ప్రధాన మంత్రి కార్యాలయం

స్మార్ట్ ఇండియా హాకథాన్ 2020 గ్రాండ్ ఫైనల్ సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగపు ఆంగ్ల పాఠం

Posted On: 01 AUG 2020 7:08PM by PIB Hyderabad

మీరు ఉత్తమమైన పరిష్కారాలపై పని చేస్తున్నారు. మీరు దేశం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారాలను అందించడంలో సహాయపడటం మాత్రమే కాకుండా... డేటా, డిజిటైజేషన్ మరియు ఒక హైటెక్ భవిష్యత్తుకు సంబంధించి భారత దేశం ఆకాంక్షలను బలోపేతం చేస్తున్నారు.

 

మిత్రులారా, గడచిన శతాబ్దాలలో ప్రపంచానికి మనం ఉత్తమ శాస్త్రవేత్తలను, ఉత్తమ సాంకేతిక నిపుణులను మరియు ఉత్తమ సాంకేతిక సంస్థల నాయకత్వాన్ని అందించాం. అయితే, ఇది 21వ శతాబ్దం. వేగంగా మారుతున్న ప్రపంచంలో కూడా అంతే ప్రభావవంతమైన పాత్రను పోషించాలంటే, ఇండియా సాధ్యమైనంత వేగంగా తనను తాను మార్చుకోవలసి ఉంటుంది.

 

ఈ ఆలోచనతోనే.. ఆవిష్కరణలు, పరిశోధనలు, రూపకల్పనలు, అభివృద్ధి మరియు స్థాపనలకు అవసరమైన ఆవరణ వ్యవస్థను దేశంలో వేగంగా అభివృద్ధి చేయడం జరుగుతోంది. ఇప్పుడు 21వ శతాబ్దపు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు నాణ్యమైన విద్యకు చాలా ప్రాధాన్యత ఏర్పడింది. 21వ శతాబ్దపు అవసరాలను తీర్చగల విద్యా వ్యవస్థకు ఇప్పుడు సమాంతర ప్రాధాన్యత ఉంది.

 

అది ప్రధాన మంత్రి ఇ- లెర్నింగ్ కార్యక్రమం లేదా అటల్ ఇన్నొవేషన్ మిషన్ అయినా, దేశంలో శాస్త్రీయ దృక్పథం పెంచడానికి అనేక రంగాల్లో స్కాలర్ షిప్ ల విస్తరణ లేదా క్రీడా నైపుణ్యానికి అధునాతన సదుపాయాలు మరియు ఆర్థిక మద్ధతు, పరిశోధనలను ప్రోత్సహించడానికి పథకాలు లేదా ప్రపంచ స్థాయి 20 గొప్ప సంస్థలను ఇండియాలో సృష్టించే మిషన్, ఆన్ లైన్ విద్య కోసం సరికొత్త వనరులను సృష్టించడం లేదా స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ వంటి కార్యక్రమాలు... ఇలా భారత దేశ విద్యను మరింత ఆధునికంగా రూపుదిద్దడానికి, దేశ నైపుణ్యానికి అవకాశాలు లభించేలా భరోసా ఇవ్వడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి.

 

మిత్రులారా,

దీనికి అనుగుణంగానే కొద్ది రోజుల క్రితం దేశ నూతన విద్యా విధాన ప్రకటన వెలువడింది. 21వ శతాబ్దపు యువత ఆలోచన, అవసరాలు, ఆశలు, ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని ఈ విధానాన్ని రూపొందించడం కోసం ఒక మహా ప్రయత్నం జరిగింది. ఐదేళ్లుగా దేశవ్యాప్తంగా ప్రతి అంశం పైనా, ప్రతి దశలోనూ విస్తృత స్థాయిలో చర్చలు, సమాలోచనలు సాగాయి. అప్పుడు మాత్రమే ఈ విధానం రూపుదిద్దుకుంది.

 

నిజమైన అర్ధంలో, నూతన భారత దేశపు విద్యా విధానం భారత దేశ కలలను, దేశ భవిష్యత్ తరాల ఆశలు మరియు ఆకాంక్షలను ప్రతిబింబిస్తుంది. దేశంలోని ప్రతీ ప్రాంతం, ప్రతి రాష్ట్రం నుంచి స్కాలర్ల అభిప్రాయాలు అందులో ఉన్నాయి. అందువల్ల, ఇది కేవలం ఒక విధాన పత్రం మాత్రమే కాదు... 130 కోట్లకు పైగా భారతీయుల ఆకాంక్షల ప్రతిబింబం.

 

మిత్రులారా, ఈ రోజుకి కూడా చాలా మంది పిల్లలు తమకు ఆసక్తి లేని బోధనాంశం ఆధారంగా తమను అంచనా వేస్తున్నారని భావిస్తుండటం మీరు చూసే ఉంటారు. వారు తల్లిదండ్రుల, బంధువుల, స్నేహితుల మరియు మొత్తం ఆవరణం ద్వారా ఒత్తిడికి గురవుతున్నారు. చివరికి ఇతరులు ఎంపిక చేసిన సబ్జెక్టులను చదవడం ప్రారంభిస్తారు. ఈ విధానం దేశానికి బాగా చదువుకున్న చాలా పెద్ద జనాభాను ఇచ్చింది. కానీ, వారు చదివిన వాటిలో అధిక భాగం వారికి ఎందుకూ పనికిరావు. అనేక డిగ్రీలు సాధించిన తర్వాత కూడా ఓ వ్యక్తి తాను అసంపూర్తిగా ఉన్నట్లు తనలో భావిస్తాడు. తనలో ఉండాల్సిన విశ్వాసం కొరవడాన్ని గమనిస్తాడు. అతని మొత్తం జీవన ప్రయాణాన్ని ఇది ప్రభావితం చేస్తుంది.

 

మిత్రులారా, ఈ పద్ధతిని మార్చడానికి నూనత విద్యా విధానం ద్వారా ఒక ప్రయత్నం జరిగింది. గతంలోని లోపాలను తొలగించడం జరుగుతోంది. భారతీయ విద్యా వ్యవస్థలో వ్యవస్థాగత సంస్కరణ కోసం ఇప్పుడొక ప్రయత్నం జరిగింది. విద్య ఉద్ధేశం మరియు విషయం రెంటినీ మార్చే ప్రయత్నం ఇది.

 

మిత్రులారా,

21వ శతాబ్దం ఒక వైజ్ఞానిక యుగం. అభ్యాసం, పరిశోధన మరియు ఆవిష్కరణ లపై కేంద్రీకరణ పెంచవలసిన సమయం ఇది. భారత జాతీయ విద్యా విధానం – 2020 చేసింది సరిగ్గా ఇదే. మీ పాఠశాల, కళాశాల మరియు విశ్వ విద్యాలయం అనుభవం ఫలవంతంగా, విస్తృత ప్రాతిపదికన ఉండేలా చేయాలని, అది మీ సహజమైన అభిరుచుల వైపు మీకు మార్గదర్శనం చేయాలని ఈ విధానం కోరుకుంటోంది.  

 

మిత్రులారా, మీరు భారత దేశంలోని ఉత్తమమైన మరియు ప్రకాశవంతమైన వారిలో ఉన్నారు. ఈ హ్యాకథాన్ మీరు పరిష్కరించడానికి ప్రయత్నించిన తొలి సమస్య కాదు. ఇదే చివరిది కూడా కాదు. మీరు, మీలాంటి యువత మూడు అంశాలు చేయడం ఆపకూడదని నేను కోరుతున్నాను. అవి: అభ్యసించడం, ప్రశ్నించడం మరియు పరిష్కరించడం.

 

మీరు నేర్చుకున్నప్పుడు, ప్రశ్నించడానికి తగిన జ్ఞానాన్ని పొందుతారు. మీరు ప్రశ్నించినప్పుడు, సమస్యలను పరిష్కరించడానికి అసాధారణ మార్గాలు దొరుకుతాయి. మీరు అది చేసినప్పుడు ఎదుగుతారు. మీ ప్రయత్నాలతో మన దేశం ఎదుగుతుంది. మన భూగోళం సుసంపన్నమవుతుంది.

 

మిత్రులారా, భారత దేశ జాతీయ విద్యా విధానం ఈ ఆదర్శాలను ప్రతిబింబిస్తుంది. మనం వీటి నుంచి మారుతున్నాం: పాఠశాల తర్వాత అవసరం లేని స్కూలు బ్యాగ్ భారం నుంచి జీవితానికి ఉపయోగపడే అభ్యాస ప్రయోజనం వరకు; కేవలం జ్ఞాపకం పెట్టుకోవడం నుంచి విమర్శనాత్మక ఆలోచన వరకు. అనేక సంవత్సరాలుగా, విద్యా వ్యవస్థ లోని పరిమితులు విద్యార్ధుల జీవితాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఇకపై అలా కాదు. జాతీయ విద్యా విధానం యువ భారత దేశపు ఆకాంక్షలను ప్రతిబింబిస్తోంది. ఇది ప్రక్రియా కేంద్రకంగా ఉండదు. ప్రజలే కేంద్రంగా మరియు భవిష్యత్ ప్రధానంగా ఉంటుంది.

 

మిత్రులారా,

ఈ విధానంలోని అత్యంత ఆసక్తికరమైన అంశాల్లో ఒకటి వైవిధ్యభరిత అంశాల (ఇంటర్ డిసిప్లినరీ) అధ్యయనం. ఈ పద్ధతి సరైనది కాబట్టి ఆదరణ లభించింది. అందరికీ ఒకే సైజు సరిపోదు. మీరేమిటో ఒక్క సబ్జెక్టు నిర్వచింపజాలదు. ఏదో ఒక కొత్త అంశాన్ని కనుగొనడానికి అవధులు లేవు. మహామహులు విభిన్న రంగాలలో రాణించిన ఉదంతాలు మానవ చరిత్రలో అనేకం ఉన్నాయి. ఆర్యభట్ట, లియోనార్డో డా విన్సీ, హెలెన్ కెల్లెర్, గురుదేవ్ ఠాగూర్ అందుకు ఉదాహరణలు. ఆర్ట్స్, సైన్స్ మరియు కామర్స్ మధ్య ఉన్న సంప్రదాయ సరిహద్దులను ఇప్పుడు మేము చెరిపేశాము. ఎవరికైనా ఆసక్తి ఉంటే, వారు: లెక్కలు మరియు సంగీతం కలిపి నేర్చుకోవచ్చు.. కోడింగ్ మరియు రసాయన శాస్త్రం కలిపి నేర్చుకోవచ్చు. విద్యార్ధి ఏమి నేర్చుకోవాలని సమాజం ఆశిస్తుందో దానికంటే విద్యార్ధి ఏమి నేర్చుకోవాలనుకుంటాడో దానిపైన కేంద్రీకరణ ఉండేలా ఈ విధానం భరోసా ఇస్తుంది. వైవిధ్యభరిత అంశాల అధ్యయనాలు మీకు నియంత్రణను ఇస్తాయి. ఈ ప్రక్రియలో ఇది మీకు పరిస్థితులకు అనుగుణంగా మారే మృదుత్వాన్ని ఇస్తుంది. 

 

జాతీయ విద్యా విధానంలో ఈ సరళతకు గొప్ప ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. బహుళ ప్రవేశాలకు మరియు నిష్క్రమణలకు అందులో సౌలభ్యాలు ఉన్నాయి. ఒక విద్యార్ధికి ఒకే మార్గం ఉండదు. డిగ్రీ అనుభవం మూడేళ్ళ ప్రయాణం కావచ్చు లేదా నాలుగేళ్లు కూడా కావచ్చు. తాము సముపార్జించిన విద్యా క్రెడిట్స్ మొత్తాన్ని సమీకృతం చేసే అకడమిక్ క్రెడిట్ బ్యాంకు ప్రయోజనాలను విద్యార్ధులు ఆస్వాదిస్తారు. ఇవి బదిలీ అయి చివరి డిగ్రీలో గణించబడతాయి. ఇలాంటి సరళత్వం మన విద్యా వ్యవస్థలో ఎప్పటినుంచో అవసరం ఉంది. జాతీయ విద్యా విధానం ఈ కోణాన్ని పరిష్కరించినందుకు నాకు సంతోషంగా ఉంది.

 

మిత్రులారా,

ప్రాథమిక విద్యా స్థాయి నుంచి విద్యావకాశాల కల్పనకు జాతీయ విద్యా విధానం ప్రాధాన్యత ఇస్తుంది. ఉన్నత స్థాయిలో స్థూల నమోదు నిష్ఫత్తి (గ్రాస్ ఎన్ రోల్ మెంట్ రేషియో)ని 2035 నాటికి 50 శాతానికి పెంచడం లక్ష్యం. జెండర్ ఇంక్లూజన్ ఫండ్, ప్రత్యేక విద్యా జోన్లు, సార్వత్రిక మరియు దూరవిద్య వంటి ఇతర ప్రయత్నాలూ ప్రయోజనకరంగా ఉంటాయి.

 

మిత్రులారా, విద్య అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని... మన దేశపు గొప్ప విద్యావేత్త మరియు భారత రాజ్యాంగ ముఖ్య రూపశిల్పి బాబా సాహెబ్ అంబేద్కర్ చెబుతుండేవారు. ఈ విద్యా విధానాన్ని ఆయన ఆదర్శాలకు కూడా అంకితమిచ్చాం. ఉద్యోగాలు కోరుకునేవారిని కాకుండా ఉద్యోగాలు సృష్టించేవారిని సృష్టించడానికి ఈ విద్యా విధానం ప్రాధాన్యతను ఇచ్చింది. అంటే, ఒక విధంగా ఇది మన ఆలోచనా విధానంలో, ఆచరణ పద్ధతిలో సంస్కరణను తెచ్చే ప్రయత్నం. ఉద్యోగం చేయాలా లేక ఒక సేవను చేపట్టాలా లేక ఒక వ్యవస్థాపకుడిగా మారాలా అనేది నిర్ణయించుకోగలిగే స్వయం సమృద్ధ యువతను సృష్టించడంపై ఈ విధానం దృష్టి పెట్టింది.

 
మిత్రులారా,
మన దేశంలో భాష ఎప్పుడూ ఒక సున్నితమైన అంశం. దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి ఏమంటే... స్థానిక భాషలను మనం వాటి ఖర్మానికి వదిలేశాం. అవి ఎదగడానికి, వృద్ధి చెందడానికి చాలా తక్కువ అవకాశం ఉంది. విద్యా విధానంలో ఇప్పుడు తీసుకొచ్చిన మార్పులతో భారతీయ భాషలు పురోగమిస్తాయి. మరింతగా అభివృద్ధి అవుతాయి. ఇవి భారత దేశం గురించి అవగాహనను పెంచడం మాత్రమే కాకుండా... దేశ ఐక్యతను కూడా బలోపేతం చేస్తాయి. మన భారతీయ భాషలలో చాలా సుసంపన్నమైన రచనలు ఉన్నాయి. శతాబ్దాల జ్ఞానం, అనుభవం మనకు ఉన్నాయి. అవన్నీ మరింత విస్తృతమవుతాయి. ఇది భారతీయ సుసంపన్న భాషలకు ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. విద్యార్ధులు నిర్మాణాత్మక సంవత్సరాల్లో మాతృ భాషలో అభ్యసించనుండటం ఓ పెద్ద ప్రయోజనం. 

 
దీంతో విద్యార్ధులు ప్రతిభను పెంచుకోవడానికి, మనో వికాసానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. వారు హాయిగా ఉండగలుగుతారు. ఒత్తిడి లేకుండా కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రేరణ పొందుతారు. విద్యకు బాగా దగ్గర కాగలుగుతారు. మీరు జీడీపీ ప్రాతిపదికన ప్రపంచంలోని టాప్ 20 దేశాల జాబితాను పరిశీలిస్తే, అందులో ఎక్కువ దేశాలు మాతృ భాషలోనే విద్యను అందించడం మీకు కనిపిస్తుంది. ఆయా దేశాలు తమ యువత ఆలోచనలను, అవగాహనను వారి సొంత భాషలోనే అభివృద్ధి చేసి... ప్రపంచంతో సంబంధాల కోసం ఇతర భాషలపై కూడా దృష్టి సారించాయి. 21వ శతాబ్దపు భారత దేశానికి కూడా అదే విధానం, వ్యూహం బాగా ఉపయోగకరం అవుతాయి. ఇండియాకు అద్భుతమైన భాషల నిధి ఉంది. వాటిని నేర్చుకోవడానికి ఒక జీవితం చాలదు. ఈ రోజు ప్రపంచం కూడా దాని కోసం ఆసక్తి చూపుతోంది. 

 
మిత్రులారా, 
నూతన విద్యా విధానంలో మరో ప్రత్యేక అంశం ఉంది. స్థానికతపై కేంద్రీకరించినంతగానే ప్రపంచంతో అనుసంధానం పైనా దృష్టి పెట్టింది. స్థానిక జానపద కళలు, రంగాలు, శాస్త్రీయ కళలు, జ్ఞానానికి సహజమైన స్థానం కల్పించేందుకు ప్రాధాన్యత ఇస్తూనే... ప్రపంచంలోని అత్యున్నత సంస్థలను కూడా ఇండియాలో తమ క్యాంపస్ లు ప్రారంభించేందుకు ఆహ్వానించడం జరిగింది. దీంతో మన యువత ప్రపంచ శ్రేణికి పరిచయం కావడం, ఇండియాలో అవకాశాలు పొందడం మాత్రమే కాదు... ప్రపంచ పోటీకి మరింతగా సిద్ధమవుతారు కూడా. ఈ క్రమం ఇండియాలో ప్రపంచ శ్రేణి సంస్థల నిర్మాణానికి దోహదం చేస్తుంది. ఇండియాను ప్రపంచ విద్యా కేంద్రంగా మారుస్తుంది. 

 
మిత్రులారా, 
నేను ఎప్పుడూ దేశ యువత శక్తిని నమ్మాను. నేను ఎందుకు వారిని నమ్మానో.. దాన్ని దేశ యువత మళ్లీ మళ్లీ రుజువు చేశారు. ఇటీవల కరోనాపై పోరాటంలో ముఖ కవచాలకు గిరాకీ బాగా పెరిగింది. ఆ గిరాకీని అధిగమించడానికి ఈ దేశ యువత 3డి సాంకేతిక పరిజ్ఞానంతో పెద్ద సంఖ్యలో ముందుకొచ్చారు. పిపిఇ కిట్లు, ఇతర వైద్య పరికరాల అభివృద్ధికి యువ ఆవిష్కర్తలు, యువ వ్యవస్థాపకులు ముందుకు వచ్చిన తీరుపై అంతటా చర్చ జరిగింది. ఆరోగ్య సేతు యాప్ తో కోవిడ్ అన్వేషణ కోసం చాలా తక్కువ సమయంలోనే యువ డెవలపర్లు ఒక గొప్ప మాధ్యమాన్ని సిద్ధం చేశారు. 

 
మిత్రులారా, మీరంతా స్వయం సమృద్ధ భారత దేశపు యువత ఆకాంక్షలకు ఆధారం. దేశంలోని పేదలకు మెరుగైన జీవితాన్ని ఇవ్వడానికి గాను, ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ లక్ష్యాన్ని సాధించడంలో యువత అందరి పాత్ర చాలా ముఖ్యమైనది. మన యువత ఎదుర్కోలేని, వారు పరిష్కారం కనుగొనలేని సవాలును దేన్నీ దేశం ఎదుర్కోవడం లేదని నేను ఎప్పుడూ విశ్వసించాను. అవసరమైన సమయంలో ఎప్పుడు దేశం తన యువ ఆవిష్కర్తల వైపు చూసినా, వారు నిరుత్సాహపరచలేదు. 

 
స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ ద్వారా గత కొద్ది సంవత్సరాలుగా దేశం అద్భుతమైన ఆవిష్కరణలను అందుకుంది. ఈ హ్యాకథాన్ తర్వాత కూడా యువ మిత్రులు దేశ అవసరాలను అర్ధం చేసుకుంటారని, దేశం స్వావలంబన సాధించడానికి సరికొత్త పరిష్కారాలపై కృషి చేస్తారని నాకు విశ్వాసం ఉంది.

 
మరోసారి మీకు అందరికీ శుభాకాంక్షలు!

 
చాలా ధన్యవాదాలు! 
*****

(Release ID: 1648436) Visitor Counter : 281