నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ

కోవిడ్ కారణంగా కలిగిన అంతరాయాన్ని పరిగణనలోకి తీసుకొని...ఆర్.ఇ. ప్రాజెక్టుల కాలపరిమితి 24-08-2020 వరకు పొడిగింపునూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (ఎం.ఎన్.ఆర్.ఇ) నిర్ణయం


Posted On: 14 AUG 2020 7:14PM by PIB Hyderabad

మార్చి 25వ తేదీన లాక్ డౌన్ ప్రారంభమయ్యే నాటికి అమల్లో ఉన్న పునరుత్పాదక ఇంధన (ఆర్ఇ) ప్రాజెక్టుల కాల పరిమితిని 5 నెలలు పొడిగించాలని కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ (ఎం.ఎన్.ఆర్.ఇ) శాఖ నిర్ణయించింది. దీంతో... ఎం.ఎన్.ఆర్.ఇ. పరిధిలోని వివిధ పథకాల కింద ఆ శాఖ గుర్తింపు పొందిన ఏజెన్సీల ద్వారా అమలవుతున్న పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు 2020 ఆగస్టు 24 వరకు గడువు (2020 మార్చి 25 నుంచి 5 నెలలు పొడిగింపు) ఉంటుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు కేంద్ర విద్యుత్, పునరుత్పాదక ఇంధన శాఖల సహాయ మంత్రి ఆర్.కె. సింగ్ ఆమోదం తెలిపారు. తాజా ఒఎం (తేదీ 13.8.2020) ద్వారా ఈ నిర్ణయాన్ని తెలియజేశారు. కోవిడ్ కారణంగా విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో తమ ప్రాజెక్టుల కాల పరిమితిని పొడిగించాలని, లాక్ డౌన్ ముగిసిన తర్వాత కూడా సాధారణ స్థితి నెలకొనడానికి అదనపు సమయం అవసరమని ఆర్.ఇ. డెవలపర్లు సంప్రదాయేతర ఇంధన మంత్రిత్వ శాఖకు విన్నవించారు. ఈ విన్నపాన్ని పరిశీలించిన తర్వాత మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. 

అందువల్ల ఎంఎన్ఆర్ఇ శాఖ పరిధిలోని పునరుత్పాదక ఇంధన (ఆర్ఇ) ఏజన్సీలన్నీ కోవిడ్-19 కారణంగా విధించిన లాక్ డౌన్ ను అనివార్య పరిస్థితిగా పరిగణిస్తాయి. ఆర్ఇ డెవలపర్లను ఎవరికి వారినే విడివిడిగా పరిశీలించే పని లేకుండానే ఈ సామూహిక పొడిగింపు వర్తిస్తుంది. ఈ పొడిగింపు కోసం ఎలాంటి పత్రాలు/ ఆధారాలను కోరబోవడం లేదు. ఒక ప్రాజెక్టు ప్రారంభానికి పొడిగించిన గడువుకు లోబడి మధ్యంతర మైలురాళ్ళకు నిర్దేశించిన కాల పరిమితులను కూడా పొడిగించవచ్చు.

ప్రాజెక్టు డెవలపర్లు గడువు పొడిగింపు ద్వారా తాము పొందిన ప్రయోజనాన్ని గొలుసు కట్టులో చివరిగా ఉన్న భాగస్వాముల వరకు బదిలీ చేయవచ్చు. అంటే ఇంజనీరింగ్ ప్రొక్యూర్ మెంట్ కన్స్ట్రక్షన్ (ఇపిసి) కాంట్రాక్టర్లు, మెటీరియల్, ఎక్విప్ మెంట్ సరఫరాదారులు, ఒరిజినల్ ఎక్విప్ మెంట్ మాన్యుఫాక్చరర్లు (ఒఇఎంలు) తదితరులకు అదే తరహాలో కాల పరిమితిని పొడిగించవచ్చు.

రాష్ట్రాల పునరుత్పాదక ఇంధన శాఖలు (రాష్ట్రాల విద్యుత్/ ఇంధన శాఖల కింద ఉన్నా పునరుత్పాదక ఇంధన వ్యవహారాలు చూసే ఏజెన్సీలు సహా) కూడా కోవిడ్-19 కారణంగా విధించిన లాక్ డౌన్ ను అనివార్య పరిస్థితిగా పరిగణించి సముచితమైన రీతిలో గడువు పొడిగింపులు ఇవ్వవచ్చని ఆ ఆఫీసు మెమొరాండం (ఒఎం)లో సూచించారు.

ఇంతకు ముందు ఈ మంత్రిత్వ శాఖ ఎస్ఇసిఐ, ఎన్.టి.పి.సి.లకు, రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాల్లోని ఇంధన/ పునరుత్పాదక ఇంధన శాఖల అదనపు ప్రధాన కార్యదర్శులు/ ముఖ్య కార్యదర్శులు/ కార్యదర్శులకు మార్గదర్శకాలు జారీ చేసింది. చైనా లేదా ఇతర దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా సరఫరా గొలుసు కట్టుకు అవరోధాలు కలిగి ఉంటే.. ఆ ఆలస్యాన్ని అనివార్య పరిస్థితిగా పరిగణించాలని సూచించింది. అయితే, ఆలస్యానికి సంబంధించి ప్రాజెక్టు డెవలపర్లు సమర్పించే ఆధారాలు/ పత్రాల ప్రాతిపదికన సముచితంగా గడువు పొడిగింపు ఇవ్వొచ్చని అప్పటి మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

***



(Release ID: 1645998) Visitor Counter : 141