రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

జాతీయ ఔషధ ధరల నిర్ణాయక ప్రాధికార సంస్థ పరిధిలో కర్నాటకలో ధరల పర్యవేక్షణ, వనరుల విభాగం ఏర్పాటు

Posted On: 13 AUG 2020 6:18PM by PIB Hyderabad

భారత ప్రభుత్వ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖలోని ఔషధాల విభాగానికి చెందిన జాతీయ ఔషధ ధరల నిర్ణాయక ప్రాధికార సంస్థ (ఎన్.పి.పి.ఎ) పరిధిలో పని చేసేలా కర్నాటకలో ఒక ధరల పర్యవేక్షణ- వనరుల విభాగం (పి.ఎం.ఆర్.యు) ఏర్పాటైంది.

కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి శ్రీ డి.వి. సదానంద గౌడ ఈ విషయాన్ని గురువారం ఓ ట్వీట్ ద్వారా ప్రకటించారు.

ఎన్.పి.పి.ఎ. సేవల విస్తరణకోసం ఈ పి.ఎం.ఆర్.యు. రాష్ట్ర స్థాయిలో కర్నాటక డ్రగ్ కంట్రోలర్ ప్రత్యక్ష పర్యవేక్షణలో పని చేస్తుంది. పి.ఎం.ఆర్.యు.లు సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం కింద నమోదైన సొసైటీలు. వాటికి తమవైన సొంత మెమోరాండం ఆఫ్ అసోసియేషన్/ బైలాస్ ఉంటాయి. పి.ఎం.ఆర్.యు. గవర్నర్ల బోర్డులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర భాగస్వాముల ప్రతినిధులు ఉంటారు.

ఎన్.పి.పి.ఎ. ఇప్పటికే తన కేంద్ర ప్రభుత్వ పథకం ‘కన్సూమర్ అవేర్ నెస్, పబ్లిసిటీ అండ్ ప్రైస్ మానిటరింగ్ (సిఎపిపిఎం)’ కింద 12 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో పి.ఎం.ఆర్.యు లను నెలకొల్పింది. ఆయా రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలు: కేరళ, ఒడిషా, గుజరాత్, రాజస్థాన్, హర్యానా, నాగాలాండ్, త్రిపుర, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, ఆంధ్ర ప్రదేశ్, మిజోరాం, జమ్మూ & కాశ్మీర్.

దేశంలోని 36 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలలో పి.ఎం.ఆర్.యు. లను స్థాపించాలన్నది ఎన్.పి.పి.ఎ. ప్రణాళిక. పి.ఎం.ఆర్.యు.ల వ్యవస్థాపనకు, వార్షిక నిర్వహణకు అయ్యే ఖర్చులను ఎన్.పి.పి.ఎ. పై పథకం కింద సమకూరుస్తుంది.

ఇప్పటిదాకా జాతీయ ఔషధ ధరల నిర్ణాయక ప్రాధికార సంస్థ (ఎన్.పి.పి.ఎ) కేంద్ర కార్యాలయం ఢిల్లీలో మాత్రమే ఉంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పి.ఎం.ఆర్.యు.ల ఏర్పాటుతో ఎన్.పి.పి.ఎ. రాష్ట్రాల స్థాయిలోనూ సేవలకు అందుబాటులో ఉంటుంది.

ఔషధాల ధరలను పర్యవేక్షించడం, ఔషధాల లభ్యతకు లోటు లేకుండా చూడటం, వినియోగదారుల్లో అవగాహన పెంచడం వంటి కార్యకలాపాల్లో ఎన్.పి.పి.ఎ.కు సహకరించడం పి.ఎం.ఆర్.యు.ల ప్రాథమిక విధి. ఆయా సంస్థలు క్షేత్ర స్థాయిలో సమాచార సేకరణ యంత్రాంగంతో ఎన్.పి.పి.ఎ.కి సహకార భాగస్వాములుగా వ్యవహరిస్తాయి. ఇటు ఎన్.పి.పి.ఎ.కి, అటు రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల డ్రగ్ కంట్రోలర్లకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని పి.ఎం.ఆర్.యు.లు అందిస్తాయి.

కోవిడ్-19 మహమ్మారి కాలంలో ప్రాణాలు నిలిపే హైడ్రాక్సీ క్లోరోక్విన్ (హెచ్.సి.క్యు), పారాసెటమాల్, వ్యాక్సిన్లు, ఇన్సులిన్, కోవిడ్ ప్రొటోకాల్ లోని ఇతర ఔషధాలు నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా చూసేందుకు... ఎన్.పి.పి.ఎ. రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి సమన్వయంతో పని చేసింది. దేశవ్యాప్తంగా మందులకు కొరత లేకుండా భరోసా ఇచ్చేందుకు ఎన్.పి.పి.ఎ. రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి మంచి కృషి చేసింది. పి.ఎం.ఆర్.యు.లు ప్రాంతీయ స్థాయిలో ఔషధ భద్రతకు, కొనుగోలు స్థోమతకు భరోసా ఇస్తాయని భావిస్తున్నారు.

***



(Release ID: 1645589) Visitor Counter : 229