్యమంత్రి శ్రీ సుశీల్ కుమార్ మోదీ. బీహార్ శాసనమండలి చైర్మన్ శ్రీ అవధీష్ నారాయణ సింగ్, మరికొందరు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

బీహార్ విధాన మండలి లో ఏర్పాటు చేసిన టెలిఫోన్ ఎక్స్ ఛేంజ్ అత్యాధునికమైనది. ఇది ఆప్టిక్ ఫైబర్ మీద ఏర్పాటైనది కావటం వల్ల ఆధారపడదగిన వైర్ లైన్ బ్రాడ్ బాండ్ సేవలను అందిస్తుంది. ఈ ఎక్స్ ఛేంజ్ లో 512 టెలిఫోన్ వైర్ లైన్, 128 బ్రాడ్ బాండ్ కనెక్షన్లు అందించే సామర్థ్యం ఉంటుంది. దీన్ని ముందు ముందు మరింతగా విస్తరించవచ్చు. పాత, కొత్త విధానమండలి, మూడు కొత్త సచివాలయ బ్లాకులు ఎ, బి, సి ఈ కొత్త కేంద్రం నుంచి సేవలు అందుకుంటాయి.

కొత్తగా ప్రారంభించిన భారత్ ఎయిర్ ఫైబర్ ద్వారా వేగవంతమైన, ఆధారపడదగిన ఇంటర్నెట్ సేవలు గ్రామీణ ప్రాంతాలకు అందించగలిగే వెసులుబాటు ఉంటుంది. భారత్ ఎయిర్ ఫైబర్ కు హైస్పీడ్ ఎఫ్ టి టి హెచ్ కు సమానమైన వేగం ఉంటుంది. దానాపూర్ టెలిఫోన్ ఎక్స్ ఛేంజ్ నుంచి ఆర్ కె పురం, ఆనందపూర్, దానాపూర్ మార్కెట్, దానాపూర్ కంటోన్మెంట్ దాకా సేవలు అందుతాయి.


ఇది పూర్తిగా వైర్ లెస్ టెక్నాలజీ కావటంతో దీన్ని అమర్చటం చాలా సులభమవుతుంది. పైగా విశ్వసనీయంగా సేవలందించటానికి, తక్కువ మరమ్మతులతో పనిచేయించటానికి వీలవుతుంది. వైరుతో ఎఫ్ టి ఇ హెచ్ ద్వారా బ్రాడ్ బాండ్ అందించటానికి అవకాశం లేని మారుమూల ప్రాంతాలకు సైతం భారత్ ఎయిర్ ఫైబర్ సేవలు సులువుగా అందించవచ్చు. చందాదారులకు ఇది నాణ్యమైన సేవలు అందించగలిగే వీలుంటుంది.  దీని నెలవారీ చందా అతి తక్కువ స్థాయిలో నెలకు రూ.349 తో మొదలవుతుంది.దీనివలన గ్రామీణ ప్రాంతాలు. చేరుకోవటం క్లిష్టంగా ఉండే మారు మూల ప్రాంతాల వారికి సరసమైన ధరకే ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది.
" ఆత్మ నిర్భర్ భారత్ కోసం సవాళ్ళను అవకాశంగా మార్చుకోవాలన్న ప్రధాని నరేంద్రమోదీ ఆలోచనా విధానానికి అనుగుణంగా అవకాశాలను దేశంలోని మారుమూలల్లో ఉన్న గ్రామాలకు తీసుకు వెళ్ళాలనుకుంటున్నాను. మరీ ముఖ్యంగా కోవిడ్ సంక్షోభ సమయంలో డిజిటల్ చదువులకు, డిజిటల్ నైపుణ్య శిక్షణకు, టెలీ మెడిసిన్ కు ప్రాధాన్యం ఏర్పడింది. గ్రామీణ భారతంలో బ్రాడ్ బాండ్ కనెక్టివిటీ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. భారత్ ఎయిర్ ఫైబర్ ను మరింత వేగంగా విస్తరించి 1000 రోజుల్లో 6 లక్షల గ్రామాల లక్ష్యాన్ని నెరవేర్చటానికి సాయం చేస్తుంది. " అన్నారు టెలికాం మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్.ఈ సందర్భంగా బీహార్ లో వచ్చే ఆరు నెలలకాలంలో మరో 50 ఎయిర్ ఫైబర్ సెక్టార్ యాంటెన్నాలు ఏర్పాటు చేస్తామని కూదా ఆయన ప్రకటించారు.
ఈ సందర్భంగా బీహార్ ఉపముఖ్యమంత్రి శ్రీ సుశీల్ మోదీ మాట్లాడుతూ, " బీహార్ ప్రభుత్వం ఇటీవలే రైట్ ఆఫ్ వే ని నోటిఫై చేసింది.. దీనివలన మొబైల్ టవర్ యాంటెన్నాలు ఏర్పాటు చేయటం, ఆప్టిక్ ఫైబర్ కేబుల్ లైన్లు వేయటం రాష్ట్రంలో సులభమవుతుంది. నాకు ఈ మధ్యనే బి ఎస్ ఎన్ ఎల్ వారి ఎఫ్ టిటి హెచ్ బ్రాడ్ బాండ్ కనెక్షన్ వచ్చింది. హై స్పీడ్ కనెక్టివిటీ బాగా నచ్చింది" అన్నారు.
భారత ప్రభుత్వం అనేక జాతీయ ప్రాధాన్యమున్న, వ్యూహాత్మకమైన ప్రాజెక్టులను బి ఎస్ ఎన్ ఎల్ కు అప్పగించింది. దీనివలన దేశ నిర్మాణంలో భాగమిఅన్ నెట్ వర్క్ ఫర్ స్పెక్ట్రమ్, భారత్ నెట్ ప్రాజెక్ట్ ఫర్ ఆప్టికల్ ఫైబర్ లాంటివి చేపట్టగలిగింది. దీనివలన జమ్మూకాశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలలో 3000కు పైగా వ్యూహాత్మక ప్రాధాన్యమున్న గ్రామ పంచాయితీలకు ఫైబర్ కనెక్టివిటీ ఇవ్వగలిగింది. ఇటీవలే చెన్నై్ నుంచి అండమాన్, నికోబార్ దీవులలోని పోర్ట్ బ్లెయిర్ కు రూ. 1224 కోట్లతో జలాంతర మార్గాన ఆప్టిక్ ఫైబర్ కేబుల్ కనెక్టివిటీ ఇచ్చింది. ఇదే విధంగా భారత ప్రధాన భూభాగం నుంచి లక్ష దీవులకు కూడా కేబుల్ కనెక్టివిటీ ఇవ్వటానికి బి ఎస్ ఎన్ ఎల్ సిద్ధమవుతోంది. భారత ప్రభుత్వం రూ.14,000 కోట్ల విలువచేసే 4 జి   స్పెక్ట్రమ్ ను బి ఎస్ ఎన్ ఎల్ కి కేటాయించింది. దీంతో బి నెస్ ఎన్ ఎల్ సంస్థ 4 జి   సేవలు ప్రారంభించటానికి సమాయత్తమవుతోంది. దీనివలన మేకిన్ ఇండియా ప్రయత్నాలు వేగం పుంజుకుంటాయి.


అనేక ప్రభుత్వ ప్రాజెక్టులకు తోడుగా బి ఎస్ ఎన్ ఎల్ ఇప్పటికే దేశవ్యాప్తంగా దాదాపు 3 లక్షల ఎఫ్ టి టి హెచ్ /బ్రాడ్ బాండ్ కనెక్షన్లు ఇచ్చింది. దీనివలన గడిచిన ఆరు నెలలకాలంలో  వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారి ఇంటర్నెట్ అవసరాలు తీరుతూ వస్తున్నాయి. అదే విధంగా చందాదారులకు ఆనందం కలిగించేలా సులువైన, ఆకర్షణీయమైన టారిఫ్ ప్రణాళికలు రూపొందించింది. 

***



(Release ID: 1649562) Visitor Counter : 163