రక్షణ మంత్రిత్వ శాఖ
కీలక ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నౌకాదళ కమాండర్లకు రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ సూచన
ప్రాదేశిక జల ప్రాంత ప్రయోజనాలు కాపాడడంలో నౌకాదళ పాత్రను ప్రశంసించిన కేంద్ర మంత్రి
నౌకాదళ కమాండర్ల కాన్ఫరెన్స్-2020లో ప్రసంగించిన రాజ్‌నాథ్ సింగ్
Posted On:
19 AUG 2020 5:35PM by PIB Hyderabad
'నౌకాదళ కమాండర్ల కాన్ఫరెన్స్' ప్రారంభ కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగించారు. దేశ తీరప్రాంత రక్షణకు ఎనలేని కృషి చేస్తున్నారంటూ ప్రశంసించారు. ఏదైనా సవాలు ఎదురైతే నౌకలు, యుద్ధ విమానాలు మోహరించడంలో చురుగ్గా స్పందిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
కొవిడ్ విసిరిన సవాళ్ల గురించి మాట్లాడుతూ.., దేశ ప్రయోజనాలతో ముడిపడిన, చరిత్రలోనే అతి పెద్ద ఆపరేషన్ 'సముద్ర సేతు' చేపట్టారని ప్రశంసించారు. కఠినమైన సముద్ర పరిస్థితులు, కరోనా భయంలోనూ నావికాదళం బెదరకుండా దాదాపు 4 వేలమంది భారతీయులను స్వదేశానికి చేర్చిందన్నారు. 'మిషన్ సాగర్' పేరిట మాల్దీవులు, మారిషస్, కొమొరోస్, సీషెల్స్, మడగాస్కర్ దేశాలకు వైద్య సాయం అందించిందని చెప్పారు. ప్రజల సాయం కోసం క్వారంటైన్ సదుపాయాలు ఏర్పాటు చేసినందుకు కూడా నౌకాదళ కమాండర్లను రక్షణ మంత్రి అభినందించారు.
ప్రధాని శ్రీ నరేంద్రమోదీ విజన్ అయిన 'సాగర్' (సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ది రీజియన్) స్ఫూర్తితో; కీలక, సున్నత ప్రాంతాల్లో నౌకలు, యుద్ధ విమానాలను మోహరించి సముద్ర ప్రాంత ప్రయోజనాలను రక్షించడానికి భారత నౌకాదళం 'మిషన్ బేస్డ్ డిప్లాయ్‌మెంట్'ను సమర్థవంతంగా నిర్వహించిందని రక్షణ మంత్రి చెప్పారు. 'మిషన్ బేస్డ్ డిప్లాయ్‌మెంట్' ప్రారంభమైన 2017 జూన్ నుంచి, 'సముద్ర యాజమాన్య అవగాహన'ను, హిందూ మహాసముద్ర ప్రాంతానికి 'మానవత సాయం, విపత్తు ఉపశమనం'లో వేగాన్ని, అంతర్జాతీయ సముద్ర జలాల్లో భద్రతను ఈ మోహరింపులు పెంచాయని అన్నారు.
సాయుధ దళాల్లో చోటుచేసుకుంటున్న వేగవంతమైన మార్పులను ప్రస్తావిస్తూ.., సీడీఎస్ హోదా, సైనిక వ్యవహారాల విభాగం ఏర్పాటు గురించి చెప్పారు. ఇవి, త్రివిధ దళాల మధ్య సహకారాన్ని పెంచడంలో, ముఖ్యంగా శిక్షణ, సేకరణ, సంయుక్త ఆపరేషన్ల విషయంలో మైలురాళ్లుగా అభివర్ణించారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో కోవిడ్-19 విసురుతున్న సవాళ్లను ఎదుర్కొంటూనే.., కార్యాచరణ, పరిపాలన, ఆధునీకరణ ప్రయత్నాల్లో భారత నౌకాదళం ముందడుగు వేస్తూనే ఉందని రక్షణ మంత్రి అన్నారు. ‘భారత్‌లో తయారీ’ అడుగులకు అనుగుణంగా చేపట్టిన ‘ఆత్మనిర్భర్ భారత్’ సాధనలో నౌకాదళ నిబద్ధతపై మాట్లాడిన శ్రీ రాజ్‌నాథ్ సింగ్, స్వదేశీకరణ ప్రక్రియలో నౌకాదళం ముందడుగులో ఉందని ప్రశంసించారు. ఇప్పటివరకు సాధించిన విజయాలను వేగవంతం చేయడం ముఖ్యమన్నారు. ఇటీవలే ప్రారంభించిన ఎన్‌ఐఐవో (నావల్ ఇన్నోవేషన్ అండ్ ఇండిజినైజేషన్ ఆర్గనైజేషన్)ను ఇందుకు ఉదాహరణగా రక్షణ మంత్రి సూచించారు. కీలకంగా దృష్టి సారించాల్సిన ప్రాంతాలు, వ్యూహాలు పటిష్టంగా ఉంటాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
కార్యక్రమం ప్రారంభ సమయంలో, 'చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్' అడ్మిరల్ కరంబీర్ సింగ్ రక్షణ మంత్రికి స్వాగతం పలికారు. కొవిడ్‌పై పోరాటం కోసం భారత నౌకాదళం రూపొందించిన ఆవిష్కరణల గురించి మంత్రికి వివరించారు.
***
(Release ID: 1647077)
Visitor Counter : 298