PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 12 AUG 2020 6:38PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • దేశంలో ఇవాళ ఒకేరోజు అత్యధికంగా 56,110 మందికి కోవిడ్‌ వ్యాధి నయం.
  • డిశ్చార్జి అయ్యేవారు పెరుగుతుండటంతో 70 శాతం కన్నా ఎగువకు దూసుకెళ్లిన కోలుకునేవారి సగటు.
  • భారత్‌లో ఇవాళ ఒకేరోజు అత్యధికంగా 7,33,449 రోగ నిర్ధారణ పరీక్షలు.
  • దేశంలో నమోదైన మొత్తం కేసులలో ప్రస్తుత (6,43,948) కేసులు 27.64 శాతానికి తగ్గుదల.
  • నిర్ధారిత కేసులలో మరణాల సగటు 1.98 శాతానికి పతనం.
  • ప్రయోగశాలల నిరంతర విస్తరణ ఫలితంగా దేశవ్యాప్తంగా నేడు మొత్తం 1,421 అందుబాటు.
  • కోవిడ్‌-19 టీకాల లభ్యత, సరఫరా యంత్రాంగంపై జాతీయ టీకా కార్యక్రమం నిర్వహణ నిపుణుల బృందం చర్చ.

Image

దేశంలో ఇవాళ అత్యధికంగా 56,110 మందికి వ్యాధి నయం; 70శాతం దాటిన కోలుకునేవారి సగటు; ఒకేరోజు అత్యధికంగా 7,33,449 రోగ నిర్ధారణ పరీక్షలు

దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో ఒకేరోజు అత్యధికంగా 56,110 మందికి కోవిడ్‌ వ్యాధి నయమైంది. ఈ మేరకు మహమ్మారిపై పోరులో భాగంగా సమర్థ త్రిముఖ నియంత్రణ వ్యూహం అమలుతోపాటు ప్రామాణిక వైద్య నిర్వహణ విధానాలు సత్ఫలితాలిస్తున్నాయి. తదనుగునంగా జూలై నెల తొలివారంలో రోజువారీగా సగటున 15,000 మంది కోలుకుంటుండగా, ఆగస్టు మొదటివారానికల్లా ఇది 50,000 స్థాయికి చేరింది. స్వస్థత పొందినవారితోపాటు చాలామంది ప్రస్తుతం ఏకాంత గృహవాస పర్యవేక్షణలో ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ కోలుకున్నవారి సంఖ్య 16,39,599కి చేరింది. ఈ విధంగా కోలుకునేవారి జాతీయ సగటు మరోసారి గరిష్ఠంగా 70.38 శాతానికి చేరుకుంది. దేశంలో నమోదైన మొత్తం కేసులలో ప్రస్తుత (6,43,948) కేసులు ఇప్పుడు 27.64శాతం మాత్రమే. వీరంతా చురుకైన వైద్య పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. కోలుకునేవారి సంఖ్య నిరంతర పెరుగుదలతో ప్రస్తుత రోగులతో పోలిస్తే అంతరం దాదాపు 10 లక్షల స్థాయికి చేరింది. అదేవిధంగా మరణాల సగటు అంతర్జాతీయ స్థాయితో పోలిస్తే భారత్‌లో ప్రస్తుతం 1.98 శాతానికి పతనమైంది. ఇక గడచిన 24 గంటల్లో 7,33,449 రోగ నిర్ధారణ పరీక్షలతో “పరీక్ష, అన్వేషణ, చికిత్స” పేరిట భారత అనుసరిస్తున్న త్రిముఖ వ్యూహం మరో కొత్త శిఖరం అధిరోహించింది. ఈ మేరకు ఇప్పటిదాకా పరీక్షించిన మొత్తం నమూనాల సంఖ్య 2.6 కోట్లు దాటింది. ప్రతి 10 లక్షల జనాభాకు పరీక్షల సగటు 18,852కు పెరిగింది. ఇక దేశవ్యాప్తంగా ప్రయోగశాలలు నిరంతరం విస్తరిస్తున్నందున ప్రభుత్వ రంగంలో 944, ప్రైవేటు రంగంలో 477 వంతున నేడు 1421 అందుబాటులో ఉన్నాయి.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1645405

కోవిడ్‌-19 టీకాల లభ్యత, సరఫరా యంత్రాంగంపై జాతీయ టీకా కార్యక్రమం నిర్వహణ నిపుణుల బృందం చర్చ

కోవిడ్ -19పై జాతీయ టీకా కార్యక్రమం నిర్వహణ నిపుణుల బృందం ఇవాళ నీతి ఆయోగ్‌ సభ్యుడైన డాక్టర్‌ వి.కె.పాల్‌ అధ్యక్షతన తొలిసారి సమావేశమైంది. దీనికి ఉపాధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ కార్యదర్శి కూడా ఇందులో పాల్గొన్నారు. టీకా తయారీ సంబంధిత సరంజామా నిర్వహణ, సరఫరా యంత్రాంగం కోసం డిజిటల్ మౌలిక వసతుల కల్పన, భావనల అభివృద్ధి-అమలు విధానాలపై నిపుణుల బృందం ఈ సందర్భంగా చర్చించింది. అలాగే మారుమూలదాకా టీకాల సరఫరాపై ప్రత్యేకంగా దృష్టి సారించడం కూడా ఇందులో భాగంగా ఉంటుంది. దేశ అవసరాలకు తగిన సంభావ్య టీకాల ఎంపికకు మార్గనిర్దేశం చేసే విస్తృత పారామితులపైనా వారు చర్చించారు. దీంతోపాటు టీకాల సేకరణకు అవసరమైన ఆర్థిక వనరులపైనా నిపుణుల బృందం చర్చించింది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1645363

“పారదర్శక పన్ను విధానం-నిజాయితీకి నిండు గౌరవం” దిశగా 2020 ఆగస్టు 13న వేదికను ప్రారంభించనున్న ప్రధానమంత్రి

“పారదర్శక పన్ను విధానం-నిజాయితీకి నిండు గౌరవం” దిశగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు దృశ్య-శ్రవణ మాధ్యమం ద్వారా ఒక వేదికను ప్రారంభిస్తారు. కాగా, ఇటీవలి సంవత్సరాల్లో కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) పలు ప్రధాన పన్ను సంబంధ సంస్కరణలు తెచ్చింది. పన్ను శాతాల తగ్గింపు, ప్రత్యక్ష పన్ను చట్టాల సరళీకరణ వంటివి ఈ సంస్కరణల లక్ష్యంగా ఉన్నాయి. ఇక ఆదాయపు పన్ను విభాగం పన్ను చెల్లింపుదారుల విధానానుసరణను సులభతరం చేయడానికి కృషిచేసింది. అలాగే కోవిడ్‌ సమయంలో రిటర్నుల దాఖలుకు చట్టబద్ధ గడువుల పొడిగింపు, చెల్లింపుదారులకు ద్రవ్యలభ్యత పెంపుదిశగా పన్నువాపసుల సత్వర విడుదల వంటి పలు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో రేపు “పారదర్శక పన్ను విధానం-నిజాయితీకి నిండు గౌరవం” దిశగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేతులమీదుగా ప్రారంభించనున్న వేదిక ప్రత్యక్ష పన్ను సంస్కరణలను మరింత ముందుకు నడపనుంది.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1645289

చారిత్ర సంఘటనలపై సమగ్ర, వాస్తవ కథనాల వెలికితీత అవసరం: ఉప రాష్ట్రపతి

చారిత్రక సంఘటనలపై సమగ్ర, అధీకృత, వాస్తవ కథనాల వెలికితీత ఎంతయినా అవసరమని ఉప రాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్య నాయుడు నొక్కిచెప్పారు. ఇవాళ ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. భారతదేశ చరిత్ర గురించి మన యువతరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఉప రాష్ట్రపతి స్పష్టం చేశారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య సమరయోధుల సాహసం, త్యాగాలకు పాఠ్యపుస్తకాలలో ప్రముఖ స్థానమివ్వాలని శ్రీ నాయుడు అన్నారు. భారత్‌సహా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై కోవిడ్-19 ప్రభావాన్ని ఉప రాష్ట్రపతి ప్రస్తావించారు. ఈ మహమ్మారిపై పోరులో భాగంగా సవాళ్లను అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ శక్తిసామర్థ్యాలను మరింత పెంచుకోవాలని సూచించారు. భారత్‌లాంటి దేశాలు నిజమైన స్వావలంబనద్వారా ఎలాంటి పరిస్థితినైనా తట్టుకోగల ఆర్థిక వ్యవస్థను నిర్మించాల్సిన ఆవశ్యకతను కోవిడ్-19 బలంగా గుర్తు చేసిందని పేర్కొన్నారు.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1645296

‘పీఎం స్వానిధి’ పథకం కింద 5 లక్షలకుపైగా దరఖాస్తుల స్వీకరణ

‘ప్రధానమంత్రి వీధి వర్తకుల స్వావలంబన నిధి’ (పీఎం స్వానిధి) పథకం కింద ఇప్పటికే లక్ష దరఖాస్తులపై రుణం మంజూరు చేయగా, మొత్తం 5 లక్షలకుపైగా దరఖాస్తులు అందాయి. కాగా, 2020 జూలై 2న ఈ ప్రక్రియ ప్రారంభమైన 41 రోజులలోనే ఈ రికార్డు నమోదు కావడం విశేషం. కోవిడ్‌-19 మహమ్మారి అనంతరం వ్యాపార పునఃప్రారంభానికి కావాల్సిన నిర్వహణ మూలధనం సమకూర్చే ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న వీధి వర్తకులలో ‘పీఎం స్వానిధి’ పథకం ఉత్సాహం నింపింది. ఏడాది వ్యవధిలో తిరిగి చెల్లించేలా సుమారు 50 లక్షల మంది వీధి వర్తకులకు ₹10,000 వరకూ హామీలేని రుణాలివ్వడం ఈ పథకం లక్ష్యం.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1645312

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  •  పంజాబ్: రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కోవిడ్ కేసుల పెరుగుదలతోపాటు 50 శాతం మేర ఆదాయ క్షీణత నడుమ పన్ను వసూళ్లలో అంతరాన్ని పూరించడం కోసం రాష్ట్రాలకు ఉదార ​​ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. అంతేకాకుండా SDRF నుంచి కోవిడ్-సంబంధిత వ్యయంపై నిబంధనలను సడలించాలని విజ్ఞప్తి చేశారు.
  • హిమాచల్ ప్రదేశ్: రాష్ట్రవ్యాప్తంగా ఇ-సంజీవని పోర్టల్‌ద్వారా అత్యధిక సంఖ్యలో డాక్టర్లతో సంప్రదింపులు నమోదు కావడంద్వారా జాతీయ స్థాయిలో హిమాచల్ ప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది. ఈ మేరకు ఇ-సంజీవని, ఇ-సంజీవనిఓపీడీ పోర్టల్స్ ద్వారా రాష్ట్రంలో 24,527 సంప్రదింపులు సాగాయి. కాగా, 32,035 సంప్రదింపులతో తమిళనాడు, 28,960 సంప్రదింపులతో ఆంధ్రప్రదేశ్ ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ఉన్నాయి.
  • మహారాష్ట్ర: రాష్ట్రంలో కోవిడ్-19 పునరావృత వ్యాప్తి చోటుచేసుకోకుండా మహారాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన సమావేశంలో తెలిపారు. కరోనావైరస్ వ్యాప్తి నియంత్రణకు అన్ని జిల్లాల్లో ప్రత్యేక ఆస్పత్రుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు చెప్పారు. దేశంలో నమోదైన మొత్తం కేసులలో నాలుగింట ఒక వంతు- 1.48 లక్షలమేర ఒక్క మహారాష్ట్రలోనే ఉన్నాయి. అయితే, రాజధాని ముంబైలో క్రియాశీల కేసుల సంఖ్య ప్రస్తుతం 20 వేలకన్నా దిగువకు పతనమైంది.
  • గుజరాత్: రాష్ట్రంలో నిర్ధారణ అయ్యే కేసుల సగటు అధికంగా ఉన్నందున గుజరాత్‌లో పరీక్షల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని కోవిడ్‌పై సమీక్ష సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నొక్కిచెప్పారు. కాగా, గుజరాత్‌లో 34 ప్రభుత్వ, 59 ప్రైవేట్ ప్రయోగశాలల నెట్‌వర్క్ ద్వారా రోజుకు ప్రతి 10 లక్షల జనాభాకు సగటున 456 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ తెలిపారు. రాష్ట్రంలో కోలుకునేవారి సగటు 77శాతానికి చేరిన నేపథ్యంలో ప్రస్తుతం గుజరాత్‌లో 14,125 యాక్టివ్ కేసులున్నాయి.
  • రాజస్థాన్: రాష్ట్రంలో మంగళవారం అత్యధికంగా 1,217 కొత్త కేసులు నమోదవగా వీటిలో బీకానేర్‌లో 115 మందికి కోవిడ్‌ వ్యాధి నిర్ధారణ అయింది. రాజస్థాన్‌లో ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య 54,887 కాగా, వాటిలో 13,677 క్రియాశీల కేసులున్నాయి.
  • మధ్యప్రదేశ్: రాష్ట్రంలో కోలుకునేవారి సగటు 75 శాతం స్థాయిని చేరిందని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఈ నేపథ్యంలో స్వల్ప లక్షణాలున్న రోగులకు ఇంట్లోనే చికిత్స అందించే ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
  • ఛత్తీస్‌గఢ్‌: కరోనావైరస్ మహమ్మారి మధ్య అసెంబ్లీ సమావేశం  సురక్షిత నిర్వహణకు సన్నాహాలు చేసినట్లు శాసనసభాపతి చరణ్‌దాస్ మహంత్ అన్నారు. కాగా, ఛత్తీస్‌గఢ్‌ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 25నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే, మహమ్మారి కారణంగా నాలుగు రోజులు మాత్రమే నిర్వహించనున్నారు.
  • కేరళ: తిరువనంతపురంలోని సెంట్రల్ జైలులో 59మంది ఖైదీలకు కోవిడ్ నిర్ధారణ అయింది. దీంతో జైల్లోని 1,200 మందికిపైగా ఖైదీల కోసం తొలి అంచె కోవిడ్‌ చికిత్స కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇక రాజధాని జిల్లాలో వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో శివార్లలోని ప్రధాన సామాజిక ప్రాంతాల్లో 25కుపైగా కేసులు నమోదవగా వివిధ పోలీస్‌ స్టేషన్లలో ఐదుగురు సిబ్బందికీ వ్యాధి నిర్ధారణ అయింది. ఇక ప్రతి తీర ప్రాంతానికి చేపలు పట్టడానికి నిర్దిష్ట రోజులు కేటాయించడంతో తీరప్రాంత ప్రజలు ఇవాళ్టినుంచి చేపల వేటకు వెళ్లడం ప్రారంభించారు. రేపు ప్రధాన నౌకాశ్రయాలు తెరవబడతాయి. కేరళలో ఇవాళ రెండు కోవిడ్ మరణాలు సంభవించడంతో మృతుల సంఖ్య 122కు పెరిగింది. ప్రస్తుతం 12,721మంది చికిత్స పొందుతుండగా 1.49 లక్షలమంది నిఘాలో ఉన్నారు.
  • తమిళనాడు: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఇవాళ ఒకేరోజు అత్యధికంగా 481 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కఠిన నిర్ణయాలు తీసుకోనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి సూచనప్రాయంగా తెలిపారు. ఇక గత 24 గంటల్లో ఐదుగురు మరణించగా మృతుల సంఖ్య 96కు చేరింది. ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య 6381గా ఉంది. ఇక తమిళనాడులో ఆగస్టు 10 నాటికి కోవిడ్ కారణంగా మదురై జిల్లాలో ఆరుగురు వైద్యులు మరణించారని ఐఎంఏ జిల్లాశాఖ తెలిపింది. రాష్ట్రంలో నిన్న 5,834 కొత్త కేసులు, 118 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం కేసులు 3,08,649కి, మరణాలు 5,159కి పెరిగాయి. రాష్ట్రంలో ఇప్పుడు 52,810 క్రియాశీల కేసులున్నాయి.
  • కర్ణాటక: రాష్ట్రంలో కోవిడ్-19 నేపథ్యంలో ఆస్తిపన్ను మినహాయింపు నిమిత్తం దాఖలైన పిటిషన్‌పై కర్ణాటక హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. కాగా, కొడగు-కేరళ సరిహద్దును దాదాపు ఐదు నెలల తర్వాత తెరవడంతో వాహనాల సంచారం పునఃప్రారంభమైంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో డిశ్చార్జ్ అయిన కోవిడ్ రోగుల ఏకాంత గృహవాసం వ్యవధిని 14 రోజులనుంచి స్వీయ పర్యవేక్షణతో 7 రోజులకు ప్రభుత్వం పరిమితం చేసింది. కర్ణాటకలో ప్రస్తుతం 6257 కొత్త కేసులు, 86 మరణాలు నమోదవగా 6473 మంది డిశ్చార్జి అయ్యాయి. మొత్తం కేసులు: 1,88,611; క్రియాశీల కేసులు: 79,606; మొత్తం మరణాలు: 3398; డిశ్చార్జి అయినవి: 1,05,599గా ఉన్నాయి.
  • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలోని ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సిబ్బంది నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ మేరకు గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆరోగ్య కేంద్రాల్లో 42 మంది వైద్యాధికారులు, 84 మంది స్టాఫ్ నర్సు పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ జారీచేశారు. ఒంగోల్ పురపాలిక పరిధి మొత్తంలో నియంత్రణ కార్యకలాపాలను ఇవాళ్టినుంచి కఠినంగా అమలు చేస్తున్నట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్‌ ప్రకటించారు. ఈ ఆంక్షలు 2 వారాలపాటు అమలులో ఉంటాయని తెలిపారు. రాష్ట్రంలో కోవిడ్ నుంచి కోలుకునే కేసులు ఇటీవల ఇది 50-55 శాతం మధ్య ఉండగా ఇప్పుడు 63.28 శాతానికి పెరిగినట్లు ప్రభుత్వం పేర్కొంది. కాగా, నిన్న రాష్ట్రంలో 9024 కొత్త కేసులు, 87 మరణాలు నమోదవగా మొత్తం కేసులు 2,44,549కు పెరిగాయి. ప్రస్తుతం చురుకైన కేసులు 2203గా ఉన్నాయి.
  • తెలంగాణ: రాష్ట్రంలో మంగళవారం దాదాపు 1,900 కొత్త కేసులు నమోదవగా వీటిలో నమోదైన కేసుల్లో 82 శాతం లేదా 1,558 గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ప్రాంతాల వెలుపల నమోదయ్యాయి. ఈ మేరకు గత 24 గంటల్లో 1897 కొత్త కేసులు, 9 మరణాలు నమోదవగా 1920 మంది కోలుకున్నారు; కొత్త కేసులలో 479 జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. ప్రస్తుతం మొత్తం కేసులు: 84,544; క్రియాశీల కేసులు: 22, 596; మరణాలు: 654; డిశ్చార్జి: 61,294గా ఉన్నాయి.

FACT CHECK

***



(Release ID: 1645409) Visitor Counter : 206